గోదావరి–కావేరి అనుసంధానంపై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోని ఎన్‌డబ్ల్యూడీఏ
తొలుత అకినేపల్లి, ఆ తర్వాత జానంపల్లి, ఇప్పుడు ఇచ్చంపల్లి అంటూ డీపీఆర్
గోదావరిలో మిగులు జలాలు ఎక్కడున్నాయన్న ఏపీ, తెలంగాణ
ఛత్తీస్‌గఢ్ వాడుకోని 141 టీఎంసీలనే ఇచ్ఛంపల్లి నుంచి తరలిస్తామంటూ ప్రతిపాదన
మా కోటా నీటిని వాడుకోవడానికి వీల్లేదంటున్న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం
ఇచ్ఛంపల్లి నుంచి అంగీకరించే ప్రశ్నేలేదంటున్న తెలంగాణ సర్కార్
పోలవరం నుంచి పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదన
దాంతో గోదావరి–కావేరి అనుసంధానంపై ఒక్క అడుగూ ముందుకు పడని పరిస్థితి
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానంపై రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) విఫలమవుతోంది. దీంతో ఏడేళ్లుగా ఈ ప్రతిపాదనలో ఒక్క అడుగూ ముందుకు పడని పరిస్థితి. నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) పరిధిలోని రాష్ట్రాల అభిప్రాయాలను ఎన్‌డబ్ల్యూడీఏ తీసుకోకుండా గోదావరి–కావేరి అనుసంధానం ప్రతిపాదన రూపొందించడమే దానికి కారణమని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
తొలుత అకినేపల్లి.. ఆ తర్వాత జానంపల్లి.. ఇప్పుడు ఇచ్ఛంపల్లి నుంచి గోదావరి జలాలను కావేరికి తరలించేలా డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను ఎన్‌డబ్ల్యూడీఏ సిద్ధం చేసింది. తమ కోటా నీటిని కావేరికి ఎలా తరలిస్తారని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఇచ్ఛంపల్లి నుంచి అనుసంధానానికి అంగీకరించే ప్రశ్నే లేదని తెలంగాణ సర్కార్ చెబుతోంది.
బేసిన్‌లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలంటే పోలవరం నుంచి కావేరికి గోదావరి జలాలను తీసుకెళ్లేలా ప్రతిపాదనలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడంలో ఎన్‌డబ్ల్యూడీఏ విఫలమవుతున్న నేపథ్యంలో కావేరితో గోదావరి అనుసంధానం కష్టమేనని నిపుణులు తేల్చిచెబుతున్నారు.
ఏకపక్షంగా ప్రతిపాదన..
గోదావరిలో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141 టీఎంసీలకు 107 టీఎంసీల మిగులు జలాలను జతచేసి 248 టీఎంసీలను అకినేపల్లి నుంచి కావేరికి తరలించేలా 2017లో ఎన్‌డబ్ల్యూడీఏ డీపీఆర్‌ను రూపొందించింది. దీనిపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా జానంపేట నుంచి 248 టీఎంసీల గోదావరి జలాలను కావేరికి తరలించేలా 2018లో డీపీఆర్‌లో మార్పులు చేసింది. దీనిపై కూడా మూడు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఛత్తీస్‌గఢ్ ససేమిరా అంటున్నా
గోదావరిలో మిగులు జలాలే లేవని.. నీటి లభ్యతే లేనప్పుడు అనుసంధానం ఎలా చేపడతారని 2020లో ఏపీ ప్రభుత్వం ఎన్‌డబ్ల్యూడీఏను నిలదీసింది. ఆంధ్రప్రదేశ్ హక్కులకు విఘాతం కలిగించే చర్యలను సహించబోమని స్పష్టం చేసింది. దాంతో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141 టీఎంసీలను ఇచ్ఛంపల్లి నుంచి కావేరికి తరలించేలా 2022లో డీపీఆర్‌లో ఎన్‌డబ్ల్యూడీఏ మార్పులు చేసింది.
ఇచ్ఛంపల్లి నుంచి అనుసంధానం చేపడితే దేవాదుల, సీతారామ ఎత్తిపోతల తదితర ప్రాజెక్టుల కింద ఆయకట్టు ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దిగువ రాష్ట్రం హక్కులను పరిరక్షించాలంటే పోలవరం నుంచే కావేరికి గోదావరి జలాలను తీసుకెళ్లాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
తమ కోటా నీటిని కావేరికి తరలించడానికి అనుమతించే ప్రశ్నే లేదని.. కాదూ కూడదని అనుసంధానం చేపడితే న్యాయపోరాటం చేస్తామని ఛత్తీస్‌గఢ్ సర్కార్ స్పష్టం చేసింది. కానీ.. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఇచ్ఛంపల్లి నుంచే ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని నీటిని కావేరికి తరలించే ప్రతిపాదననే ఎన్‌డబ్ల్యూడీఏ మళ్లీ తెరపైకి తేవడంపై రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment