మూడు వాహనాలు ఢీ.. ముగ్గురు మృతి
దొడ్డబళ్లాపురం: బాగలకోట జిల్లాలో బైక్, కారు, టాటాఏస్ ఇలా మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. జిల్లాలోని జమఖండి తాలూకా ఆలగూరు వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. టాటా ఏస్ వాహనం, బైక్, కారు అదుపు తప్పి పరస్పరం ఢీకొన్నాయి. ముగ్గురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. మహంతేశ్ (35), భీమప్ప గంటన్నవర (39), ఆనంద్ బాడగి (22) మృతులు కాగా, వీరు బెళగావి, జమఖండి వాసులుగా గుర్తించారు. జమఖండి గ్రామీణ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.
డివైడర్‌కు బస్సు ఢీ
దొడ్డబళ్లాపురం: కేఎస్ ఆర్టీసీ బస్సు డివైడర్‌ను డీకొన్న ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డ సంఘటన దొడ్డ తాలూకా సిద్ధేనాయకనహళ్లి వద్ద చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం బెంగళూరు నుంచి హిందూపురం మీదుగా పావగడకు వెళ్తున్న బస్సు దొడ్డబళ్లాపురం వద్ద మలుపులో బైక్‌ను తప్పించబోయి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. దొడ్డ గ్రామీణ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
యాసిడ్ పోస్తా, పొడిచేస్తా
● రోడ్డుపై భార్య మీద భర్త దాడి
మైసూరు: కోర్టులో తనపై వేసిన దావాను వెనక్కు తీసుకోవాలని భార్యపై ఓ భర్త పట్టపగలే దాడి చేశాడు. నగరంలోని కుక్కరహళ్లి వద్ద జరిగింది. వివరాలు..శారదాదేవి నగరకు చెందిన ఐశ్వర్య, సందేశ్ దంపతులు, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనివార్య కారణాలతో ఆమె భర్త నుంచి దూరంగా ఉంటోంది. జీవన భృతి కోసం కోర్టును ఆశ్రయించింది. జీవన భృతి చెల్లించాలని కోర్టు కూడా ఆదేశించింది. అయితే దీనిని సహించలేని భర్త సందేశ్ తన స్నేహితులతో కలిసి కుక్కరహళ్లి చెరువు వద్ద వాకింగ్ చేస్తున్న ఐశ్వర్యను అడ్డుకొని దూషిస్తూ ఆమెను హెల్మెట్‌తో కొట్టాడు. చాకు చూపించి చంపుతానని బెదిరించాడు. స్థానికులు వచ్చి ఐశ్వర్యను కాపాడారు. ఘరానా భర్తపై ఆమె జయలక్ష్మిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాసిడ్ పోస్తానని బెదిరించాడని, తనకేమైనా అయితే అతనిదే బాధ్యత అని తెలిపింది. సందేశ్‌తో పాటు అతని స్నేహితులు విజయ్‌కుమార్, పుట్టస్వామిలపై ఫిర్యాదుచేసింది.
కేంద్ర బడ్జెట్‌లో
రైతులకు పంగనామాలే
కోలారు: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రైతులకు కేంద్రం ఏమీ ఇవ్వకుండా పంగనామం పెట్టిందని రైతు సంఘం నేతలు విమర్శించారు. బడ్జెట్లో రైతులకు అరకొర అనుకూల అంశాలున్నాయని, కార్పొరేట్ కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేసి రైతులకు శూన్య బడ్జెట్ అందించారని ఆగ్రహం వ్యక్తపరిచారు. బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతాంగ వర్గానికి తీవ్రమైన నిరాశే మిగిలిందన్నారు. రైతుల హితవును కాపాడే పథకాలు బడ్జెట్‌లో ఏమీ కనిపించలేదన్నారు. వ్యవసాయ, నీటిపారుదల, రైల్వే రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తారని ఎదురు చూసిన వారికి తీవ్రనిరాశను మిగిల్చారన్నారు. ఎపిఎంసిల బలోపేతానికి ప్రాధాన్యత నివ్వలేదు. వ్యవసాయ రంగానికి గట్టి భరోసా ఇవ్వలేదని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె నారాయణగౌడ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్టీలు ప్లేట్లకు నామాలు రాసి నిరసన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment