కండకావరం
అధికార దర్పం పచ్చ కామెర్లుగా కప్పేస్తోంది ... అహంకారం తోడై కండకావరం పెరిగిపోతోంది ... మెజార్టీ లేకపోయినా ఇటీవల జరిగిన జెడ్పీ ఎన్నికల్లో అడ్డదార్లు తొక్కి నానా గడ్డి కరిచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసిన టీడీపీ మూకలు జిల్లా ప్రజల ముందు అభాసుపాలయ్యారు. ఆ విషయాన్ని జీర్ణించుకోలేని ఆ నేతలు, వారి అనుచరులు తాజాగా రామతీర్థం రిజర్వాయర్ వద్ద కిష్కింద కాండనే సృష్టించారు.
తాగునీరు విడుదల విషయంలో కూడా స్థానిక ఎస్సీ ఎమ్మెల్యే సురేష్‌ను అడ్డుకుని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం నీటిని విడుదల చేయడాన్ని చూసిన వారు ఛీదరించుకున్నా..నవ్విపోదురు గాక మాకేంటంటూ ముందుకు సాగిపోయారు. పోలీసుల సమక్షంలో తోపులాట జరిగినా ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. ప్రొటోకాల్ ఉల్లంఘించిన నీటిపారుదల శాఖ అధికారులు మౌనవ్రతాన్నే పాటించారు.
చీమకుర్తి: రామతీర్థం రిజర్వాయర్‌వద్ద ఒంగోలు సమ్మర్‌స్టోర్ ట్యాంక్‌లకు తాగునీటిని విడుదల చేసే కార్యక్రమం మంగళవారం ఏర్పాటు చేశారు. దీనికి ఇరిగేషన్ ఎస్‌ఈ స్థానిక ఎమ్మెల్యే సురేష్‌ను కూడా ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు వెళ్లిన ఎమ్మెల్యేను ‘ఇది మా కార్యక్రమమైతే మీరెందుకు వచ్చారంటూ’ తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇదే కార్యక్రమం కోసం ఒంగోలు నుంచి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, బీఎన్.విజయ్‌కుమార్ రానుండటం తో వారికోసం చీమకుర్తి మండల టీడీపీ కార్యకర్తలు ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో అక్కడకు వచ్చి న సురేష్‌ను రిజర్వాయర్ వద్దకు పోకుం డా టీడీపీ రౌడీ మూకలు అడ్డుకున్నాయి.
ఈలోపు ఒంగోలు నుంచి వచ్చిన దామచర్ల, బలరాం, విజయ్‌కుమార్ నేరుగా రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. సురేష్‌కూడా తన కార్యకర్తలతో రిజర్వాయర్ వద్దకు వచ్చారు. ఈలోగా ఒంగోలు దామచర్ల సాగర్ జలాలను వదిలిపెట్టారు. రిజర్వాయర్ వద్దకు వెళ్తున్న సురేష్‌ను టీడీపీ కార్యకర్తలు మళ్లీ అడ్డుకున్నారు. అడ్డొచ్చిన ఎస్సైని, పోలీసులను కూడా నెట్టేశారు. దీంతో ఎమ్మెల్యే అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ తన నియోజకవర్గం పరిధిలో రామతీర్థం రిజ ర్వాయర్ ఉందని, దానికి సంబంధించిన జలాలను వదిలేందుకు నేను రాకూడదా..? ఎంత అన్యాయం అంటూ ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించారు. తనపై దాడిచేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమవడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదేమైనా ప్రైవేటు జాగీరా?
ప్రొటోకాల్ నిబంధనలను తుంగలో తొక్కి దళిత ఎమ్మెల్యేనని కూడా చూడకుండా రిజర్వాయర్ వద్దకు రాకుండా దారుణంగా నెట్టేస్తారా..? మరీ ఇంత రాక్షసత్వంగా ప్రవర్తించటానికి ఇదేమైనా వారి ప్రైవేటు జాగీరా.....ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలిపెట్టు అంటూ సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న దానికి సంబంధించిన జలాలను వదిలేందుకు నేను రాకూడదా..? వేరే నియోజకవర్గాలలోని ప్రజాప్రతినిధులు వచ్చి నీటిని విడుదల చేయడమేమిటని ప్రశ్నించారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాల్సింది పోయి దౌర్జన్యానికి దిగిన వారికి అండగా నిలవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కి..
ఇరిగేషన్ అధికారులు కూడా ప్రోటోకాల్ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారు. కలెక్టర్ ఆదేశా ల మేరకు సాగర్ జలాలను తాగునీటి అవసరాల నిమిత్తం వదలమని చెప్పారు. స్ధానిక ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ను, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను, ఎస్‌ఈ కోటేశ్వరరావు, ఈఈ వరలక్ష్మి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కానీ నీళ్లు వదిలే సమయంలో మాత్రం స్థానిక ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొనకుండానే ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్‌తో కలిసి ఎస్‌ఈ నీళ్లను వదిలేశారు. పైగా ఏ ప్రొటోకాల్ వర్తించని బలరాం, విజయ్‌కుమార్ కూడా అధికారికంగా పాల్గొన్నారు. ప్రొటోకాల్ నిబంధనలను తుంగలో తొక్కి ఇరిగేషన్ ఎస్‌ఈ కోటేశ్వరరావు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.
సమ్మర్‌స్టోరేజి ట్యాంక్‌లకు సాగర్ జలాలు
రామతీర్థం నుంచి తాగునీటి అవసరాల కోసం 200 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు ఈఈ వరలక్ష్మి తెలిపారు. ఈ నీటితో ఒంగోలు, చీమకుర్తిలోని సమ్మర్ స్టోరేజి ట్యాంక్‌లను నింపుతారన్నారు.
సారీ అన్నా..కాలువపై ఒంటరిగా తిరిగేవాడిని..!
నీటి విడుదల కార్యక్రమం పూర్తయి టీడీపీ నాయకులు వెళ్లిపోయాక..ఆదిమూలపు సురేష్ వద్దకు వచ్చిన ఎస్‌ఈ ‘సారీ అన్నా.. నేను ఎన్‌ఎస్‌పీ కాలువ కట్టల మీద ఒంటరిగా తిరిగేవాడిని..నన్ను వదిలేయండి..’ అంటూ సురేష్ చేతులు పట్టుకున్నారు. అంతేనా మీడియా ముందుకొచ్చి..నాకు ప్రొటోకాల్ నిబంధనలు తెలియవండీ..అంటూ అమాయకంగా బదులిచ్చారు. పోలీసులు కూడా ఇదే తీరున వ్యవహరించారు. స్థానిక ఎమ్మెల్యేకి రక్షణ కల్పించాల్సిన పోలీసులు వేరే నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించడంలో స్వామి భక్తి చాటుకున్నారు. అంతా అయిపోయాక..సీఐ, ఎస్సైలు దళితుడైన స్థానిక ఎమ్మెల్యే సురేష్ వద్దకు వచ్చి ‘ఎవరో ఒకరు సర్దుకుపోవాలి గదా సార్’ అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.