సాక్షి, అమరావతి : నదుల అనుసంధానం పనులను పర్యవేక్షించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ తరహాలో నేషనల్ ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ అథారిటీ (నిరా) పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదించింది. నదుల అనుసంధానానికి సంబంధించి సర్వే, సమగ్ర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్) తయారీ నుంచి.. ప్రధాన పనులకు సంబంధించిన టెండర్లు, వాటి పర్యవేక్షణ వరకూ అన్ని బాధ్యతలను ఆ సంస్థే నిర్వహించనుంది.
ఆయకట్టుకు నీళ్లందించే బ్రాంచ్ కెనాల్స్ (ఉప కాలువలు), డి్రస్టిబ్యూటరీల (పిల్ల కాలువల) పనులను మాత్రమే రాష్ట్రాలకు అప్పగించాలని ప్రతిపాదించింది. అప్పుడే నదుల అనుసంధానం వేగవంతమయ్యే అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తూ కేంద్ర మంత్రి మండలికి కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదనలు పంపింది. వాటిపై కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేయడమే తరువాయి. జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) నిరాగా రూపాంతరం చెందుతుందని అధికార వర్గాలు తెలిపాయి.
జాతీయ ప్రాజెక్టుల కంటే అధికంగా..
జాతీయ ప్రాజెక్టులకు అయ్యే వ్యయంలో 90% నిధులను కేంద్రం సమకూర్చేది. కానీ.. ఇటీవల ఆ వాటాను 60 శాతానికి తగ్గిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ.. నదుల అనుసంధానం ప్రాజెక్టులకు మాత్రం 90 శాతం నిధులను కేంద్రం విడుదల చేస్తుందని, మిగతా 10 శాతం నిధులను ఆయా రాష్ట్రాలు భరించాలని తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. కెన్–బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు (కేబీఎల్‌పీ) నుంచే ఈ మార్గదర్శకాలు అమలవుతాయని పేర్కొంది.
కేంద్రంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కేబీఎల్‌పీ మధ్యప్రదేశ్‌లో 8.11 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్‌లో 2.51 లక్షల హెక్టార్లు వెరసి 10.62 లక్షల హెక్టార్లకు నీళ్లందించనున్నారు. కేబీఎల్‌పీ అంచనా వ్యయం 2020–21 ధరల ప్రకారం రూ.44,605 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. ఇందులో 90 శాతం కేంద్రం భరిస్తుంది. మిగతా 10 శాతం ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ భరిస్తాయి. మిగతా నదుల అనుసంధాన ప్రాజెక్టులకూ ఇదే విధానం వర్తిస్తుందని కేంద్ర జల్ శక్తి శాఖ పేర్కొంది.
నదుల అనుసంధానం వేగవంతం
హిమాలయ, ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడం ద్వారా కడలి పాలవుతున్న జలాలను మళ్లించి దేశాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ఎన్‌డబ్ల్యూడీఏ 30 అనుసంధాన ప్రాజెక్టులను సిద్ధం చేసింది. కానీ.. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, నిధుల కొరత, జల వివాదాలు, అటవీ పర్యావరణ అనుమతులు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం తదితర సమస్యల వల్ల నదుల అనుసంధానం దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైంది.
ఇటీవల కెన్–బెట్వా నదుల అనుసంధానానికి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావడంతో ఆ ప్రాజెక్టును కేంద్రం చేపట్టింది. నదుల అనుసంధానం కోసం ప్రత్యేకంగా ‘నిరా’ను ఏర్పాటు చేస్తే.. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం నుంచి పనులు చేపట్టడం వరకూ వేగవంతమయ్యే అవకాశం ఉందని నీటి పారుదలరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment