సమస్యలు ఫుల్‌.. సౌకర్యాలు నిల్‌ | problems in the vullapalem village, Singarayakonda | Sakshi
Sakshi News home page

సమస్యలు ఫుల్‌.. సౌకర్యాలు నిల్‌

Published Sun, Mar 10 2019 9:45 AM | Last Updated on Sun, Mar 10 2019 9:45 AM

problems in the vullapalem village, Singarayakonda - Sakshi

మరుగుదొడ్లో నివాసం ఉంటున్న దృశ్యం

సాక్షి, సింగరాయకొండ(ప్రకాశం): అభివృద్ధి అనేది ఆ కాలనీలో బూతద్దం వేసి వెతికినా కనిపించదు. నాలుగు తాటాకులతో వేసిన చిన్న చిన్న పూరి గుడిసెలు, ఏళ్ల తరబడి పూడుపోయిన మురుగు కాలువలు, మంచినీటి కోసం కిలోమీటర్‌ దూరం ప్రయాణం..ఇదీ ఊళ్లపాలెం ఎస్టీ కాలనీ దుస్థితి. ఏళ్ల తరబడి కనీస వసతులు కరువై కాలనీవాసులు పడే ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు.

మౌలిక వసతులు మృగ్యం..

ఎస్టీ కాలనీలో సుమారు 100 వరకు పక్కా గృహాలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా ఎస్టీలు పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు. వీరికి చదువు లేకపోవడంతో పాటు ప్రజాసాధికారిక సర్వేలో నమోదు కాక ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరడం లేదు. వీరు కూలినాలి చేసుకుని జీవిస్తుంటారు.

తాగునీటికి తిప్పలు

కాలనీవాసులు తీవ్ర తాగునీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తాగునీటికి సుమారు అరకిలోమీటర్‌ దూరంలోని కొత్తపాలెం ఎన్టీఆర్‌ సుజల వాటర్‌ప్లాంట్‌ నుంచి 20 లీటర్ల క్యాన్‌ రూ.5 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వాడుకనీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం నాలుగురోజులకు ఒకసారి మాత్రమే కుళాయిల ద్వారా అరకొరగా నీటిని సరఫరా చేస్తున్నారు. పంచాయతీల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా కాలనీకి మాత్రం ట్యాంకర్లు సక్రమంగా రావడంలేదని కాలనీవాసులు వాపోతున్నారు. కాలనీలోని మురుగుకాలువలను ఏళ్ల తరబడి పూడిక తీయలేదు. దీంతో మురుగునీరు పారే అవకాశం లేకుండా పోయింది.

పూరి గుడిసెలే శరణ్యం..


బేస్‌మెంట్‌ దశలో నిలిచిపోయిన పక్కా గృహం 

కాలనీవాసులకు గతంలో సునామీ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పక్కా గృహాలు నిర్మించారు. ఇంకా చాలా మంది నేటికి పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. ఇటీవల సుమారు 30 మందికి ఎన్టీఆర్‌ హౌసింగ్‌  పథకం కింద పక్కా గృహాలు మంజూరయ్యాయి. ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.2.25 లక్షల ఆర్థిక సహాయం చేస్తోంది. అయితే వీరికి ఇళ్లు కట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వీరికి ఇళ్లు కట్టిస్తానని ముందుకు వచ్చి కొంతమందికి పునాదుల కోసం గుంటలు తవ్వి వదిలేయగా, మరి కొంతమందికి బేస్‌మెంటు వేసి వదిలేశారు. అదేమంటే ఇటుకరాయి కావాలి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని, అంతమొత్తం ఇచ్చుకునే స్థోమత లేకపోవడంతో ఇళ్ల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయిందని కాలనీవాసులు వాపోయారు. మరి కొంతమంది అయితే నివాసముంటున్న పూరి గుడిసె పూర్తిగా దెబ్బతినడంతో గత్యంతరం లేక స్వచ్ఛభారత్‌ కింద నిర్మించిన మరుగుదొడ్లలో నివాసం ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

పాఠశాలలోనూ సమస్యలే

కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాల విద్యార్థులు వాడుకనీటి కోసం నాలుగురోజులకు ఒకసారి వచ్చే రక్షితమంచినీటి పథకం కుళాయిలపైనే ఆధారపడుతున్నారు. పాఠశాలలో బోరు మరమ్మతులకు గురైనా పట్టించుకునే వారే కరువయ్యారు. మరుగుదొడ్లు కూడా అధ్వాన్నంగా ఉన్నాయి. దీంతో విద్యార్థులు ఆరుబయటే మూత్ర విసర్జన చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇబ్బందులు తీర్చి కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

పూడిపోయిన మురుగుకాలువ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement