శివాజీనగర: తమిళనాడుకు కావేరి నీరు విడుదలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని రాజకీయ పక్షాలు సర్కార్ ఏకపక్ష వైఖరిని ఎండగడుతున్నాయి. రాష్ట్ర రైతులకు అన్యాయం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. మరో వైపు రైతు సంఘాలు రోడ్డెక్కుతున్నాయి. అన్నదాతకు బాసటగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధ్యక్షతన ఈనెల 23న విధానసౌధ సమ్మేళనా సభా మందిరంలో అఖిల పక్ష సమావేశం జరుగనుండగా రాష్ట్ర రైతుల హితరక్షణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై చర్చ జరుగనుంది.
వర్షాలు తక్కువ కావటంతో నీటి కొరత ఏర్పడిందని, తమిళనాడుకు నీరు విడుదల చేసేందుకు సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం వాదించినా కావేరి నీటి నిర్వహణా ప్రాధికార మాత్రం... నిత్యం 10 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొంతమేరకు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. నీరు విడుదలపై రైతులు, ప్రతిపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తోంది.
నేడు సుప్రీం కోర్టులో పిటీషన్
కావేరి నీటి నిర్వహణ ప్రాధికార ఆదేశాలను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో నేడు పిటీషన్ దాఖలు చేయాలని శనివారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో తీర్మానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అడ్వోకేట్ జనరల్‌ను మంత్రి మండలి సమావేశానికి పిలిపించి న్యాయ పోరాటం చేయాల్సిన ఆవశ్యకతపై చర్చించారు.
24న ఎక్స్‌ప్రెస్ వే బంద్
యశవంతపుర: తమిళనాడుకు కావేరి నీటి విడుదలను వ్యతిరేకిస్తూ ఈ నెల 24న బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్ వే రోడ్డును దిగ్బంధం చేయాలని బీజేపీ నిర్ణయించింది. అందోళనలో పార్టీ రాష్ట్ర నాయకులు కూడ పాల్గొనే అవకాశం ఉందని ఎంపీ ప్రతాప్‌సింహా ఆదివారం ట్విట్ చేశారు. కాగా మండ్య జిల్లా ఇండువాళు వద్ద సోమవారం రైతులు హైవేబంద్ దిగ్బంధనం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment