సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని మెహిదీపట్నం నుంచి 30 కిలోమీటర్ల దూరం.. విపరీతమైన ట్రాఫిక్, ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఔటర్ రింగురోడ్డుతో అనుసంధానమైన బెంగళూరు జాతీయ రహదారిని దాటాల్సి రావటం.. వెరసి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ఎప్పుడూ టెన్షనే. ఇప్పుడు ఆ టెన్షన్‌ను తగ్గిస్తూ విమానాశ్రయానికి కొత్త ‘రాచబాట’ సిద్ధం కాబోతోంది. తాజాగా పనులు మొదలుపెట్టిన జాతీయ రహదారుల విభాగం మరో 12 నుంచి 15 నెలల్లో దాన్ని సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే సంవత్సరం జూలై నాటికి దాని మీదుగా దూసుకెళ్లొచ్చు. మెహిదీపట్నం నుంచి జస్ట్ 18 నిమిషాల్లో విమానాశ్రయంలో దిగొచ్చు.
పీవీ ఎక్స్‌ప్రెస్‌వేకు కొనసాగింపుగా..
వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శంషాబాద్ అవతల నిర్మించింది. దానికి వీలైనంత తొందరగా చేరుకునేందుకు అప్పట్లో దేశంలోనే అతి పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించింది. మెహిదీపట్నం సమీపంలో మొదలయ్యే ఈ నాలుగు వరుసల ఫ్లైఓవర్ 11.6 కి.మీ. సాగి బెంగళూరు జాతీయ రహదారిపై వ్యవసాయ విశ్వవిద్యాలయం గేటు ఎదుట ముగుస్తుంది. పదేళ్ల కిందటే ఈ వంతెన అందుబాటులోకి రావటంతో.. విమానాశ్రయానికి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు వెళ్లగలుగుతున్నారు. కానీ విమానాశ్రయం ఏర్పాటుతో శంషాబాద్ పట్టణం ఒక్కసారిగా అభివృద్ధి చెందటం ప్రారంభమైంది. వాహనాల సంఖ్య బాగా పెరిగింది. ఫలితంగా ఆ రోడ్డు రద్దీగా మారింది. పీవీ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేపై వచ్చే వాహనాలు జాతీయ రహదారిపై దిగగానే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్నాయి. మెహిదీ పట్నం నుంచి అక్కడి వరకు 10–12 నిమిషాల్లో వచ్చే వాహనాలు, అక్కడి నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకు నేందుకు అరగంట కంటే ఎక్కువ సమయం పడుతోంది. విమానాశ్రయానికి వెళ్లే వారికి పెద్ద సమస్యగా పరిణ మించింది. దీనికి పరిష్కారంగా ఇప్పుడు జాతీయ రహ దారిని పీవీ ఎక్స్‌ప్రెస్‌వేకు కొనసాగింపుగా ఎక్స్‌ప్రెస్ వే తరహాలో మార్చాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. గతేడాది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆ పనులను జాతీయ రహదారుల విభాగం ప్రారంభించింది.
ఆరు నిమిషాల్లోనే..
పీవీ ఎక్స్‌ప్రెస్‌వే దిగిన వాహనాలు అక్కడి నుంచి విమానాశ్రయానికి ఆరు నిమిషాల్లోనే చేరుకునేలా రోడ్డును పూర్తిగా మారుస్తున్నారు. పీవీ ఎలివేటెడ్ కారిడార్ పూర్తయిన వెంటనే ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ వే తరహా నిర్మాణం మొదలవుతుంది. అక్కడికి 200 మీటర్ల తర్వాత లైట్‌వెయిట్ వెహిక్యులర్ అండర్ పాస్ (ఎల్‌వీయూపీ) నిర్మిస్తారు. ప్రధాన రోడ్డుపై సిగ్నల్స్, యూటర్న్ అవకాశం ఉండదు. దానిమీదకు వచ్చే వాహనాలు నేరుగా విమానాశ్రయానికో, బెంగళూరు వైపో వెళ్లాల్సిందే. ఇందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లే సాధారణ వాహనాలు ఆ రోడ్డును క్రాస్ చేసేందుకు ఈ అండర్‌పాస్ ఉపయోగపడుతుంది. ఇది 770 మీటర్ల పొడవుతో నిర్మితమవుతుంది. కార్లు, మినీ వెహికిల్స్, ఆటోలు, ద్విచక్ర వాహనాలు దీని కిందుగా రోడ్డును అటూఇటూ దాటతాయి.
భారీ ఫ్లైఓవర్
కాటేదాన్, గగన్‌పహాడ్‌ల నుంచి వచ్చే వాహనాలు సిటీ వైపు, సమీపంలోని ఇతర ప్రాంతాల వైపు నుంచి వెళ్లేందుకు వీలుగా ఫ్లైఓవర్ ఆప్షన్ ఉంటుంది. 730 మీటర్ల పొడవుండే ఈ వంతెనను నిర్మిస్తారు. ఎయిర్‌పోర్టు, బెంగళూరు వైపు వెళ్లే వాహనాలు దీనిమీదుగా దూసుకెళ్తాయి. కాటేదాన్, గగన్‌పహాడ్ నుంచి వచ్చే వాహనాలు సిటీ వైపు వెళ్లాలన్నా, ప్రధాన రహదారిని క్రాస్ చేసి మరోవైపు వెళ్లాలన్నా దీని కిందుగా క్రాస్ చేయాల్సి ఉంటుంది. కాగా, శంషాబాద్ సమీపంలో 500 మీటర్ల పొడవుతో ఓ వెహికిల్ అండర్ పాస్ నిర్మిస్తారు. జాతీయ రహదారి మీదుగా కాకుండా అటూఇటూ వెళ్లే చిన్న వాహనాలు దీని కిందుగా ప్రధాన రోడ్డును క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే గగన్‌పహాడ్ గ్రామస్తులు రోడ్డు దాటేందుకు స్టీల్ ఫుట్‌ఓవర్ బ్రిడ్జి కూడా నిర్మిస్తారు. వీలైతే పాదచారులు రోడ్డు దాటేందుకు అండర్‌పాస్‌కు అనుసంధానంగా ఏర్పాటు చేయాలని ఇప్పుడు భావిస్తున్నారు. అది సాధ్యమైతే ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఉండదు.
భారీ ఎలివేటెడ్ కారిడార్..
ప్రధాన ట్రాఫిక్ శంషాబాద్ పట్టణం వద్దనే ఉంటున్నందున ఆ ప్రాంతం యావత్తు దాటేందుకు విశాలమైన 1.2 కి.మీ. మీటర్ల పొడవుండే ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. శంషాబాద్ కంటే ముందు మొదలయ్యే ఈ కారిడార్ ముందుకు సాగి విమానాశ్రయం మలుపు వద్ద రెండుగా చీలుతుంది. విమానాశ్రయంలోకి వెళ్లేందుకు ఎడమవైపు ఒక పాయ చీలి ఎయిర్‌పోర్డు రోడ్డుపై ల్యాండ్ అవుతుంది. ప్రధాన పాయ జాతీయ రహదారిపై ఓఆర్‌ఆర్ వంతెన కంటే ముందు ల్యాండ్ అవుతుంది. విమానాశ్రయం నుంచి వచ్చి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు ఈ వంతెన మీదకు చేరుకునేలా ఓ ర్యాంపును అనుసంధానిస్తారు.
గడువు లోపు పూర్తి చేస్తాం
విమానాశ్రయానికి ప్రధాన అనుసంధానం అవుతున్నందున ఈ రోడ్డు నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేస్తాం. అది అందుబాటులోకి వస్తే మెహిదీపట్నం నుంచి విమానాశ్రయానికి 20 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు. ఎక్కడా విమానాశ్రయ వాహనాలకు అడ్డంకి లేకుండా ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రహదారి రూపుదిద్దుకోనుంది
– గణపతి రెడ్డి,ఈఎన్‌సీ జాతీయ రహదారులు
Comments
Please login to add a commentAdd a comment