‘సమ్మక్క’ నుంచే అనుసంధానం? | Center reconsiders construction of barrage at Ichchampally | Sakshi
Sakshi News home page

‘సమ్మక్క’ నుంచే అనుసంధానం?

Published Fri, Jun 7 2024 4:38 AM | Last Updated on Fri, Jun 7 2024 4:38 AM

Center reconsiders construction of barrage at Ichchampally

ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణంపై కేంద్రం పునరాలోచన 

తెలంగాణ చేసిన ప్రతిపాదనలుపరిశీలిస్తున్న ఎన్‌డబ్ల్యూడీఏ 

‘సమ్మక్క’నీటి వినియోగంపై లెక్కలు కోరిన కేంద్రం  

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి –కావేరీ నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ కడితే, దానికి దిగువన తమ రాష్ట్రానికి ఉన్న 158 టీఎంసీల నీటి అవసరాలకు నష్టం కలుగుతుందని తెలంగాణ చేసిన అభ్యంతరాలతో నేషనల్‌వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఎన్‌డబ్ల్యూడీఏ) పునరాలోచనలో పడింది. తమ రాష్ట్రం నిర్మించిన సమ్మక్క బ్యారేజీ నుంచే నీటిని తరలించాలని తెలంగాణ చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. 

ఇచ్చంపల్లికి దిగువన ఉన్న ప్రాజెక్టులైన దేవాదులకు 38 టీఎంసీలు, సీతారామకు 70 టీఎంసీలు, తుపాకులగూడెంకు 50 టీఎంసీలు కలిపి మొత్తం 158 టీఎంసీలు తమకు అవసరమని తెలంగాణ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో సమ్మక్క సాగర్‌ బ్యారేజీకి ఎగువన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కట్టిన మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఏ మేరకు నీటిని పంపింగ్‌ చేయనున్నారు? 

సమ్మక్క సాగర్‌ నుంచి దేవాదుల ఎత్తిపోతల పథకానికి, శ్రీరాంసాగర్‌ రెండో దశ ప్రాజెక్టుకు తరలించనున్న నీటి లెక్కలతో పాటు సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా తరలించనున్న 70 టీఎంసీల నీటి వినియోగం లెక్కలు అందించాలని ఎన్‌డబ్ల్యూడీఏ తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ లెక్కల ఆధారంగా సిమ్యులేషన్‌ స్టడీస్‌ నిర్వహించి ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.  

తెలంగాణ అభ్యంతరం 
నాలుగు నెలల క్రితం గోదావరి–కావేరీ అనుసంధానం ప్రాజెక్టు డీపీఆర్‌ను అందించిన ఎన్‌డబ్ల్యూడీఏ..దీనిపై తెలంగాణ అభిప్రాయాన్ని కోరింది. ఇచ్చంపల్లి వద్దే బ్యారేజీ నిర్మిస్తామని ఇందులో ప్రతిపాదించింది. 

అయితే ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మిస్తే నదుల అనుసంధానం ప్రాజెక్టుకి, ఇచ్చంపల్లి దిగువన ఉన్న తెలంగాణ ప్రాజెక్టుల అవసరాలకు ఏకకాలంలో నీళ్లను తరలించడం సాధ్యం కాదని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. అలాగే దిగువన ఉన్న సమక్క సాగర్‌ బ్యారేజీకి బ్యాక్‌ వాటర్‌ సమస్య ఏర్పడుతుందని, వరదల నిర్వహణ సమస్యగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.  

1980లోనే ఇచ్చంపల్లి ప్రతిపాదనలు 
గోదావరి నీళ్లను తెలంగాణ ప్రాంతానికి తరలించడానికి వీలుగా ఇచ్చంపల్లి వద్ద 118 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించడానికి 1980లోనే బచావత్‌ ట్రిబ్యునల్‌ అనుమతిని చ్చింది. అయితే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అభ్యంతరాలతో దీని ఎత్తును తొలుత 112 మీటర్లకు, మళ్లీ 1986–88 లో 108 మీటర్లకు, కాలక్రమంలో 105 మీటర్లకు తగ్గించారు. తాజాగా నదుల అనుసంధానంలో భాగంగా 87 మీటర్ల ఎత్తుకు కుదించారు. 

అయినా ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. ఇక ఇచ్చంపల్లికి 24 కిలోమీటర్ల దిగువలోనే సమ్మక్క బ్యారేజీ ఉంది. ఇచ్చంపల్లి నుంచి అకస్మికంగా వరదను విడుదల చేస్తే సమ్మక్క బ్యారేజీ వద్ద వరదలు పోటెత్తి నిర్వహణ కష్టంగా మారుతుందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

కాగా వరదల తీవ్రతపై సిమ్యులేషన్‌ స్టడీ చేయాలనే తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం అంగీకారం తెలుపడంతో సమ్మక్క బ్యారేజీ నుంచే గోదావరి– కావేరీ అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా నీళ్లను తరలించే అవకాశాలు మెరుగైనట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement