river linkage
-
‘సమ్మక్క’ నుంచే అనుసంధానం?
సాక్షి, హైదరాబాద్: గోదావరి –కావేరీ నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ కడితే, దానికి దిగువన తమ రాష్ట్రానికి ఉన్న 158 టీఎంసీల నీటి అవసరాలకు నష్టం కలుగుతుందని తెలంగాణ చేసిన అభ్యంతరాలతో నేషనల్‌వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఎన్‌డబ్ల్యూడీఏ) పునరాలోచనలో పడింది. తమ రాష్ట్రం నిర్మించిన సమ్మక్క బ్యారేజీ నుంచే నీటిని తరలించాలని తెలంగాణ చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఇచ్చంపల్లికి దిగువన ఉన్న ప్రాజెక్టులైన దేవాదులకు 38 టీఎంసీలు, సీతారామకు 70 టీఎంసీలు, తుపాకులగూడెంకు 50 టీఎంసీలు కలిపి మొత్తం 158 టీఎంసీలు తమకు అవసరమని తెలంగాణ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో సమ్మక్క సాగర్ బ్యారేజీకి ఎగువన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కట్టిన మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఏ మేరకు నీటిని పంపింగ్ చేయనున్నారు? సమ్మక్క సాగర్ నుంచి దేవాదుల ఎత్తిపోతల పథకానికి, శ్రీరాంసాగర్ రెండో దశ ప్రాజెక్టుకు తరలించనున్న నీటి లెక్కలతో పాటు సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా తరలించనున్న 70 టీఎంసీల నీటి వినియోగం లెక్కలు అందించాలని ఎన్‌డబ్ల్యూడీఏ తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ లెక్కల ఆధారంగా సిమ్యులేషన్ స్టడీస్ నిర్వహించి ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తెలంగాణ అభ్యంతరం నాలుగు నెలల క్రితం గోదావరి–కావేరీ అనుసంధానం ప్రాజెక్టు డీపీఆర్‌ను అందించిన ఎన్‌డబ్ల్యూడీఏ..దీనిపై తెలంగాణ అభిప్రాయాన్ని కోరింది. ఇచ్చంపల్లి వద్దే బ్యారేజీ నిర్మిస్తామని ఇందులో ప్రతిపాదించింది. అయితే ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మిస్తే నదుల అనుసంధానం ప్రాజెక్టుకి, ఇచ్చంపల్లి దిగువన ఉన్న తెలంగాణ ప్రాజెక్టుల అవసరాలకు ఏకకాలంలో నీళ్లను తరలించడం సాధ్యం కాదని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. అలాగే దిగువన ఉన్న సమక్క సాగర్ బ్యారేజీకి బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడుతుందని, వరదల నిర్వహణ సమస్యగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. 1980లోనే ఇచ్చంపల్లి ప్రతిపాదనలు గోదావరి నీళ్లను తెలంగాణ ప్రాంతానికి తరలించడానికి వీలుగా ఇచ్చంపల్లి వద్ద 118 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించడానికి 1980లోనే బచావత్ ట్రిబ్యునల్ అనుమతిని చ్చింది. అయితే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అభ్యంతరాలతో దీని ఎత్తును తొలుత 112 మీటర్లకు, మళ్లీ 1986–88 లో 108 మీటర్లకు, కాలక్రమంలో 105 మీటర్లకు తగ్గించారు. తాజాగా నదుల అనుసంధానంలో భాగంగా 87 మీటర్ల ఎత్తుకు కుదించారు. అయినా ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. ఇక ఇచ్చంపల్లికి 24 కిలోమీటర్ల దిగువలోనే సమ్మక్క బ్యారేజీ ఉంది. ఇచ్చంపల్లి నుంచి అకస్మికంగా వరదను విడుదల చేస్తే సమ్మక్క బ్యారేజీ వద్ద వరదలు పోటెత్తి నిర్వహణ కష్టంగా మారుతుందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాగా వరదల తీవ్రతపై సిమ్యులేషన్ స్టడీ చేయాలనే తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం అంగీకారం తెలుపడంతో సమ్మక్క బ్యారేజీ నుంచే గోదావరి– కావేరీ అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా నీళ్లను తరలించే అవకాశాలు మెరుగైనట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. -
గోదావరి– కావేరి అనుసంధానంపై వచ్చేనెలలో సీఎంల భేటీ
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరీ నదుల అనుసంధానంపై వచ్చేనెలలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ అధ్యక్షతన ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఈ మేరకు జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్డట్లూ్యడీఏ) రాష్ట్రాలకు ప్రాథమికంగా సమాచారం పంపించింది. ఈ రెండు నదుల అనుసంధానానికి సంబంధించి సవివర ప్రణాళిక నివేదిక(డీపీఆర్) త్వరలోనే రాష్ట్రాలకు పంపించి అ«ద్యయనం చేయడానికి గడువు ఇచ్చిన తర్వాత ఈనెలాఖరులో ఆయా ప్రభావిత రాష్ట్రాల నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శులు/కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ముసాయిదా డీపీఆర్‌ను ఎన్‌డబ్లు్యడీఏ హైదరాబాద్ విభాగం కేంద్రానికి పంపించింది. దీనికి ఎన్‌డబ్లు్యడీఏ ఆమోదముద్ర వేసిన వెంటనే సంబంధిత రాష్ట్రాలకు ఆ నివేదిక పంపిస్తారు. రెండు నదుల అనుసంధానికి రూ.74,329 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ప్రాజెక్టు చేపట్టిన ఐదేళ్లలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా అందులో పేర్కొన్నారు. ఈ పాజెక్టు పూర్తయితే ప్రతీ సంవత్సరం రూ.9824.49 కోట్ల మేరకు ఆదాయం సమకూరుతుందని లెక్కకట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపడతారు. దీనికి రూ.3381 కోట్లు అవుతుందని అంచనా. ఇక ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని149 టీఎంసీల నీటిని గోదావరి–కావేరి అనుసంధానం కింద తరలించాలని కేంద్రం భావిస్తున్న సంగతి విదితమే. ఒకవేళ ఛత్తీస్‌గఢ్ ఈ 140 టీఎంసీల నీటిని వినియోగించుకున్న పక్షంలో.. మహానది–గోదావరి మధ్య 230 టీఎంసీల నీటిని తరలించే ప్రక్రియ చేపడతామని కేంద్రం స్పష్టం చేసింది. వాటిని కావేరికి తరలిస్తామని వెల్లడించింది. ఇప్పటికే పలు సమావేశాల్లో గోదావరి–కావేరి నదుల అనుసంధానికి సంబంధించి సమ్మతి లభించింది. త్వరలోనే గోదావరి బోర్డు సమావేశం కూడా... గోదావరినది యాజమాన్య బోర్డు సమావేశం త్వరలోనే జరగనున్నట్టు సమాచారం. తదుపరి బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల సమాచారం అందులో చేర్చాలని ఏపీ ప్రభుత్వం గతంలో కోరింది. ఈ మేరకు బోర్డుకు ఏపీ జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి లేఖ కూడా రాశారు. ఎల్లంపల్లి బ్యారేజీ పరిసర ప్రాంతాల్లోని ఎత్తిపోతల పథకాలతోపాటు కుప్తి, ఎస్సారెస్పీ రెండో దశ వినియోగం, ఇందిరమ్మ వరద నీటి కాలువ, కాళేశ్వరం అదనపు టీఎంసీల వినియోగంపై చర్చించాలని కోరింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి సమాచారం ఇవ్వాలని గోదావరి యాజమాన్య బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. సాగర్ నుంచి ఏపీకి 5 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాలకు 5 టీఎంసీల నీరు విడుదల చేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది. శ్రీశైలం కోటాను సాగర్‌కు మళ్లించింది. ఉమ్మడి జలాశయాల నుంచి ఇరు రాష్ట్రాలకు 80 టీఎంసీల నీటిని కేటాయించిన సంగతి తెలిసిందే. శ్రీశైలంలో కేటాయించిన నీటిని వినియోగించుకోలేకపోయామని, అందువల్ల నాగార్జునసాగర్ కుడికాలువ నుంచి ఐదు టీఎంసీల నీటి విడుదల చేయాలని ఏపీ కోరిక మేరకు బోర్డు అనుమతినిచి్చంది. బోర్డు ఆర్థిక పరిస్థితిపై ఈనెల 12వ తేదీన అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
గోదావరి–కావేరిపై సమ్మతి!
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై చిన్న ముందడుగు పడింది. ప్రాజెక్టు నిర్మాణానికి సమ్మతి తెలుపుతూ పరస్పర అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు చేసేందుకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. కేంద్ర జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో నదుల అనుసంధానంపై సంప్రదింపులు, టాస్‌్కఫోర్స్ సమావేశాలను నిర్వహించింది. టాస్క్‌ఫోర్స్ చైర్మన్ వెదిరె శ్రీరామ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీల్లో ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్‌సింగ్, తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఇతర రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి ప్రాజెక్టు డీపీఆర్‌ను సిద్ధం చేసి రాష్ట్రాలకు అందజేస్తామని, అప్పటి నుంచి 15 రోజుల్లోగా అన్ని రాష్ట్రాల సీఎంలు ఎంఓయూపై సంతకాలు చేయాలని వెదిరె శ్రీరామ్ సూచించారు. ఈ భేటీల నిర్ణయాలను ఈనెల 22న ఢిల్లీలో నిర్వహించనున్న ఎన్‌డబ్ల్యూడీఏ పాలక మండలి సమావేశంలో ఆమోదిస్తామన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి(గోదావరి)–మూసీ–నాగార్జునసాగర్–సోమశిల– గ్రాండ్ ఆనికట్ (కావేరి)లను అనుసంధానం చేస్తామని తెలిపారు. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ వద్దు: తెలంగాణ గోదావరి జలాల్లో తెలంగాణ వాటాకు రక్షణ కల్పిస్తే అనుసంధానం ప్రాజెక్టుకు సమ్మతి తెలుపుతామని సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ సి.మురళీధర్ స్పష్టంచేశారు. ప్రాజెక్టు ద్వారా తరలించే 148 టీఎంసీల్లో తెలంగాణకు 50శాతం కేటాయించాలని కోరారు. గోదావరి జలాల్లో రాష్ట్రాల వారీగా వాటాలను నిర్థారించి, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు జరగకుండా ఫ్రీజ్ చేయాలన్నారు. గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద కాకుండా కొంత ఎగువన బ్యారేజీ నిర్మించి నీటిని తరలించాలని.. లేకుంటే దిగువన ఉన్న సమ్మక్క బ్యారేజీ నిర్వహణలో సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ఇచ్చంపల్లి వద్దే నిర్మిస్తాం: వెదిరె శ్రీరాం తెలంగాణ సహా ఏ రాష్ట్ర వాటా నీటికీ నష్టం కలిగించమని వెదిరే శ్రీరామ్ సమాధానమిచ్చారు. భౌగోళికంగా ఉన్న ప్రతికూలతల దృష్ట్యా ఛత్తీస్‌గఢ్, ఇతర ఎగువ రాష్ట్రాలు వాడుకోలేకపోతున్న గోదావరి జలాలనే తరలిస్తామని స్పష్టం చేశారు. గోదావరిలో మిగులు జలాల లభ్యత లేదని నిర్థారించిన నేపథ్యంలో వాటిని సైతం వినియోగించబోమని హామీ ఇచ్చారు. తెలంగాణకు 50శాతం వాటా కేటాయింపును పరిశీలిస్తామన్నారు. తొలి విడత ప్రాజెక్టుకు కేవలం 400 హెక్టార్ల భూసేకరణ మాత్రమే అవసరమని చెప్పారు. ఇచ్చంపల్లి వద్దే బ్యారేజీ నిర్మాస్తామని, సమ్మక్క బ్యారేజీకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మా వాటా పూర్తిగా వాడుకుంటాం: ఛత్తీస్‌గఢ్ గోదావరిలో తమ రాష్ట్ర వాటాను పూర్తిగా వాడుకుంటామని సమావేశంలో ఛత్తీస్‌గఢ్ చీఫ్ ఇంజనీర్ కుబేర్‌సింగ్ గురోవర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సర్వేలు పూర్తిచేసి, సీడబ్ల్యూసీ నుంచి ప్రాథమిక స్థాయి అనుమతులు పొందామని చెప్పారు. దీంతో ఛత్తీస్‌గఢ్ తన వాటా జలాలను వాడుకోవడం ప్రారంభించిన వెంటనే గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టు ద్వారా నీటి తరలింపును నిలుపుదల చేస్తామని వెదిరె శ్రీరామ్ హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్ ప్రాజెక్టులు పూర్తి కావడానికి మరో 10 ఏళ్లకు పైగా పట్టవచ్చని, ఆలోగా మహానది–గోదావరి అనుసంధానం పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం నుంచే అనుసంధానం జరపాలి: ఏపీ గోదావరి–కావేరి అనుసంధానాన్ని పోలవరం ప్రాజెక్టు నుంచి చేపట్టాలని ఏపీ తరఫున శశిభూషణ్‌కుమార్ కోరారు. గోదావరిలో ఛత్తీస్‌గఢ్ వాడుకోని జలాలను సాంకేతికంగా నిర్ధారించాలని కోరారు. గోదావరిలో 75శాతం లభ్యత ఆధారంగా నికర జలాల లభ్యత లేదని తేల్చుతూ సీడబ్ల్యూసీ ఇ చ్చిన నివేదికలో తారతమ్యాలు ఉన్నాయని, మరింత స్పష్టత కల్పిoచాలని సూచించారు. బెడ్తి–వార్ధా నదుల అనుసంధానం ప్రాజెక్టు ద్వారా రాయలసీమలోని హెచ్ఎల్సీ ప్రాజెక్టుకు నీళ్లు కేటాయించాలన్నారు. ఎగువ రాష్ట్రాల వినియోగంతో గోదావరిలో దిగువ చివరి రాష్ట్రం ఏపీ వాటాకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని.. ఇందుకోసం ఏపీతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఎన్‌డబ్ల్యూడీఏను కోరారు. దీనిపై స్పందించిన వెదిరె శ్రీరామ్.. తొలివిడతలో ఇచ్చంపల్లి నుంచి అనుసంధానం చేపడతామని, తదుపరి దశల్లో ఇతర ప్రాంతాల నుంచి సైతం గోదావరి జలాల తరలింపును పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ వాటాలకు రక్షణ కల్పించే విషయంలో రాజీపడబోమని భరోసా ఇచ్చారు. నాగార్జునసాగర్, సోమశిల జలాశయాల కింద ఇప్పటికే ఉన్న ఆయకట్టుతోపాటు నదుల అనుసంధానం ప్రాజెక్టు కింద ప్రతిపాదిస్తున్న కొత్త ఆయకట్టుకు సైతం సాగునీటిని సరఫరా చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. -
నదుల అనుసంధానానికి ట్రిబ్యునళ్ల అవార్డులే అడ్డంకి!
సాక్షి, అమరావతి: కడలిపాలవుతోన్న నదీ జలాలను.. నీటి కొరత ఉన్న నదులకు మళ్లించడం ద్వారా దేశంలో కరవు పరిస్థితులను రూపుమాపవచ్చుననే లక్ష్యంతో చేపట్టిన నదుల అనుసంధానానికి నదీ జల వివాదాల ట్రిబ్యునళ్ల అవార్డులే ప్రతిబంధకంగా మారాయని కేంద్రానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) నివేదించింది. ట్రిబ్యునళ్ల అవార్డులను చూపి.. నదీ పరీవాహక ప్రాంతాల(బేసిన్)లోని రాష్ట్రాలు వాటా కోసం పట్టుబడుతున్నాయని పేర్కొంది. నదుల అనుసంధానానికి వాటి బేసిన్ల పరిధిలోని రాష్ట్రాలతో పలుమార్లు సంప్రదింపులు జరిపినా ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో కెన్–బెటా్వమినహా మిగతా అనుసంధానాలు ప్రతిపాదన దశను దాటడం లేదని వివరించింది. ఈ అంశంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ ఇటీవల నివేదిక ఇచ్చారు. దేశంలో హిమాలయ నదుల అనుసంధానానికి 14.. ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడానికి 16 లింక్‌లను ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. నదుల అనుసంధానాన్ని వేగవంతం చేయడానికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి అధ్యక్షతన అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. నదుల అనుసంధానంపై బేసిన్ల పరిధిలోని రాష్ట్రాలను ఒప్పించేందుకు సంప్రదింపులు జరుపుతోంది. కాగా, పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో మహారాష్ట్ర 14, కర్ణాటక 21 టీఎంసీలను అదనంగా వాడుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. మిగతా 45 టీఎంసీలను నాగార్జునసాగర్‌కు ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను అదనంగా వాడుకోవడానికి అనుమతి ఇచ్చింది. కావేరి, కృష్ణా జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన ట్రిబ్యునళ్లు కూడా ఇదే రీతిలో నిర్ణయాలను ప్రకటించాయి. ఇప్పుడు ఆ ట్రిబ్యునళ్ల అవార్డులను చూపుతున్న రాష్ట్రాలు.. నదుల అనుసంధానం ద్వారా మళ్లించే నీటిలో అదనపు వాటా కోసం పట్టుబడుతున్నాయి. గోదావరి–కావేరి అనుసంధానం తొలి దశలో 141 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా(నాగార్జునసాగర్), పెన్నా(సోమశిల) మీదుగా కావేరికి తరలించేందుకు ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదన అమలు చేస్తే.. కృష్ణా జలాల్లో అదనపు వాటా కావాలంటూ మహారాష్ట్ర, కర్ణాటకలు పట్టుబడుతున్నాయి. కావేరికి మళ్లించే గోదావరి జలాలకుగానూ కావేరి జలాల్లో అదనపు వాటా ఇవ్వాలంటూ కర్ణాటక, కేరళ డిమాండ్ చేస్తున్నాయి. దాంతో ఈ అనుసంధానంపై ఏకాభిప్రాయం సవాల్‌గా మారింది. విధానపరమైన నిర్ణయం తీసుకుంటేనే..: నీటి లభ్యత అధికంగా ఉన్న నదుల నుంచి నీటి కొరత తీవ్రంగా ఉన్న నదులకు మళ్లించే నీటి విషయంలో రాష్ట్రాలతో సంప్రదించి, కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకుంటేనే నదుల అనుసంధానం పట్టాలెక్కే అవకాశం ఉందని ఎన్డబ్ల్యూడీఏనే స్పష్టం చేస్తోంది. ఒక నది నుంచి మళ్లించిన నీటికిగానూ.. మరొక నదిలో అదనపు వాటా వాడుకోవడానికి ట్రిబ్యునళ్లు ఇచ్చిన అనుమతిని నదుల అనుసంధానానికి మినహాయిస్తేనే నదుల అనుసంధానం సాకారమవుతుందని సాగునీటిరంగ నిపుణులు తేల్చిచెబుతున్నారు. -
నదుల అనుసంధానానికి ప్రాధికార సంస్థ
సాక్షి, అమరావతి : నదుల అనుసంధానం పనులను పర్యవేక్షించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ తరహాలో నేషనల్ ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ అథారిటీ (నిరా) పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదించింది. నదుల అనుసంధానానికి సంబంధించి సర్వే, సమగ్ర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్) తయారీ నుంచి.. ప్రధాన పనులకు సంబంధించిన టెండర్లు, వాటి పర్యవేక్షణ వరకూ అన్ని బాధ్యతలను ఆ సంస్థే నిర్వహించనుంది. ఆయకట్టుకు నీళ్లందించే బ్రాంచ్ కెనాల్స్ (ఉప కాలువలు), డి్రస్టిబ్యూటరీల (పిల్ల కాలువల) పనులను మాత్రమే రాష్ట్రాలకు అప్పగించాలని ప్రతిపాదించింది. అప్పుడే నదుల అనుసంధానం వేగవంతమయ్యే అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తూ కేంద్ర మంత్రి మండలికి కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదనలు పంపింది. వాటిపై కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేయడమే తరువాయి. జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) నిరాగా రూపాంతరం చెందుతుందని అధికార వర్గాలు తెలిపాయి. జాతీయ ప్రాజెక్టుల కంటే అధికంగా.. జాతీయ ప్రాజెక్టులకు అయ్యే వ్యయంలో 90% నిధులను కేంద్రం సమకూర్చేది. కానీ.. ఇటీవల ఆ వాటాను 60 శాతానికి తగ్గిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ.. నదుల అనుసంధానం ప్రాజెక్టులకు మాత్రం 90 శాతం నిధులను కేంద్రం విడుదల చేస్తుందని, మిగతా 10 శాతం నిధులను ఆయా రాష్ట్రాలు భరించాలని తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. కెన్–బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు (కేబీఎల్పీ) నుంచే ఈ మార్గదర్శకాలు అమలవుతాయని పేర్కొంది. కేంద్రంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కేబీఎల్పీ మధ్యప్రదేశ్‌లో 8.11 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్‌లో 2.51 లక్షల హెక్టార్లు వెరసి 10.62 లక్షల హెక్టార్లకు నీళ్లందించనున్నారు. కేబీఎల్పీ అంచనా వ్యయం 2020–21 ధరల ప్రకారం రూ.44,605 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. ఇందులో 90 శాతం కేంద్రం భరిస్తుంది. మిగతా 10 శాతం ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ భరిస్తాయి. మిగతా నదుల అనుసంధాన ప్రాజెక్టులకూ ఇదే విధానం వర్తిస్తుందని కేంద్ర జల్ శక్తి శాఖ పేర్కొంది. నదుల అనుసంధానం వేగవంతం హిమాలయ, ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడం ద్వారా కడలి పాలవుతున్న జలాలను మళ్లించి దేశాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ఎన్‌డబ్ల్యూడీఏ 30 అనుసంధాన ప్రాజెక్టులను సిద్ధం చేసింది. కానీ.. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, నిధుల కొరత, జల వివాదాలు, అటవీ పర్యావరణ అనుమతులు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం తదితర సమస్యల వల్ల నదుల అనుసంధానం దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైంది. ఇటీవల కెన్–బెట్వా నదుల అనుసంధానానికి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావడంతో ఆ ప్రాజెక్టును కేంద్రం చేపట్టింది. నదుల అనుసంధానం కోసం ప్రత్యేకంగా ‘నిరా’ను ఏర్పాటు చేస్తే.. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం నుంచి పనులు చేపట్టడం వరకూ వేగవంతమయ్యే అవకాశం ఉందని నీటి పారుదలరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
న్యాయబద్ధంగా నీటి కేటాయింపులు
వరదలు ఉధృతంగా ఉన్నప్పుడు భారీగా నీరు సముద్రంలో కలుస్తోంది. అలాంటప్పుడు వాడుకునే నీటికి లెక్కలు కట్టడం భావ్యం కాదు. వృథాగా పోతున్న నీటిని ఎవరైనా వాడుకోవచ్చనేదే మా విధానం. – రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాలను రెండు రాష్ట్రాలకు శాస్త్రీయంగా కేటాయించాలని అపెక్స్ కౌన్సిల్‌కు స్పష్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కృష్ణా జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 తీర్పు వెలువడే వరకు 2015లో జూన్ 18, 19న రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారమే జలాలను పంపిణీ చేయాలని స్పష్టం చేయనుంది. పరీవాహక ప్రాంతం(బేసిన్)లో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2014 జూన్ 2 నాటికి పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ఆధారంగానే గోదావరి జలాలను (ఆంధ్రప్రదేశ్ 776, తెలంగాణ 650 టీఎంసీలు) పంపిణీ చేయాలని తెగేసి చెప్పాలని నిర్ణయించింది. ఈ నెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్లో కృష్ణా, గోదావరి నదీ జలాల్లో వాటా విషయంలో తెలంగాణ లేవనెత్తే అభ్యంతరాలను సాక్ష్యాధారాలతో కొట్టిపారేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. గోదావరిలో 75 శాతం నీటి లభ్యత కంటే ఎక్కువగా ఉన్న జలాలపై పూర్తి హక్కు దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ఉందని, ఆ నీటిని కేటాయిస్తే ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ) ప్రతిపాదించిన మేరకు నదుల అనుసంధానం పనులు చేపడతామని స్పష్టం చేసేందుకు సిద్ధమైంది. పూటకో మాట.. రోజుకో విధానమా? ► కృష్ణా జలాల పంపిణీ విషయంలో తెలంగాణ సర్కార్ పూటకో మాట.. రోజుకో విధానం అనుసరిస్తుండటాన్ని అపెక్స్ కౌన్సిల్లో ఎండగట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ► కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన 811 టీఎంసీల నికర జలాల్లో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్, 299 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకునేందుకు అంగీకరిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ అదనపు కార్యదర్శి సమక్షంలో రెండు రాష్ట్రాల అప్పటి జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శులు ఆదిత్యనాథ్ దాస్, ఎస్కే జోషిలు సంతకం చేసిన అంశాన్ని ఎత్తిచూపాలని నిర్ణయించింది. ► కేడబ్ల్యూడీటీ–2 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మిగులు జలాల్లో కేటాయించిన 197.50 టీఎంసీలను విభజన చట్టంలో షెడ్యూలు 11లో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు గుంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులకు.. తెలంగాణలో కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేయనుంది. ► శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు పూర్తిగా నిండి.. గేట్లు ఎత్తేసిన సమయంలో.. దిగువ ప్రాంతాలకు ముంపు ముప్పును తగ్గించడానికి రెండు రాష్ట్రాలు మళ్లించే వరద జలాలను లెక్కలోకి తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరనుంది. ► కేడబ్ల్యూడీటీ–1 నాలుగింట మూడొంతుల నీటి లభ్యత (75 శాతం) ఆధారంగా కృష్ణా నదిలో 2,130 టీఎంసీలు ఉంటాయని అంచనా వేసి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించింది. వాటిని కేడబ్ల్యూడీటీ–2 పరిరక్షిస్తూనే.. మూడింట రెండొంతుల (66.66 శాతం) లభ్యత.. 75 శాతం నీటి లభ్యత మధ్య మిగిలిన 448 టీఎంసీల మిగులు జలాలను మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 194 టీఎంసీలు (పునరుత్పత్తితో 197.50 టీఎంసీలు) కేటాయించింది. ఈ జలాలను విభజన చట్టంలో 11వ షెడ్యూలులో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగుగంగ, హంద్రీ–నీవా, తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్‌ను కోరనుంది. విభజన రోజు ఆధారంగా గోదావరి జలాల పంపిణీ ► ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 1,360 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని.. పునరుత్పత్తితో కలిపి 1,430 టీఎంసీల లభ్యత ఉంటుందని 2004లో వ్యాప్కోస్ నివేదిక ఇచ్చింది. ► 1970–71 నుంచి 2017–18 వరకు పోలవరం వద్ద 3,007 టీఎంసీల మిగులు జలాలు, 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 1,948 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని వ్యాప్కోస్ లెక్క కట్టింది. ఎగువ రాష్ట్రాలు తమకు కేటాయించిన వాటా జలాల్లో 1,400 టీఎంసీలను వినియోగించుకోకపోవడం వల్లే ఈ స్థాయిలో మిగులు జలాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. ► ఉమ్మడి రాష్ట్రం విడిపోయే నాటికి అంటే 2014 జూన్ 2 నాటికి గోదావరి జలాల్లో 660 టీఎంసీలను వినియోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్, 472 టీఎంసీలు వినియోగించుకోవడానికి తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేశాయి. మరో 116 టీఎంసీలను వినియోగించుకునే సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్, 178 టీఎంసీలు ఉపయోగించుకునేలా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని అపెక్స్ కౌన్సిల్‌కు రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. -
‘నీటి సంక్షోభానికి అదే ప్రధాన కారణం’
సాక్షి, న్యూఢిల్లీ : నదుల అనుసంధానంతోనే నీటి సంక్షోభాన్ని పరిష్కరించగలమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. దేశంలో తాగునీరు, సాగునీరు సంక్షోభం - సవాళ్లు అనే అంశంపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయి రెడ్డి మాట్లాడారు. రుతుపవనాల వైఫల్యమే నీటి సంక్షోభానికి ప్రధాన కారణమన్నారు. అంతరించి పోతున్న అడవులు మరో కారణమని తెలిపారు. నదుల అనుసంధానమే నీటి సంక్షోభానికి సరైన పరిష్కారం అన్నారు. కేంద్రం ప్రతిపాదించిన నదుల అనుసంధానంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి - పెన్నా నదుల అనుసంధానం తక్షణమే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
రేపటి నుంచి జల్‌మంథన్
పీఎంకేఎస్‌వై ప్రాజెక్టులు, నదుల అనుసంధానంపై చర్చలు సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ నదీ బేసిన్ల పరిధిలో చేపట్టిన సాగునీటి ప్రాజె క్టులు, వాటికి అందిస్తున్న కేంద్ర నిధులు, వాటి పురోగతి అంశాలపై చర్చించేందుకు కేంద్రం జలవనరుల శాఖ ఈ నెల 28 నుంచి రెండ్రోజుల పాటు నాలుగో జల్‌మంథన్ నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో తొలిరోజు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద చేపట్టిన ప్రాజెక్టులు, రెండో రోజు నదుల అనుసంధానంపై చర్చ జరగనుంది. ఈ సదస్సుల్లో పీఎంకేఎస్‌వై సభ్యుడైన నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు పాల్గొననున్నారు. పీఎంకేఎస్‌వై కింద దేశవ్యాప్తంగా 99 ప్రాజెక్టులను గుర్తించి వాటికి కేంద్రం వివిధ పథకాల నుంచి నిధులు మంజూరు చేస్తోంది. ఇందులో రాష్ట్రం నుంచి మొత్తం 11 ప్రాజెక్టులున్నాయి. వీటికి సంబంధించి నిధులు విడుదల కావల్సి ఉంది. వీటిపై సదస్సుల్లో మంత్రి స్పష్టత కోరే అవకాశం ఉంది. ఇక దేశవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న 185 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.45వేల కోట్లతో ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలన్న సిఫార్సులు, వీటితో పాటే ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం–వినియోగం మధ్య వ్యత్యాసం తగ్గించడం తదితర అంశాలపై చర్చించనున్నారు.