National Highways Authority
-
నేషనల్ హైవే కమిటీ సభ్యులుగా ఎంపీలు బోస్, అవినాష్‌రెడ్డి
సాక్షి, కోనసీమ జిల్లా: నేషనల్ హైవే కన్సల్టింగ్ కమిటీ సభ్యులుగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, లోక్‌సభ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నియమితులయ్యారు.ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో లోక్‌సభ నుంచి 20 మంది, రాజ్యసభ నుంచి ఏడుగురు సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. -
పెరిగిన టోల్ నేటి అర్ధరాత్రి నుంచే అమలు.. ఛార్జీలు వివరాలు ఇలా
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లో చార్జీల పెంపు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. రోడ్ల నిర్వహణకు సంబంధించి ఏటా ఏప్రిల్ ఒకటి నుంచి చార్జీల పెంపును ఆనవాయితీగా తీసుకున్న జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ).. ఈసారి కూడా కొత్త చార్జీలను సిద్ధం చేసింది. గతేడాది వివిధ కేటగిరీల వాహనాలకు సంబంధించి 8 శాతం నుంచి 15 శాతం వరకు ధరలు పెంచగా.. ఈసారి వాహనదారులపై కాస్త దయతలిచి 5.50 శాతంలోపే పెంపును పరిమితం చేసింది. (వాహనదారులకు షాక్?.. పెరగనున్న టోల్ చార్జీలు.. ఎంతంటే?) విజయవాడ రహదారిలోని పంతంగి టోల్ ప్లాజాను ఉదాహరణగా తీసుకుంటే.. గతేడాది కారు/జీపు/వ్యాన్ కేటగిరీలో చార్జీని రూ.80 నుంచి రూ.90కి అంటే రూ.10 పెంచగా... ఈసారి రూ.90 నుంచి రూ.95కు అంటే రూ.5 మాత్రమే పెంచింది. ఇక గతేడాది టోల్ ధరలు అమల్లోకి వచ్చాక కొత్తగా ఐదు ప్రాంతాల్లో టోల్గేట్లు అందుబాటులోకి వచ్చాయి. పెరగనున్న ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో టోల్‌ప్లాజాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.1,820 కోట్లు సమకూరాయి. ఈసారి దేశవ్యాప్తంగా మరిన్ని టోల్గేట్లు అందుబాటులోకి రావడం, ధరల పెంపు నేపథ్యంలో టోల్ వసూళ్లు రూ.2 వేలకోట్లను దాటిపోతాయని అంచనా. ఫాస్టాగ్‌తో కచ్చితమైన ఆదాయం గతంలో టోల్గేట్ల వద్ద నిర్వాహకులు భారీగా అక్రమాలకు పాల్పడటంతో.. వాహనాల నుంచి వసూలు చేసిన మొత్తంలో దాదాపు 25 శాతం పక్కదారి పట్టేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనితో ప్రభుత్వ ఖజానాకు చేరే మొత్తం తక్కువగా కనిపించేది. ఫాస్టాగ్ అమల్లోకి వచ్చాక అక్రమాలకు తెరపడి, ప్రతి రూపాయి లెక్కలోకి వస్తోంది. దీనితో గత మూడేళ్లుగా టోల్ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 98.6 శాతం వాహనాలు ఫాస్టాగ్‌ను వినియోగిస్తున్నాయి. విజయవాడ రోడ్డులోని కోర్లపహాడ్ ప్లాజాలో.. కార్లు, జీపులు సింగిల్ జర్నీ చార్జి రూ.120 నుంచి రూ.125కు.. రిటర్న్ జర్నీ రూ.180 నుంచి రూ.200కు.. నెల పాస్ రూ.4,025 నుంచి రూ.4,225కు.. ► లైట్ కమర్షియల్ వాహనాలకు సింగిల్ ట్రిప్ రూ.190–రూ.200, రిటర్న్ జర్నీ రూ.285–రూ.300, నెలపాస్ రూ.6,385–రూ.6,710.. ► బస్సు, ట్రక్కులకు సింగిల్ ట్రిప్ రూ.395–రూ.415, రిటర్న్ జర్నీ రూ.595–రూ.625, నెలపాస్ రూ.13,240–రూ.13,910కు.. ► ఓవర్ సైజ్డ్ వెహికల్స్ సింగిల్ ట్రిప్ రూ.765 నుంచి రూ.805కు, రిటర్న్ జర్నీ 1,150–రూ.1,210, నెలపాస్ రూ.25,540–రూ.26840కు సవరించారు. చిల్లకల్లు టోల్‌ప్లాజాలో.. కార్, జీప్ సింగిల్ ట్రిప్పు రూ.100 నుంచి రూ.105కు, రిటర్న్ జర్నీ రూ.150–రూ.160, నెలపాస్ రూ.3,350–రూ.3,520కు పెంచారు. ► లైట్ కమర్షియల్ వాహనాలకు సింగిల్ ట్రిప్పు రూ.160 నుంచి రూ.165కు, రిటర్న్ జర్నీ రూ.240–రూ.250, నెలపాస్ రూ.5,290–రూ.5,560కు.. ► బస్సు, ట్రక్కులకు సింగిల్ ట్రిప్పు రూ.330–రూ.345, రిటర్న్ జర్నీ రూ.490–రూ.515, నెలపాస్ రూ.10,940–రూ.11,495కు.. ► హెవీ వెహికల్స్ సింగిల్ ట్రిప్పు రూ.635–రూ.665, రిటర్న్ జర్నీ రూ.955–రూ.1,000, నెలపాస్ రూ.21,170–రూ.22,240కు సవరించారు. జాతీయ రహదారి 765 మీద కడ్తాల్ వద్ద.. కార్లు, జీపులకు సింగిల్ ట్రిప్పు రూ.45, రిటర్న్ జర్నీ రూ.65, నెల పాస్ రూ.1,495కు.. ► లైట్ వెహికల్స్ సింగిల్ ట్రిప్పు రూ.75, రిటర్న్ జర్నీ రూ.110, నెలపాస్ రూ.2,420కు.. ► బస్సు ట్రక్కులకు సింగిల్ ట్రిప్పు రూ.150, రిటర్న్ జర్నీ రూ.230, నెల పాస్ రూ.5,070 ► హెవీ వెహికల్స్ సింగిల్ ట్రిప్పు రూ.290, రిటర్న్ జర్నీ రూ.435, నెలపాస్ రూ.9,675కు పెంచారు. జాతీయ రహదారి 167పై మహబూబ్‌నగర్ జిల్లా మున్ననూర్ టోల్ ప్లాజా.. కార్లు, జీపుల సింగిల్ ట్రిప్పు రూ.45, రిటర్న్ జర్నీ రూ.65, నెలపాస్ రూ.1,475కు పెంచారు. ► లైట్ వెహికల్ సింగిల్ ట్రిప్పు రూ.70, రిటర్న్ జర్నీ రూ.105, నెలపాస్ రూ.2,385కు.. ► బస్సులు, ట్రక్కుల సింగిల్ ట్రిప్పు రూ.150, రిటర్న్ జర్నీ రూ.225, నెలపాస్ రూ.4,995 ► భారీ వాహనాలకు సింగిల్ ట్రిప్పు రూ.285, రిటర్న్ జర్నీ రూ.430, నెలపాస్ రూ.9,540గా నిర్ధారించారు. జాతీయ రహదారి 163 చిట్లపల్లి టోల్‌ప్లాజా వద్ద కార్లు, జీపులకు సింగిల్ ట్రిప్పు రూ.65, రిటర్న్ జర్నీ రూ.95, నెలపాస్ రూ.2,110కు పెంచారు. ► లైట్ వెహికల్స్ సింగిల్ ట్రిప్పు రూ.100, రిటర్న్ జర్నీ రూ.155, నెల పాస్ రూ.3,410కు.. ► బస్సు/ట్రక్కులకు సింగిల్ ట్రిప్పు రూ.215, రిటర్న్ జర్నీ రూ.320, నెలపాస్ రూ.7,145కు.. ► హెవీ వెహికల్స్‌కు సింగిల్ ట్రిప్పు రూ.410, రిటర్న్ జర్నీ రూ.615, నెలపాస్ రూ.13,645కు పెంచారు. -
నదుల అనుసంధానానికి ప్రాధికార సంస్థ
సాక్షి, అమరావతి : నదుల అనుసంధానం పనులను పర్యవేక్షించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ తరహాలో నేషనల్ ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ అథారిటీ (నిరా) పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదించింది. నదుల అనుసంధానానికి సంబంధించి సర్వే, సమగ్ర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్) తయారీ నుంచి.. ప్రధాన పనులకు సంబంధించిన టెండర్లు, వాటి పర్యవేక్షణ వరకూ అన్ని బాధ్యతలను ఆ సంస్థే నిర్వహించనుంది. ఆయకట్టుకు నీళ్లందించే బ్రాంచ్ కెనాల్స్ (ఉప కాలువలు), డి్రస్టిబ్యూటరీల (పిల్ల కాలువల) పనులను మాత్రమే రాష్ట్రాలకు అప్పగించాలని ప్రతిపాదించింది. అప్పుడే నదుల అనుసంధానం వేగవంతమయ్యే అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తూ కేంద్ర మంత్రి మండలికి కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదనలు పంపింది. వాటిపై కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేయడమే తరువాయి. జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) నిరాగా రూపాంతరం చెందుతుందని అధికార వర్గాలు తెలిపాయి. జాతీయ ప్రాజెక్టుల కంటే అధికంగా.. జాతీయ ప్రాజెక్టులకు అయ్యే వ్యయంలో 90% నిధులను కేంద్రం సమకూర్చేది. కానీ.. ఇటీవల ఆ వాటాను 60 శాతానికి తగ్గిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ.. నదుల అనుసంధానం ప్రాజెక్టులకు మాత్రం 90 శాతం నిధులను కేంద్రం విడుదల చేస్తుందని, మిగతా 10 శాతం నిధులను ఆయా రాష్ట్రాలు భరించాలని తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. కెన్–బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు (కేబీఎల్పీ) నుంచే ఈ మార్గదర్శకాలు అమలవుతాయని పేర్కొంది. కేంద్రంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కేబీఎల్పీ మధ్యప్రదేశ్‌లో 8.11 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్‌లో 2.51 లక్షల హెక్టార్లు వెరసి 10.62 లక్షల హెక్టార్లకు నీళ్లందించనున్నారు. కేబీఎల్పీ అంచనా వ్యయం 2020–21 ధరల ప్రకారం రూ.44,605 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. ఇందులో 90 శాతం కేంద్రం భరిస్తుంది. మిగతా 10 శాతం ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ భరిస్తాయి. మిగతా నదుల అనుసంధాన ప్రాజెక్టులకూ ఇదే విధానం వర్తిస్తుందని కేంద్ర జల్ శక్తి శాఖ పేర్కొంది. నదుల అనుసంధానం వేగవంతం హిమాలయ, ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడం ద్వారా కడలి పాలవుతున్న జలాలను మళ్లించి దేశాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ఎన్‌డబ్ల్యూడీఏ 30 అనుసంధాన ప్రాజెక్టులను సిద్ధం చేసింది. కానీ.. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, నిధుల కొరత, జల వివాదాలు, అటవీ పర్యావరణ అనుమతులు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం తదితర సమస్యల వల్ల నదుల అనుసంధానం దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైంది. ఇటీవల కెన్–బెట్వా నదుల అనుసంధానానికి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావడంతో ఆ ప్రాజెక్టును కేంద్రం చేపట్టింది. నదుల అనుసంధానం కోసం ప్రత్యేకంగా ‘నిరా’ను ఏర్పాటు చేస్తే.. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం నుంచి పనులు చేపట్టడం వరకూ వేగవంతమయ్యే అవకాశం ఉందని నీటి పారుదలరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
రూ.10 వేల కోట్లతో హైవేల అభివృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి వేగం పుంజుకుంటోంది. మరో 1,586 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల అభివృద్ధి ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించింది. రాబోయే మూడేళ్లలో దశలవారీగా మొత్తం రూ.10 వేల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఈమేరకు ప్రతిపాదనలను జాతీయ రహదారులశాఖ ఖరారు చేసింది. గత వార్షిక ప్రణాళికలో మిగులు పనులతోపాటు రాష్ట్రంలో పోర్టులు, ప్రధాన పారిశ్రామిక పట్టణాలను అనుసంధానించే రహదారులను 12 మీటర్ల వెడల్పుతో (టూ లేన్స్ విత్ పావ్డ్ సోల్టర్స్)గా విస్తరించేందుకు మార్గం సుగమమైంది. సూత్రప్రాయంగా ఆమోదించిన ఈ ప్రణాళికలకు త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ రహదారుల నిర్మాణానికి ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు ఖరారు చేశారు. త్వరలోనే టెండర్లు పిలిచి మూడేళ్లలో పనులు పూర్తిచేయనున్నారు. అభివృద్ధి చేయనున్న కొన్ని ప్రధాన రోడ్లు కల్వకుర్తి–నంద్యాల 250 కిలోమీటర్లు, నంద్యాల–జమ్మలమడుగు 82 కి.మీ., డోన్–సోమయాజులపల్లి 78 కి.మీ., గోరంట్ల–హిందూపురం 50 కి.మీ., పెడన–హనుమాన్‌జంక్షన్ 51 కి.మీ., అమలాపురం–బొబ్బర్లంక 55 కి.మీ., ఆకివీడు–దిగుమర్రు 45 కి.మీ., నరసాపురం రింగ్‌రోడ్డు 40 కిలోమీటర్ల రహదారుల్ని అభివృద్ధి చేయనున్నారు. ఇవేగాక రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులతో అనుసంధానించే పలు రోడ్లను 12 మీటర్ల వెడల్పుతో విస్తరించనున్నారు. -
హైదరాబాద్ ఆర్ఆర్ఆర్.. 320 కి.మీ.
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద రింగ్‌రోడ్డుకు మార్గం సుగమమైంది. భాగ్యనగరం చుట్టూ దాదాపు 320 కి.మీ. చుట్టూ నిర్మించతలపెట్టిన హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్)లో ఉత్తర భాగానికి ఈ సంవత్సరమే మార్గం సుగమమైంది. 158.46 కి.మీ. పొడవైన ఈ భాగానికి తుది అలైన్‌మెంటు సిద్ధమైంది. మరో నెలరోజుల్లో భూసమీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. నాగ్‌పూర్‌కు చెందిన కే అండ్ జే కన్స్ట్రక్షన్స్ కన్సెల్టెన్సీ ఆధ్వర్యంలో నాలుగు అలైన్‌మెంటు ఆప్షన్లు రూపొందగా.. అందులో జాతీయ రహదారుల అధీకృత సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆప్షన్–ఏను ఎంపిక చేసింది. గతంలో అలైన్‌మెంటు రూపొందినప్పుడు కాళేశ్వరం నీటితో నింపే రిజర్వాయర్లకు ప్రణాళికలు లేవు. ఈ నేపథ్యంలో అలాంటి కాలువలు, చానళ్లు, జలాశయాలకు ఇబ్బందిలేకుండా ఆయా ప్రాంతాల్లో అలైన్‌మెంటును మళ్లిస్తూ కొత్త అలైన్‌మెంటును రూపొందించారు. దీనికే ఎన్హెచ్ఏఐ మొగ్గు చూపింది. నాలుగు వరసల ఈ రోడ్డు నిర్మాణానికి రూ.7,512 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సంగారెడ్డి–తూప్రాన్–గజ్వేల్–జగదేవ్‌పూర్–యాదాద్రి–భువనగిరి–చౌటుప్పల్ పట్టణాలను అనుసంధానిస్తూ ఈ రోడ్డు నిర్మాణం కానుంది. దక్షిణ భాగం కోసం కసరత్తు దాదాపు 180 కి.మీ. పొడవుతో రూపుదిద్దుకోవాల్సిన దక్షిణ భాగం రింగ్‌రోడ్డుకు సంబంధించిన అంశం కేంద్రప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఉత్తర భాగంతో పోలిస్తే దక్షిణ భాగం మార్గంలో ప్రస్తుతం వాహనాల సంచారం తక్కువగా ఉందని ఇటీవల జాతీయ రహదారుల విభాగం అధ్యయనంలో తేలింది. ప్రత్యేకంగా ఓ ప్రైవేటు సంస్థకు బాధ్యత అప్పగించి సర్వే చేయించగా, దీని నివేదిక కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. వాహనాలు తక్కువగా ఉన్నప్పుడు నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్ వే తరహా రోడ్డు నిర్మాణం ఎంతవరకు ఉపయోగం అన్న విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. అయితే, ఒకసారి రింగ్ అలైన్మెంట్ సిద్ధమైతే.. ఆ రోడ్డు మీదుగా తిరిగే వాహనాల సంఖ్య ఉత్తర భాగం తరహాలోనే ఉంటుందని, పూర్తి రింగుగా ఈ రోడ్డు నిర్మితమైతేనే ఉపయోగం ఉంటుందని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తెచ్చింది. దీనికి సానుకూలంగానే కేంద్రం పరిశీలిస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. -
రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం నుంచి దేవరపల్లికి వేస్తున్న జాతీయ రహదారి నిమిత్తం సేకరిస్తున్న భూములకు సంబంధించి రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని నేషనల్ హైవేస్ అథారిటీని హైకోర్టు ఆదేశించింది. రైతుల అభ్యంతరాలపై చట్టపరంగా తగిన నిర్ణయం తీసుకునే వరకు వారి భూములను స్వాధీనం చేసుకోరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. తమ భూముల స్వాధీనానికి నేషనల్ హైవేస్ అథారిటీ చట్టం సెక్షన్ 3(ఎ) కింద ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ ఆ ప్రాంతానికి చెందిన రైతు కె.రాజశేఖర్‌రెడ్డితోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. దాదాపు 2 వేల మంది రైతులకు చెందిన భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ తరఫున న్యాయవాది కౌటూరు పవన్‌కుమార్ నివేదించారు. పర్యావరణ చట్టాలతోపాటు రాజ్యాంగ విరుద్ధంగా ఈ భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు. నోటిఫికేషన్‌పై గత డిసెంబర్ 9న రైతులు అభ్యంతరాలను తెలియజేశారని, అయినా వాటిని పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. ఈ మేరకు న్యాయమూర్తి స్పందిస్తూ రైతుల అభ్యంతరాలపై చట్టపరంగా తగిన నిర్ణయం తీసుకోవాలని, అప్పటివరకు వారి భూములను స్వాధీనం చేసుకోరాదని ఆదేశించారు. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు నేషనల్ హైవేస్ అథారిటీని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలపాటు వాయిదా వేశారు. -
మెహిదీపట్నం టూ శంషాబాద్ ఎయిర్‌పోర్టు జస్ట్ 18 నిమిషాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని మెహిదీపట్నం నుంచి 30 కిలోమీటర్ల దూరం.. విపరీతమైన ట్రాఫిక్, ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఔటర్ రింగురోడ్డుతో అనుసంధానమైన బెంగళూరు జాతీయ రహదారిని దాటాల్సి రావటం.. వెరసి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ఎప్పుడూ టెన్షనే. ఇప్పుడు ఆ టెన్షన్‌ను తగ్గిస్తూ విమానాశ్రయానికి కొత్త ‘రాచబాట’ సిద్ధం కాబోతోంది. తాజాగా పనులు మొదలుపెట్టిన జాతీయ రహదారుల విభాగం మరో 12 నుంచి 15 నెలల్లో దాన్ని సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే సంవత్సరం జూలై నాటికి దాని మీదుగా దూసుకెళ్లొచ్చు. మెహిదీపట్నం నుంచి జస్ట్ 18 నిమిషాల్లో విమానాశ్రయంలో దిగొచ్చు. పీవీ ఎక్స్‌ప్రెస్‌వేకు కొనసాగింపుగా.. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శంషాబాద్ అవతల నిర్మించింది. దానికి వీలైనంత తొందరగా చేరుకునేందుకు అప్పట్లో దేశంలోనే అతి పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించింది. మెహిదీపట్నం సమీపంలో మొదలయ్యే ఈ నాలుగు వరుసల ఫ్లైఓవర్ 11.6 కి.మీ. సాగి బెంగళూరు జాతీయ రహదారిపై వ్యవసాయ విశ్వవిద్యాలయం గేటు ఎదుట ముగుస్తుంది. పదేళ్ల కిందటే ఈ వంతెన అందుబాటులోకి రావటంతో.. విమానాశ్రయానికి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు వెళ్లగలుగుతున్నారు. కానీ విమానాశ్రయం ఏర్పాటుతో శంషాబాద్ పట్టణం ఒక్కసారిగా అభివృద్ధి చెందటం ప్రారంభమైంది. వాహనాల సంఖ్య బాగా పెరిగింది. ఫలితంగా ఆ రోడ్డు రద్దీగా మారింది. పీవీ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేపై వచ్చే వాహనాలు జాతీయ రహదారిపై దిగగానే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్నాయి. మెహిదీ పట్నం నుంచి అక్కడి వరకు 10–12 నిమిషాల్లో వచ్చే వాహనాలు, అక్కడి నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకు నేందుకు అరగంట కంటే ఎక్కువ సమయం పడుతోంది. విమానాశ్రయానికి వెళ్లే వారికి పెద్ద సమస్యగా పరిణ మించింది. దీనికి పరిష్కారంగా ఇప్పుడు జాతీయ రహ దారిని పీవీ ఎక్స్‌ప్రెస్‌వేకు కొనసాగింపుగా ఎక్స్‌ప్రెస్ వే తరహాలో మార్చాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. గతేడాది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆ పనులను జాతీయ రహదారుల విభాగం ప్రారంభించింది. ఆరు నిమిషాల్లోనే.. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే దిగిన వాహనాలు అక్కడి నుంచి విమానాశ్రయానికి ఆరు నిమిషాల్లోనే చేరుకునేలా రోడ్డును పూర్తిగా మారుస్తున్నారు. పీవీ ఎలివేటెడ్ కారిడార్ పూర్తయిన వెంటనే ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ వే తరహా నిర్మాణం మొదలవుతుంది. అక్కడికి 200 మీటర్ల తర్వాత లైట్‌వెయిట్ వెహిక్యులర్ అండర్ పాస్ (ఎల్‌వీయూపీ) నిర్మిస్తారు. ప్రధాన రోడ్డుపై సిగ్నల్స్, యూటర్న్ అవకాశం ఉండదు. దానిమీదకు వచ్చే వాహనాలు నేరుగా విమానాశ్రయానికో, బెంగళూరు వైపో వెళ్లాల్సిందే. ఇందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లే సాధారణ వాహనాలు ఆ రోడ్డును క్రాస్ చేసేందుకు ఈ అండర్‌పాస్ ఉపయోగపడుతుంది. ఇది 770 మీటర్ల పొడవుతో నిర్మితమవుతుంది. కార్లు, మినీ వెహికిల్స్, ఆటోలు, ద్విచక్ర వాహనాలు దీని కిందుగా రోడ్డును అటూఇటూ దాటతాయి. భారీ ఫ్లైఓవర్ కాటేదాన్, గగన్పహాడ్ల నుంచి వచ్చే వాహనాలు సిటీ వైపు, సమీపంలోని ఇతర ప్రాంతాల వైపు నుంచి వెళ్లేందుకు వీలుగా ఫ్లైఓవర్ ఆప్షన్ ఉంటుంది. 730 మీటర్ల పొడవుండే ఈ వంతెనను నిర్మిస్తారు. ఎయిర్‌పోర్టు, బెంగళూరు వైపు వెళ్లే వాహనాలు దీనిమీదుగా దూసుకెళ్తాయి. కాటేదాన్, గగన్‌పహాడ్ నుంచి వచ్చే వాహనాలు సిటీ వైపు వెళ్లాలన్నా, ప్రధాన రహదారిని క్రాస్ చేసి మరోవైపు వెళ్లాలన్నా దీని కిందుగా క్రాస్ చేయాల్సి ఉంటుంది. కాగా, శంషాబాద్ సమీపంలో 500 మీటర్ల పొడవుతో ఓ వెహికిల్ అండర్ పాస్ నిర్మిస్తారు. జాతీయ రహదారి మీదుగా కాకుండా అటూఇటూ వెళ్లే చిన్న వాహనాలు దీని కిందుగా ప్రధాన రోడ్డును క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే గగన్‌పహాడ్ గ్రామస్తులు రోడ్డు దాటేందుకు స్టీల్ ఫుట్ఓవర్ బ్రిడ్జి కూడా నిర్మిస్తారు. వీలైతే పాదచారులు రోడ్డు దాటేందుకు అండర్‌పాస్‌కు అనుసంధానంగా ఏర్పాటు చేయాలని ఇప్పుడు భావిస్తున్నారు. అది సాధ్యమైతే ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఉండదు. భారీ ఎలివేటెడ్ కారిడార్.. ప్రధాన ట్రాఫిక్ శంషాబాద్ పట్టణం వద్దనే ఉంటున్నందున ఆ ప్రాంతం యావత్తు దాటేందుకు విశాలమైన 1.2 కి.మీ. మీటర్ల పొడవుండే ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. శంషాబాద్ కంటే ముందు మొదలయ్యే ఈ కారిడార్ ముందుకు సాగి విమానాశ్రయం మలుపు వద్ద రెండుగా చీలుతుంది. విమానాశ్రయంలోకి వెళ్లేందుకు ఎడమవైపు ఒక పాయ చీలి ఎయిర్‌పోర్డు రోడ్డుపై ల్యాండ్ అవుతుంది. ప్రధాన పాయ జాతీయ రహదారిపై ఓఆర్ఆర్ వంతెన కంటే ముందు ల్యాండ్ అవుతుంది. విమానాశ్రయం నుంచి వచ్చి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు ఈ వంతెన మీదకు చేరుకునేలా ఓ ర్యాంపును అనుసంధానిస్తారు. గడువు లోపు పూర్తి చేస్తాం విమానాశ్రయానికి ప్రధాన అనుసంధానం అవుతున్నందున ఈ రోడ్డు నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేస్తాం. అది అందుబాటులోకి వస్తే మెహిదీపట్నం నుంచి విమానాశ్రయానికి 20 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు. ఎక్కడా విమానాశ్రయ వాహనాలకు అడ్డంకి లేకుండా ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రహదారి రూపుదిద్దుకోనుంది – గణపతి రెడ్డి,ఈఎన్సీ జాతీయ రహదారులు -
ట్రాన్స్ ట్రాయ్ రోడ్డు కాంట్రాక్టు రద్దు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిర్మాణ రంగ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌కి నేషనల్ హైవేస్ అథారిటీ(ఎన్హెచ్ఏఐ) షాక్ ఇచ్చింది. నిర్మాణం, నిర్వహణ, బదిలీ ప్రాతిపదికన కంపెనీకి 2012 ఏప్రిల్‌లో అప్పగించిన రూ.912 కోట్ల విలువైన రోడ్డు నిర్మాణ ప్రాజెక్టును రద్దు చేసింది. మధ్యప్రదేశ్‌లో 69వ జాతీయ రహదారిలో ఉన్న ఓబెదుల్లాగంజ్-బేతుల్ సెక్షన్లో 121.36 కిలోమీటర్ల మేర రోడ్డును 4 లేన్ల రహదారిగా 2016 ఆగస్టు నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా 1.34% పనులే పూర్తి కావడంతో ఎన్‌హెచ్‌ఏఈ ఈ నిర్ణయం తీసుకుంది. -
జిల్లాలో రెండో టోల్‌ప్లాజా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నేషనల్ హైవే-44 పై మరో కొత్త టోల్‌ప్లాజా రాబోతోంది. భిక్కనూర్ సమీపంలో ఈ ప్లాజాను నిర్మించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ హైవేపై జిల్లాలోని ఇందల్వాయి వద్ద ఒక టోల్‌ప్లాజా ఉంది. తదుపరి ప్లాజా మెదక్ జిల్లాలోని తూఫ్రాన్ వద్ద ఉంది. ఆదిలాబాద్-నిజామాబాద్ జిల్లాల సరిహద్దులోని గంజాల్ వద్ద మరొక టోల్ ప్లాజా ఉంది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనదారులు త్వరలోనే జిల్లాలోని రెండో టోల్‌ప్లాజాలో పన్ను చెల్లించాలి. భిక్కనూర్ సమీపంలో నిర్మించే టోల్‌ప్లాజా నమూనాతోపాటు, టోల్గేట్ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ రిపోర్టు పంపించినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ అధికారవర్గాల ద్వారా తెలిసింది. నాగపూర్ నుంచి హైదరాబాద్ వరకు నాలుగు లేన్లతో నేషనల్ హైవే-44 విస్తరణ తర్వాత ఈ మార్గం ద్వారా వెళ్లే వాహనాల నుంచి ట్యాక్స్ వసూలు చేసేం దుకు టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేశారు. ఇపుడు మరో టోల్‌ప్లాజాతో హైదరాబాద్‌కు వెళ్లేవారిపై మరింత అదనపు భారం పడుతుందని వాహనదారులలో ఆం దోళన వ్యక్తం అవుతోంది. నిబంధనలు ఎన్నో సాధారణంగా జాతీయ రహదారులపై ఒక టోల్గేట్ నుంచి కనీసం 60 కిలోమీటర్ల వ్యత్యాసం ఉంటేనే కొత్తగా మరో ప్లాజాను ఏర్పాటు చేస్తారు. ఎన్హెచ్ఏ అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు. నిబంధనల ప్రకారం జాతీయ రహదారి వెడల్పు, విస్తరణ సమయంలో జరిగిన వ్యయాన్ని బట్టి కూడ టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేయవచ్చంటున్నారు. పెట్టుబడి వంటి ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకు నే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్‌హెచ్-44 పై భిక్కనూర్ సమీపంలో త్వరలోనే టోల్‌ప్లాజా ఏర్పాటు చే సేందుకు తొందరపడుతున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వాహనాల పరిస్థితి ఎలా ఉన్నా, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, డిచ్ పల్లి, భిక్కనూర్ తదితర ప్రాంతాల వాహనదారులకు ఒక రకం గా ఇబ్బందికరమే. అదనపు భారం భిక్కనూర్ సమీపంలో నేషనల్ హైవేపై టోల్ ప్లాజా ఏర్పాటు జరిగితే హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలపై ఏటా రూ.36.93 కోట్ల అదనపు భారం పడనుంది. ఇది నేషనల్ హైవేస్ అథారిటీకి అదనపు ఆదాయం గా సమకూరునుంది. ఇప్పటికే ఇందల్వాయి వద్ద ఉన్న టోల్‌ప్లాజాలో నమోదవుతున్న లెక్కల ప్రకారం ప్రతిరోజు 5,2 50 చిన్న, పెద్ద, భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. సగటున రోజుకు రూ.10,25,850 టోల్‌ట్యాక్స్ వసూలు అవుతోంది. ఈ లెక్కన నెలకు రూ.3 కోట్ల 7 లక్షల 75 వేల 500 వస్తుండగా, ఏడాదికి రూ.36 కోట్ల 93 లక్షల 6 వేలు వాహనాల నుంచి టోల్గేట్ నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. ఇందల్వాయి టోల్‌ప్లాజాలో నెలలో సగటున 34,961 కార్లు, జీపులు, వ్యాన్లు ట్యాక్స్‌లు చెల్లిస్తున్నట్ల్లు రికార్డులు చెబుతున్నాయి. మినీబస్సులు, తేలికపాటి వాణిజ్య వాహనాలు 15,279, బస్సులు, ట్రక్కులు 34,152 వెళ్తుండగా హెవీ కన్స్ట్రక్షన్ మెషినరీ, ఎర్త్‌మూవింగ్ యంత్రాలతో పాటు మొత్తం కలిపితే 1,30,842 వాహనాలు జాతీయ రహదారిపై టోల్ట్యాక్స్లు చెల్లిస్తున్నాయి. భిక్కనూర్ సమీపంలో ఏర్పాటు చేసే టోల్‌ప్లాజాకు టెండర్లు నిర్వహిస్తారా? లేదా నేషనల్ హైవేస్ అథారిటీ నిర్వహణ కొనసాగిస్తుందా? అనేది తేలాల్సి ఉంది. -
ఫుట్ ఓవర్ బ్రిడ్జీల పనులు వేగిరం
* హైవేపై ఫుట్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం * మరి.. సర్వీసు రోడ్లు ఎప్పటికి పూర్తయ్యేనో.. * నేటికీ పూర్తికాని భూసేకరణ చౌటుప్పల్ మండలం మల్కాపురం నుంచి కృష్ణాజిల్లా నందిగామ వరకు 181.5కి.మీ.ల మేర బీఓటీ పద్ధ్దతిన జీఎంఆర్ కాంట్రాక్ట్ సంస్థ నాలుగులేన్ల రహదారి విస్తరణను రూ.2200కోట్ల వ్యయంతో ఏడాదిన్నర క్రితం పూర్తి చేసింది. కానీ, నేటికీ సర్వీసు రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయలేదు. పాదచారులు కూడా రోడ్డును దాటేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. డివైడర్‌పైనున్న బారీకేడ్లను దాటుతూ పడరానిపాట్లు పడుతున్నారు. దీంతో జాతీయ రహదారుల సంస్థ పాదచారుల కోసం ఫుట్ఓవర్ బ్రిడ్జీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చౌటుప్పల్‌లో 2, చిట్యాలలో 1, కేతేపల్లిలో 1 చొప్పున, ఒక్కోదాన్ని రూ.1.05కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. చౌటుప్పల్‌లోని బస్టాండ్ వద్ద, భాస్కర్ థియేటర్ వద్ద మరోటి నిర్మిస్తున్నారు. చిట్యాలలో కూడ ఒకదాని నిర్మాణం పూర్తికావొచ్చింది. మరోటి నిర్మాణంలో ఉంది. కేతేపల్లిలో కూడ పూర్తి కావొచ్చింది. కాగా, చౌటుప్పల్, చిట్యాలలో ఏర్పాటు చేయద ల్చిన ఎట్ గ్రేడ్ జంక్షన్ల నిర్మాణం నేటికీ ప్రారంభం కాలేదు. సర్వీసు రోడ్లు ఎప్పుడో... చౌటుప్పల్, చిట్యాల, మునగాల, నల్లబండగూడెం, పిల్లలమర్రి, రాయినిగూడెం, నకిరేకల్‌లలో రోడ్డును విస్తరించినా సర్వీసురోడ్ల నిర్మాణం చేపట్టడం లేదు. చౌటుప్పల్‌లో రెండు వైపులా నిర్మాణాలను పూర్తిగా కూల్చివేసినప్పటికీ, తంగడపల్లి క్రాస్‌రోడ్డు ఎదురుగా ఉన్న ఓ భవనం యజమాని కోర్టుకెళ్లడంతో, అధికారులు ఆ భవనం వైపు కన్నెత్తి చూడడం లేదు. బస్టాండ్ సమీపంలో సమాధులను కూడా తొలగించలేదు. సర్వీసు రోడ్డు వేసేందుకు ప్రస్తుతం మట్టిపనులు జరుగుతున్నా, ఇవి మాత్రం అడ్డంకిగా మారాయి. చిట్యాల మండల కేంద్రంలోనూ ఒక వైపు సర్వీసురోడ్డు నిర్మాణం పూర్తయింది. మరోవైపు కిలోమీటరున్నర మేర భూసేకరణ పూర్తికాక, భవన నిర్మాణాలే కూల్చివేయలేదు. నిర్వాసితులు కోర్టుకెళ్లడమే ఇందుకు కారణం. ఫలితంగా వర్షం కురిస్తే, వరద నీరు రోడ్లవెంటే నిల్వ ఉంటోంది. రోడ్డుకంటే తక్కువ ఎత్తులో భవన నిర్మాణాలుండడంతో, దుకాణాల్లోకి వర్షపు నీరు చేరుతోంది. చౌటుప్పల్‌లోనూ ఇదే పరిస్థితి. ప్రమాదాలు నిత్యకృత్యం గతంలో ఉన్న ఇరుకు రహదారిపై ప్రమాదకరమైన మూలమలుపులుండేవి. డేంజర్ జోన్లని బోర్డులుండేవి. హైవే విస్తరణ సమయంలో క్రాసింగ్‌లన్నింటినీ సరిచేస్తామని ఇరువైపులా భూసేకరణ కూడా అధికంగా చేశారు. కానీ కొన్నిచోట్ల డేంజర్ జోన్లు కాదు.. ఏకంగా డెత్ క్రాసింగ్‌లుగా మారాయి. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం వద్ద అండర్‌పాస్ బ్రిడ్జి దిగగానే వాహనాలు తిరగలేని మూలమలుపు ఉంది. హైవే విస్తరణతో 120కిలోమీటర్లకు మించి వేగంతో వస్తున్న వాహనదారులు నేరుగా వచ్చి బోల్తా కొడుతున్నారు. చిట్యాల రైల్వే బ్రిడ్జి వద్ద ఉన్న మూలమలుపు పరిస్థితి అంతే. నార్కట్‌పల్లిలో బైపాస్ చివర, నార్కట్‌పల్లి నుంచి వచ్చే వాహనాలు కలిసే చోట జంక్షన్‌ను సరిగ్గా వేయలేదు. బ్రిడ్జి దిగే క్రమంలో వాహనాలు అతివేగంగా వస్తుంటాయి. ఇదే సమయంలో ఇక్కడ ఇరువైపులా నుంచి వచ్చే వాహనదారులు రోడ్డు దాటాలంటే ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంది. సర్వీసురోడ్లు పూర్తికాకపోవడంతో ఇప్పటి వరకు చౌటుప్పల్‌లో 10మందికిపైగా, చిట్యాలలో 15 మందికిపైగా మంది మృత్యువాతపడ్డారు.