పెద్దారవీడు మండలం సానికవరంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్‌డబ్లు్యఎస్ డీఈ యల్లయ్యను చుట్టుముట్టిన మహిళలు (ఫైల్)
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : నాగార్జునసాగర్‌లో నీరు ఉన్నా.. ఆయకట్టుకు సక్రమంగా సాగునీరు అందించని ప్రభుత్వం కనీసం వేసవిలో తాగునీరు అయినా అందిస్తుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పశ్చిమ ప్రకాశం పరిధిలోని యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, కొండపి, కందుకూరు ప్రాంతాల్లో ఇప్పటికే తాగునీటి కష్టాలు తీవ్రరూపం దాల్చగా సాగర్ కుడికాలువ పరిధిలోని ప్రాంతంలోనూ సాగుతో పాటు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. సాగర్‌లో నీరున్నా ప్రభుత్వం తగినంతగా విడుదల చేయకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జిల్లాలోని రామతీర్థం ప్రాజెక్టుతో పాటు 228 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులలో నీరు లేదు. తక్షణం వీటిని నింపితేనే కనీసం కొంత ప్రాంతానికైనా తాగునీరు అందే అవకాశం ఉంది. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తక్షణం నీటి విడుదలకు కృషి చేయాల్సి ఉంది.
జిల్లా వ్యాప్తంగా వేలాది గ్రామాల్లో ఇప్పటికే నీరు దొరికే పరిస్థితి లేదు. ప్రజలు ట్యాంకర్ల ద్వారా నిత్యావసరాలతో పాటు క్యాన్‌ల ద్వారా తాగునీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. వర్షాకాలంలోనూ నీటి కష్టాలు తప్పలేదు. వేసవి వస్తుండడంతో నీటి ఇబ్బందులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నా మొక్కుబడిగా మాత్రమే ఇస్తున్నారు. ఒక్కో గ్రామంలో ఒకటి లేదా రెండు ట్యాంకర్ల నీటిని మాత్రమే ఇస్తుండడంతో అవి ఏమూలకు సరిపోవడం లేదు. నీటి సరఫరా పేరుతో జరుగుతున్న అక్రమాలే అధికంగా ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో ఉన్న తాగునీటి పథకాలు నిరుపయోగంగా మారినట్లు అధికారులు చెబుతున్నారు. అక్కడక్కడా ఉన్న రైతుల బోర్ల నుంచి ప్రజలకు తాగునీటిని అందించాల్సిన పరిస్థితి నెలకొంది. వేసవిలో ఇది మరింత ఆందోళన కరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు నాగార్జునసాగర్ కుడి కాలువ పరివాహక ప్రాంతంలోనూ నీటి కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే జిల్లాలోని 228 సమ్మర్ ట్యాంకుల్లో నీరు అడుగంటింది. సత్వరం చెరువులు సాగర్ జలాలతోనింపితేనే ప్రజలు తాగునీరు అందే పరిస్థితి ఉంటుంది. ఈ ఏడాది ఎగువన వర్షాలతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నీటితో నిండాయి. సాగర్‌కు 582 అడుగుల మేర నీరు చేరింది. దీంతో వరితోపాటు ఆరుతడి పంటలకు నీటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం సైతం ప్రకటించింది. వరిసాగు చేసుకోవాలని రైతులను ఆదేశించింది. ఏడాది ప్రారంభంలోనే రెండు పెద్ద ప్రాజెక్టులకు నీరు చేరడంతో తాగునీటికి ఇబ్బందులు ఉండవని అందరూ ఆశించారు. అయితే ప్రభుత్వం సాగర్ ఆయకట్టులో సగం ఆయకట్టుకు కూడా నీరివ్వక చేతులెత్తేసింది. ఇక తాగునీటిని కూడా పూర్తి స్థాయిలో జిల్లాకిచ్చే పరిస్థితులు కానరావడం లేదు.
తాగునీటి కోసం 10 టీఎంసీలకు ప్రతిపాదన..
రామతీర్థం ప్రాజెక్టు ఇప్పటికే దాదాపు వట్టిపోయింది. 1.5 టీఎంసీల నీటిని రామతీర్థంలో నింపితేనే ఒంగోలు నగరంతో పాటు కందుకూరు, కొండపి ప్రాంతాలకు తాగునీరు అందే అవకాశం ఉంటుంది. దీంతో పాటు అద్దంకి బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 128 చెరువులను యర్రగొండపాలెం, దర్శి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండపి నియోజకవర్గాల పరిధిలోని 100 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు మొత్తం 228 ట్యాంకులను నీటితో నింపాల్సి ఉంది. ఇందుకోసం కనీసం 4.5 టీఎంసీల నీరు అవసరమని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు వారు ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చారు. గురువారం రాత్రికే బుగ్గవాగు నుంచి నీటిని విడుదల చేస్తే ఈనెల 19 శనివారం నాటికి జిల్లా సరిహద్దు 85/3 మైలు వద్దకు నీరు చేరుకుటుందన్నది అధికారుల అంచనా. అదే సమయంలో అటు ఏబీసీ పరిధిలోని పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లోని చెరువులను నీటితో నింపాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రధాన కాలువ నుంచి జిల్లాకు నీరు చేరిన వెంటనే తొలుత రామతీర్థం ప్రాజెక్టులో కనీసం 1.3 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాలని అధికారులు భావిస్తున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలో తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీరు కావాలని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈమేరకు కనీసం 10 టీఎంసీల నీటిని సాగర్ నుంచి కుడి కాలువకు విడుదల చేయాల్సి ఉంది. ఇది జిల్లాకు ఎప్పటికి చేరుతుందన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది.
నిండుకున్న ఎస్.ఎస్.ట్యాంకులు..
ఒంగోలు నగరంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లోనూ నీరు అడుగంటింది. తక్షణం రామతీర్థం రిజర్వాయర్ ద్వారా ఇక్కడికి నీటిని తరలించాల్సి ఉంది. అలా అయితే ప్రజల దాహార్తి తీర్చే అవకాశం ఉంటుంది. మరో వైపు కుడి కాలువ పరిధిలో రైతులు సాగు చేసిన వరి, మిరప, సువాబుల్, జామాయిల్ ఇతర పంటలు సక్రమంగా నీరు అందక ఎండి పోతున్నాయి. దిగువకు తాగునీటి అవసరాల కోసం సాగర్ జలాలను విడుదల చేస్తే రైతులు ఆనీటిని పంటలకు మల్లించే అవకాశం లేకపోలేదు. ఇదే సమయంలో ఇటు ప్రజల దాహార్తిని తీర్చాల్సిన అవసరం ఉంది. సాగర్‌లో ఈ ఏడాది తగినంతగా నీరు చేరింది. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, అధికారులు ముందు జాగ్రత్త వహించి ఇప్పటికే రామతీర్థంతో పాటు ట్యాంకులను నీటితో నింపాల్సి ఉంది. కాని ఆదిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడేమో ప్రభుత్వం ఎగువన నీరు లేదంటూ అడ్డంకులు పెడుతోంది. తక్షణం నీరు ఇవ్వక పోతే సాగైన పంటలు ఎండిపోవడంతో పాటు ఇటు ప్రజలకు తాగునీరు అందక మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఒట్టిమాటలతో ప్రజలను మభ్యపెట్టకుండా ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టి జిల్లాకు తగినంత నీటిని విడుదల చేయించేందుకు కృషి చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment