Hut residents
-
సమస్యలు ఫుల్.. సౌకర్యాలు నిల్
సాక్షి, సింగరాయకొండ(ప్రకాశం): అభివృద్ధి అనేది ఆ కాలనీలో బూతద్దం వేసి వెతికినా కనిపించదు. నాలుగు తాటాకులతో వేసిన చిన్న చిన్న పూరి గుడిసెలు, ఏళ్ల తరబడి పూడుపోయిన మురుగు కాలువలు, మంచినీటి కోసం కిలోమీటర్ దూరం ప్రయాణం..ఇదీ ఊళ్లపాలెం ఎస్టీ కాలనీ దుస్థితి. ఏళ్ల తరబడి కనీస వసతులు కరువై కాలనీవాసులు పడే ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. మౌలిక వసతులు మృగ్యం.. ఎస్టీ కాలనీలో సుమారు 100 వరకు పక్కా గృహాలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా ఎస్టీలు పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు. వీరికి చదువు లేకపోవడంతో పాటు ప్రజాసాధికారిక సర్వేలో నమోదు కాక ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరడం లేదు. వీరు కూలినాలి చేసుకుని జీవిస్తుంటారు. తాగునీటికి తిప్పలు కాలనీవాసులు తీవ్ర తాగునీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తాగునీటికి సుమారు అరకిలోమీటర్ దూరంలోని కొత్తపాలెం ఎన్టీఆర్ సుజల వాటర్‌ప్లాంట్ నుంచి 20 లీటర్ల క్యాన్ రూ.5 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వాడుకనీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం నాలుగురోజులకు ఒకసారి మాత్రమే కుళాయిల ద్వారా అరకొరగా నీటిని సరఫరా చేస్తున్నారు. పంచాయతీల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా కాలనీకి మాత్రం ట్యాంకర్లు సక్రమంగా రావడంలేదని కాలనీవాసులు వాపోతున్నారు. కాలనీలోని మురుగుకాలువలను ఏళ్ల తరబడి పూడిక తీయలేదు. దీంతో మురుగునీరు పారే అవకాశం లేకుండా పోయింది. పూరి గుడిసెలే శరణ్యం.. బేస్మెంట్ దశలో నిలిచిపోయిన పక్కా గృహం కాలనీవాసులకు గతంలో సునామీ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పక్కా గృహాలు నిర్మించారు. ఇంకా చాలా మంది నేటికి పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. ఇటీవల సుమారు 30 మందికి ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద పక్కా గృహాలు మంజూరయ్యాయి. ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.2.25 లక్షల ఆర్థిక సహాయం చేస్తోంది. అయితే వీరికి ఇళ్లు కట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వీరికి ఇళ్లు కట్టిస్తానని ముందుకు వచ్చి కొంతమందికి పునాదుల కోసం గుంటలు తవ్వి వదిలేయగా, మరి కొంతమందికి బేస్మెంటు వేసి వదిలేశారు. అదేమంటే ఇటుకరాయి కావాలి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, అంతమొత్తం ఇచ్చుకునే స్థోమత లేకపోవడంతో ఇళ్ల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయిందని కాలనీవాసులు వాపోయారు. మరి కొంతమంది అయితే నివాసముంటున్న పూరి గుడిసె పూర్తిగా దెబ్బతినడంతో గత్యంతరం లేక స్వచ్ఛభారత్ కింద నిర్మించిన మరుగుదొడ్లలో నివాసం ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలోనూ సమస్యలే కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాల విద్యార్థులు వాడుకనీటి కోసం నాలుగురోజులకు ఒకసారి వచ్చే రక్షితమంచినీటి పథకం కుళాయిలపైనే ఆధారపడుతున్నారు. పాఠశాలలో బోరు మరమ్మతులకు గురైనా పట్టించుకునే వారే కరువయ్యారు. మరుగుదొడ్లు కూడా అధ్వాన్నంగా ఉన్నాయి. దీంతో విద్యార్థులు ఆరుబయటే మూత్ర విసర్జన చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇబ్బందులు తీర్చి కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
దంపతుల సజీవదహనం
- గుడిసెకు మంటలంటుకొని ఘటన - మృతులు పాలమూరుజిల్లా వాసులు మెహిదీపట్నం: పొట్టకూటి కోసం నగరానికి వచ్చిన దంపతులు అనుమానాస్పద స్థితిలో మంటలంటుకొని మృతి చెందారు. భర్త సజీవదహనం కాగా... ఆసుపత్రికి తరలించేలోపే భార్య మృతి చెందింది. ఈ విషాద ఘటన బుధవారం అర్ధరాత్రి హుమయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మల్లేపల్లి రవీంద్రభారతి పాఠశాల పక్కన ఖాదర్‌పాషా అనే వ్యక్తి ఇంటిని నిర్మిస్తున్నాడు. ఈ ఇంటి నిర్మాణ పనులు చేసేందుకు కొద్ది రోజుల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలానికి..... చెందిన కుర్మయ్య (35), సుల్తానా (30) దంపతులు వచ్చారు. నిర్మాణంలో ఉన్న భవనంలోనే ఓ పక్కన గుడిసె వేసుకొని ఉంటున్నారు. కాగా బుధవారం అర్ధరాత్రి కుర్మయ్య, సుల్తానా ఉంటున్న గుడిసెకు మంటలంటుకున్నాయి. క్షణాల్లో గుడిసె మొత్తం మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకున్న కుర్మయ్య సజీవదహనం కాగా... తీవ్రగాయాలకు గురైన సుల్తానాను ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పివేసి మృతదేహాలకు పంచనామా నిర్వహించారు. ఇన్స్పెక్టర్ రవీందర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై ఆరా తీశారు. గుడిసెకు మంటలు ఎలా అంటుకున్నాయి? మంటలు వస్తున్నా దంపతులు బయటకు ఎందుకు రాలేకపోయారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ చెప్పారు. -
ఖాళీ చేస్తారా.. చేయించమంటారా..!
⇒ గుడిసె వాసులకు ఏడీఎం హెచ్చరిక ⇒ రెండు రోజుల్లో నోటీసులు జారీ చేస్తాం: జోగిపేట తహశీల్దార్ ⇒ సాక్షి కథనంతో కదిలిన అధికారులు జోగిపేట: మార్కెట్ కార్యాలయ ఆవరణను ఖాళీ చేస్తారా..ఖాళీ చేయించమంటారా.. అంటూ జిల్లా మార్కెటింగ్ శాఖ ఏడీఎం హమీద్ బుధవారం గుడిసె వాసులను హెచ్చరించారు. ఈనెల 23న ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘మార్కెట్ దుకాణాలకు మోక్షమెప్పుడో’ అన్న శీర్షికన వార్త ప్రచురితం కావడంతో జిల్లా మార్కెటింగ్ అధికారులు బుధవారం జోగిపేటకు పరుగులు తీశారు. వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో ఉన్న గుడిసె వాసుల వద్దకు అధికారులు వెళ్లి ఇంటి యజమాని పేర్లు రాసుకొని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో వారు 40 ఏళ్లకుపైగా తాము ఇక్కడే నివాసముంటున్నామని, ప్రభుత్వం తమకు ఇప్పటి వరకు ఎలాంటి స్థలాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ అధికారులు అవేమీ పట్టించుకోకుండా హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక తహశీల్దార్ నాగేశ్వరరావు, నగర పంచాయతీ కమిషనర్ ప్రభాకర్, మార్కెట్ కార్యదర్శి నాగేశ్వరరావు, జహీరాబాద్ మార్కెట్ కార్యదర్శి శివరామశాస్త్రితో కలిసి ఏడీఎం సమావేశమయ్యారు. టెండర్లు నిర్వహించిన ఏడాది పూర్తయినా గుడిసెలను తొలగించకపోవడంపై మంత్రి తమను పలుమార్లు ప్రశ్నించారన్నారు. ఈ విషయమై స్పందించిన తహశీల్దార్ నాగేశ్వరరావు తాను గుడిసెల్లో నివాసముంటున్న వారందరికి నోటీసులు జారీ చేస్తానని సూచించారు. సకాలంలో ఖాళీ చేయనట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని సూచించారు.