Cauvery River
-
‘నీటి’ మీద లెక్కలు
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో నీటి లభ్యతపై జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) లెక్కను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కొట్టిపారేస్తోంది. తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, గోదావరి–కావేరి అనుసంధానంలో ప్రతిపాదించిన ఇచ్చంపల్లి ప్రాజెక్టు మధ్య ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు వినియోగించుకున్న నికర జలాల్లో 177 టీఎంసీలు మిగులు ఉందని ఎన్‌డబ్ల్యూడీఏ లెక్క కట్టింది. సీడబ్ల్యూసీ దీనికి విరుద్ధంగా చెబుతోంది. గోదావరిలో ఎక్కడా నికర జలాల్లో మిగులు లేదని సీడబ్ల్యూసీ తేల్చిచెప్పింది. దాంతో గోదావరిలో నీటి లభ్యతపై సంయుక్తంగా శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని సీడబ్ల్యూసీ, ఎన్డబ్ల్యూడీఏలను కేంద్ర జల్ శక్తి శాఖ ఆదేశించింది. మహానది–గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా 760 టీఎంసీల జలాలను కృష్ణా, పెన్నా, కావేరి బేసిన్లకు తరలించాలని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఆ లెక్కకు ప్రాతిపదిక ఏమిటో? శ్రీరాం సాగర్ ప్రాజెక్టు – ఇచ్చంపల్లి మధ్య తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకోగా.. ఇచ్చంపల్లి వద్ద నికర జలాల్లో 177 టీఎంసీల మిగులు జలాలు ఉంటాయని ఎన్‌డబ్ల్యూడీఏ లెక్కకట్టింది. ఇంద్రావతి సబ్ బేసిన్లో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 105 టీఎంసీలు, జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు నీటి ఆవిరి కింద కేటాయించిన 52 టీఎంసీలకు మిగులు జలాలు 177 టీఎంసీలు జత చేసి 334 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానంలో తరలించడానికి ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. దీన్ని సీడబ్ల్యూసీ అంగీకరించడంలేదు. శ్రీరాం సాగర్ – ఇచ్చంపల్లి మధ్య 177 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్లు ఏ ప్రాతిపదికన లెక్కగట్టారని ఎన్‌డబ్ల్యూడీఏను ప్రశ్నించింది. గోదావరి బేసిన్లో ఎక్కడా నికర జలాల్లో మిగులు లేదని పేర్కొంది. కోటా నీటిని ఛత్తీస్‌గఢ్ వాడుకుంటే గోదావరి–కావేరి అనుసంధానం ప్రశ్నార్థకమవుతుందంది. శ్రీరాం సాగర్– ఇచ్చంపల్లి మధ్య వరద జలాల్లో మిగులు అనుమానమేనని సీడబ్ల్యూసీ పేర్కొంది. 50 శాతం లభ్యత.., గరిష్టంగా వరద వచ్చే రోజుల్లో ఇచ్చంపల్లి వద్ద 247 టీఎంసీల లభ్యత ఉండే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. -
కర్ణాటక బంద్ ఎఫెక్ట్: స్కూల్స్ మూసివేత.. 44 విమానాలు రద్దు
సాక్షి, చెన్నై: కావేరి జలాల సమస్య కారణంగా కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం బంద్ కొనసాగుతోది. పొరుగున్న ఉన్న తమిళనాడుకు కావేరి నీటి విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అధారిటీ (CWMA) కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ ఒక్కూట రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందుకు దాదాపు 1900 కన్నడ సంఘాలు మద్దతు తెలిపాయి. వీటిలో హోటళ్లు, సినీరంగం, ప్రైవేటు క్యాబ్‌లు, ఆటో సంఘాలు, ప్రైవేటు విద్యాసంఘాలు ఉన్నాయి. బంద్‌లో భాగంగా నిరసనల్లో పాల్గొన్న వివిధ సంఘాలకు చెందిన 60 మంది ఆందోళనకారులను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని బెంగళూరు రూరల్ ఏఎస్పీ మల్లికారంరోజున బాలదండి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగుకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కర్ణాటక బంద్ ఎఫెక్ట్ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై పడింది. బంద్ కారణంగా రవాణా సౌకర్యాలు దెబ్బతినడంతో శుక్రవారం ప్రయాణించాల్సిన ఏకంగా 44 విమానాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వీటిలో 22 విమానాలు బెంగుళూరులో ల్యాండ్ అయ్యేవి కాగా మరో 22 విమానాలు ఇక్కడి నుంచి టేకాఫ్ కావాల్సినవి ఉన్నాయి. ప్రయాణికులకు సకాలంలో సమాచారం అందించడం ద్వారా వారు తమ టికెట్లను రద్దు చేసుకున్నట్లు పేర్కొన్నారు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ ప్రభావం కొనసాగనుంది. బెంగళూరు నగరంలో పోలీసులు సెక్షన్ 144 విధించారు. ప్రజలు గుంపులుగా బయటకు వచ్చి ర్యాలీలు, నిరసనలు చేపట్టకూడదని, అయిదుగురు కంటే ఎక్కువ మంది సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. 1,900కు పైగా సంఘాలు బంద్‌కు మద్దతు తెలిపాయి. బెంగళూరుతో సహా రాష్ట్రంలో కిరాణా దుకాణాలు, ఇతర షాప్‌లను మూసేశారు. అయితే ఆసుపత్రులు, అంబులెన్స్‌లు, ఫార్మసీలు వంటి అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి. Karnataka Bandh: Section 144 Imposed in Mandya District; Schools, Colleges Closed#BNN #Newsupdate #Dailynews #Breakingnews #India #KarnatakaBandh #CauveryIssue #Bengaluru #Cauveryrow #Karnataka #WATCH pic.twitter.com/XxoBNFwLni — Rafia Tasleem (@rafia_tasleem) September 29, 2023 బెంగళూరులో మెట్రో సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి. మెట్రో స్టేషన్ల వద్ద ఎలాంటి అల్లర్లు జరగకుండా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కర్ణాటక బంద్ దృష్ట్యా బెంగళూరులోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు బెంగళూరు డిప్యూటీ కమిషనర్ దయానంద కేఏ సెలవు ప్రకటించారు. అనేక విశ్వవిద్యాలయాల్లో పరీక్షలను వాయిదా వేశారు. కాగా బంద్‌తో సంబంధం లేకుండా రాష్ట్ర రవాణ బస్సులు, బీఎంటీసీ బస్సులు నడవనున్నాయి. అయితే తమిళనాడు వైపు వెళ్లే బస్సులు నడవకపోవచ్చని, పరిస్థితిని బట్టి మారుతుంటాయని అధికారులు పేర్కొన్నారు. బెంగళూరులోని ప్రధాన రహదారులపై, ముఖ్యంగా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పాడే అవకాశం ఉందన్నారు. Actor #Siddharth was forced to leave a press conference he was attending of #Tamil movie "#Chiththa" on #September 28, due to angry #protestors over the #Cauverywater dispute. pic.twitter.com/qviXRWcgLM — Madhuri Adnal (@madhuriadnal) September 28, 2023 ఓలా ఉబర్ వంట క్యాబ్ యాజమాన్యాలు బంద్‌కు మద్దతునిచ్చాయి. ర్యాలీలో పాల్గొనాలని భావించాయి. ఆటో, రక్షా సంఘాలు కూడా సంఘీభావం తెలిపాయి. 32 ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక స్టేట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కర్ణాటక బంద్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. కర్ణాటక హోటల్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్తంగా తన కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించింది. ఇక శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి సినిమాలను ప్రదర్శించబోమని కర్ణాటక ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. -
స్టార్ హీరో సిద్ధార్థ్‌కి నిరసన సెగ.. ఆ గొడవ వల్లే!
స్టార్ హీరో సిద్ధార్థ్‌కు నిరసన సెగ తగిలింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బెంగళూరు వెళ్లిన ఇతడికి చేదు అనుభవం ఎదురైంది. నేరుగా ఈవెంట్ జరుగుతున్న చోటుకే వచ్చిన కొందరు వ్యక్తులు ప్రెస్‌మీట్‌ని అడ్డుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది? (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు) హీరో సిద్ధార్థ్ నటించి నిర్మించిన కొత్త సినిమా 'చిత్తా'. దీన్ని తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే బెంగళూరు వెళ్లి ప్రెస్ మీట్ లో పెట్టాడు. ప్రస్తుతం తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి నదీ జలాల వివాదం నడుస్తోంది. దీంతో అక్కడికి అకస్మాత్తుగా వచ్చిన కరవే కార్యకర్తలు.. సిద్ధార్థ్‌ని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ప్రమోషన్స్ కి ఇది సరైన టైమ్ కాదని, వేరే ఎప్పుడైనా చేసుకోవాలని చెప్పారు. దీంతో విషయం అర్థం చేసుకున్న సిద్ధార్థ్.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే వెళ్తూ వెళ్తూ.. అందరూ తన సినిమా చూడాలంటూ చేతులు జోడించి మరీ స్టేజీ దిగి వెళ్లిపోయాడు. అయితే కరవే కార్యకర్తలు వచ్చినప్పుడు సిద్దార్థ్ కన్నడలో తన సినిమా గురించి మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో అతడి ప్రసంగాన్ని అడ్డుకున్న కరవే కార్యకర్తలు.. తమిళ సినిమా ఎవరూ ప్రోత్సాహించొద్దని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో తమిళ-కన్నడ ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్‌గా మారింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' కోసం నాగార్జునకి అన్ని కోట్ల రెమ్యునరేషన్!?) Actor #Siddharth was forced to leave a press conference he was attending of #Tamil movie "#Chiththa" on #September 28, due to angry #protestors over the #Cauverywater dispute. pic.twitter.com/qviXRWcgLM — Madhuri Adnal (@madhuriadnal) September 28, 2023 -
కావేరి జలాల వివాదం.. నేడు బెంగళూరు బంద్
బెంగళూరు: కావేరీ నీటి వివాదం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. తమిళనాడుకు ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కావేరీ నీటిని విడుదల చేయడాన్ని వివిధ కన్నడ సంఘాలు తప్పుపడుతున్నాయి. తమిళనాడుకు 15 రోజులపాటు రోజూ 5 వేల క్యూసెక్కుల కావేరి నీటినివిడుదల చేయాలని కావేరి వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ (సిడబ్ల్యుఎంఎ) ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా దాదాపు 300కు పైగా సంస్థలు మంగళవారం బెంగళూర్ బంద్‌కు పిలుపునిచ్చాయి. రైతు నాయకుడు కురుబూర్ శాంతకుమార్ నేతృత్వంలోని రైతు సంఘాలు, ఇతర సంస్థల ఆధ్వర్యంలో ‘కర్ణాటక జల సంరక్షణ సమితి’ పేరుతో బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆందోళన కారుల పిలుపు మేరకు బెంగుళూర్ బంద్ కొనసాగుతోంది. నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సలను ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. దీంతో కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ క్రమంలో బెంగళూరు వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం అర్థరాత్రి వరకు 144 సెక్షన్ విధించారు. అలాగే నేడు నగరంలో ఎలాంటి ఊరేగింపులకు అనుమతులు లేవని తేల్చిచెప్పారు. స్వచ్చందంగా బంద్‌ను పాటించాలని, బలవంతంగా బంద్‌ను అమలు చేయకూడదని బెంగళూరు పోలీస్ కమిషనర్ సూచించారు. స్కూల్స్, కాలేజీలు బంద్ బంద్ నేపథ్యంలో మంగళవారం బెంగుళూరులోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు బెంగళూరు అర్భన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ దయానంద్ కేఏ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అదే విధంగా ఆటోలు, ట్యాక్సీ యూనియన్లు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. మెట్రో, ఆర్టీసీ సేవలు యధాతథం అయితే మెట్రో సేవలు బంద్ పిలుపుతో ప్రభావితం కాకుండా యథాధావిధిగా పనిచేయనున్నాయి. ఓలా, ఉబర్ వంటి సర్వీసులు సైతం పనిచేయనున్నాయి. తాము బంద్‌కు మద్దతు తెలపడం లేదని, తమ సర్వీసులు పనిచేస్తాయని ఓలా ఉబర్ యాజమాన్యాలు ప్రకటించాయి. హోటళ్ల యజమానుల సంఘం కూడా బంద్‌కు మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్ల కూడా తెరుచుకొని ఉండనున్నాయి. #WATCH | Karnataka: Bengaluru Bandh has been called by various organizations regarding the Cauvery water issue. According to BMTC, all routes of Bengaluru Metropolitan Transport Corporation will be operational as usual. (Visuals from Majestic BMTC Bus stop, Bengaluru) pic.twitter.com/fSZSeLyKMh — ANI (@ANI) September 26, 2023 వీటితోపాటు బెంగుళూరు ఆర్టీసీ బస్సులు కూడా బంద్‌తో సంబంధం లేకుండా యథావిధిగా తమ సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. అయితే కర్ణాటక-తమిళనాడు సరిహద్దుల్లో మాత్రం తమిళనాడు బస్సుల ప్రవేశాన్ని నిలిపివేశారు. బెంగళూరు బంద్ దృష్ట్యా తమ ప్రయాణాలను అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని విమాన ప్రయాణికులను అభ్యర్థిస్తూ బెంగళూరు విమానాశ్రయం ఓ ప్రకటన విడుదల చేసింది. #WATCH | An auto driver at Majestic BMTC Bus stop, Bengaluru, Naseer Khan says "We support the bandh called by various organisations. When the Cauvery water issue comes, we have a very clear stand that Karnataka will not provide water to anyone. Only night drivers are here, autos… pic.twitter.com/jMeVz3GeB8 — ANI (@ANI) September 26, 2023 విమానాశ్రయానికి ప్రయాణించేటప్పుడు విలైనంత త్వరగా బయలుదేరాలని ఇండిగో సూచించింది. బంద్ కారణంగా సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చని.. డొమెస్టిక్ ప్రయాణానికి రెండున్నర గంటల ముందు, అంతర్జాతీయ ప్రయాణానికి మూడున్నర గంటల ముందు చేరుకోవాలని ట్విటర్లో తెలిపింది. కర్ణాటకలో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ మంగళవారం బంద్‌కు మద్దతు తెలిపింది. బెంగళూరు బంద్‌కు జేడీఎస్ కూడా మద్దతు తెలిపింది. బంద్‌కు తమ పార్టీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ నేత హెచ్డీ కుమారస్వామి తెలిపారు. కాగా, తమిళనాడుకు కావేరీ నీటి విడుదలకు వ్యతిరేకంగా కర్ణాటకలో మంగళవారం చేపట్టిన నిరసనలను నిషేధించేలా కేంద్రం ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు కావేరి రైతుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. నిరసనలకు ప్రభుత్వం అనుమతి అయితే బెంగళూరు బంద్‌కు కర్ణాటక ప్రభుత్వం అనుమతినిచ్చింది. తమ ప్రభుత్వం నిరసనలను అడ్డుకోబోమని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఈ ఆందోళనలను కట్టడి చేయబోమని హామీ ఇచ్చింది. అయితే బంద్ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కూడా ముఖ్యమని చెప్పారు. కావేరీ జలాలపై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తామని పేర్కొన్నది. ఏంటీ కావేరి వివాదం? తమిళనాడుకు 15 రోజుల పాటు రోజుకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అధారిటీ కర్నాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే నీటిని విడుదల చేయడానికి వీలులేదంటూ కర్నాటకలోని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దీంతో కర్నాకట ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో కర్నాటక ప్రభుత్వం నీటిని విడుదల చేయాలని నిర్ణయించుకుంది. దీంతో పలు ప్రజాసంఘాలు బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చాయి. -
కావేరి జల జగడానికి చుక్క పడేనా?
శివాజీనగర: తమిళనాడుకు కావేరి నీరు విడుదలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని రాజకీయ పక్షాలు సర్కార్ ఏకపక్ష వైఖరిని ఎండగడుతున్నాయి. రాష్ట్ర రైతులకు అన్యాయం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. మరో వైపు రైతు సంఘాలు రోడ్డెక్కుతున్నాయి. అన్నదాతకు బాసటగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధ్యక్షతన ఈనెల 23న విధానసౌధ సమ్మేళనా సభా మందిరంలో అఖిల పక్ష సమావేశం జరుగనుండగా రాష్ట్ర రైతుల హితరక్షణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై చర్చ జరుగనుంది. వర్షాలు తక్కువ కావటంతో నీటి కొరత ఏర్పడిందని, తమిళనాడుకు నీరు విడుదల చేసేందుకు సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం వాదించినా కావేరి నీటి నిర్వహణా ప్రాధికార మాత్రం... నిత్యం 10 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొంతమేరకు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. నీరు విడుదలపై రైతులు, ప్రతిపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తోంది. నేడు సుప్రీం కోర్టులో పిటీషన్ కావేరి నీటి నిర్వహణ ప్రాధికార ఆదేశాలను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో నేడు పిటీషన్ దాఖలు చేయాలని శనివారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో తీర్మానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అడ్వోకేట్ జనరల్‌ను మంత్రి మండలి సమావేశానికి పిలిపించి న్యాయ పోరాటం చేయాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. 24న ఎక్స్‌ప్రెస్ వే బంద్ యశవంతపుర: తమిళనాడుకు కావేరి నీటి విడుదలను వ్యతిరేకిస్తూ ఈ నెల 24న బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్ వే రోడ్డును దిగ్బంధం చేయాలని బీజేపీ నిర్ణయించింది. అందోళనలో పార్టీ రాష్ట్ర నాయకులు కూడ పాల్గొనే అవకాశం ఉందని ఎంపీ ప్రతాప్‌సింహా ఆదివారం ట్విట్ చేశారు. కాగా మండ్య జిల్లా ఇండువాళు వద్ద సోమవారం రైతులు హైవేబంద్ దిగ్బంధనం చేయనున్నారు. -
కావేరి డెల్టాలో ‘కోల్’ కల్లోలం
ఏడాదికి మూడు పంటలతో కళకళలాడే డెల్టా జిలాల్లో కల్లోలం రేగుతోంది. నిత్యం పచ్చదనంతో ఉండే సురక్షిత వ్యవసాయ క్షేత్రంలో నేలబొగ్గు తవ్వకాలకు కేంద్రం అనుమతించ్చిందనే సమాచారంతో అక్కడి రైతులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. వివిధ రాజకీయ పార్టీలు పోరుబాట పట్టాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్నదాతలు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ మంత్రి సూచించారు. రైతులను ఇబ్బంది పెట్టే నిర్ణయాలను పునఃసమీక్షించి వెనక్కి తీసుకోవాలని సీఎం స్టాలిన్ ప్రధాని మోదీకి లేఖ రాయడం గమనార్హం. సాక్షి, చైన్నె: కావేరి డెల్టా పరిధిలోని సురక్షిత వ్యవసాయ క్షేత్రంలో నేల బొగ్గు తవ్వకాలకు కేంద్రం అనుమతించిందనే సమాచారంతో రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ఆరు చోట్ల నేల బొగ్గు సొరంగాలు, 11 చోట్ల పరిశోధనలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మినిస్టరీ ఆఫ్ కోల్ నోటిఫికేషన్ జారీ చేయడంపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వీటికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని పీఎంకే నేత అన్భుమణి రాందాసు డిమాండ్ చేశారు. సురక్షిత క్షేత్రంలో కేంద్రం నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ డిమాండ్ చేశారు. నేపథ్యం ఇదీ.. రాష్ట్రంలో పచ్చటి పంట పొలాలతో నిండిన జిల్లాలుగా తిరువారూర్, తంజావూరు, పుదుకోట్టై, పెరంబలూరు, అరియలూరు, నాగపట్నం, కడలూరు, తిరుచ్చికి పేరుంది. ఇక్కడ లక్షలాది ఎకరాలల్లో వరి పంట, వేలాది ఎకరాలలో ఇతర పంటలు సాగవుతున్నాయి. అలాగే పెద్దఎత్తున కొబ్బరి సాగవుతోంది. కావేరినది నీటి ఆధారంగానే ఇక్కడ పంటలు పండుతున్నాయి. గత కొన్నేళ్లుగా వరుణుడి కరుణ, కావేరి పరవళ్లతో ఇక్కడి అన్నదాతల్లో ఆనందం తాండవిస్తోంది. అయితే డెల్టా జిల్లాల్లోని భూగర్భంలో ఉన్న ఇంధనం, హైడ్రో కార్బన్, గ్యాస్, నేల బొగ్గు వంటి నిక్షేపాలను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం గత కొంతగాలంగా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో కేంద్రం ఇచ్చిన అనేక ఉత్తర్వులకు వ్యతిరేకంగా డెల్టాలో మహోద్యమాలు జరిగాయి. కేంద్రం వ్యూహాలకు చెక్ పేట్టే విధంగా, రైతుల్లో నెలకొన్న ఆందోళనను పోగొట్టే రీతిలో గత అన్నాడీఎంకే ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా కీలక తీర్మానం చేసింది. డెల్టా జిల్లాలను సురక్షిత వ్యవసాయ క్షేత్రంగా ప్రకటిస్తూ చట్టం తీసుకొచ్చింది. ఈ క్షేత్రంలో వ్యవసాయం మాత్రమే చేపట్టాలని, ఇతర పరిశ్రమలు, తవ్వకాలకు అనుమతులు లేవని స్పష్టం చేసింది. అలాగే గతంలో జారీ చేసిన ఇతర పరిశ్రమలకు సంబంధించిన అనుమతులను రద్దు చేశారు. దీంతో డెల్టా సురక్షిత వ్యవసాయ క్షేత్రంగా మారింది. అదే సమయంలో రాష్ట్రంలో అధికార మార్పు తర్వాత.. ప్రస్తుతం కేంద్రం మళ్లీ చాప కింద నీరులా డెల్టాపై కన్నేసి వ్యూహాలకు పదును పెట్టడం మంగళవారం అక్కడి రైతుల్లో ఆందోళన రేకెత్తించింది. నైవేలి తరహాలో.. కడలూరు జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఆ జిల్లాను పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకునే విధంగా దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. నైవేలి పరిసరాల్లో నేల బొగ్గు తవ్వకాల పేరిట గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకోవడం వివాదానికి దారి తీసింది. దీనికి వ్యతిరేకంగా ఓ ఉద్యమమే ప్రారంభమైంది. అలాగే వీరాణ్ణం రిజర్వాయర్ పరిధిలో నేల బొగ్గు తవ్వకాలకు పరిశోధనలు చేయడం వెలుగులోకి రావడంతో కల్లెం వేయడానికి ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమయంలో డెల్టాలో ప్రధాన జిల్లాగా ఉన్న తంజావూరు ఒరత్తనాడు పరిధిలో ఆరు చోట్ల నేల బొగ్గు తవ్వకాలకు సొరంగాలపై కేంద్రం దృష్టి పెట్టడం వివాదానికి దారి తీసింది. తిరువారూర్– తంజావూరు జిల్లాల పరిధిలో ఆరు చోట్ల నేల బొగ్గు తవ్వకాలకు సంబంధించిన సొరంగాలు, పరిశోధనలకు కేంద్రం అనుమతి ఇవ్వడం వెలుగు చూసింది. ఈ సమాచారం అన్నదాతల్లో ఆగ్రహాన్ని రేపింది. సురక్షిత క్షేత్రాన్ని చిన్నాభిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయంటూ రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం స్పందించకుంటే మరో ఉద్యమం ప్రారంభమవుతుందని హెచ్చరించాయి. అడ్డుకట్ట వేసేందుకు.. కావేరి డెల్టాలోని లక్షా 25 వేల ఎకరాల పంట పొలాలను సర్వనాశనం చేయడానికి కేంద్రం సిద్ధమైందని పీఎంకే నేత అన్భుమణి రాందాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వద్ద ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని వివరించారు. తంజావూరు జిల్లా పరిధిలో 11 చోట్ల పరిశోధనలు, ఆరు చోట్ల సొరంగాల తవ్వకాలకు కేంద్రం కార్యచరణ సిద్ధం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా కేంద్రం ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకోవడం తగదని హితవుపలికారు. ఈ వ్యవహారంపై సీఎం స్టాలిన్ తక్షణం స్పందించాలని, అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేయాలని పట్టుబట్టారు. బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. సురక్షిత వ్యవసాయం క్షేత్రంలో పరిశోధనలకు కేంద్రం అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా మని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ వ్యాఖ్యలు చేశారు. రైతులతో కలిసి పెద్దఎత్తున పోరాటాలకు తాము సిద్ధం అని ప్రకటించారు. ఆందోళన వద్దు.. కేంద్రం అనుమతులు ఇచ్చినంత మాత్రాన అవన్నీ అమల్లోకి వచ్చే ప్రసక్తే లేదని వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్కే పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న స్థలాల్లో, తమ అనుమతి లేకుండా కేంద్రం ఎలా తవ్వకాలపై దృష్టి పెడుతుందని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీఎం స్టాలిన్ స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడిస్తారన్నారు. తిరువారూర్, తంజావూరు పర్యటనలో ఉన్న క్రీడల శాఖమంత్రి ఉదయ నిధి స్టాలిన్ మాట్లాడుతూ, కేంద్రం చర్యలను ఆదిలోనే కట్టడి చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా డెల్టాలో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. సురక్షిత వ్యవసాయ క్షేత్రాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని వివరించారు. తక్షణం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. -
నీటి లభ్యత తేల్చాకే కావేరికి గోదావరి
సాక్షి, అమరావతి: గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాకే కావేరి గ్రాండ్ ఆనకట్టకు గోదావరి జలాలను తరలించేలా గోదావరి – కావేరి అనుసంధానం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలక మండలి 70వ సమావేశం మంగళవారం కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన వర్చువల్‌గా జరిగింది. ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తా, ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్, అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ కార్యదర్శులు, ఈఎన్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నదుల అనుసంధానంపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించారు. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141 టీఎంసీల గోదావరి జలాలను తుపాకులగూడెం నుంచి నాగార్జునసాగర్, సోమశిలల్లోకి, అక్కడి నుంచి కావేరి గ్రాండ్ ఆనకట్టకు తరలించేలా రూపొందించిన గోదావరి – కావేరి అనుసంధానం డీపీఆర్‌పై చర్చించారు. ఇందులో 40 టీఎంసీల చొప్పున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులకు కేటాయించి, కర్ణాటకకు 9.8 టీఎంసీలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. తమ కోటాలో నీటిని మళ్లించడానికి అంగీకరించబోమని ఛత్తీస్‌గఢ్ చెప్పింద. గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం ఇతర బేసిన్లకు మళ్లించే గోదావరి జలాలకుగాను తమకు కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని మహారాష్ట్ర పట్టుబట్టింది. తమకు ఏ ప్రాతిపదికన 9.8 టీఎంసీలు కేటాయించారని కర్ణాటక ప్రశ్నించింది. తమకు అంతకంటే ఎక్కువ కేటాయించాలని డిమాండ్ చేసింది. కావేరికి గోదావరి జలాలు తరలిస్తున్నందున, కావేరి జలాల్లో 92 టీఎంసీలు తమకు ఇవ్వాలని కేరళ కోరింది. గోదావరిలో మిగులు జలాలు లేవని, శాస్త్రీయంగా అధ్యయనం చేసి నీటి లభ్యతను తేల్చాలని ఏపీ డిమాండ్ చేసింది. నీటి లభ్యతను తేల్చాకే గోదావరి జలాలను కావేరికి తరలించాలని, అప్పుడే వర్షాభావ ప్రాంతాలకు సాగు, తాగు నీరు లభిస్తుందని పేర్కొంది. గత నెల 18న బెంగళూరులో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలపై నివేదిక రూపకల్పనలో తాము వెల్లడించిన అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని కోరింది. తెలంగాణ కూడా ఇదే రీతిలో స్పందించింది. రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ స్పష్టం చేశారు. -
అమ్మ చేతి పంట
విద్యార్థులు ఏటా పరీక్షలు రాసి ఉత్తీర్ణులవుతూ పై తరగతులకు ప్రమోట్ అవుతుంటారు. పట్టభద్రులైన తర్వాత ఇక పుస్తకాలుండవు, తరగతులుండవు, పరీక్షలూ ఉండవు. రైతుకి అలా కాదు. వ్యవసాయం అనే పరీక్షను ఏటా ఎదుర్కోవాల్సిందే. తన జీవితకాలమంతా ఏటా పరీక్ష కు సిద్ధం కావాల్సిందే. కాలం కలిసి వచ్చి ప్రకృతి కరుణిస్తేనే ఉత్తీర్ణత. ఎన్నేళ్లు ఎన్ని పరీక్షలు రాసినా ప్రమోషన్ ఉండదు. అదే పొలం, అదే పంట. భూమితో అనుబంధం తెంచుకోలేక, ఉత్తీర్ణత ప్రశ్నార్థకమవుతున్నా సరే మళ్లీ మళ్లీ పరీక్షకు సిద్ధం కావాల్సిందే. ఇన్ని పరీక్షలతో అలసిపోయిన రైతులు తర్వాతి తరాన్ని పొలానికి దూరంగా పెంచుతున్నారు. వ్యవసాయం మీద మమకారం పెంచుకుంటారేమోనని భయపడుతున్నారు కూడా. తమిళనాడులోని ఈ కుటుంబం కూడా అలాంటిదే. ఓ అమ్మ పిల్లల బాధ్యతలు పూర్తయిన తరవాత అదే పొలంలో అడుగుపెట్టి, ప్రయోగాల పంట పండించింది. కావేరి తీరం! భువనేశ్వరి పుట్టింది తమిళనాడు, తంజావూరు జిల్లాలోని కల్యాణోదయ్ గ్రామంలో. వాళ్ల ఇంటికి దగ్గరగా కావేరి నది ప్రవహిస్తుండేది. నీరు, మట్టి, చెట్టు, పండు అన్నీ స్వచ్ఛమే. కలుషితం కావడం అంటే ఏమిటో తెలియని ప్రకృతి ఒడిలో పెరిగిన బాల్యం ఆమెది. పెళ్లి తర్వాత మధురైకి దగ్గరలోని పుదుకొటై్టకి వెళ్లింది. అత్తవారిది కూడా వ్యవసాయ ప్రధానమైన కుటుంబమే. కానీ ఈ తరంలో అందరూ ఇతర వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు. కౌలు రైతుల కెమికల్ ఫార్మింగ్ వల్ల పొలం బీడువారింది. అత్తగారింట్లో వాళ్లెవరూ తమకు పదెకరాల పొలం ఉందనే సంగతి కూడా పట్టించుకోవడం లేదు. భువనేశ్వరి మొక్కల హాబీ పెరటిసాగుకే పరిమితమైంది. పిల్లలు పెద్దయిన తర్వాత ఆమెకు ఖాళీ సమయం ఎక్కువైంది. ఇంట్లో వాళ్లను అడిగి ఒకటిన్నర ఎకరా పొలంలో సాగు చేయడానికి అనుమతి తీసుకుందామె. పొలానికి వెళ్లి సేద్యం చేయడానికి అనుమతి ఇస్తూ ఇంట్లో వాళ్లు ‘వ్యవసాయం అంటే పెరట్లో కూరగాయలు పండించినట్లు కాదు’ అని హెచ్చరించారు కూడా. సేద్యంలో మెళకువల కోసం కరూర్‌లోని ‘వనగమ్ నమ్మళ్వార్ ఎకలాజికల్ ఫౌండేషన్’లో శిక్షణ తీసుకుంది. అన్నింటికీ తలూపి సేంద్రియ పద్ధతిలో సేద్యం చేయడం మొదలుపెట్టిందామె. అలా ఆమె రైతుగా మారింది. ఇది 2013 నాటి మాట. ప్రయోగాత్మకంగా మొదలు పెట్టిన సాగు మంచి ఫలితాలనిచ్చింది. సాగు విస్తీర్ణాన్ని విస్తరించింది. ఇప్పుడు పదెకరాల పొలాన్ని ఒంటి చేత్తో సాగు చేస్తోంది. నేలకు ఎప్పుడు ఏ సేవ చేయాలో, ఎప్పుడు ఏ పంట వేయాలో క్షుణ్నంగా వివరించగలుగుతోంది. కొత్తగా సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే వాళ్లకు సలహాలిస్తోంది. వంట కోసమా! పంట కోసమా!! భువనేశ్వరి సేంద్రియ సేద్యంలో నేర్చుకున్న ఆవుపేడ, ఆవు మూత్రంతో కూడిన పంచగవ్యాన్ని ఉపయోగించడం వంటి మెళకువలకు తోడు తాను మరికొన్ని జోడించి చేసిన సొంత ప్రయోగాలు ఫలించాయి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మెత్తగా నూరి ఆ ముద్దను మజ్జిగలో కలిపి పంటల మీద చల్లేది. కీటకాలు మొక్కలోని సారాన్ని పీల్చేసి ఆకులు తెల్లగా మారిపోయినప్పుడు ఆమె ఈ పని చేసింది. కీటకాలు నశించి మొక్కలు ఆకుపచ్చదనం సంతరించుకున్నాయి. ఆమె ప్రయోగాలను చూసి ఆమె పిల్లలు ‘అమ్మా! వంట చేస్తున్నావా? పంట పండిస్తున్నావా’ అని చమత్కరించేవారు. ఎరువులు, క్రిమిసంహారక మందుల మీద ప్రయోగాలు పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు అంతరించిపోతున్న ధాన్యాలను పరిరక్షించే పనిలో ఉందామె. అందరికీ ఉండేది రోజుకు ఇరవై నాలుగ్గంటలే. ఆ ఇరవై నాలుగ్గంటలను ఉపయుక్తంగా మలుచుకునే వాళ్లు చరిత్ర సృష్టిస్తారు... అచ్చం భువనేశ్వరిలాగానే. -
గోదావరి.. కావేరి కలిపేద్దాం
సాక్షి, హైదరాబాద్: నదుల అనుసంధాన ప్రక్రియపై కొన్నాళ్ల పాటు మౌనంగా ఉన్న కేంద్రం..ఇటీవల ఆ ప్రక్రియపై వేగం పెంచుతోంది. ముఖ్యంగా గోదావరి–కావేరి నదుల అనుసంధానాన్ని గాడిలో పెట్టే పనిలో పడింది. పరీవాహక రాష్ట్రాలు లేవనెత్తుతున్న అభ్యంతరాలు ఒక్కొక్కటీ పరిష్కరించి వారిని ఒప్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 28న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేక కమిటీ భేటీ జరగనుంది. కమిటీకి చైర్మన్‌గా ఉన్న కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో మాట్లాడనున్నారు. మరోవైపు జాతీయ జల వనరుల అభివృధ్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) నదుల అనుసంధానంపై తన తదుపరి సమావేశాన్ని ఈనెల 29న హైదరాబాద్‌లోని జలసౌధ కేంద్రంగా నిర్వహించనుంది. ఈ భేటీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలను ఆహ్వానించింది. నీటి లభ్యత, రాష్ట్రాలకు దక్కే వాటాలు, ఆయకట్టు, ముంపు సమస్యలతో పాటు రాష్ట్రాలు లేవనెత్తే ఇతర అంశాలపై ఇందులో చర్చించనుంది. తమిళనాడు ఒత్తిడితో ముందుకు... నదుల అనుసంధానంలో భాగంగా మహానది–గోదావరి–కృష్ణా–కావేరి గ్రాండ్ ఆనకట్టల వరకు నీటిని తరలించే ప్రక్రియ ఉన్నప్పటికీ.. ఒడిశా అభ్యంతరాల నేపథ్యంలో కేంద్రం మహానది–గోదావరి అనుసంధానాన్ని రెండో దశలో చేపట్టాలని నిర్ణయించింది. తొలి దశలో గోదావరి–కావేరి అనుసంధాన ప్రక్రియను చేపట్టాలని భావించింది. ఇంద్రావతి, గోదావరి జలాలు కలిపి ఇచ్చంపల్లి వద్ద 324 టీఎంసీల మేర లభ్యత ఉందని పేర్కొంటూ, ఇందులో 247 టీఎంసీల నీటిని రోజుకు 2.2 టీఎంసీల చొప్పున తరలించేలా రూ.86 వేల కోట్లతో ప్రణాళిక రచించింది. అయితే ఇంద్రావతి నీటిపై ఛత్తీస్‌గఢ్ తీవ్ర అభ్యంతరం చెబుతోంది. తాము కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు ఇంద్రావతి నీరు సరిపోతుందని, అలాంటప్పుడు ఇంద్రావతిలో మిగులు జలాలు ఉండవని అంటోంది. దీనికి తోడు ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణం చేపడితే తమ ప్రాంతంలోని 4 గ్రామాలకు ముంపు సమస్య తలెత్తుతుందని పేర్కొంటోంది. తెలుగు రాష్ట్రాలు కూడా గోదావరి–కావేరి అనుసంధానంపై పలు అభ్యంతరాలు లేవనెత్తాయి. అయితే దిగువ రాష్ట్రమైన తమిళనాడు మాత్రం ఈ ప్రక్రియను వెంటనే చేపట్టాలని పట్టుబడుతోంది. తమ తాగు, సాగు, పారిశ్రామిక అవసరాల దృష్ట్యా 200 టీఎంసీల మేర నీటినైనా తమ సరిహద్దు వరకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. దీనితో పాటు పూండీ రిజర్వాయర్‌ను ఆరనియార్ రిజర్వాయర్‌తో అనుసంధానించాలని, దీనిద్వారా 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న 609 చెరువులు నింపేందుకు అవకాశం ఉంటుందని చెబుతోంది. మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలు ఈ ప్రాజెక్టును చేపట్టవచ్చని అంటున్నాయి. ఈ నేపథ్యంలో అనుసంధాన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకే కేంద్రం మొగ్గు చూపుతోంది. మిగులు స్వేచ్ఛను హరించొద్దన్న ఏపీ ఇక పోలవరం వద్ద నీటి లభ్యత విషయంలో ఎన్‌డబ్ల్యూడీఏ, సీడబ్ల్యూసీ, వ్యాప్కోస్ల లెక్కల మధ్య పొంతన లేదని ఏపీ అంటోంది. నీటి లభ్యతను శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని కోరుతోంది. నికర జలాలు వాడుకోగా మిగిలిన జలాలను దిగువ రాష్ట్రమైన ఏపీ కి కేటాయించారని, మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛను ఇచ్చారని, ఇప్పుడు నీటిని కావేరికి తరలించే క్రమంలో ఏపీ హక్కులు పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. తమ హక్కుల పరిరక్షణలో భాగంగా పోలవరం నుంచి బనకచర్లకు 200 టీఎంసీల తరలింపు, గోదావరి–పెన్నా లింకు ద్వారా 320 టీఎంసీలు తరలింపు ప్రణాళికలను పరిశీలించాలని కోరుతోంది. వీటిపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సి ఉంది. మహానది నీటిని తరలించాకే అంటున్న రాష్ట్రం గోదావరి–కావేరి అనుసంధాన డీపీఆర్ ఆమోదించేందుకు ముందుగా ఇచ్చంపల్లి వద్ద నీటి లభ్యత అంశాలపై రాష్ట్రాలు, కేంద్ర జలసం ఘం ఆమోదం తీసుకోవాలని తెలంగాణ కోరుతోంది. దీంతో పాటే మొత్తంగా తరలించే నీటిలో 50 శాతం నీటి వాటాను తెలంగాణకు కేటాయించాలని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా భూసేకరణ అవసరం కానున్న దృష్ట్యా ఆ రాష్ట్రాలతో చర్చించాకే తుది అలైన్‌మెంట్‌ను ఖరారు చేయాలని అంటోంది. గోదావరి నీటిని కావేరికి తరలించే ముందు తెలంగాణలో ఇచ్చంపల్లి ఎగువన ఉన్న దేవాదుల, తుపాకులగూడెం అవసరాలు, దిగువన ఉన్న సీతారామ ఎత్తిపోతల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని, డీపీఆర్‌ను ఆమోదించే ముందే ఆయా ప్రాజెక్టుల నెలవారీ అవసరాలను లెక్కలోకి తీసుకోవాలని కోరుతోంది. గోదావరి–కావేరి అనుసంధానానికి ముందే మహానది–గోదావరి అనుసంధానాన్ని కేంద్రం చేపట్టాలని, అక్కడి నుంచి మిగులు జలాలను గోదావరికి తరలించాకే, గోదావరి జలాలు కావేరికి తరలించాలని కోరుతోంది. దీంతో పాటు నాగార్జునసాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజ ర్వాయర్‌గా ప్రతిపాదించే ముందు బచావత్, బ్రిజేశ్ ట్రిబ్యునల్ ప్రకారం ఉన్న కేటాయింపుల్లో కృష్ణా బేసిన్లో నీటి అవసరాలపై సమగ్ర అధ్యయనం చేయాలని, ఇచ్చంపల్లి ప్రతిపాదన తుపాకులగూడెం ఫోర్‌షోర్‌లో ఉన్న నేపథ్యంలో దీనిద్వారా దేవాదుల, ఎస్సారెస్పీలపై పడే ప్రభావా న్ని అధ్యయనం చేయాలని కూడా కోరుతోంది. -
ఎస్సారెస్పీ, ఇచ్చంపల్లి మధ్య మిగులు జలాల్లేవు
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరీ నదుల అనుసంధాన ప్రక్రియపై తమ అభ్యంతరాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ మరోసారి కేంద్రానికి స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎస్సారెస్పీ, ఇచ్చంపల్లి మధ్య తెలంగాణ అవసరాలు పోను, మరో 176 టీఎంసీల మేర నీటి లభ్యత ఉందని, ఆ నీటిని అనుసంధాన ప్రక్రియలో వినియోగిస్తామనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎస్సారెస్పీ–ఇచ్చంపల్లి మధ్య మిగులు జలాల్లేవని, లభ్యత నీటిని వాడుకునేలా ఇప్పటికే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని తెలిపింది. గోదావరి–కావేరీ నదుల అనుసంధానంపై మంగళవారం జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ భూపాల్‌సింగ్ నేతృత్వంలోని గవర్నింగ్ బాడీ అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయ సేకరణ చేసింది. ఈ భేటీకి తెలంగాణ తరఫున అంతర్రాష్ట్ర విభాగం సీఈ మోహన్‌కుమార్, ఎస్ఈ కోటేశ్వర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇచ్చంపల్లి నుంచి నీటిని కావేరీకి తరలించేలా చేసిన ప్రతిపాదనలపై పలు అభ్యంతరాలు లేవనెత్తారు. ముఖ్యంగా ఇంద్రావతిలో ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోలేని 247 టీఎంసీల నీటిని అనుసంధానం ద్వారా తరలిస్తామని కేంద్రం చెబుతున్నా.. దీనికి ఛత్తీస్‌గఢ్ వ్యతిరేకిస్తున్న విషయాన్ని రాష్ట్ర ఇంజనీర్లు ఎత్తిచూపారు. భవిష్యత్తులో ఇంద్రావతి నీటిని ఛత్తీస్‌గఢ్ వినియోగిస్తే మిగులు జలాలు ఎలా ఉంటాయో కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరారు. కాగా, గోదావరిలో మిగులు జలాలే లేవని పునరుద్ఘాటించారు. ఈ దృష్ట్యా గోదావరి–కావేరీ అనుసంధానం కన్నా ముందు మహానది–గోదావరి అనుసంధానం చేయాలని, మహానది నుంచి నీటిని తరలించాకే కావేరీకి నీటిని తీసుకెళ్లాలని వెల్లడించారు. దీంతోపాటు ఈ అనుసంధాన ప్రక్రియలో నాగార్జునసాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకుంటామన్న ప్రతిపాదనను తెలంగాణ తప్పుపట్టింది. సాగర్‌కు ఉన్న నీటి కేటాయింపులు, దాని ఆపరేషన్ ప్రొటోకాల్‌పై ఇంతవరకు స్పష్టత లేదని, దీనిపై ట్రిబ్యునల్ తేల్చాల్సి ఉందని, అది జరగకుండా సాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మార్చడం లేక అటు నుంచి నీటిని తరలించడం సాధ్యమయ్యేది కాదని స్పష్టం చేసింది. -
ముందుకా.. వెనక్కా?
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధాన ప్రక్రియపై మళ్లీ కదలిక వచ్చింది. జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) తెరపైకి తెచ్చిన ఇచ్ఛంపల్లి నుంచి కావేరి గ్రాండ్ ఆనకట్టకు నీటి తరలింపుపై పరీవాహక రాష్ట్రాల అభ్యంతరాలు, నీటి లభ్యతపై భిన్న వాదనలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై మరోమారు సమావేశం నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ నెల 17న ఎన్‌డబ్ల్యూడీఏ గవర్నింగ్ బాడీ నదుల అనుసంధాన ప్రక్రియపై కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలతో చర్చించనుంది. మిగులు జలాల తరలింపు విషయంలో ఛత్తీస్‌గఢ్ లేవనెత్తుతున్న అభ్యంతరాలు, రాష్ట్ర అవసరాలు తీరాకే నీటిని తరలించాలంటున్న తెలంగాణ, ఏపీ వాదనల నేపథ్యంలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా ఉంది. ఇంద్రావతిలో మిగులుందని ముందుకు పోవద్దు.. గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై ఇప్పటికే జనంపేట, అకినేపల్లి, తుపాకులగూడెం నుంచి నీటిని తరలించే ప్రణాళికలు తెరపైకి తెచ్చిన కేంద్రం వాటిపై తెలంగాణ ఆమోదం లేని నేపథ్యంలో మళ్లీ ఇచ్ఛంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి అటునుంచి నీటిని కావేరికి తరలిస్తామన్న ప్రతిపాదనకు ప్రాణం పోస్తోంది. ఇంద్రావతి, గోదావరి జలాలు కలిపి మొత్తంగా ఇచ్ఛంపల్లి వద్ద 324 టీఎంసీల మేర లభ్యత ఉందని, ఇందులో 247 టీఎంసీల నీటిని రోజుకు 2.2 టీఎంసీల చొప్పున తరలిస్తామని కేంద్రం చెబుతోంది. దీనికి రూ.86వేల కోట్ల అంచనాతో ఇదివరకే రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను రాష్ట్రాలకు పంపింది. అయితే ఇందులో ఇంద్రావతిలో లభ్యతగా ఉన్నాయని చెబుతున్న 273 టీఎంసీల నీటిపై ఛత్తీస్‌గఢ్ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. ఇంద్రావతిలో మిగులు జలాలున్నాయంటూ వాటి ఆధారంగా దిగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు చేపట్టవద్దని సూచించింది. ఇంద్రావతిపై తమ ప్రభుత్వం బ్యారేజీలు, ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వీటి ద్వారా 273 టీఎంసీలు వినియోగిస్తామని అంటోంది. ఒకవేళ మిగులు ఉందని చెప్పి వేల కోట్ల ఖర్చుతో అనుసంధాన ప్రక్రియ చేపడితే, భవిష్యత్తులో తాము నీటి వినియోగం మొదలుపెట్టేలా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తే నీళ్లే ఉండవని, అప్పుడు శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరేనని హెచ్చరిస్తోంది. ఛత్తీస్‌గఢ్ వాదనతో తెలంగాణ సైతం ఏకీభవిస్తోంది. ఏ నదీ బేసిన్‌లోని నీటిని ఆ బేసిన అవసరాలు తీరాకే ఇతర బేసిన్లకు తరలించాలని ట్రిబ్యునల్స్, చట్టాలు చెబుతున్నాయని అంటోంది. ఛత్తీస్‌గఢ్ అవసరాలు తీరకుండా, వాటికి హక్కు ఇవ్వకుండా మిగులు నీటిని ఇతర బేసిన్లకు తరలించడం కష్టమేనని చెబుతోంది. ఇంద్రావతి జలాలపై స్పష్టత ఇచ్చాకే ముందుకెళ్లాలని అంటోంది. -
నదుల అనుసంధానానికి తొలి అడుగు
(రామగోపాలరెడ్డి ఆలమూరు – సాక్షి ప్రత్యేక ప్రతినిధి): దేశంలో దుర్భిక్షాన్ని తరిమికొట్టేందుకు జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించిన నదుల అనుసంధానాన్ని చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన రెండు దశాబ్దాల తర్వాత కేంద్రం తొలి అడుగు వేసింది. కెన్ – బెట్వా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టింది. ఈ రెండు నదుల అనుసంధానికి సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై మార్చి 22న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వర్చువల్ విధానంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సీఎంలు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లు సంతకం చేశారు. ఈ నదుల అనుసంధానికి రూ.37,611 కోట్లు వ్యయం అవుతుంది. మధ్యప్రదేశ్‌కు 82 టీఎంసీలను సరఫరా చేయడం ద్వారా 8.11 లక్షల హెక్టార్లు.. ఉత్తరప్రదేశ్‌కు 59.98 టీఎంసీలను సరఫరా చేయడం ద్వారా 2.51 లక్షల హెక్టార్లకు నీళ్లందించనున్నారు. రెండు రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు ద్వారా 62 లక్షల మందికి తాగు నీటిని అందించనున్నారు. 103 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడంలో భాగంగా 90 శాతం నిధులను వ్యయం చేసేందుకు కేంద్రం అంగీకరించింది. మిగతా పది శాతం నిధులను ఆయకట్టు ఆధారంగా దామాషా పద్దతిలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు భరిస్తాయి. ఎనిమిదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం గోదావరి – కృష్ణా – పెన్నా – కావేరీ అనుసంధానాన్ని చేపట్టడంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. కావేరికి గో‘దారి’పై సమాలోచనలు ► గోదావరి – కృష్ణా(నాగార్జునసాగర్) – పెన్నా(సోమశిల) – గ్రాండ్ ఆనకట్ట(కావేరీ) అనుసంధానానికి 2019లో ఎన్‌డబ్ల్యూడీఏ రెండు ప్రతిపాదనలు చేసింది. ► తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇచ్చంపల్లి వద్ద మిగులుగా ఉన్న 175 టీఎంసీలు, ఇంద్రావతి బేసిన్లో ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 72 టీఎంసీలు వెరసి 247 టీఎంసీల గోదావరి జలాలను మొదటి దశలో కావేరికి తరలించాలని సూచించింది. ఇందులో ప్రవాహ నష్టాలు పోను ఆంధ్రప్రదేశ్‌కు 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీఎంసీలు కేటాయించాలని పేర్కొంది. ► ఉమ్మడి వరంగల్ జిల్లా జానంపేట వద్ద నుంచి కావేరికి మొదటి దశలో 247 టీఎంసీల గోదావరి జలాలను తరలించాలని సూచించింది. ఇందులో ఏపీకి 108, తెలంగాణకు 39, తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. దీనిపై ప్రయోజనం పొందే రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. ► గతేడాది జూలై 12న ఎన్‌డబ్ల్యూడీఏ సర్వసభ్య సమావేశంలో.. జూలై 28న సంప్రదింపుల సమావేశంలో గోదావరి – కావేరి అనుసంధానం రెండు ప్రతిపాదనలపై బేసిన్ పరిధిలోని రాష్ట్రాలు సానుకూలంగా స్పందించలేదు. దీంతో కేంద్ర జల్ శక్తి శాఖ ఈ అంశాన్ని టాస్క్‌ఫోర్స్ కమిటీకి పంపింది. గత నెల 25న కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన టాస్క్‌ఫోర్స్ కమిటీ ఇచ్చంపల్లి నుంచి గోదావరి – కావేరీ అనుసంధానాన్ని చేపట్టాలని ఎన్‌డబ్ల్యూడీఏకు దిశా నిర్దేశం చేసింది. ► తమ అవసరాలు తీర్చాకే ఇతర రాష్ట్రాలకు గోదావరి జలాలను తరలించాలని ఏపీ, తెలంగాణలు స్పష్టం చేస్తుండగా.. తమ వాటా జలాలను వాడుకోవడానికి అంగీకరించబోమని ఛత్తీస్‌గఢ్ తెగేసి చెబుతోంది. కావేరికి మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా కావాలంటూ కర్ణాటక, మహారాష్ట్ర పట్టుపడుతున్నాయి. ఇదే రీతిలో కావేరీ జలాల్లో అదనపు వాటా కావాలంటే కేరళ, కర్ణాటకలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను ఒప్పించడం కేంద్రానికి సవాలే. ఐదు అడ్డంకులు.. ► నదుల అనుసంధానంపై ఇప్పటి వరకు స్పెషల్ కమిటీ 18 సార్లు, సబ్ కమిటీ (కాంప్రహెన్షివ్ ఎవల్యూషన్) ఎనిమిది సార్లు, సబ్ కమిటీ (నదుల అధ్యయనం) 15 సార్లు, సంప్రదింపుల కోసం ఏర్పాటైన సబ్ కమిటీ మూడు సార్లు, టాస్క్‌ఫోర్స్ 13 సార్లు, న్యాయపరమైన అంశాల కమిటీ పది సార్లు, ఆర్థిక అంశాల కమిటీ 13 సార్లు సమావేశాలను నిర్వహించింది. ► ఈ సమావేశాల్లో కేవలం కెన్ – బెట్వా నదుల అనుసంధానంపై మాత్రం రాష్ట్రాలను ఒప్పించగలిగింది. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, ఒక బేసిన్ (నదీ పరీవాహక ప్రాంతం) నుంచి మరో బేసిన్‌కు మళ్లించే నీటిలో వాటా కోసం ఆ బేసిన్‌లోని ఎగువ రాష్ట్రాలు పట్టుబడుతుండటం, బేసిన్లో మిగులు జలాలు ఉన్నప్పటికీ ఆ రాష్ట్రాలు ఆ విషయాన్ని అంగీకరించకపోవడం జరుగుతోంది. ► దీనికితోడు నదీ జలాలను పంపిణీ చేస్తూ ట్రిబ్యునల్లు ఇచ్చిన తీర్పులు, అనుసంధానం వ్యయంలో 90 శాతం కేంద్రమే భరించాలని రాష్ట్రాలు ఒత్తిడి తెస్తుండటం లాంటి అంశాల కారణంగా దేశంలో నదుల అనుసంధానం కార్యరూపం దాల్చడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోందని ఎన్‌డబ్ల్యూడీఏ ఇటీవల కేంద్రానికి నివేదిక ఇచ్చింది. రూ.5.60 లక్షల కోట్ల వ్యయం ► దేశంలో ఏటా కురిసే వర్షపాతం పరిమాణం నాలుగు వేల బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు. (1,41,260 టీఎంసీలు). గంగా, బ్రహ్మపుత్రా, గోదావరి, మహానది తదితర నదుల ద్వారా ఏటా వేలాది టీఎంసీల జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ► హిమాలయ, ద్వీపకల్పంలోని 37 నదులను అనుసంధానం చేయడం ద్వారా 6,144.81 టీఎంసీలను మళ్లించేలా ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 14 లింక్‌ల ద్వారా హిమాలయ నదులను, 16 లింక్‌ల ద్వారా ద్వీపకల్ప నదులను అనుసంధానం చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. ► ఈ నదుల అనుసంధానం వల్ల కొత్తగా 8.65 కోట్ల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. 34 వేల మెగావాట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. జల రవాణాకు ఊతమిస్తుంది. ఈ పనులు చేపట్టడానికి 2002 – 03 ధరల ప్రకారం రూ.5.60 లక్షల కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ధరల ప్రకారం నదుల అనుసంధానానికి రూ.పది లక్షల కోట్ల మేర అవసరం అవుతాయని అంచనా. ► నదుల అనుసంధానానికి వెచ్చించే వ్యయం.. ఆయకట్టులో ఉత్పత్తయ్యే పంటలపై వేసే పన్నులు, జల విద్యుత్ ఉత్పత్తి తదితర రూపాల్లో కేవలం పదేళ్లలో ఖజానాకు ఆ మొత్తం వెనక్కి వస్తుందని ఆర్థిక నిపుణులు తేల్చిచెప్పారు. ► దేశంలో దుర్భిక్షాన్ని తరిమికొట్టడానికి.. పేదరికాన్ని నిర్మూలించడానికి నదుల అనుసంధానం ఒక్కటే మార్గమని.. ఆ పనులు చేపట్టేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ 2002లో దాఖలైన రిట్ పిటిషన్‌పై 2002 ఫిబ్రవరి 27న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నదుల అనుసంధానాన్ని చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది. ► సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2014 జూలై 14న నదుల అనుసంధానాన్ని చేపట్టడానికి కేంద్ర కేబినెట్ అంగీకరించింది. ఇందుకోసం స్పెషల్ కమిటీని ఏర్పాటు చేస్తూ 2014 సెప్టెంబరు 23న కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. -
‘అనుసంధానం’..అగమ్యగోచరం..!
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి అనుసంధాన ప్రక్రియలో ఎలాంటి ముందడుగు పడటం లేదు. వివిధ రాష్ట్రాల నుంచి వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు, స్వరాష్ట్ర ప్రయోజనాలు కాపాడాకే మిగులు జలాలు తరలించాలన్న విధానాన్ని పలు రాష్ట్రాలు వ్యక్తం చేస్తుండటంతో అనుసంధాన ప్రక్రియ మూలనపడుతోంది. అదీగాక జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై రాష్ట్రాలు గుర్రుగా ఉండటం సైతం అనుసంధానానికి అడ్డుగా మారుతోంది. అకినేపల్లి అని ఒకమారు, జనంపేట్ అని మరోమారు, ఇచ్చంపల్లి అంటూ ఇంకోమారు మాటలు చెబుతున్నా అవి కార్యరూపం దాల్చడం లేదు. నాలుగు ప్రతిపాదనల్లో ఏదీ తేలలేదు..? ఒడిశాలోని మహానది మొదలు తెలంగాణ, ఏపీ లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ, తమిళనాడు, కర్ణాటకలోని కావేరి వరకు నదుల అనుసంధానాన్ని చేపట్టాలని భావిస్తున్న కేంద్రం, ఇప్పటికే దానికి అనుగుణంగా పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మహానదిలో 360 టీఎం సీలు, గోదావరిలో 530 టీఎంసీల మేర మిగులు జలాలున్న దృష్ట్యా, ఇందులో 247 టీఎంసీల నీటిని ఖమ్మం జిల్లాలోని అకినేపల్లి నుంచి కృష్ణా, కావేరికి తరలించాలని మొదట ప్రతిపాదించింది. దీనిపై తెలంగాణ పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గోదావరిలో తెలంగాణకు హక్కుగా 954 టీఎంసీల కేటాయింపు ఉం దని, ఉమ్మడి రాష్ట్రంలో ఆ మేరకు నీటిని వాడు కునే అవకాశం దక్కలేదని తెలిపింది. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు సైతం చేపట్టడంతో ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు తెలంగాణకు 1,600 టీఎంసీలు అవసరమని తెలిపింది. ఈ నీటిని పక్కనపెట్టి, అంతకుమించి నీటి లభ్యత ఉంటే దానిని నదుల అనుసంధానం ప్రక్రియకు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో ఎన్‌డబ్ల్యూడీఏ జనం పేట ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. భూ సేకరణను తగ్గించేలా పైప్‌లైన్ ద్వారా నాగార్జునసాగర్‌కు తరలించాలని ప్రతిపాదించింది. దీన్ని తెలంగాణ తిసర్కరించింది.దీంతో ఇచ్చంపల్లి నుంచి తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇచ్చంపల్లి(గోదావరి)– నాగార్జునసాగర్(కృష్ణా) ప్రాజెక్టులను అనుసంధానించాలని, దీనికి మూసీ రిజర్వాయర్‌ను వినియోగించుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది. దీనికి తెలంగాణ సాను కూలంగా ఉంది. దీని ద్వారా రాష్ట్ర పరిధిలో కనిష్టంగా 18 నుంచి 20లక్షల ఎకరాల మేర సాగు జరుగుతుందని చెబుతోంది.దీనిపై ఇప్పటివరకు ఎన్డబ్ల్యూఏ ఎటూ తేల్చలేదు. దీంతో పాటు ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి అను కూలత లేనిపక్షంలో ఇప్పటికే నిర్మాణం జరుగుతున్న తుపాకులగూడెం ద్వారా అయినా గోదావరి నీటిని తరలించే ప్రతిపాదనకు తెలంగాణ సమ్మతి తెలుపుతున్నా ఎన్‌డబ్ల్యూడీఏ నుంచి సానుకూలత లేదు. ఇదిలా ఉంటే కర్ణాటక, తమిళనాడు ఎన్నికల ప్రచా రంలో బీజేపీ మాత్రం గోదావరి–కావేరీ నదుల అనుసంధా నం చేసి తీరుతామని, ఆయా రాష్ట్రాల నీటి అవ సరాలు తీరుస్తామని హామీలు ఇచ్చింది. కేంద్ర జల వనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఇదే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు. దీనిపై ముందడుగు మాత్రం పడలేదు. ప్రస్తుతం కేంద్రం నియమిం చిన టాస్క్‌ఫోర్స్ కమిటీ భేటీయై రాష్ట్రాలతో చర్చిస్తేనే దీనిపై అడుగు ముందుకు పడనుంది. -
కావేరి బోర్డుపై న్యాయ పోరాటం
సాక్షి బెంగళూరు: కావేరి నది నీటి నిర్వహణ బోర్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయాలని కర్ణాటక సర్కారు నిర్ణయించింది. సీఎం కుమారస్వామి ఆధ్వర్యంలో శనివారం విధానసౌధలో జరిగిన అఖిలపక్ష భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూలై 2న జరిగే బోర్డు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఇద్దరు సీనియర్ అధికారులు కర్ణాటక తరఫు వాదనలు వినిపించాలని తీర్మానించారు. అన్ని పార్టీల ఎంపీలు ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని నిర్ణయించారు. సమావేశంలో అన్ని పార్టీల నేతలతో పాటు కేంద్రమంత్రులు సదానందగౌడ, అనంత్‌కుమార్ పాల్గొన్నారు. భేటీ అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డీకే శివకుమార్ మాట్లాడారు. ‘కావేరీ నిర్వహణ ప్రాధికార సంస్థ, నియంత్రణ కమిటీలను కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో బోర్డును హడావుడిగా నియమించాల్సిన అవసరం లేదని మాత్రమే మేం చెబుతున్నాం’ అని పేర్కొన్నారు. జూలై 2న జరిగే బోర్డు సమావేశంలో కర్ణాటక ప్రతినిధులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ వాదనలను, రైతుల నీటి కష్టాలను వివరిస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై తమ న్యాయ నిపుణులు మోహన్ కటార్కి, ఫాలి నారిమన్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తారని వెల్లడించారు. ఈ భేటీలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప పాల్గొన్నారు. -
‘కావేరి’పై సుప్రీంకు ముసాయిదా
న్యూఢిల్లీ: కావేరి నదీ జలాల నిర్వహణకు సంబంధించిన ముసాయిదా ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ముసాయిదాను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనానికి సోమవారం సమర్పించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, కేంద్రం ప్రతిపాదించిన ప్రణాళిక ఫిబ్రవరి 16 నాటి తమ తీర్పుకు అనుగుణంగా ఉందా లేదా అనేది ఈ నెల 16న పరిశీలించి, ఆమోదం తెలుపుతామని పేర్కొంది. కావేరీ నదీ జలాల నిర్వహణ సంస్థను బోర్డు అనాలా? కమిటీ అనాలా? అథారిటీ అనాలా? అన్న విషయాన్ని సుప్రీంకోర్టుకే వదిలేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. కావేరి జలాల పంపిణీ కోసం బెంగళూరు కేంద్రంగా 9 మంది సభ్యులుగాగల ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ కమిటీలో కేంద్రం నియమించే ఓ చైర్మన్, ఇద్దరు శాశ్వత సభ్యులు, ఇద్దరు తాత్కాలిక సభ్యులతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిల నుంచి ఒక్కోప్రతినిధి ఉంటారు. కావేరి నదీ జలాల పంపిణీని మార్చడంతోపాటు కావేరి మేనేజ్మెంట్ బోర్డును ఆరు వారాల్లో ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ఫిబ్రవరి 16నే సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. అయినా ఇన్నాళ్లూ కేంద్రం జాప్యం చేయడంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ నెల 8న కేసును విచారిస్తూ కేంద్రం చర్యలు పూర్తిగా కోర్టు ధిక్కారం కిందకు వస్తాయనీ, ఈ నెల 14న (సోమవారమే) కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి స్వయంగా హాజరై ముసాయిదాను సమర్పించకపోతే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ముసాయిదాను సమర్పించింది. -
కావేరి బోర్డు ఏర్పాటులో జాప్యంపై అసంతృప్తి
న్యూఢిల్లీ: కావేరి నదీ జలాల యాజమాన్య బోర్డు ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డు ఏర్పాటుకు సంబంధించి తీసుకున్న చర్యలు వివరిస్తూ మే 8 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కావేరి బోర్డును నియమించే బాధ్యత కేంద్రానిదేనని, ఇందులో రాష్ట్రాల పాత్ర ఏమీ ఉండదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు సూచించింది. తమ ఆదేశాల మేరకు కావేరి జలాశయాల నుంచి తమిళనాడుకు 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేని పక్షంలో కోర్టు ధిక్కార కేసుగా భావించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరు కోరుతామని హెచ్చరించింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారని, విచారణను పోలింగ్ ముగిసే దాకా వాయిదా వేయాలని వేణుగోపాల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం పక్షపాత ధోరణితో సమాఖ్య విధానానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని తమిళనాడు ఆరోపించింది. -
కావేరీ తల్లి కన్నీళ్లపై సినిమా
-
కావేరీ తల్లి కన్నీళ్లపై సినిమా
సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల పురాణం ప్రకారం అగస్త్య ముని తన కమండలంలోని నీళ్లను మంత్రించి నేలపై చల్లగా అది ఏరులై, పాయలై తమిళ్, కన్నడ ప్రాంతాల నుంచి ప్రవహించే కావేరీ నదిగా మారుతుంది. ఫల, ఫుష్పాలకు, సకల జీవజాలాన్ని పోషించే తల్లిగా చరిత్రకెక్కుతుంది. అలాంటి తల్లి కోసం నేడు తమిళనాడు, కర్ణాటక ప్రజలు కొట్టుకుంటున్నారు. బక్కచిక్కి శల్యమై తుది శ్వాసతో కొట్టుమిట్టాడుతున్న కావేరీ తల్లిని రక్షించుకోవాల్సిన బిడ్డలు నేడు తల్లి రక్తం ఆఖరి బొట్లను పంచుకునేందుకు కొట్లాడుతున్నారని ప్రముఖ డాక్యుమెంటరీ డైరెక్టర్ వినోద్ ఈశ్వర్ వాపోతున్నారు. ఒకప్పుడు పచ్చటి అభయారణ్యం గుండా ప్రవహించిన కావేరీ ఇప్పుడు ఎడారిగా మారిన ప్రాంతంలోని బీటలు వారిన భూమినికూడా తడపలేక ఎండిపోయిన పంట కాలువలా ప్రవహిస్తున్న వైనాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూ దాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి తెలియజేస్తూ వినోద్ ఈశ్వర్ ఓ లఘు చిత్రాన్ని దీశారు. దాన్ని గతేడాది ఆగస్టు నెలలోనే పూర్తి చేసినప్పటికీ ఇంతకాలం విడుదల చేయలేదు. కర్ణాటక, తమిళనాడు మధ్య నలుగుతున్న కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఈ సినిమాను విడుదల చేయాల్సిన అవసరం వచ్చిందని భావించిన దర్శకుడు వినోద్ తమళ్, కొడవ, కన్నడ భాషల్లో రెండు రోజుల క్రితం సినిమాను విడుదల చేశారు. ఇప్పుడు ఈ చిత్రం ‘యూట్యూబ్’లో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది. -
కావేరిలో విద్యార్థుల గల్లంతు..
సాక్షి, సేలం: ధర్మపురి జిల్లాలో కావేరి నదిలో మునిగి కర్ణాటక విద్యార్థులు ముగ్గురు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా, మరో ఇద్దరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు సంతోష్ కారులో స్నేహితులు సూర్య, బాలాజీ, అరుణ్ కుమార్, కార్తిక్, నందకుమార్, పిజిలీ రావు, ఎస్ఎస్ అని మొత్తం ఎనిమిది మంది శుక్రవారం ధర్మపురి జిల్లాలో ఉన్న హొగ్నెకల్‌కు పర్యటనకు వచ్చారు. ఇక్కడ ఉన్న జలపాతాల్లో స్నానాలు చేసి ఆనందించారు. తర్వాత కర్ణాటకకు వెనుదిరిగిన వారు అంజట్టి వద్ద వెళుతుండగా ఆలంబాడి అనే ప్రాంతంలో ఉన్న కావేరి నదిలో స్నానం చేయడానికి దిగారు. అయితే అక్కడ స్నానం చేయకూడదు– ప్రమాదం అనే బోర్డు ఉన్నప్పటికీ దాన్ని బేఖాతరు చేస్తూ నీటిలో స్నానం చేయడానికి దిగారు. వారిలో సంతోష్ కొంత దూరం వెళ్లగా నీటి ఉధృతి అధికంగా ఉండడంతో నీటిలో కొట్టుకుపోయాడు. అతన్ని కాపాడేందుకు బాలాజి, ఎస్ఎస్ ప్రయత్నించారు. అయితే వారు కూడా నీళ్లలో గల్లంతయ్యారు. దీంతో మిగిలిన వారు ఒడ్డుకు చేరి పెన్నగరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పెన్నగరం డీఎస్పీ అన్బురాజ్, అగ్నిమాపక సిబ్బంది చుట్టు పక్కల గాలించి బాలాజి మృతదేహాన్ని బయటకు తీశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. సరదాగా షికారుకు వచ్చి తిరిగి రాని లోకానికి వెళ్లిన స్నేహితుడిని చూసి సహ మిత్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. -
పక్షులు కోసం వెళ్లి.. మృత్యువు కౌగిట్లోకి..!
సెలవు రోజున సరదాగా గడిపేందుకు వెళ్లిన నలుగురు బాలమిత్రులు కన్నవారికి కడుపు కోత మిగిల్చారు. ఆదివారం సాయంత్రం నుంచి కనబడకపోతే ఉదయాన్నే వస్తారనుకున్న ఆ తల్లిదండ్రులను కన్నీటి సంద్రంలో ముంచేశారు. పక్షులు పట్టడానికి వెళతామని ఇంట్లో చెప్పి కావేరి నదిలో మృతదేహాలుగా కనిపించారు. ఈత కొట్టేందుకు వెళ్లి ఆ బాలురు మునిగిపోయారా.. లేక రసాయన వ్యర్థాల ప్రభావంతో చనిపోయారా అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. సాక్షి, సేలం: మెట్టూరు డ్యాం వద్ద కావేరి నదిలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు సహా నలుగురు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. వివరాలు.. సేలం జిల్లా మేట్టూరు సమీపం సేలం క్యాంప్ అన్నానగర్ ప్రాంతానికి చెందిన కూలీ ధనపాల్. ఇతని కుమారులు రాజా (12), తమిళలగన్ (9) అదే ప్రాంతంలో ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి, నాలుగో తరగతి చదువుతున్నారు. అదే పాఠశాలలో మణి కుమారుడు మోహన్ రాజ్ (7) రెండో తరగతి, బాలాజీ కుమారుడు మణికంఠన్ (17) పదో తరగతి వరకు చదువుకుని ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ నలుగురు స్నేహితులు ఆదివారం సెలవు కావడంతో పక్షులను పట్టడానికి వెళుతున్నామని తెలిపి బయటకు వెళ్లారు. అయితే పొద్దుపోయినా వారు నలుగురు ఇంటికి చేరుకోలేదు. తల్లిదండ్రులు అనేక ప్రాంతాల్లో గాలించినా వారి ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో మెట్టూరులో 16 గేట్ల ఉపరి నీరు వెలువడే ప్రాంతంలో రసాయన వ్యర్థపు నీరు నిల్చి ఉంటుంది. ఈ ప్రాంతంలో సోమవారం ఉదయం నలుగురి మృత దేహాలు తేలుతూ కనిపించాయి. విషయం తెలుసుకున్న వారి కుటుంబీకులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న కరుమలైకూడల్ పోలీసులు, మెట్టూరు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని నలుగురి మృత దేహాలను వెలికి తీసి శవపంచనామా నిమిత్తం మేట్టూరు జీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, ప్రాథమిక విచారణలో సరదాగా ఈత కొట్టడానికి నీటిలో దిగి ఉంటారని తెలిసింది. అయితే విద్యార్థుల మృతదేహాలు లభించిన ప్రాంతంలో లోతుగా లేకపోవడంతో చిన్నారుల మృతికి గల కారణలపై దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ నిలిచిఉన్న రసాయన వ్యర్థపు నీటి వల్ల మృతి చెంది ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కడకు రసాయన వ్యర్థపు నీరు ఏఏ సంస్థల నుంచి వచ్చి చేరుతుంది. రసాయనాల కారణంగానే నలుగురు బాలురు మృతి చెందారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. -
గోదావరి–కావేరీ నదుల అనుసంధానం
చెన్నై: నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని, గోదావరి మిగులు జలాల్ని కావేరీకి తరలించేందుకు ప్రణాళిక రూపకల్పన కోసం ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. గోదావరి–కావేరీ నదుల అనుసంధానానికి జల వనరుల శాఖ కృషి చేస్తోందని, ఇది కార్యరూపం దాల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో నీటి కొరత తీరుతుందని పేర్కొన్నారు. ‘మిగులు జలాల్ని గోదావరి నది నుంచి కృష్ణకు, అక్కడి నుంచి పెన్నా.. చివరకు కావేరీకి తరలించాలని జల వనరుల శాఖ నిర్ణయించింది’ అని చెన్నైలో గడ్కారీ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రాల ఆందోళనలపై చర్చిస్తున్నామని, సమీప భవిష్యత్తులో నిర్ధిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వస్తామని ఆయన చెప్పారు. ‘తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి, వారి అనుమతితో ప్రణాళికను ఖరారు చేస్తాం. ఈ ప్రాజెక్టుల్ని జాతీయ ప్రాజెక్టులుగా పరిగణిస్తాం. 90 శాతం ఖర్చు కేంద్ర ప్రభుత్వం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి’ అని తెలిపారు. మొదటి ప్రాజెక్టులో భాగంగా 300 టీఎంసీల గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ డ్యాం ద్వారా కృష్ణాకు మళ్లిస్తారు. అక్కడి నుంచి పెన్నా నదిపై ఉన్న సోమశిల ప్రాజెక్టుకు.. అనంతరం కావేరీ నది పరివాహకంలోని గ్రాండ్ ఆనకట్టుకు మళ్లిస్తారు. కాల్వల ద్వారా కాకుండా స్టీలు పైపుల ద్వారా నీటిని తరలిస్తాయని గడ్కారీ వెల్లడించారు. మొదటి దశలో 100 టీఎంసీల నీరు కావేరీకి వెళ్తుందని, ఈ ప్రాజెక్టు ద్వారా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు లబ్ధిపొందుతాయని తెలిపారు. రెండో ప్రాజెక్టులో భాగంగా ఇంద్రావతి నది నుంచి నీటిని నాగార్జున సాగర్ డ్యాంకు తరలిస్తాం. అక్కడి నుంచి సోమశిల ప్రాజెక్టుకు మళ్లించి అనంతరం కర్ణాటకతో సంబంధం లేకుండా కావేరీకి నీటిని తరలిస్తాం’ అని గడ్కారీ వెల్లడించారు. అలాగే చెన్నై – బెంగళూరుల మధ్య రూ. 20 వేల కోట్లతో ఎక్స్‌ప్రెస్ వేను నిర్మిస్తామని చెప్పారు. తమిళనాడులోని తాంబరం–చెంగల్పట్టు మధ్య రూ. 2,250 కోట్లు, పూనామలీ నుంచి మదురవొయల్ మధ్య రూ. 1500 కోట్లతో, చెన్నై– ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు మధ్య రూ. 1000 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. -
కావేరి వివాదం.. కర్ణాటకకు సుప్రీంకోర్టు ఆదేశాలు
⇒ తమిళనాడుకు రోజుకు 2వేల క్యూసెక్కులు ⇒ కావేరి జలాల విడుదలకు కర్ణాటకను ఆదేశించిన సుప్రీంకోర్టు బెంగళూరు: తమిళనాడుకు రోజుకు రెండు వేల క్యూసెక్కుల చొప్పున కావేరి జలాలను ఈ నెల ఏడు నుంచి 18 వరకూ విడుదల చేయాలని జస్టిస్ ఉదయ్‌లలిత్, జస్టిస్ దీపక్‌మిశ్రాతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కర్ణాటకను మంగళవారం ఆదేశించింది. కావేరి నదీ జలాల వివాదానికి సంబంధించి గత నెల ఐదు నుంచి ద్విసభ ధర్మాసనం ముందు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ధర్మాసనం మంగళవారం తమిళనాడు, కర్ణాటకతో పాటు కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రస్తోగి వాదనలు విన్నది. తమిళనాడుకు నీటిని విడుదల చేయడంతో పాటు కేంద్ర జల సంఘం చైర్మన్ జీఎస్ ఝ నేతృత్వంలో నిపుణుల కమిటీ కావేరి నదీ పరివాహక రాష్ట్రాల్లో పర్యటించి ఈ నెల 17న నివేదిక అందజేయాలని ఆదేశించింది. అలాగే కావేరి నీటి నిర్వహణ మండలి ఏర్పాటుపై స్టే విధిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. అంతకుముందు వాదనల సందర్భంగా గత నెల 30న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి రోజుకు ఆరు వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 36వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని సర్వోన్నత న్యాయస్థానానికి కర్ణాటక తెలియజేసింది. ఇక అటార్నీ జనరల్ వాదిస్తూ కావేరి నీటి నిర్వహణ మండలి సుప్రీం పరిధిలోకి రాదని, గతంలో సరైన అవగాహన లేకపోవడంతో మండలి ఏర్పాటుకు సమ్మతించామని తెలిపారు. ఇక తమిళనాడు మాత్రం ఎప్పటి లాగానే మండలి ఏర్పాటుకు పట్టుబట్టింది. కర్ణాటక కోరుతున్నట్లే మండలి ఏర్పాటు నిలిచిపోవడం, నీటి లభ్యత అనుసరించి రెండు వేల క్యూసెక్కులు వదలడం కష్టం కాబోదని నిపుణులు చెబుతుండటం, క్షేత్రస్థాయి పర్యటన కోసం నిపుణుల కమిటీ ఏర్పాటుకు సుప్రీంకోర్టు అంగీకరించడం వల్ల కర్ణాటకకు ఊరట లభించిందని సీఎం సిద్ధరామయ్యతో పాటు పలువురు న్యాయనిపుణులు పేర్కొన్నారు. -
జల కళ
సాక్షి, చెన్నై : నైరుతీ రుతు పవనాలు కేరళ, కర్ణాటక ప్రజలను కరుణించాయి. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దులోని పశ్చిమ పర్వత శ్రేణుల్లో వర్షాలు కరుస్తున్నాయి. ఫలితంగా రాష్ట్ర సరిహద్దు జిల్లాల వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. డ్యాంలు కళకళ గత నెల మొదటి వారంలో పూర్తిగా అడుగంటిన మెట్టూరు డ్యాంను కర్ణాటక వర్షాలు ఆదుకున్నాయి. అక్కడి వర్షాలతో రెండు వారాలకు పైగా కావేరి నది పరవళ్లు తొక్కతూ వచ్చింది. హొగ్నెకల్‌లో కొద్ది రోజులు సందర్శకులకు నిషేధం విధించారంటే కావేరి ఏ మేరకు ఉధృతంగా ప్రవహించిందో అర్థం చేసుకోవచ్చు. రెండు రోజుల క్రితం వరద ఉధృతి తగ్గడంతో సందర్శకులకు అనుమతిచ్చారు. ఆహ్లాదకరంగా ఉన్న హొగ్నెకల్‌లో కొత్త అనుభూతిని ఆశ్వాదించే పనిలో సందర్శకులు పడ్డారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కర్ణాటకలోని కబిని డ్యాం పూర్తిగా నిండింది. దీంతో ఉబరి నీటిని పూర్తిగా విడుదల చేస్తూ, గేట్లను ఎత్తి వేశారు. ఇప్పటికే కావేరి నదిలో పదిహేను వేల గణపుటడుగుల నీళ్లు ప్రవహిస్తుండడంతో కబిని డ్యాం ఉబరి నీటితో ఉధృతి మరింత పెరిగింది. సుమారు 30 వేల గణపుటడుగుల మేరకు నీళ్లు విడుదలవుతుండడంతో కావేరి తీర వాసుల్ని అప్రమత్తం చేశారు. ఈ నీళ్లు మెట్టూరు డ్యాంకు వచ్చి చేరుతుండడంతో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. సాయంత్రానికి నీటి మట్టం 84 అడుగులు దాటింది. మరి కొద్ది రోజులు నీటి ఉధృతి ఇదే విధంగా కొనసాగిన పక్షంలో మెట్టూరు డ్యాం పూర్తిగా నిండే అవకాశాలు కన్పిస్తున్నాయి. పిల్లూరు ఫుల్ పశ్చిమ పర్వత శ్రేణుల్లో, కేరళ తీరంలో కురుస్తున్న వర్షాలతో కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం సమీపంలోని పిల్లూరు డ్యాం పూర్తిగా నిండింది. నీటి మట్టం 98 అడుగులకు చేరడంతో ఉబరి నీటిని విడుదలచేసే పనిలో అధికారులు పడ్డారు. ఉదయం ఆ డ్యాం మూడు గేట్లను ఎత్తివేశారు. ఆ డ్యాం నుంచి నీళ్లు పరవళ్లు తొక్కతూ భవానీ నదిలోకి చేరుతున్నాయి. కారమడైలోని శిరువాని డ్యాం సైతం నిండింది. ఆ డ్యాం నుంచి ఉబరి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ రెండు డ్యాంల నీటి విడుదలతో భవానీ నది పరవళ్లు తొక్కతూ, భవానీ సాగర్ డ్యాం వైపుగా ప్రవహిస్తుండడంతో ఆ పరిసర అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇక వాతావరణ కేంద్రం శనివారం రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. కోయంబత్తూరులో వరుణుడు కరుణించగా, చెన్నై పరిసరాల్లో అక్కడక్కడ చిరు జల్లులు పలకరించాయి.