ఏడాదికి మూడు పంటలతో కళకళలాడే డెల్టా జిలాల్లో కల్లోలం రేగుతోంది. నిత్యం పచ్చదనంతో ఉండే సురక్షిత వ్యవసాయ క్షేత్రంలో నేలబొగ్గు తవ్వకాలకు కేంద్రం అనుమతించ్చిందనే సమాచారంతో అక్కడి రైతులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. వివిధ రాజకీయ పార్టీలు పోరుబాట పట్టాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్నదాతలు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ మంత్రి సూచించారు. రైతులను ఇబ్బంది పెట్టే నిర్ణయాలను పునఃసమీక్షించి వెనక్కి తీసుకోవాలని సీఎం స్టాలిన్ ప్రధాని మోదీకి లేఖ రాయడం గమనార్హం.
సాక్షి, చైన్నె: కావేరి డెల్టా పరిధిలోని సురక్షిత వ్యవసాయ క్షేత్రంలో నేల బొగ్గు తవ్వకాలకు కేంద్రం అనుమతించిందనే సమాచారంతో రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ఆరు చోట్ల నేల బొగ్గు సొరంగాలు, 11 చోట్ల పరిశోధనలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మినిస్టరీ ఆఫ్ కోల్ నోటిఫికేషన్ జారీ చేయడంపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వీటికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని పీఎంకే నేత అన్భుమణి రాందాసు డిమాండ్ చేశారు. సురక్షిత క్షేత్రంలో కేంద్రం నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ డిమాండ్ చేశారు.
నేపథ్యం ఇదీ..
రాష్ట్రంలో పచ్చటి పంట పొలాలతో నిండిన జిల్లాలుగా తిరువారూర్, తంజావూరు, పుదుకోట్టై, పెరంబలూరు, అరియలూరు, నాగపట్నం, కడలూరు, తిరుచ్చికి పేరుంది. ఇక్కడ లక్షలాది ఎకరాలల్లో వరి పంట, వేలాది ఎకరాలలో ఇతర పంటలు సాగవుతున్నాయి. అలాగే పెద్దఎత్తున కొబ్బరి సాగవుతోంది. కావేరినది నీటి ఆధారంగానే ఇక్కడ పంటలు పండుతున్నాయి. గత కొన్నేళ్లుగా వరుణుడి కరుణ, కావేరి పరవళ్లతో ఇక్కడి అన్నదాతల్లో ఆనందం తాండవిస్తోంది. అయితే డెల్టా జిల్లాల్లోని భూగర్భంలో ఉన్న ఇంధనం, హైడ్రో కార్బన్, గ్యాస్, నేల బొగ్గు వంటి నిక్షేపాలను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం గత కొంతగాలంగా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో కేంద్రం ఇచ్చిన అనేక ఉత్తర్వులకు వ్యతిరేకంగా డెల్టాలో మహోద్యమాలు జరిగాయి.
కేంద్రం వ్యూహాలకు చెక్ పేట్టే విధంగా, రైతుల్లో నెలకొన్న ఆందోళనను పోగొట్టే రీతిలో గత అన్నాడీఎంకే ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా కీలక తీర్మానం చేసింది. డెల్టా జిల్లాలను సురక్షిత వ్యవసాయ క్షేత్రంగా ప్రకటిస్తూ చట్టం తీసుకొచ్చింది. ఈ క్షేత్రంలో వ్యవసాయం మాత్రమే చేపట్టాలని, ఇతర పరిశ్రమలు, తవ్వకాలకు అనుమతులు లేవని స్పష్టం చేసింది. అలాగే గతంలో జారీ చేసిన ఇతర పరిశ్రమలకు సంబంధించిన అనుమతులను రద్దు చేశారు. దీంతో డెల్టా సురక్షిత వ్యవసాయ క్షేత్రంగా మారింది. అదే సమయంలో రాష్ట్రంలో అధికార మార్పు తర్వాత.. ప్రస్తుతం కేంద్రం మళ్లీ చాప కింద నీరులా డెల్టాపై కన్నేసి వ్యూహాలకు పదును పెట్టడం మంగళవారం అక్కడి రైతుల్లో ఆందోళన రేకెత్తించింది.
నైవేలి తరహాలో..
కడలూరు జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఆ జిల్లాను పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకునే విధంగా దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. నైవేలి పరిసరాల్లో నేల బొగ్గు తవ్వకాల పేరిట గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకోవడం వివాదానికి దారి తీసింది. దీనికి వ్యతిరేకంగా ఓ ఉద్యమమే ప్రారంభమైంది. అలాగే వీరాణ్ణం రిజర్వాయర్ పరిధిలో నేల బొగ్గు తవ్వకాలకు పరిశోధనలు చేయడం వెలుగులోకి రావడంతో కల్లెం వేయడానికి ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమయంలో డెల్టాలో ప్రధాన జిల్లాగా ఉన్న తంజావూరు ఒరత్తనాడు పరిధిలో ఆరు చోట్ల నేల బొగ్గు తవ్వకాలకు సొరంగాలపై కేంద్రం దృష్టి పెట్టడం వివాదానికి దారి తీసింది. తిరువారూర్– తంజావూరు జిల్లాల పరిధిలో ఆరు చోట్ల నేల బొగ్గు తవ్వకాలకు సంబంధించిన సొరంగాలు, పరిశోధనలకు కేంద్రం అనుమతి ఇవ్వడం వెలుగు చూసింది. ఈ సమాచారం అన్నదాతల్లో ఆగ్రహాన్ని రేపింది. సురక్షిత క్షేత్రాన్ని చిన్నాభిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయంటూ రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం స్పందించకుంటే మరో ఉద్యమం ప్రారంభమవుతుందని హెచ్చరించాయి.
అడ్డుకట్ట వేసేందుకు..
కావేరి డెల్టాలోని లక్షా 25 వేల ఎకరాల పంట పొలాలను సర్వనాశనం చేయడానికి కేంద్రం సిద్ధమైందని పీఎంకే నేత అన్భుమణి రాందాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వద్ద ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని వివరించారు. తంజావూరు జిల్లా పరిధిలో 11 చోట్ల పరిశోధనలు, ఆరు చోట్ల సొరంగాల తవ్వకాలకు కేంద్రం కార్యచరణ సిద్ధం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా కేంద్రం ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకోవడం తగదని హితవుపలికారు. ఈ వ్యవహారంపై సీఎం స్టాలిన్ తక్షణం స్పందించాలని, అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేయాలని పట్టుబట్టారు. బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. సురక్షిత వ్యవసాయం క్షేత్రంలో పరిశోధనలకు కేంద్రం అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా మని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ వ్యాఖ్యలు చేశారు. రైతులతో కలిసి పెద్దఎత్తున పోరాటాలకు తాము సిద్ధం అని ప్రకటించారు.
ఆందోళన వద్దు..
కేంద్రం అనుమతులు ఇచ్చినంత మాత్రాన అవన్నీ అమల్లోకి వచ్చే ప్రసక్తే లేదని వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్‌కే పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న స్థలాల్లో, తమ అనుమతి లేకుండా కేంద్రం ఎలా తవ్వకాలపై దృష్టి పెడుతుందని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీఎం స్టాలిన్ స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడిస్తారన్నారు. తిరువారూర్, తంజావూరు పర్యటనలో ఉన్న క్రీడల శాఖమంత్రి ఉదయ నిధి స్టాలిన్ మాట్లాడుతూ, కేంద్రం చర్యలను ఆదిలోనే కట్టడి చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా డెల్టాలో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. సురక్షిత వ్యవసాయ క్షేత్రాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని వివరించారు. తక్షణం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment