సాక్షి, తూర్పుగోదావరి: తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రస్తుతం 48 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. గోదావరి ఉధృతి నేపథ్యంలో ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
మరోవైపు.. ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. ఇక, ఏజెన్సీలోని పలు గ్రామాలు జలదిగ్భందమయ్యాయి. ఇప్పటికే చర్ల మండలంలోని మూడు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ఉధృతి నేపథ్యంలో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశించారు.
ఇక ధవళేశ్వేరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. దీంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇక, వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఐదు ఎస్డీఆర్‌ఎఫ్, నాలుగు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు విధుల్లో ఉన్నాయి.
కాగా, ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 46.7 అడుగులకు చేరుకుంది. మరోవైపు, పోలవరం వద్ద గోదావరి నీటి ప్రవాహం 12.5 మీటర్లకు చేరుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. గోదావరి నుంచి ప్రస్తుతం 10 లక్షల 28 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల అవుతోంది.
ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజలు పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక, ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ స్కూల్స్‌కు సెలవు ప్రకటించారు విద్యాశాఖ అధికారులు.
Comments
Please login to add a commentAdd a comment