బెంగళూరులో అఖిలపక్ష సమావేశంలో కుమారస్వామి, యడ్యూరప్ప కరచాలనం
సాక్షి బెంగళూరు: కావేరి నది నీటి నిర్వహణ బోర్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయాలని కర్ణాటక సర్కారు నిర్ణయించింది. సీఎం కుమారస్వామి ఆధ్వర్యంలో శనివారం విధానసౌధలో జరిగిన అఖిలపక్ష భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూలై 2న జరిగే బోర్డు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఇద్దరు సీనియర్ అధికారులు కర్ణాటక తరఫు వాదనలు వినిపించాలని తీర్మానించారు. అన్ని పార్టీల ఎంపీలు ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని నిర్ణయించారు. సమావేశంలో అన్ని పార్టీల నేతలతో పాటు కేంద్రమంత్రులు సదానందగౌడ, అనంత్‌కుమార్ పాల్గొన్నారు. భేటీ అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డీకే శివకుమార్ మాట్లాడారు.
‘కావేరీ నిర్వహణ ప్రాధికార సంస్థ, నియంత్రణ కమిటీలను కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో బోర్డును హడావుడిగా నియమించాల్సిన అవసరం లేదని మాత్రమే మేం చెబుతున్నాం’ అని పేర్కొన్నారు. జూలై 2న జరిగే బోర్డు సమావేశంలో కర్ణాటక ప్రతినిధులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ వాదనలను, రైతుల నీటి కష్టాలను వివరిస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై తమ న్యాయ నిపుణులు మోహన్ కటార్కి, ఫాలి నారిమన్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తారని వెల్లడించారు. ఈ భేటీలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment