summer storage tank
-
వేసవిలోనూ పుష్కలంగా తాగునీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే జూన్ నెలాఖరు వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తి కావచ్చిన మంచినీటి పథకాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని స్పష్టంచేశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని ఆదేశించారు. తాగునీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వేసవి నీటి ఎద్దడిని అధిగమించేందుకు రూ.115 కోట్ల అంచనాతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. బోర్‌వెల్స్ సహా ఇతర తాగునీటి వనరులన్నీ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి ఎద్దడి గల ఆవాసాలు, శివారు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా ప్రతి రోజూ తాగునీరు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కుళాయిల ద్వారా రోజుకొకసారి తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. ఎక్కడైనా మంచినీటికి ఇబ్బంది కలిగితే 1904 కాల్‌సెంటర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. పశువులకు కూడా తాగునీటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రైవేట్ బోరులను అద్దెకు తీసుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న బోరులను మరింత లోతు చేయడం.. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపడం వంటి పనులు చేస్తున్నట్లు చెప్పారు. నీటి ఎద్దడి ఉన్న 1,354 ఆవాసాలకు జూన్ వరకూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయగా.. ఈనెలలో 109 ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు అనుమతి మంజూరు చేశామని తెలిపారు. మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ శ్రీకేశ్ బాలాజీరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం 47 పట్టణ స్థానిక సంస్థల్లో రోజుకు ఒకసారి, 29 యూఎల్బీల్లో రోజుకు 2సార్లు, 43 చోట్ల 2 రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. కడప, పెనుగొండ, ఒంగోలు, హిందూపురంలో మూడు రోజులకు ఒకసారి మంచినీటి సరఫరా చేస్తున్నామని.. ఇక్కడ పరిస్థితిని మెరుగుపరిచేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు ఎస్ఎస్ రావత్, కేవీవీ సత్యనారాయణ, ఆర్వీ కృష్ణారెడ్డి, ఆనందరావు పాల్గొన్నారు. -
పంటలు, గొంతులు ఎండుతున్నాయ్!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : నాగార్జునసాగర్‌లో నీరు ఉన్నా.. ఆయకట్టుకు సక్రమంగా సాగునీరు అందించని ప్రభుత్వం కనీసం వేసవిలో తాగునీరు అయినా అందిస్తుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పశ్చిమ ప్రకాశం పరిధిలోని యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, కొండపి, కందుకూరు ప్రాంతాల్లో ఇప్పటికే తాగునీటి కష్టాలు తీవ్రరూపం దాల్చగా సాగర్ కుడికాలువ పరిధిలోని ప్రాంతంలోనూ సాగుతో పాటు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. సాగర్‌లో నీరున్నా ప్రభుత్వం తగినంతగా విడుదల చేయకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జిల్లాలోని రామతీర్థం ప్రాజెక్టుతో పాటు 228 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులలో నీరు లేదు. తక్షణం వీటిని నింపితేనే కనీసం కొంత ప్రాంతానికైనా తాగునీరు అందే అవకాశం ఉంది. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తక్షణం నీటి విడుదలకు కృషి చేయాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా వేలాది గ్రామాల్లో ఇప్పటికే నీరు దొరికే పరిస్థితి లేదు. ప్రజలు ట్యాంకర్ల ద్వారా నిత్యావసరాలతో పాటు క్యాన్ల ద్వారా తాగునీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. వర్షాకాలంలోనూ నీటి కష్టాలు తప్పలేదు. వేసవి వస్తుండడంతో నీటి ఇబ్బందులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నా మొక్కుబడిగా మాత్రమే ఇస్తున్నారు. ఒక్కో గ్రామంలో ఒకటి లేదా రెండు ట్యాంకర్ల నీటిని మాత్రమే ఇస్తుండడంతో అవి ఏమూలకు సరిపోవడం లేదు. నీటి సరఫరా పేరుతో జరుగుతున్న అక్రమాలే అధికంగా ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో ఉన్న తాగునీటి పథకాలు నిరుపయోగంగా మారినట్లు అధికారులు చెబుతున్నారు. అక్కడక్కడా ఉన్న రైతుల బోర్ల నుంచి ప్రజలకు తాగునీటిని అందించాల్సిన పరిస్థితి నెలకొంది. వేసవిలో ఇది మరింత ఆందోళన కరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు నాగార్జునసాగర్ కుడి కాలువ పరివాహక ప్రాంతంలోనూ నీటి కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే జిల్లాలోని 228 సమ్మర్ ట్యాంకుల్లో నీరు అడుగంటింది. సత్వరం చెరువులు సాగర్ జలాలతోనింపితేనే ప్రజలు తాగునీరు అందే పరిస్థితి ఉంటుంది. ఈ ఏడాది ఎగువన వర్షాలతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నీటితో నిండాయి. సాగర్‌కు 582 అడుగుల మేర నీరు చేరింది. దీంతో వరితోపాటు ఆరుతడి పంటలకు నీటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం సైతం ప్రకటించింది. వరిసాగు చేసుకోవాలని రైతులను ఆదేశించింది. ఏడాది ప్రారంభంలోనే రెండు పెద్ద ప్రాజెక్టులకు నీరు చేరడంతో తాగునీటికి ఇబ్బందులు ఉండవని అందరూ ఆశించారు. అయితే ప్రభుత్వం సాగర్ ఆయకట్టులో సగం ఆయకట్టుకు కూడా నీరివ్వక చేతులెత్తేసింది. ఇక తాగునీటిని కూడా పూర్తి స్థాయిలో జిల్లాకిచ్చే పరిస్థితులు కానరావడం లేదు. తాగునీటి కోసం 10 టీఎంసీలకు ప్రతిపాదన.. రామతీర్థం ప్రాజెక్టు ఇప్పటికే దాదాపు వట్టిపోయింది. 1.5 టీఎంసీల నీటిని రామతీర్థంలో నింపితేనే ఒంగోలు నగరంతో పాటు కందుకూరు, కొండపి ప్రాంతాలకు తాగునీరు అందే అవకాశం ఉంటుంది. దీంతో పాటు అద్దంకి బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 128 చెరువులను యర్రగొండపాలెం, దర్శి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండపి నియోజకవర్గాల పరిధిలోని 100 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు మొత్తం 228 ట్యాంకులను నీటితో నింపాల్సి ఉంది. ఇందుకోసం కనీసం 4.5 టీఎంసీల నీరు అవసరమని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు వారు ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చారు. గురువారం రాత్రికే బుగ్గవాగు నుంచి నీటిని విడుదల చేస్తే ఈనెల 19 శనివారం నాటికి జిల్లా సరిహద్దు 85/3 మైలు వద్దకు నీరు చేరుకుటుందన్నది అధికారుల అంచనా. అదే సమయంలో అటు ఏబీసీ పరిధిలోని పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లోని చెరువులను నీటితో నింపాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రధాన కాలువ నుంచి జిల్లాకు నీరు చేరిన వెంటనే తొలుత రామతీర్థం ప్రాజెక్టులో కనీసం 1.3 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాలని అధికారులు భావిస్తున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలో తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీరు కావాలని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈమేరకు కనీసం 10 టీఎంసీల నీటిని సాగర్ నుంచి కుడి కాలువకు విడుదల చేయాల్సి ఉంది. ఇది జిల్లాకు ఎప్పటికి చేరుతుందన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. నిండుకున్న ఎస్.ఎస్.ట్యాంకులు.. ఒంగోలు నగరంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లోనూ నీరు అడుగంటింది. తక్షణం రామతీర్థం రిజర్వాయర్ ద్వారా ఇక్కడికి నీటిని తరలించాల్సి ఉంది. అలా అయితే ప్రజల దాహార్తి తీర్చే అవకాశం ఉంటుంది. మరో వైపు కుడి కాలువ పరిధిలో రైతులు సాగు చేసిన వరి, మిరప, సువాబుల్, జామాయిల్ ఇతర పంటలు సక్రమంగా నీరు అందక ఎండి పోతున్నాయి. దిగువకు తాగునీటి అవసరాల కోసం సాగర్ జలాలను విడుదల చేస్తే రైతులు ఆనీటిని పంటలకు మల్లించే అవకాశం లేకపోలేదు. ఇదే సమయంలో ఇటు ప్రజల దాహార్తిని తీర్చాల్సిన అవసరం ఉంది. సాగర్‌లో ఈ ఏడాది తగినంతగా నీరు చేరింది. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, అధికారులు ముందు జాగ్రత్త వహించి ఇప్పటికే రామతీర్థంతో పాటు ట్యాంకులను నీటితో నింపాల్సి ఉంది. కాని ఆదిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడేమో ప్రభుత్వం ఎగువన నీరు లేదంటూ అడ్డంకులు పెడుతోంది. తక్షణం నీరు ఇవ్వక పోతే సాగైన పంటలు ఎండిపోవడంతో పాటు ఇటు ప్రజలకు తాగునీరు అందక మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఒట్టిమాటలతో ప్రజలను మభ్యపెట్టకుండా ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టి జిల్లాకు తగినంత నీటిని విడుదల చేయించేందుకు కృషి చేయాలి. -
అయ్యో పాపం!
గుంతకల్లు టౌన్ / అనంతపురం సిటీ: వారిప్పుడే ఈ లోకంలోకి వచ్చారు. భావవ్యక్తీకరణకు భాష తెలియని అమాయకులు. కుటుంబ సభ్యులకు ఏ కష్టమొచ్చిందో గానీ అభం శుభం తెలియని ఆ శిశువులను బయట పడేశారు. ఒక శిశువు సజీవంగా లభ్యమైతే, మరొక శిశువు చనిపోయి ఉంది. అయ్యో పాపం అన్పించే ఈ ఘటనలు సోమవారం అనంతపురం జిల్లాలో వేర్వేరు చోట్ల వెలుగు చూశాయి. వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు పట్టణ శివారులోని సమ్మర్‌స్టోరేజీ ట్యాంక్ పంప్‌హౌస్ ఎదురుగా ఉన్న ముళ్లపొదల్లో నుంచి పసికందు ఏడ్పును అక్కడికెళ్లిన ముగ్గురు బాలురు భరత్, రాజశేఖర్, రాజు విన్నారు. వెళ్లి చూడగా పసికందును ఓ టవల్లో చుట్టి పడేసి ఉండడం కన్పించింది. తలపైభాగంలో చీమలు కరిచి చిన్న గాయాలయ్యాయి. వెంటనే వారు 100కి డయల్ చేశారు. గుంతకల్లు వన్‌టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ఆడశిశువును 1098 చైల్డ్‌లైన్ సంస్థ మండల కోఆర్డినేటర్ బాలాజీకి అప్పగించారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పసికందును పరీక్షించిన చిన్నపిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ హరిప్రసాద్ ఆ పసికందుకు పుట్టుకతోనే మలవిసర్జన ప్రాంతంలో రంధ్రం లేదని, వెంటనే చిన్నపిల్లల సర్జన్‌తో ఆపరేషన్ చేయించాల్సి ఉంటుందని తెలిపారు. తర్వాత అక్కడి నుంచి అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. శిశువు బొడ్డుకున్న క్లిప్‌ను చూస్తే ఎక్కడో హాస్పిటల్లోనే జన్మించినట్లు తెలుస్తోంది. అలాగే అనంతపురం సర్వజనాస్పత్రి గైనిక్ వార్డు సమీపంలోని నీళ్ల ట్యాంకు వద్ద ఉన్న క్యారీ బ్యాగులో మృత మగశిశువు లభ్యమైంది. ఈ విషయాన్ని రోగుల బంధువులు గమనించి ఔట్‌పోస్ట్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత శిశువును స్వాధీనం చేసుకున్నారు. కాగా.. మృత శిశువు లభించిన ప్రాంతంలో గుర్తుతెలియని మహిళకు కాన్పు చేసినట్లు తెలుస్తోంది. -
ఈతకెళ్లి యువకుడి మృతి
సంతోష్‌నగర్ దగ్గర ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో మునిగి మృత్యువాత పడ్డాడు. కర్నూలు : స్నేహితులతో కలసి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు ఎస్ఎస్ ట్యాంకులో మునిగి మృత్యువాత పడ్డాడు. బుధవారం కర్నూలు నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక బళ్లారి చౌరస్తా సమీపంలోని కృష్ణారెడ్డి నగర్లో నివాసముంటున్న నాగేశ్వరరెడ్డి కుమారుడు జగదీశ్వరరెడ్డి(20) స్నేహితులు ధను, సంతోష్, నానిలతో కలసి మంగళవారం మధ్యాహ్నం సంతోష్ నగర్ దగ్గర నున్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఈతకొట్టేందుకు వెళ్లారు. 3 గంటల సమయంలో జగదీశ్వర్‌రెడ్డి నీటిలో మునిగిపోవడంతో స్నేహితులు ఆందోళనకు గురై పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి 5 గంటల సమయంలో కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. వెంటనే సంఘటన స్థలం వద్దకు చేరుకుని గాలించారు. గట్టుపైన బట్టలు, చెప్పులు కనిపించాయి. చీకటి పడటంతో వెనుదిరిగి వచ్చారు. బుధవారం ఉదయం ఆత్మకూరు నుంచి గత ఈతగాళ్లను రప్పించి ఎస్ఎస్ ట్యాంకులో గాలింపు చర్యలు చేపట్టగా సాయంత్రం 5 గంటల సమయంలో వారు మృతదేహాన్ని వెలికి తీశారు. నాగేశ్వరరెడ్డి, జయమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, జగదీశ్వరరెడ్డి రెండవ కుమారుడు. ఇంటర్ వరకు చదువుకున్నాడు. హైదరబాదులో పెట్రోల్ బంకులో పనిచేస్తూ ఇటీవలే కర్నూలుకు వచ్చాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకునా్నరు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడా లేక స్నేహితులే నీటిలో ముంచారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పులివెందులకు తాగునీటి గండం
సాక్షి, కడప/పులివెందుల : నక్కలపల్లె ఎస్ఎస్ ట్యాంకు నీరులేక వెలవెలబోతోంది. దీంతో తాగునీటి ముప్పు ముంచుకొస్తోంది. వేసవితోపాటు ఇతర ఏ సందర్భంలోనూ పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించి ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడకూడదన్న మహాసంకల్పంతో దివంగత సీఎం వైఎస్సార్ ముందుచూపుగా నక్కలపల్లె వద్ద సమ్మర్ స్టోరేజీ ట్యాంకు (ఎస్ఎస్ ట్యాంకు) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ జీవించినంతకాలం సమ్మర్ స్టోరేజీకి నీరు తీసుకొచ్చి సమస్య లేకుండా చూస్తూ వచ్చారు. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ సర్కార్ సక్రమంగా నీరు విడుదల చేయకపోవడంతో పులివెందుల సమస్యల సుడిగుండంలో పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపధ్యంలో గత ఏడాది అన్నో ఇన్నో నీళ్లను నక్కలపల్లె సమీపంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో నీటి నిల్వ చేసినా, ప్రస్తుతకరువు పరిస్థితులలో పూర్తిగా ఎండిపోయింది. పులివెందులకు నీటి గండం ముంచుకొస్తోంది. పులివెందులకు ఎక్కిళ్లు.. నక్కలపల్లె వద్ద రూ. 40 కోట్లకు పైగా వెచ్చించి సమ్మర్ స్టోరేజీ ట్యాంకును నిర్మించారు. అయితే, ఈ ఏడాది 2014 జనవరి, ఫిబ్రవరి ప్రాంతంలో ఎస్ఎస్ ట్యాంకుకు సీబీఆర్ నుంచి నీరు తీసుకొచ్చి నిల్వ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పులివెందుల ప్రజలకు సంబంధించి ప్రతిరోజు అవసరమైన రూ. 10 లక్షలకు పైగా లీటర్ల నీటిని అందిస్తూ వచ్చారు. అయితే, వర్షాభావ పరిస్థితులకు తోడు విపరీతమైన ఎండలు కాస్తుండడంతో ఉన్న నీరు అయి పోయాయి. ప్రస్తుతం సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నీరు లేక ఎండిపోయి బీటలు వారింది. ప్రజలకు నీటిని ఎలా అందించాలన్న సమస్య అధికారుల్లో మొదలైంది. చివరకు పులివెందులలో అన్నో ఇన్నో బోర్లలో వస్తున్న నీళ్లు కూడా ఇప్పుడు రాకుండా పోతున్నాయి. బోర్లలో కూడా నీరు ఆవిరి కావడంతో పాలకవర్గం అనుమతితో మున్సిపాలిటీ అధికారులు కొత్త బోర్లను వేస్తున్నారు. నీరివ్వలేక చేతులు ఎత్తేసిన ఆర్‌డబ్ల్యుఎస్.. రెండు వారాల క్రితమే ఎస్ఎస్ ట్యాంకు ఎండిపోవడంతో తాత్కాలికంగా పులివెందుల ప్రజలకు నీరందించేందుకు మున్సిపల్‌శాఖ అధికారులు గ్రామీణ తాగునీటి విభాగం అధికారులతో మాట్లాడారు. రోజూ పది లక్షల లీటర్ల నీటిని మున్సిపాలిటీ ప్రజలకు ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ అందించేలా....పది లక్షల లీటర్ల నీటికి రూ. 6 వేలు చొప్పున అద్దె ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. అయితే, రెండుమూడు రోజులు నీటిని అందించిన ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ గ్రామాలకు నీటి సమస్య ఉత్పన్నం అవుతుందంటూ చేతులెత్తేసింది. దీంతో పులివెందుల మున్సిపాలిటీ అధికారులతో పాలకవర్గం మాట్లాడి ఉలిమెల్ల వద్ద బోర్లువేశారు. ఆశాజనకంగా బోర్లలో నీరు పడడంతో వారం, పదిరోజుల్లో కనెక్షన్ ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. 10 ట్యాంకులతో ప్రజలకు నీరు.. పులివెందుల మున్సిపాలిటీలో ప్రస్తుతం బోర్లు ఎండిపోవడంతో ఎస్ఎస్ ట్యాంకులో నీరు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులు ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం పది ట్యాంకర్లతో వీధులకు నీటిని సరఫరాచేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో మరికొన్ని ట్యాంకర్లను అదనంగా పెట్టి నీందించేందుకు కసరత్తు చేస్తున్నారు. పులివెందుల మున్సిపాలిటీలో 65 వేల పైచిలుకు జనాభా ఉండగా, రోజుకు 10 నుంచి 13 లక్షల లీటర్ల మేర నీటి అవసరం ముంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
కండకావరం
అధికార దర్పం పచ్చ కామెర్లుగా కప్పేస్తోంది ... అహంకారం తోడై కండకావరం పెరిగిపోతోంది ... మెజార్టీ లేకపోయినా ఇటీవల జరిగిన జెడ్పీ ఎన్నికల్లో అడ్డదార్లు తొక్కి నానా గడ్డి కరిచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసిన టీడీపీ మూకలు జిల్లా ప్రజల ముందు అభాసుపాలయ్యారు. ఆ విషయాన్ని జీర్ణించుకోలేని ఆ నేతలు, వారి అనుచరులు తాజాగా రామతీర్థం రిజర్వాయర్ వద్ద కిష్కింద కాండనే సృష్టించారు. తాగునీరు విడుదల విషయంలో కూడా స్థానిక ఎస్సీ ఎమ్మెల్యే సురేష్‌ను అడ్డుకుని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం నీటిని విడుదల చేయడాన్ని చూసిన వారు ఛీదరించుకున్నా..నవ్విపోదురు గాక మాకేంటంటూ ముందుకు సాగిపోయారు. పోలీసుల సమక్షంలో తోపులాట జరిగినా ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. ప్రొటోకాల్ ఉల్లంఘించిన నీటిపారుదల శాఖ అధికారులు మౌనవ్రతాన్నే పాటించారు. చీమకుర్తి: రామతీర్థం రిజర్వాయర్వద్ద ఒంగోలు సమ్మర్‌స్టోర్ ట్యాంక్‌లకు తాగునీటిని విడుదల చేసే కార్యక్రమం మంగళవారం ఏర్పాటు చేశారు. దీనికి ఇరిగేషన్ ఎస్ఈ స్థానిక ఎమ్మెల్యే సురేష్‌ను కూడా ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు వెళ్లిన ఎమ్మెల్యేను ‘ఇది మా కార్యక్రమమైతే మీరెందుకు వచ్చారంటూ’ తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇదే కార్యక్రమం కోసం ఒంగోలు నుంచి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, బీఎన్.విజయ్‌కుమార్ రానుండటం తో వారికోసం చీమకుర్తి మండల టీడీపీ కార్యకర్తలు ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో అక్కడకు వచ్చి న సురేష్‌ను రిజర్వాయర్ వద్దకు పోకుం డా టీడీపీ రౌడీ మూకలు అడ్డుకున్నాయి. ఈలోపు ఒంగోలు నుంచి వచ్చిన దామచర్ల, బలరాం, విజయ్‌కుమార్ నేరుగా రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. సురేష్‌కూడా తన కార్యకర్తలతో రిజర్వాయర్ వద్దకు వచ్చారు. ఈలోగా ఒంగోలు దామచర్ల సాగర్ జలాలను వదిలిపెట్టారు. రిజర్వాయర్ వద్దకు వెళ్తున్న సురేష్‌ను టీడీపీ కార్యకర్తలు మళ్లీ అడ్డుకున్నారు. అడ్డొచ్చిన ఎస్సైని, పోలీసులను కూడా నెట్టేశారు. దీంతో ఎమ్మెల్యే అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ తన నియోజకవర్గం పరిధిలో రామతీర్థం రిజ ర్వాయర్ ఉందని, దానికి సంబంధించిన జలాలను వదిలేందుకు నేను రాకూడదా..? ఎంత అన్యాయం అంటూ ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించారు. తనపై దాడిచేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమవడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమైనా ప్రైవేటు జాగీరా? ప్రొటోకాల్ నిబంధనలను తుంగలో తొక్కి దళిత ఎమ్మెల్యేనని కూడా చూడకుండా రిజర్వాయర్ వద్దకు రాకుండా దారుణంగా నెట్టేస్తారా..? మరీ ఇంత రాక్షసత్వంగా ప్రవర్తించటానికి ఇదేమైనా వారి ప్రైవేటు జాగీరా.....ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలిపెట్టు అంటూ సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న దానికి సంబంధించిన జలాలను వదిలేందుకు నేను రాకూడదా..? వేరే నియోజకవర్గాలలోని ప్రజాప్రతినిధులు వచ్చి నీటిని విడుదల చేయడమేమిటని ప్రశ్నించారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాల్సింది పోయి దౌర్జన్యానికి దిగిన వారికి అండగా నిలవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కి.. ఇరిగేషన్ అధికారులు కూడా ప్రోటోకాల్ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారు. కలెక్టర్ ఆదేశా ల మేరకు సాగర్ జలాలను తాగునీటి అవసరాల నిమిత్తం వదలమని చెప్పారు. స్ధానిక ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ను, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను, ఎస్ఈ కోటేశ్వరరావు, ఈఈ వరలక్ష్మి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కానీ నీళ్లు వదిలే సమయంలో మాత్రం స్థానిక ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొనకుండానే ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్‌తో కలిసి ఎస్ఈ నీళ్లను వదిలేశారు. పైగా ఏ ప్రొటోకాల్ వర్తించని బలరాం, విజయ్‌కుమార్ కూడా అధికారికంగా పాల్గొన్నారు. ప్రొటోకాల్ నిబంధనలను తుంగలో తొక్కి ఇరిగేషన్ ఎస్ఈ కోటేశ్వరరావు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. సమ్మర్‌స్టోరేజి ట్యాంక్‌లకు సాగర్ జలాలు రామతీర్థం నుంచి తాగునీటి అవసరాల కోసం 200 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు ఈఈ వరలక్ష్మి తెలిపారు. ఈ నీటితో ఒంగోలు, చీమకుర్తిలోని సమ్మర్ స్టోరేజి ట్యాంక్‌లను నింపుతారన్నారు. సారీ అన్నా..కాలువపై ఒంటరిగా తిరిగేవాడిని..! నీటి విడుదల కార్యక్రమం పూర్తయి టీడీపీ నాయకులు వెళ్లిపోయాక..ఆదిమూలపు సురేష్ వద్దకు వచ్చిన ఎస్ఈ ‘సారీ అన్నా.. నేను ఎన్ఎస్పీ కాలువ కట్టల మీద ఒంటరిగా తిరిగేవాడిని..నన్ను వదిలేయండి..’ అంటూ సురేష్ చేతులు పట్టుకున్నారు. అంతేనా మీడియా ముందుకొచ్చి..నాకు ప్రొటోకాల్ నిబంధనలు తెలియవండీ..అంటూ అమాయకంగా బదులిచ్చారు. పోలీసులు కూడా ఇదే తీరున వ్యవహరించారు. స్థానిక ఎమ్మెల్యేకి రక్షణ కల్పించాల్సిన పోలీసులు వేరే నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించడంలో స్వామి భక్తి చాటుకున్నారు. అంతా అయిపోయాక..సీఐ, ఎస్సైలు దళితుడైన స్థానిక ఎమ్మెల్యే సురేష్ వద్దకు వచ్చి ‘ఎవరో ఒకరు సర్దుకుపోవాలి గదా సార్’ అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. -
మంచినీళ్లో రామచంద్ర..!
మార్కాపురం, న్యూస్‌లైన్ : మార్కాపురం మున్సిపాలిటీలో ఏ బ్లాక్‌లో చూసినా నీటి సమస్య తాండవిస్తోంది. మిగిలిన రోజుల్లో పరిస్థితి ఎలాగున్నా..వేసవి కాలంలో మాత్రం పట్టణ ప్రజల గొంతెండక తప్పడం లేదు. బిందె నీటి కోసం నానాతంటాలు పడాల్సి వస్తోంది. స్థానికులకు సక్రమంగా మంచినీరు సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన దూపాడు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులోని సాగర్‌నీరు గతేడాది పూర్తిగా అడుగంటింది. దీంతో గతంలో మూడు రోజులకోసారి సరఫరా చేసే సాగర్‌నీటిని ప్రస్తుతం ఐదు రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. శివారు కాలనీలకు పైపులైన్లు సక్రమంగా లేకపోవడంతో సాగర్‌నీటి సరఫరా కలగానే మిగిలింది. ఆయా కాలనీలకు ట్యాంకర్ల ద్వారా వచ్చే నీరే దిక్కయింది. ఆ ట్యాంకర్లు కూడా ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. వాటి వద్ద నీరు పట్టుకునేందుకు మహిళలు పోటీపడే నేపథ్యంలో నిత్యం ఘర్షణలు సర్వసాధారణమయ్యాయి. ప్రధాన కాలనీలకు సైతం అరకొరగానే సాగర్ నీరు అందుతోంది. మున్సిపాలిటీలో 32 వార్డులుండగా, అధికారికంగా 17,464 నివాస గృహాలు, 71,092 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. 29 మురికివాడల్లో 29,173 మంది నివసిస్తున్నారు. ఒక్కొక్కరికి రోజుకు సుమారు 70 లీటర్ల నీరు అవసరం. కానీ, ప్రస్తుతం 40 నుంచి 50 లీటర్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. 24 వార్డుల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. వేసవి ప్రారంభానికి ముందే నీటివెతలు మొదలవడంతో వేసవిలో ఇంకెలా ఉంటుందోనని పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాలుగు నెలల నుంచి వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే శివారు ప్రాంతాల్లోని డీప్‌బోర్లు సైతం పనిచేయడం లేదు. మున్సిపాలిటీలో సుమారు 165 డీప్బోర్లుండగా, వాటిలో 80 నుంచి 85 మాత్రమే పనిచేస్తున్నాయి. 25 మినీ వాటర్ ట్యాంకులుండగా 10 నుంచి 12 మాత్రమే వాడుకలో ఉన్నాయి. పూలసుబ్బయ్యకాలనీ, ఎస్సీబీసీకాలనీ, బాపూజీకాలనీ, భగత్‌సింగ్‌కాలనీ, చెన్నరాయునిపల్లె, విద్యానగర్, కరెంట్ ఆఫీస్కాలనీ, నాగులవరం రోడ్డు, ఒంటెద్దుబండ్లకాలనీ, నానాజాతుల పేట, ఏకలవ్యకాలనీ, రాజ్యలక్ష్మీనగర్, సుందరయ్య కాలనీల్లో తీవ్ర నీటి కొరత నెలకొంది. 28, 29 బ్లాకుల్లో దాహంతో ప్రజలు అల్లాడుతున్నారు. పొలాల్లో నుంచి తోపుడు బండ్లు, సైకిళ్లపై నీరు తెచ్చుకుంటూ అవస్థపడుతున్నారు. సుమారు 350 నుంచి 400 అడుగుల లోతులో వేసిన బోర్లలో సైతం నీరు రాకపోవడంతో ప్రజలతో పాటు సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. కనిగిరిలో కన్నీటి గాథ కనిగిరి, న్యూస్‌లైన్ : కనిగిరి అనగానే ప్రధానంగా నీటి సమస్య గుర్తొస్తుంది. కనిగిరి మేజర్ పంచాయతీని నగర పంచాయతీగా మార్చేందుకు చుట్టుపక్కలున్న కాశీపురం, మాచవరం, శంఖవరం పంచాయతీలను విలీనం చేశారు. ప్రస్తుతం కనిగిరి నగర పంచాయతీలో 20 వార్డులు, 44,755 మంది జనాభా ఉన్నారు. అధికారికంగా 10,465 గృహాలు, 307 బోర్లు, 51 డీప్‌బోర్లు, 1,839 కుళాయిలు ఉన్నాయి. కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని సగం ప్రాంతాల్లో బోర్లలో నీరు పడవు. ఒకవేళ నీరు పడినా ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉంటుంది. అత్యధికంగా 5.1 పీపీఎం ఫ్లోరైడ్ శాతం ఇక్కడి నీటిలో ఉంటుంది. దీంతో ఇక్కడి ప్రజలకు సాగర్ నీటి సరఫరా తప్పనిసరి. 1992లో కనిగిరి పరిసరాల్లోని 18 గ్రామాల కోసం రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాంత ప్రజలకు ఫ్లోరైడ్ నీటి నుంచి విముక్తి కలిగించేందుకు 175 కోట్ల రూపాయలతో రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. కానీ, ఆయన మరణం తర్వాత సక్రమంగా నిధులు విడుదలగాక ఆ పథకం నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో నగర పంచాయతీలో ఇంటికో సాగర్‌నీటి కుళాయి కలగానే మిగిలింది. ట్యాంకర్లపై ఆధారపడి నీటి సమస్యతో ప్రజలు అల్లాడుతూనే ఉన్నారు. -
నీళ్లున్నా.. గొంతు తడవదు !
పీలేరు, న్యూస్‌లైన్: పీలేరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నప్పుడు ప్రజల తాగునీటి ఎద్దడిని శాశ్వత ప్రాతిపదికన తీర్చేందుకు రూ. 2.17 కోట్లతో పట్టణ శివార్లలోని కొత్తపల్లె మార్గంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించారు. పింఛా ఏటి నీటితో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను నింపి, ఆ నీటిని శుద్ధి చేసి పైప్‌లైన్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంక్‌లకు తరలించి, అక్కడి నుంచి ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేశారు. వర్షాభావ పరిస్థితులు నెలకొంటే సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు పింఛా ఏటిపై పీలేరు-సదుం మండలాల సరిహద్దు ప్రాంతంలోని బాలంవారిపల్లె సమీపంలో రూ.2 కోట్లతో గార్గేయ ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు నుంచి పైపులైన్ ద్వారా పీలేరు సమ్మర్స్టోరేజ్కి నీటిని తరలించి పట్టణ ప్రజలకు తాగునీరు, దాదాపు 5 వేల ఎకరాలకు కాలువల ద్వారా సాగునీరు అందించాలనేది ప్రధాన లక్ష్యం. నిర్మాణ పనులు పూర్తైఐదేళ్లు కావస్తున్నా ఆ దిశగా ఎలాంటి పురోగతి కానరాలేదు. మరోవైపు కాలువల నిర్మాణం కోసం భూసేకరణ గతంలోనే పూర్తైది. ఉన్నతమైన ఆశయంతో పెద్దిరెడ్డి పీలేరు తాగునీటి సమస్య తీవ్రతను దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డికి వివరించి సమ్మర్‌స్టోరేజ్, గార్గేయ ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తి చేశారు. దాదాపుగా తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని అం దరూ సంబరపడ్డారు. అనంతరం నియోజకవర్గాల పునర్విభజనతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరుకు వెళ్లడంతో ఆశయం కార్యరూపం దాల్చలేదు. మహానేత మరణానంతరం పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సమ్మర్ స్టోరేజ్‌కి నీటి తరలింపు కోసం చేస్తున్న ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ నీటి ఎద్దడితో ప్రజలు అలమటించాల్సి వస్తోంది. ఆరునెలల కిందట మంచినీటి సమస్య జఠిలంగా మారడంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో బోర్లు డ్రిల్ చేసినా అది ఫలప్రదం కాలేదు. దాహార్తి తీవ్రతను గుర్తించి రాజకీయాలకతీతంగా సమ్మర్ స్టోరేజ్‌కి ప్రాజెక్టు నుంచి పైప్‌లైన్ వేసి నీటిని తరలించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.