Ramatheertham reservoir
-
అడుగంటిన రామతీర్థం
చీమకుర్తి రూరల్: రామతీర్థం రిజర్వాయర్ పూర్తిగా అడుగంటిపోయిందని.. అలాగే జిల్లాలోని తాగు నీటి చెరువుల పరిస్థితి ఉందని చీమకుర్తి ఇరిగేషన్ ఈఈ రాజభూషణం ఐజాక్ శుక్రవారం సీఈ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సాగర్ నీటిని విడుదల చేయాలని సీఈని కోరారు. శుక్రవారం చీమకుర్తి, దర్శి, ఒంగోలు ఇరిగేషన్ అధికారులతో సాగర్ నీటి పరిస్థితిపై సీఈ చర్చించారు. ఈ సమావేశంలో చీమకుర్తి ఈఈ ఐజాక్ మాట్లాడుతూ రామతీర్థం రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 85.34 మీటర్లు కాగా డెడ్‌స్టోరేజీ 74.9 మీటర్లు కంటే దిగువకు పడిపోయిందన్నారు. దీంతో పాటు చీమకుర్తి, ఒంగోలు ప్రాంత ప్రజల తాగునీటి అవసరంతో పాటు రిజర్వాయర్‌కు దిగువనున్న చెరువులను నింపేందుకు కనీసం 1.5 టీఎంసీల నీరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 17న నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు సీఈ వెల్లడించారని రాజభూషణం తెలిపారు. 0/0 మైలు ఓబీసీ వద్ద 1800 క్యూసెక్కుల నీటిని విడుదల కావచ్చని, వాటి నుంచి 1400 క్యూసెక్కుల సాగర్ జలాలు రామతీర్థం రిజర్వాయర్‌లోకి వచ్చి చేరే అవకాశం ఉంటుందని తెలిపారు. సుమారు 1.5 టీఎంసీల నీటిని అడిగామని, వచ్చే నీటి సామర్థ్యాన్ని బట్టి తాగునీటితో పాటు చెరువులను నింపేందుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. -
సాగుకు చివరి వరకు నీరు అందించేనా ?
చీమకుర్తి : దుక్కి దున్నటం, దమ్ముచేయటం కానేలేదు. వరినాట్లు వేసుకోవడం ఇంకా పూర్తికాలేదు. అప్పుడే సాగర్ కాలువలపై వారబందీ విధానం అమలు చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు ఆకస్మికంగా ప్రకటించడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత సోమవారం నుంచి వారబందీ విధానం అమలు చేస్తున్నట్లు ఇరిగేషన్ చీమకుర్తి డివిజన్ ఈఈ ప్రకటించిన సంగతి తెలిసిందే. వారబందీ విధానంలో రామతీర్థం రిజర్వాయర్‌కు దిగువనున్న మేజర్లకు మూడు రోజులు, ఎగువ నున్న మేజర్లకు మూడు రోజులు సాగర్ నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. దాని వలన నీటిని నిలిపేసిన మూడురోజుల పాటు వరినాట్లు వేసుకునే ందుకు, దమ్ముచేసుకునే భూములకు సాగునీరు అందక ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వరినాట్లు పూర్తయ్యాక ఎప్పుడో డిసెంబర్ నెలాఖరులోనో లేక జనవరి నెలలోనో సాగర్‌లో నీటి మట్టం తగ్గడం, రామతీర్థం రిజర్వాయర్‌లో నీటి మట్టాలు పడిపోతే వారబందీ విధానం అమలు చేయటం సర్వసాధారణం. కానీ ప్రస్తుతం సాగర్‌లో నీటిమట్టం పుష్కలంగా ఉంది. పైగా సాగర్ కాలువ ప్రారంభమైన మొదటి నుంచి వారబందీ విధానం అమలు చేయకుండా కేవలం ఓబీసీ బీద 0/0 మైలు వద్ద చీమకుర్తి డివిజన్‌లోనే విధించడంతో రిజర్వాయర్ పరిధిలోని రైతులు మాత్రమే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వచ్చాయి. సాగర్ ప్రారంభం నుంచి వచ్చే సాగర్ జలాలను గుంటూరు, పమిడిపాడు బ్రాంచ్ కాలువలకు జిల్లా సరిహద్దు 85/3వ మైలుకు పైభాగంలో రైతులు ఎంచక్కా వాడుకుంటుంటే ఓబీసీ ప్రారంభం 0/0 మైలు వద్ద నుంచి దిగువనున్న వారికి మాత్రమే వారబందీ విధానం ఎందుకు అమలు చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. వారబందీ ఇలా... ఓబీసీ మీద రామతీర్థం రిజర్వాయర్‌కు ఎగువనున్న కరవది మేజరు, బూదవాడ, లక్కవరం, నిప్పట్లపాడు, కొర్లమడుగు వంటి 38 మేజర్లు, మైనర్లు, డీపీల ద్వారా గురువారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు మాత్రమే సాగర్ నీటిని అం దిస్తారు. ఆ సమయంలో రిజర్వాయర్‌కు దిగువనున్న మేజర్లకు నీటిని పూర్తిగా నిలిపేస్తారు. అదే విధంగా సోమవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు రామతీర్థం రిజర్వాయర్‌కు దిగువనున్న కారుమంచి మేజర్, చీమకుర్తి-1, 2 మేజర్లు, మైలవరం, అగ్రహారం, త్రోవగుంట, చిలకపాడు, కొప్పోలు, ఈతముక్కల వంటి 40 మేజర్లకు సాగర్ నీటిని అందిస్తారు. అదే సమయంలో పైనున్న మేజర్లకు నీటిని నిలిపేయాలి. దిగువ రైతులకు అన్యాయం... రిజర్వాయర్‌కు దిగువనున్న మేజర్లకు నీటిని నిలిపేయాల్సి వచ్చిన ప్పుడు రిజర్వాయర్ నుంచి రావాలి కాబట్టి నీటిని పూర్తిగా ఆపేసే అవకాశం ఉంది. కానీ ఎగువనున్న మేజర్లకు నిలిపేయాల్సి వచ్చినప్పుడు ఆయా మేజర్ల మీదుగా రిజర్వాయర్‌లోకి రావాలే తప్ప రిజర్వాయర్ నుంచి ఎగువనున్న మేజర్లకు నీటి విడుదల ఉండదు. అలాంటప్పుడు కాలువల్లో వచ్చే నీటిని వారబందీ సమయంలో మేజర్లలో ఒక్కో తూము వద్ద రాత్రి, పగలనే తేడా లేకుండా అధికారులు కాపలా ఉండి నీటిని ఆపడం సాధ్యం కాదు. ఇలా వారబందీ విధానంలో రిజర్వాయర్‌కు దిగువనున్న వారికే అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. -
కండకావరం
అధికార దర్పం పచ్చ కామెర్లుగా కప్పేస్తోంది ... అహంకారం తోడై కండకావరం పెరిగిపోతోంది ... మెజార్టీ లేకపోయినా ఇటీవల జరిగిన జెడ్పీ ఎన్నికల్లో అడ్డదార్లు తొక్కి నానా గడ్డి కరిచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసిన టీడీపీ మూకలు జిల్లా ప్రజల ముందు అభాసుపాలయ్యారు. ఆ విషయాన్ని జీర్ణించుకోలేని ఆ నేతలు, వారి అనుచరులు తాజాగా రామతీర్థం రిజర్వాయర్ వద్ద కిష్కింద కాండనే సృష్టించారు. తాగునీరు విడుదల విషయంలో కూడా స్థానిక ఎస్సీ ఎమ్మెల్యే సురేష్‌ను అడ్డుకుని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం నీటిని విడుదల చేయడాన్ని చూసిన వారు ఛీదరించుకున్నా..నవ్విపోదురు గాక మాకేంటంటూ ముందుకు సాగిపోయారు. పోలీసుల సమక్షంలో తోపులాట జరిగినా ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. ప్రొటోకాల్ ఉల్లంఘించిన నీటిపారుదల శాఖ అధికారులు మౌనవ్రతాన్నే పాటించారు. చీమకుర్తి: రామతీర్థం రిజర్వాయర్వద్ద ఒంగోలు సమ్మర్‌స్టోర్ ట్యాంక్‌లకు తాగునీటిని విడుదల చేసే కార్యక్రమం మంగళవారం ఏర్పాటు చేశారు. దీనికి ఇరిగేషన్ ఎస్ఈ స్థానిక ఎమ్మెల్యే సురేష్‌ను కూడా ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు వెళ్లిన ఎమ్మెల్యేను ‘ఇది మా కార్యక్రమమైతే మీరెందుకు వచ్చారంటూ’ తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇదే కార్యక్రమం కోసం ఒంగోలు నుంచి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, బీఎన్.విజయ్‌కుమార్ రానుండటం తో వారికోసం చీమకుర్తి మండల టీడీపీ కార్యకర్తలు ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో అక్కడకు వచ్చి న సురేష్‌ను రిజర్వాయర్ వద్దకు పోకుం డా టీడీపీ రౌడీ మూకలు అడ్డుకున్నాయి. ఈలోపు ఒంగోలు నుంచి వచ్చిన దామచర్ల, బలరాం, విజయ్‌కుమార్ నేరుగా రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. సురేష్‌కూడా తన కార్యకర్తలతో రిజర్వాయర్ వద్దకు వచ్చారు. ఈలోగా ఒంగోలు దామచర్ల సాగర్ జలాలను వదిలిపెట్టారు. రిజర్వాయర్ వద్దకు వెళ్తున్న సురేష్‌ను టీడీపీ కార్యకర్తలు మళ్లీ అడ్డుకున్నారు. అడ్డొచ్చిన ఎస్సైని, పోలీసులను కూడా నెట్టేశారు. దీంతో ఎమ్మెల్యే అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ తన నియోజకవర్గం పరిధిలో రామతీర్థం రిజ ర్వాయర్ ఉందని, దానికి సంబంధించిన జలాలను వదిలేందుకు నేను రాకూడదా..? ఎంత అన్యాయం అంటూ ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించారు. తనపై దాడిచేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమవడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమైనా ప్రైవేటు జాగీరా? ప్రొటోకాల్ నిబంధనలను తుంగలో తొక్కి దళిత ఎమ్మెల్యేనని కూడా చూడకుండా రిజర్వాయర్ వద్దకు రాకుండా దారుణంగా నెట్టేస్తారా..? మరీ ఇంత రాక్షసత్వంగా ప్రవర్తించటానికి ఇదేమైనా వారి ప్రైవేటు జాగీరా.....ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలిపెట్టు అంటూ సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న దానికి సంబంధించిన జలాలను వదిలేందుకు నేను రాకూడదా..? వేరే నియోజకవర్గాలలోని ప్రజాప్రతినిధులు వచ్చి నీటిని విడుదల చేయడమేమిటని ప్రశ్నించారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాల్సింది పోయి దౌర్జన్యానికి దిగిన వారికి అండగా నిలవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కి.. ఇరిగేషన్ అధికారులు కూడా ప్రోటోకాల్ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారు. కలెక్టర్ ఆదేశా ల మేరకు సాగర్ జలాలను తాగునీటి అవసరాల నిమిత్తం వదలమని చెప్పారు. స్ధానిక ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ను, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను, ఎస్ఈ కోటేశ్వరరావు, ఈఈ వరలక్ష్మి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కానీ నీళ్లు వదిలే సమయంలో మాత్రం స్థానిక ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొనకుండానే ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్‌తో కలిసి ఎస్ఈ నీళ్లను వదిలేశారు. పైగా ఏ ప్రొటోకాల్ వర్తించని బలరాం, విజయ్‌కుమార్ కూడా అధికారికంగా పాల్గొన్నారు. ప్రొటోకాల్ నిబంధనలను తుంగలో తొక్కి ఇరిగేషన్ ఎస్ఈ కోటేశ్వరరావు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. సమ్మర్‌స్టోరేజి ట్యాంక్‌లకు సాగర్ జలాలు రామతీర్థం నుంచి తాగునీటి అవసరాల కోసం 200 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు ఈఈ వరలక్ష్మి తెలిపారు. ఈ నీటితో ఒంగోలు, చీమకుర్తిలోని సమ్మర్ స్టోరేజి ట్యాంక్‌లను నింపుతారన్నారు. సారీ అన్నా..కాలువపై ఒంటరిగా తిరిగేవాడిని..! నీటి విడుదల కార్యక్రమం పూర్తయి టీడీపీ నాయకులు వెళ్లిపోయాక..ఆదిమూలపు సురేష్ వద్దకు వచ్చిన ఎస్ఈ ‘సారీ అన్నా.. నేను ఎన్ఎస్పీ కాలువ కట్టల మీద ఒంటరిగా తిరిగేవాడిని..నన్ను వదిలేయండి..’ అంటూ సురేష్ చేతులు పట్టుకున్నారు. అంతేనా మీడియా ముందుకొచ్చి..నాకు ప్రొటోకాల్ నిబంధనలు తెలియవండీ..అంటూ అమాయకంగా బదులిచ్చారు. పోలీసులు కూడా ఇదే తీరున వ్యవహరించారు. స్థానిక ఎమ్మెల్యేకి రక్షణ కల్పించాల్సిన పోలీసులు వేరే నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించడంలో స్వామి భక్తి చాటుకున్నారు. అంతా అయిపోయాక..సీఐ, ఎస్సైలు దళితుడైన స్థానిక ఎమ్మెల్యే సురేష్ వద్దకు వచ్చి ‘ఎవరో ఒకరు సర్దుకుపోవాలి గదా సార్’ అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. -
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేను అడ్డుకున్న టీడీపీ
ఒంగోలు : ప్రకాశం జిల్లా రామతీర్థం జలాశయం వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. నీటి విడుదల సందర్భంగా రామతీర్థం రిజర్వాయర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు...వారిని అడ్డగించటంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదికాస్తా ఘర్షణకు దారి తీసింది.