Mehedipatnam
-
మెహిదీపట్నం టూ శంషాబాద్ ఎయిర్‌పోర్టు జస్ట్ 18 నిమిషాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని మెహిదీపట్నం నుంచి 30 కిలోమీటర్ల దూరం.. విపరీతమైన ట్రాఫిక్, ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఔటర్ రింగురోడ్డుతో అనుసంధానమైన బెంగళూరు జాతీయ రహదారిని దాటాల్సి రావటం.. వెరసి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ఎప్పుడూ టెన్షనే. ఇప్పుడు ఆ టెన్షన్‌ను తగ్గిస్తూ విమానాశ్రయానికి కొత్త ‘రాచబాట’ సిద్ధం కాబోతోంది. తాజాగా పనులు మొదలుపెట్టిన జాతీయ రహదారుల విభాగం మరో 12 నుంచి 15 నెలల్లో దాన్ని సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే సంవత్సరం జూలై నాటికి దాని మీదుగా దూసుకెళ్లొచ్చు. మెహిదీపట్నం నుంచి జస్ట్ 18 నిమిషాల్లో విమానాశ్రయంలో దిగొచ్చు. పీవీ ఎక్స్‌ప్రెస్‌వేకు కొనసాగింపుగా.. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శంషాబాద్ అవతల నిర్మించింది. దానికి వీలైనంత తొందరగా చేరుకునేందుకు అప్పట్లో దేశంలోనే అతి పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించింది. మెహిదీపట్నం సమీపంలో మొదలయ్యే ఈ నాలుగు వరుసల ఫ్లైఓవర్ 11.6 కి.మీ. సాగి బెంగళూరు జాతీయ రహదారిపై వ్యవసాయ విశ్వవిద్యాలయం గేటు ఎదుట ముగుస్తుంది. పదేళ్ల కిందటే ఈ వంతెన అందుబాటులోకి రావటంతో.. విమానాశ్రయానికి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు వెళ్లగలుగుతున్నారు. కానీ విమానాశ్రయం ఏర్పాటుతో శంషాబాద్ పట్టణం ఒక్కసారిగా అభివృద్ధి చెందటం ప్రారంభమైంది. వాహనాల సంఖ్య బాగా పెరిగింది. ఫలితంగా ఆ రోడ్డు రద్దీగా మారింది. పీవీ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేపై వచ్చే వాహనాలు జాతీయ రహదారిపై దిగగానే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్నాయి. మెహిదీ పట్నం నుంచి అక్కడి వరకు 10–12 నిమిషాల్లో వచ్చే వాహనాలు, అక్కడి నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకు నేందుకు అరగంట కంటే ఎక్కువ సమయం పడుతోంది. విమానాశ్రయానికి వెళ్లే వారికి పెద్ద సమస్యగా పరిణ మించింది. దీనికి పరిష్కారంగా ఇప్పుడు జాతీయ రహ దారిని పీవీ ఎక్స్‌ప్రెస్‌వేకు కొనసాగింపుగా ఎక్స్‌ప్రెస్ వే తరహాలో మార్చాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. గతేడాది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆ పనులను జాతీయ రహదారుల విభాగం ప్రారంభించింది. ఆరు నిమిషాల్లోనే.. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే దిగిన వాహనాలు అక్కడి నుంచి విమానాశ్రయానికి ఆరు నిమిషాల్లోనే చేరుకునేలా రోడ్డును పూర్తిగా మారుస్తున్నారు. పీవీ ఎలివేటెడ్ కారిడార్ పూర్తయిన వెంటనే ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ వే తరహా నిర్మాణం మొదలవుతుంది. అక్కడికి 200 మీటర్ల తర్వాత లైట్‌వెయిట్ వెహిక్యులర్ అండర్ పాస్ (ఎల్‌వీయూపీ) నిర్మిస్తారు. ప్రధాన రోడ్డుపై సిగ్నల్స్, యూటర్న్ అవకాశం ఉండదు. దానిమీదకు వచ్చే వాహనాలు నేరుగా విమానాశ్రయానికో, బెంగళూరు వైపో వెళ్లాల్సిందే. ఇందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లే సాధారణ వాహనాలు ఆ రోడ్డును క్రాస్ చేసేందుకు ఈ అండర్‌పాస్ ఉపయోగపడుతుంది. ఇది 770 మీటర్ల పొడవుతో నిర్మితమవుతుంది. కార్లు, మినీ వెహికిల్స్, ఆటోలు, ద్విచక్ర వాహనాలు దీని కిందుగా రోడ్డును అటూఇటూ దాటతాయి. భారీ ఫ్లైఓవర్ కాటేదాన్, గగన్పహాడ్ల నుంచి వచ్చే వాహనాలు సిటీ వైపు, సమీపంలోని ఇతర ప్రాంతాల వైపు నుంచి వెళ్లేందుకు వీలుగా ఫ్లైఓవర్ ఆప్షన్ ఉంటుంది. 730 మీటర్ల పొడవుండే ఈ వంతెనను నిర్మిస్తారు. ఎయిర్‌పోర్టు, బెంగళూరు వైపు వెళ్లే వాహనాలు దీనిమీదుగా దూసుకెళ్తాయి. కాటేదాన్, గగన్‌పహాడ్ నుంచి వచ్చే వాహనాలు సిటీ వైపు వెళ్లాలన్నా, ప్రధాన రహదారిని క్రాస్ చేసి మరోవైపు వెళ్లాలన్నా దీని కిందుగా క్రాస్ చేయాల్సి ఉంటుంది. కాగా, శంషాబాద్ సమీపంలో 500 మీటర్ల పొడవుతో ఓ వెహికిల్ అండర్ పాస్ నిర్మిస్తారు. జాతీయ రహదారి మీదుగా కాకుండా అటూఇటూ వెళ్లే చిన్న వాహనాలు దీని కిందుగా ప్రధాన రోడ్డును క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే గగన్‌పహాడ్ గ్రామస్తులు రోడ్డు దాటేందుకు స్టీల్ ఫుట్ఓవర్ బ్రిడ్జి కూడా నిర్మిస్తారు. వీలైతే పాదచారులు రోడ్డు దాటేందుకు అండర్‌పాస్‌కు అనుసంధానంగా ఏర్పాటు చేయాలని ఇప్పుడు భావిస్తున్నారు. అది సాధ్యమైతే ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఉండదు. భారీ ఎలివేటెడ్ కారిడార్.. ప్రధాన ట్రాఫిక్ శంషాబాద్ పట్టణం వద్దనే ఉంటున్నందున ఆ ప్రాంతం యావత్తు దాటేందుకు విశాలమైన 1.2 కి.మీ. మీటర్ల పొడవుండే ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. శంషాబాద్ కంటే ముందు మొదలయ్యే ఈ కారిడార్ ముందుకు సాగి విమానాశ్రయం మలుపు వద్ద రెండుగా చీలుతుంది. విమానాశ్రయంలోకి వెళ్లేందుకు ఎడమవైపు ఒక పాయ చీలి ఎయిర్‌పోర్డు రోడ్డుపై ల్యాండ్ అవుతుంది. ప్రధాన పాయ జాతీయ రహదారిపై ఓఆర్ఆర్ వంతెన కంటే ముందు ల్యాండ్ అవుతుంది. విమానాశ్రయం నుంచి వచ్చి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు ఈ వంతెన మీదకు చేరుకునేలా ఓ ర్యాంపును అనుసంధానిస్తారు. గడువు లోపు పూర్తి చేస్తాం విమానాశ్రయానికి ప్రధాన అనుసంధానం అవుతున్నందున ఈ రోడ్డు నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేస్తాం. అది అందుబాటులోకి వస్తే మెహిదీపట్నం నుంచి విమానాశ్రయానికి 20 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు. ఎక్కడా విమానాశ్రయ వాహనాలకు అడ్డంకి లేకుండా ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రహదారి రూపుదిద్దుకోనుంది – గణపతి రెడ్డి,ఈఎన్సీ జాతీయ రహదారులు -
నిర్లక్ష్యంతో నీరు వృధా.. కనెక్షన్ కట్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మెహిదీపట్నం జంక్షన్, బస్టాండు, రైతు బజార్, వాణిజ్య సముదాయాలలో తనిఖీలు చేశారు. మెహిదీపట్నం ప్రధాన కూడలిలో మురుగు నీరు రోడ్డుపై ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురవ్వడం పట్ల సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెహిదీపట్నం చౌరస్తా వద్ద బహుళ అంతస్తు భవనం నుండి నీరు రోడ్డుపైకి వృధాగా రావడాన్ని దాన కిషోర్ గమనించారు. నిర్లక్ష్యంగా నీటిని వృధా చేస్తూ, రోడ్డును పాడు చేసినందుకుగాను భారీగా జరిమానా విధించారు. అంతే కాకుండా నీటి కనెక్షన్‌ను తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్వాన్ రింగ్ రోడ్ నుండి జియాగూడ మీదుగా మూసీ నది పై ఉన్న ఆక్రమణలపై సర్వే నిర్వహించాల్సిందిగా జోనల్ కమిషనర్ ముషారఫ్‌ను దాన కిషోర్ ఆదేశించారు. -
గోడ కూలి ఇద్దరు కూలీల దుర్మరణం
మెహిదీపట్నం బోజగుట్టలో ఘటన హైదరాబాద్: నగరంలో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు గోడ కూలి దుర్మరణం పాలయ్యారు. ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై కుమారస్వామి వివరాలను మీడియాకు తెలిపారు. మహారాష్ట్ర, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన నాగేశ్(30), కృష్ణ (35) మెహిదీపట్నం బోజగుట్టలో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. అయోధ్యనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నం. 28 వద్ద ఓ భవన నిర్మాణ పనుల్లో ఉండగా, పక్కనున్న మరో భవనం ప్రహరీ వీరిపై కూలింది. ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. మృతులకు న్యాయం చేయాలంటూ మృతుల బంధువులు, ఇతర కార్మికులు బైఠాయించారు. ఏసీపీ గౌస్ మొహియుద్దీన్, డీఐ రాజరాజేశ్వర్ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదు పులోకి తీసుకొచ్చారు. భవన నిర్మాణంలో సెల్లార్, 6వ అంతస్తులను అనుమతి లేకుండా నిర్మిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో మృతదేహాలను తరలించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.6 లక్షల బీమాతో పాటు రూ. 30 వేల దహన సంస్కారాల ఖర్చును అందిస్తామని భవన నిర్మాణ కార్మిక సంఘం నగర అ«ధ్యక్షుడు పి.రామారావు తెలిపారు. -
అద్దె అడిగితే చంపేస్తా...
మెహిదీపట్నం: అద్దె చెల్లించమని అడిగిన పాపానికి ఇంటి యజమానిని చంపేస్తానని బెదిరించాడో వ్యక్తి. బాధితుడి ఫిర్యాదు మేరకు హుమాయూన్ నగర్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. ఇన్ స్పెక్టర్ సూరపల్లి రవీందర్ కథనం ప్రకారం...శాలిబండకు చెందిన మహ్మద్ తాఫీ అస్గర్ విజయనగర్‌కాలనీ ఆంధ్రాబ్యాంకు పక్కనే ఉన్న తన అపార్ట్మెంట్లోని ఓ గదిని మహ్మద్ అలీ ఇస్లామికి ఏడాది క్రితం అద్దెకిచ్చాడు. నాలుగు నెలలుగా ఇస్లామి అద్దె చెల్లించకపోగా రూ.10 లక్షలు ఇస్తేనే గది ఖాళీ చేస్తా, లేకపోతే చంపేస్తానని ఇంటి యజమానిని బెదిరించాడు. భయాందోళనకు గురైన అస్గర్ హుమాయూన్ నగర్ పోలీసులకు ఇస్లామిపై ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసిన పోలీసులు ఇస్లామిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
మెహిదీపట్నం... పోరు రసవత్తరం!
* బరిలో మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ * గెలుపుకోసం టీఆర్ఎస్ పోరాటం * రెండోసారి విజేతగా నిలిచేందుకు బీజేపీ ఆరాటం మెహిదీపట్నం: మెహిదీపట్నం డివిజన్లో ఎన్నికల పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడి నుంచి ఎంఐఎం అభ్యర్థిగా మాజీ మేయర్ మాజిద్ రంగంలో ఉన్నారు. ఎలాగైనా గెలుపు సాధించి తన రాజకీయ భవిష్యత్తును పదిలం చేసుకోవాలని ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక రెండవసారి గెలిచేందుకు బీజేపీ, ఎలాగైనా పాగా వేయాలని టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా పట్టుదలతో ముందుకు సాగుతుండడంతో ఎన్నికల వేడి పుంజుకుంది. బలమైన క్యాడర్..టీడీపీ అండదండలతో విజయం సాధించడానికి బీజేపీ అభ్యర్థి భుజేందర్‌కుమార్ ప్రయత్నిస్తున్నారు. సంక్షేమ పథకాలు, సెంటిమెంట్, కేసీఆర్ ఇమేజ్‌తో ప్రజల మధ్యకు వె ళ్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి అశోక్‌కుమార్ సైతం ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మెహిదీపట్నం డివిజన్లో పోరు రసవత్తరంగా మారింది. డివిజన్లో ప్రధాన సమస్యలివీ.... మెహిదీపట్నం డివిజన్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా తాగునీరు మురికిగా వస్తుండడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థతో పలు అవస్థలు ఎదురవుతున్నాయి. రాత్రి వేళ వీధి దీపాలు వెలగకపోవడంతో మహిళలు తిరగలేని పరిస్థితి నెలకొంది. హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్ నుంచి రేతిబౌలి చౌరస్తా వరకు నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాజిద్ హుస్సేన్ - ఎంఐఎం ప్రచార సరళి: ప్రచారాన్ని ఆలస్యంగా ప్రారంభించి కొంత వెనుకంజలో ఉన్నారు. ఇంటింటి ప్రచారం ఇప్పటి వరకు నిర్వహించ లేదు. కేవలం మైక్‌ల ద్వారానే ప్రచారం చేస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. పోలింగ్ సమీపిస్తుండడంతో అభివృద్ధి నినాదంతో ముందుకు సాగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బలాలు(+): గతంలో మేయర్‌గా పని చేసిన అనుభవం, తన హయాంలో జరిగిన సీసీ రోడ్లు, పార్కుల అభివృద్ధి తదితర అంశాలు కలిసొచ్చే అవకాశం ఉంది. పార్టీకి బలమైన క్యాడర్ ఉండడం..అగ్రనేతల మద్దతు, ఓటు బ్యాంకు కూడా మాజిద్‌కు ప్లస్‌గా చెప్పొచ్చు. సెలైంట్‌గా దూసుకెళ్లి విజయాన్ని మూటకట్టుకోవాలని ఆయన భావిస్తున్నారు. బలహీనతలు(-): మేయర్‌గా ఉన్న సమయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నట్లు విమర్శలు రావడం. ఒకే వర్గానికి ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తున్నారనే అపవాదు మూటకట్టుకోవడం మాజిద్‌కు మైనస్ అనొచ్చు. వి.భుజేందర్‌కుమార్ - బీజేపీ ప్రచార సరళి: టికెట్ వస్తుందో రాదో అనే సందేహంతో ఉన్న భుజేందర్‌కుమార్...చివరి నిమిషంలో పార్టీ టికెట్ ఇవ్వడంతో పోటీకి సిద్ధమయ్యారు. ప్రచారాన్ని ప్రారంభించడంలో కొంత జాప్యం జరిగినా.... క్రమంగా ముమ్మరం చేస్తూ ముందుకు సాగుతున్నారు. టీడీపీ నేతల సహకారంతో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. బలాలు(+): గతంలో మెహిదీపట్నం డివిజన్ నుంచే కార్పొరేటర్‌గా ఉండడం, బీజేపీ, టీడీపీ పొత్తు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. స్థానికంగా నివాసం ఉంటూ ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి కావడం వల్ల ఒకింత బలం చేకూరే అవకాశముంది. బలహీనతలు(-): ప్రజలతో అంతగా సంబంధాలు లేవనే ప్రచారం ఉండడం మైనస్‌గా చెపొచ్చు. ఎన్నికలు దగ్గరపడుతున్నా అగ్రనాయకులు ప్రచారంలో పాల్గొనక పోవడం క్యాడర్‌ను నిరాశపరుస్తోంది. సి.అశోక్‌కుమార్ - టీఆర్ఎస్ ప్రచార సరళి: పార్టీలోకి ఆరునెలల ముందు వచ్చిన అశోక్‌కుమార్ మొదటి నుంచే టీఆర్ఎస్ పార్టీ ప్రథకాలను వివరిస్తూ ప్రచారం ప్రారంభించారు. ఉపముఖ్యమంత్రి, మంత్రులు సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి గడపగడపకు తిరుగుతూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. స్థానిక నేతలు, కార్యకర్తల సహకారం తీసుకుంటున్నారు. బలాలు(+): స్థానికంగా ఉండడం, తాత వెంకన్న పోలీస్ పటేల్‌గా పని చేసి మంచి పేరు కలిగి ఉండడం కలిసొచ్చే అంశం. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సహాయ సహకారాలు ఉండడం ప్లస్‌గా చెప్పొచ్చు. బలహీనతలు(-): కొత్తగా పార్టీలోకి వచ్చిన అశోక్‌కుమార్‌కు అధిష్టానం టికెట్ ఇవ్వడంతో సీనియర్ నాయకుల్లో అసంతృప్తి. రాజకీయ అనుభవం లేకపోవడం, నియోజకవర్గ ఇన్చార్జి హనుమంతరావు సహకారం లేకపోవడం, ప్రజా సమస్యలు అంతగా తెలవకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు. -
దంపతుల సజీవదహనం
- గుడిసెకు మంటలంటుకొని ఘటన - మృతులు పాలమూరుజిల్లా వాసులు మెహిదీపట్నం: పొట్టకూటి కోసం నగరానికి వచ్చిన దంపతులు అనుమానాస్పద స్థితిలో మంటలంటుకొని మృతి చెందారు. భర్త సజీవదహనం కాగా... ఆసుపత్రికి తరలించేలోపే భార్య మృతి చెందింది. ఈ విషాద ఘటన బుధవారం అర్ధరాత్రి హుమయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మల్లేపల్లి రవీంద్రభారతి పాఠశాల పక్కన ఖాదర్‌పాషా అనే వ్యక్తి ఇంటిని నిర్మిస్తున్నాడు. ఈ ఇంటి నిర్మాణ పనులు చేసేందుకు కొద్ది రోజుల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలానికి..... చెందిన కుర్మయ్య (35), సుల్తానా (30) దంపతులు వచ్చారు. నిర్మాణంలో ఉన్న భవనంలోనే ఓ పక్కన గుడిసె వేసుకొని ఉంటున్నారు. కాగా బుధవారం అర్ధరాత్రి కుర్మయ్య, సుల్తానా ఉంటున్న గుడిసెకు మంటలంటుకున్నాయి. క్షణాల్లో గుడిసె మొత్తం మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకున్న కుర్మయ్య సజీవదహనం కాగా... తీవ్రగాయాలకు గురైన సుల్తానాను ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పివేసి మృతదేహాలకు పంచనామా నిర్వహించారు. ఇన్స్పెక్టర్ రవీందర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై ఆరా తీశారు. గుడిసెకు మంటలు ఎలా అంటుకున్నాయి? మంటలు వస్తున్నా దంపతులు బయటకు ఎందుకు రాలేకపోయారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ చెప్పారు.