దంపతుల సజీవదహనం
- గుడిసెకు మంటలంటుకొని ఘటన
- మృతులు పాలమూరుజిల్లా వాసులు
మెహిదీపట్నం: పొట్టకూటి కోసం నగరానికి వచ్చిన దంపతులు అనుమానాస్పద స్థితిలో మంటలంటుకొని మృతి చెందారు. భర్త సజీవదహనం కాగా... ఆసుపత్రికి తరలించేలోపే భార్య మృతి చెందింది. ఈ విషాద ఘటన బుధవారం అర్ధరాత్రి హుమయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మల్లేపల్లి రవీంద్రభారతి పాఠశాల పక్కన ఖాదర్‌పాషా అనే వ్యక్తి ఇంటిని నిర్మిస్తున్నాడు. ఈ ఇంటి నిర్మాణ పనులు చేసేందుకు కొద్ది రోజుల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలానికి..... చెందిన కుర్మయ్య (35), సుల్తానా (30) దంపతులు వచ్చారు. నిర్మాణంలో ఉన్న భవనంలోనే ఓ పక్కన గుడిసె వేసుకొని ఉంటున్నారు. కాగా బుధవారం అర్ధరాత్రి కుర్మయ్య, సుల్తానా ఉంటున్న గుడిసెకు మంటలంటుకున్నాయి.
క్షణాల్లో గుడిసె మొత్తం మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకున్న కుర్మయ్య సజీవదహనం కాగా... తీవ్రగాయాలకు గురైన సుల్తానాను ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పివేసి మృతదేహాలకు పంచనామా నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్ రవీందర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై ఆరా తీశారు. గుడిసెకు మంటలు ఎలా అంటుకున్నాయి? మంటలు వస్తున్నా దంపతులు బయటకు ఎందుకు రాలేకపోయారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ చెప్పారు.