నదుల అనుసంధానానికి తొలి అడుగు | First step to river connectivity | Sakshi
Sakshi News home page

నదుల అనుసంధానానికి తొలి అడుగు

Published Sun, Apr 18 2021 4:40 AM | Last Updated on Sun, Apr 18 2021 12:11 PM

First step to river connectivity - Sakshi

(రామగోపాలరెడ్డి ఆలమూరు – సాక్షి ప్రత్యేక ప్రతినిధి): దేశంలో దుర్భిక్షాన్ని తరిమికొట్టేందుకు జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించిన నదుల అనుసంధానాన్ని చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన రెండు దశాబ్దాల తర్వాత కేంద్రం తొలి అడుగు వేసింది. కెన్‌ – బెట్వా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టింది.

ఈ రెండు నదుల అనుసంధానికి సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై మార్చి 22న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వర్చువల్‌ విధానంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ సీఎంలు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్‌సింగ్‌ చౌహాన్, కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌లు సంతకం చేశారు. ఈ నదుల అనుసంధానికి రూ.37,611 కోట్లు వ్యయం అవుతుంది. మధ్యప్రదేశ్‌కు 82 టీఎంసీలను సరఫరా చేయడం ద్వారా 8.11 లక్షల హెక్టార్లు.. ఉత్తరప్రదేశ్‌కు 59.98 టీఎంసీలను సరఫరా చేయడం ద్వారా 2.51 లక్షల హెక్టార్లకు నీళ్లందించనున్నారు.

రెండు రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు ద్వారా 62 లక్షల మందికి తాగు నీటిని అందించనున్నారు. 103 మెగావాట్ల జల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడంలో భాగంగా 90 శాతం నిధులను వ్యయం చేసేందుకు కేంద్రం అంగీకరించింది. మిగతా పది శాతం నిధులను ఆయకట్టు ఆధారంగా దామాషా పద్దతిలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు భరిస్తాయి. ఎనిమిదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం గోదావరి – కృష్ణా – పెన్నా – కావేరీ అనుసంధానాన్ని చేపట్టడంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది.

కావేరికి గో‘దారి’పై సమాలోచనలు 
► గోదావరి – కృష్ణా(నాగార్జునసాగర్‌) – పెన్నా(సోమశిల) – గ్రాండ్‌ ఆనకట్ట(కావేరీ) అనుసంధానానికి 2019లో ఎన్‌డబ్ల్యూడీఏ రెండు ప్రతిపాదనలు చేసింది. 
► తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇచ్చంపల్లి వద్ద మిగులుగా ఉన్న 175 టీఎంసీలు, ఇంద్రావతి బేసిన్‌లో ఛత్తీస్‌గఢ్‌ వినియోగించుకోని 72 టీఎంసీలు వెరసి 247 టీఎంసీల గోదావరి జలాలను మొదటి దశలో కావేరికి తరలించాలని సూచించింది. ఇందులో ప్రవాహ నష్టాలు పోను ఆంధ్రప్రదేశ్‌కు 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీఎంసీలు కేటాయించాలని పేర్కొంది.
► ఉమ్మడి వరంగల్‌ జిల్లా జానంపేట వద్ద నుంచి కావేరికి మొదటి దశలో 247 టీఎంసీల గోదావరి జలాలను తరలించాలని సూచించింది. ఇందులో ఏపీకి 108, తెలంగాణకు 39, తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. దీనిపై ప్రయోజనం పొందే రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. 
► గతేడాది జూలై 12న ఎన్‌డబ్ల్యూడీఏ సర్వసభ్య సమావేశంలో.. జూలై 28న సంప్రదింపుల సమావేశంలో గోదావరి – కావేరి అనుసంధానం రెండు ప్రతిపాదనలపై బేసిన్‌ పరిధిలోని రాష్ట్రాలు సానుకూలంగా స్పందించలేదు. దీంతో కేంద్ర జల్‌ శక్తి శాఖ ఈ అంశాన్ని టాస్క్‌ఫోర్స్‌ కమిటీకి పంపింది. గత నెల 25న కేంద్ర జల్‌ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఇచ్చంపల్లి నుంచి గోదావరి – కావేరీ అనుసంధానాన్ని చేపట్టాలని ఎన్‌డబ్ల్యూడీఏకు దిశా నిర్దేశం చేసింది. 
► తమ అవసరాలు తీర్చాకే ఇతర రాష్ట్రాలకు గోదావరి జలాలను తరలించాలని ఏపీ, తెలంగాణలు స్పష్టం చేస్తుండగా.. తమ వాటా జలాలను వాడుకోవడానికి అంగీకరించబోమని ఛత్తీస్‌గఢ్‌ తెగేసి చెబుతోంది. కావేరికి మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా కావాలంటూ కర్ణాటక, మహారాష్ట్ర పట్టుపడుతున్నాయి. ఇదే రీతిలో కావేరీ జలాల్లో అదనపు వాటా కావాలంటే కేరళ, కర్ణాటకలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను ఒప్పించడం కేంద్రానికి సవాలే.

ఐదు అడ్డంకులు.. 
► నదుల అనుసంధానంపై ఇప్పటి వరకు స్పెషల్‌ కమిటీ 18 సార్లు, సబ్‌ కమిటీ (కాంప్రహెన్షివ్‌ ఎవల్యూషన్‌) ఎనిమిది సార్లు, సబ్‌ కమిటీ (నదుల అధ్యయనం) 15 సార్లు, సంప్రదింపుల కోసం ఏర్పాటైన సబ్‌ కమిటీ మూడు సార్లు, టాస్క్‌ఫోర్స్‌ 13 సార్లు, న్యాయపరమైన అంశాల కమిటీ పది సార్లు, ఆర్థిక అంశాల కమిటీ 13 సార్లు సమావేశాలను నిర్వహించింది. 
► ఈ సమావేశాల్లో కేవలం కెన్‌ – బెట్వా నదుల అనుసంధానంపై మాత్రం రాష్ట్రాలను ఒప్పించగలిగింది. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, ఒక బేసిన్‌ (నదీ పరీవాహక ప్రాంతం) నుంచి మరో బేసిన్‌కు మళ్లించే నీటిలో వాటా కోసం ఆ బేసిన్‌లోని ఎగువ రాష్ట్రాలు పట్టుబడుతుండటం, బేసిన్‌లో మిగులు జలాలు ఉన్నప్పటికీ ఆ రాష్ట్రాలు ఆ విషయాన్ని అంగీకరించకపోవడం జరుగుతోంది.
► దీనికితోడు నదీ జలాలను పంపిణీ చేస్తూ ట్రిబ్యునల్‌లు ఇచ్చిన తీర్పులు, అనుసంధానం వ్యయంలో 90 శాతం కేంద్రమే భరించాలని రాష్ట్రాలు ఒత్తిడి తెస్తుండటం లాంటి అంశాల కారణంగా దేశంలో నదుల అనుసంధానం కార్యరూపం దాల్చడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోందని ఎన్‌డబ్ల్యూడీఏ ఇటీవల కేంద్రానికి నివేదిక ఇచ్చింది.

రూ.5.60 లక్షల కోట్ల వ్యయం
► దేశంలో ఏటా కురిసే వర్షపాతం పరిమాణం నాలుగు వేల బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీరు. (1,41,260 టీఎంసీలు). గంగా, బ్రహ్మపుత్రా, గోదావరి, మహానది తదితర నదుల ద్వారా ఏటా వేలాది టీఎంసీల జలాలు సముద్రంలో కలుస్తున్నాయి.
► హిమాలయ, ద్వీపకల్పంలోని 37 నదులను అనుసంధానం చేయడం ద్వారా 6,144.81 టీఎంసీలను మళ్లించేలా ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 14 లింక్‌ల ద్వారా హిమాలయ నదులను, 16 లింక్‌ల ద్వారా ద్వీపకల్ప నదులను అనుసంధానం చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. 
► ఈ నదుల అనుసంధానం వల్ల కొత్తగా 8.65 కోట్ల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. 34 వేల మెగావాట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. జల రవాణాకు ఊతమిస్తుంది. ఈ పనులు చేపట్టడానికి 2002 – 03 ధరల ప్రకారం రూ.5.60 లక్షల కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ధరల ప్రకారం నదుల అనుసంధానానికి రూ.పది లక్షల కోట్ల మేర అవసరం అవుతాయని అంచనా.
► నదుల అనుసంధానానికి వెచ్చించే వ్యయం.. ఆయకట్టులో ఉత్పత్తయ్యే పంటలపై వేసే పన్నులు, జల విద్యుత్‌ ఉత్పత్తి తదితర రూపాల్లో కేవలం పదేళ్లలో ఖజానాకు ఆ మొత్తం వెనక్కి వస్తుందని ఆర్థిక నిపుణులు తేల్చిచెప్పారు.
► దేశంలో దుర్భిక్షాన్ని తరిమికొట్టడానికి.. పేదరికాన్ని నిర్మూలించడానికి నదుల అనుసంధానం ఒక్కటే మార్గమని.. ఆ పనులు చేపట్టేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ 2002లో దాఖలైన రిట్‌ పిటిషన్‌పై 2002 ఫిబ్రవరి 27న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నదుల అనుసంధానాన్ని చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది.
► సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2014 జూలై 14న నదుల అనుసంధానాన్ని చేపట్టడానికి కేంద్ర కేబినెట్‌ అంగీకరించింది. ఇందుకోసం స్పెషల్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ 2014 సెప్టెంబరు 23న కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement