![Andhra Pradesh Govt On Godavari and Cauvery River Interlinking - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/16/RIVER.jpg.webp?itok=is3bubi2)
సాక్షి, అమరావతి: గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాకే కావేరి గ్రాండ్ ఆనకట్టకు గోదావరి జలాలను తరలించేలా గోదావరి – కావేరి అనుసంధానం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలక మండలి 70వ సమావేశం మంగళవారం కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన వర్చువల్‌గా జరిగింది. ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తా, ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్, అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ కార్యదర్శులు, ఈఎన్‌సీలు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నదుల అనుసంధానంపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించారు. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141 టీఎంసీల గోదావరి జలాలను తుపాకులగూడెం నుంచి నాగార్జునసాగర్, సోమశిలల్లోకి, అక్కడి నుంచి కావేరి గ్రాండ్ ఆనకట్టకు తరలించేలా రూపొందించిన గోదావరి – కావేరి అనుసంధానం డీపీఆర్‌పై చర్చించారు. ఇందులో 40 టీఎంసీల చొప్పున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులకు కేటాయించి, కర్ణాటకకు 9.8 టీఎంసీలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి.
తమ కోటాలో నీటిని మళ్లించడానికి అంగీకరించబోమని ఛత్తీస్‌గఢ్ చెప్పింద. గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం ఇతర బేసిన్‌లకు మళ్లించే గోదావరి జలాలకుగాను తమకు కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని మహారాష్ట్ర పట్టుబట్టింది. తమకు ఏ ప్రాతిపదికన 9.8 టీఎంసీలు కేటాయించారని కర్ణాటక ప్రశ్నించింది. తమకు అంతకంటే ఎక్కువ కేటాయించాలని డిమాండ్ చేసింది. కావేరికి గోదావరి జలాలు తరలిస్తున్నందున, కావేరి జలాల్లో 92 టీఎంసీలు తమకు ఇవ్వాలని కేరళ కోరింది.
గోదావరిలో మిగులు జలాలు లేవని, శాస్త్రీయంగా అధ్యయనం చేసి నీటి లభ్యతను తేల్చాలని ఏపీ డిమాండ్ చేసింది. నీటి లభ్యతను తేల్చాకే గోదావరి జలాలను కావేరికి తరలించాలని, అప్పుడే వర్షాభావ ప్రాంతాలకు సాగు, తాగు నీరు లభిస్తుందని పేర్కొంది. గత నెల 18న బెంగళూరులో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలపై నివేదిక రూపకల్పనలో తాము వెల్లడించిన అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని కోరింది. తెలంగాణ కూడా ఇదే రీతిలో స్పందించింది. రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment