సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల పురాణం ప్రకారం అగస్త్య ముని తన కమండలంలోని నీళ్లను మంత్రించి నేలపై చల్లగా అది ఏరులై, పాయలై తమిళ్, కన్నడ ప్రాంతాల నుంచి ప్రవహించే కావేరీ నదిగా మారుతుంది. ఫల, ఫుష్పాలకు, సకల జీవజాలాన్ని పోషించే తల్లిగా చరిత్రకెక్కుతుంది. అలాంటి తల్లి కోసం నేడు తమిళనాడు, కర్ణాటక ప్రజలు కొట్టుకుంటున్నారు. బక్కచిక్కి శల్యమై తుది శ్వాసతో కొట్టుమిట్టాడుతున్న కావేరీ తల్లిని రక్షించుకోవాల్సిన బిడ్డలు నేడు తల్లి రక్తం ఆఖరి బొట్లను పంచుకునేందుకు కొట్లాడుతున్నారని ప్రముఖ డాక్యుమెంటరీ డైరెక్టర్ వినోద్ ఈశ్వర్ వాపోతున్నారు.
ఒకప్పుడు పచ్చటి అభయారణ్యం గుండా ప్రవహించిన కావేరీ ఇప్పుడు ఎడారిగా మారిన ప్రాంతంలోని బీటలు వారిన భూమినికూడా తడపలేక ఎండిపోయిన పంట కాలువలా ప్రవహిస్తున్న వైనాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూ దాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి తెలియజేస్తూ వినోద్ ఈశ్వర్ ఓ లఘు చిత్రాన్ని దీశారు. దాన్ని గతేడాది ఆగస్టు నెలలోనే పూర్తి చేసినప్పటికీ ఇంతకాలం విడుదల చేయలేదు.
కర్ణాటక, తమిళనాడు మధ్య నలుగుతున్న కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఈ సినిమాను విడుదల చేయాల్సిన అవసరం వచ్చిందని భావించిన దర్శకుడు వినోద్ తమళ్, కొడవ, కన్నడ భాషల్లో రెండు రోజుల క్రితం సినిమాను విడుదల చేశారు. ఇప్పుడు ఈ చిత్రం ‘యూట్యూబ్’లో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment