గోదావరి–కావేరిపై సమ్మతి!  | Acceptance of signatories on River Linkage MoU | Sakshi
Sakshi News home page

గోదావరి–కావేరిపై సమ్మతి! 

Published Sat, Nov 11 2023 3:52 AM | Last Updated on Sat, Nov 11 2023 3:52 AM

Acceptance of signatories on River Linkage MoU - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై చిన్న ముందడుగు పడింది. ప్రాజెక్టు నిర్మాణానికి సమ్మతి తెలుపుతూ పరస్పర అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు చేసేందుకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి.

కేంద్ర జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో నదుల అనుసంధానంపై సంప్రదింపులు, టాస్‌్కఫోర్స్‌ సమావేశాలను నిర్వహించింది. టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌ వెదిరె శ్రీరామ్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీల్లో ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్‌సింగ్, తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్, ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, ఇతర రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.

ఈ ఏడాది డిసెంబర్‌ 31 నాటికి ప్రాజెక్టు డీపీఆర్‌ను సిద్ధం చేసి రాష్ట్రాలకు అందజేస్తామని, అప్పటి నుంచి 15 రోజుల్లోగా అన్ని రాష్ట్రాల సీఎంలు ఎంఓయూపై సంతకాలు చేయాలని వెదిరె శ్రీరామ్‌ సూచించారు. ఈ భేటీల నిర్ణయాలను ఈనెల 22న ఢిల్లీలో నిర్వహించనున్న ఎన్‌డబ్ల్యూడీఏ పాలక మండలి సమావేశంలో ఆమోదిస్తామన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి(గోదావరి)–మూసీ–నాగార్జునసాగర్‌–సోమశిల– గ్రాండ్‌ ఆనికట్‌ (కావేరి)లను అనుసంధానం చేస్తామని తెలిపారు. 

ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ వద్దు: తెలంగాణ 
గోదావరి జలాల్లో తెలంగాణ వాటాకు రక్షణ కల్పిస్తే అనుసంధానం ప్రాజెక్టుకు సమ్మతి తెలుపుతామని సమావేశంలో తెలంగాణ ఈఎన్‌సీ సి.మురళీధర్‌ స్పష్టంచేశారు. ప్రాజెక్టు ద్వారా తరలించే 148 టీఎంసీల్లో తెలంగాణకు 50శాతం కేటాయించాలని కోరారు. గోదావరి జలాల్లో రాష్ట్రాల వారీగా వాటాలను నిర్థారించి, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు జరగకుండా ఫ్రీజ్‌ చేయాలన్నారు. గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద కాకుండా కొంత ఎగువన బ్యారేజీ నిర్మించి నీటిని తరలించాలని.. లేకుంటే దిగువన ఉన్న సమ్మక్క బ్యారేజీ నిర్వహణలో సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. 

ఇచ్చంపల్లి వద్దే నిర్మిస్తాం: వెదిరె శ్రీరాం 
తెలంగాణ సహా ఏ రాష్ట్ర వాటా నీటికీ నష్టం కలిగించమని వెదిరే శ్రీరామ్‌ సమాధానమిచ్చారు. భౌగోళికంగా ఉన్న ప్రతికూలతల దృష్ట్యా ఛత్తీస్‌గఢ్, ఇతర ఎగువ రాష్ట్రాలు వాడుకోలేకపోతున్న గోదావరి జలాలనే తరలిస్తామని స్పష్టం చేశారు. గోదావరిలో మిగులు జలాల లభ్యత లేదని నిర్థారించిన నేపథ్యంలో వాటిని సైతం వినియోగించబోమని హామీ ఇచ్చారు. తెలంగాణకు 50శాతం వాటా కేటాయింపును పరిశీలిస్తామన్నారు. తొలి విడత ప్రాజెక్టుకు కేవలం 400 హెక్టార్ల భూసేకరణ మాత్రమే అవసరమని చెప్పారు. ఇచ్చంపల్లి వద్దే బ్యారేజీ నిర్మాస్తామని, సమ్మక్క బ్యారేజీకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

మా వాటా పూర్తిగా వాడుకుంటాం: ఛత్తీస్‌గఢ్‌ 
గోదావరిలో తమ రాష్ట్ర వాటాను పూర్తిగా వాడుకుంటామని సమావేశంలో ఛత్తీస్‌గఢ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ కుబేర్‌సింగ్‌ గురోవర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సర్వేలు పూర్తిచేసి, సీడబ్ల్యూసీ నుంచి ప్రాథమిక స్థాయి అనుమతులు పొందామని చెప్పారు. దీంతో ఛత్తీస్‌గఢ్‌ తన వాటా జలాలను వాడుకోవడం ప్రారంభించిన వెంటనే గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టు ద్వారా నీటి తరలింపును నిలుపుదల చేస్తామని వెదిరె శ్రీరామ్‌ హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రాజెక్టులు పూర్తి కావడానికి మరో 10 ఏళ్లకు పైగా పట్టవచ్చని, ఆలోగా మహానది–గోదావరి అనుసంధానం పూర్తి చేస్తామని చెప్పారు.  

పోలవరం నుంచే అనుసంధానం జరపాలి: ఏపీ 
గోదావరి–కావేరి అనుసంధానాన్ని పోలవరం ప్రాజెక్టు నుంచి చేపట్టాలని ఏపీ తరఫున శశిభూషణ్‌కుమార్‌ కోరారు. గోదావరిలో ఛత్తీస్‌గఢ్‌ వాడుకోని జలాలను సాంకేతికంగా నిర్ధారించాలని కోరారు. గోదావరిలో 75శాతం లభ్యత ఆధారంగా నికర జలాల లభ్యత లేదని తేల్చుతూ సీడబ్ల్యూసీ ఇ చ్చిన నివేదికలో తారతమ్యాలు ఉన్నాయని, మరింత స్పష్టత కల్పిoచాలని సూచించారు. బెడ్తి–వార్ధా నదుల అనుసంధానం ప్రాజెక్టు ద్వారా రాయలసీమలోని హెచ్‌ఎల్‌సీ ప్రాజెక్టుకు నీళ్లు కేటాయించాలన్నారు.

ఎగువ రాష్ట్రాల వినియోగంతో గోదావరిలో దిగువ చివరి రాష్ట్రం ఏపీ వాటాకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని.. ఇందుకోసం ఏపీతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఎన్‌డబ్ల్యూడీఏను కోరారు. దీనిపై స్పందించిన వెదిరె శ్రీరామ్‌.. తొలివిడతలో ఇచ్చంపల్లి నుంచి అనుసంధానం చేపడతామని, తదుపరి దశల్లో ఇతర ప్రాంతాల నుంచి సైతం గోదావరి జలాల తరలింపును పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

ఏపీ వాటాలకు రక్షణ కల్పించే విషయంలో రాజీపడబోమని భరోసా ఇచ్చారు. నాగార్జునసాగర్, సోమశిల జలాశయాల కింద ఇప్పటికే ఉన్న ఆయకట్టుతోపాటు నదుల అనుసంధానం ప్రాజెక్టు కింద ప్రతిపాదిస్తున్న కొత్త ఆయకట్టుకు సైతం సాగునీటిని సరఫరా చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement