చీమకుర్తి : దుక్కి దున్నటం, దమ్ముచేయటం కానేలేదు. వరినాట్లు వేసుకోవడం ఇంకా పూర్తికాలేదు. అప్పుడే సాగర్ కాలువలపై వారబందీ విధానం అమలు చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు ఆకస్మికంగా ప్రకటించడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత సోమవారం నుంచి వారబందీ విధానం అమలు చేస్తున్నట్లు ఇరిగేషన్ చీమకుర్తి డివిజన్ ఈఈ ప్రకటించిన సంగతి తెలిసిందే. వారబందీ విధానంలో రామతీర్థం రిజర్వాయర్‌కు దిగువనున్న మేజర్‌లకు మూడు రోజులు, ఎగువ నున్న మేజర్లకు మూడు రోజులు సాగర్ నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది.
దాని వలన నీటిని నిలిపేసిన మూడురోజుల పాటు వరినాట్లు వేసుకునే ందుకు, దమ్ముచేసుకునే భూములకు సాగునీరు అందక ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వరినాట్లు పూర్తయ్యాక ఎప్పుడో డిసెంబర్ నెలాఖరులోనో లేక జనవరి నెలలోనో సాగర్‌లో నీటి మట్టం తగ్గడం, రామతీర్థం రిజర్వాయర్‌లో నీటి మట్టాలు పడిపోతే వారబందీ విధానం అమలు చేయటం సర్వసాధారణం. కానీ ప్రస్తుతం సాగర్‌లో నీటిమట్టం పుష్కలంగా ఉంది.
పైగా సాగర్ కాలువ ప్రారంభమైన మొదటి నుంచి వారబందీ విధానం అమలు చేయకుండా కేవలం ఓబీసీ బీద 0/0 మైలు వద్ద చీమకుర్తి డివిజన్‌లోనే విధించడంతో రిజర్వాయర్ పరిధిలోని రైతులు మాత్రమే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వచ్చాయి. సాగర్ ప్రారంభం నుంచి వచ్చే సాగర్ జలాలను గుంటూరు, పమిడిపాడు బ్రాంచ్ కాలువలకు జిల్లా సరిహద్దు 85/3వ మైలుకు పైభాగంలో రైతులు ఎంచక్కా వాడుకుంటుంటే ఓబీసీ ప్రారంభం 0/0 మైలు వద్ద నుంచి దిగువనున్న వారికి మాత్రమే వారబందీ విధానం ఎందుకు అమలు చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
వారబందీ ఇలా...
ఓబీసీ మీద రామతీర్థం రిజర్వాయర్‌కు ఎగువనున్న కరవది మేజరు, బూదవాడ, లక్కవరం, నిప్పట్లపాడు, కొర్లమడుగు వంటి 38 మేజర్లు, మైనర్లు, డీపీల ద్వారా గురువారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు మాత్రమే సాగర్ నీటిని అం దిస్తారు. ఆ సమయంలో రిజర్వాయర్‌కు దిగువనున్న మేజర్లకు నీటిని పూర్తిగా నిలిపేస్తారు. అదే విధంగా సోమవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు రామతీర్థం రిజర్వాయర్‌కు దిగువనున్న కారుమంచి మేజర్, చీమకుర్తి-1, 2 మేజర్లు, మైలవరం, అగ్రహారం, త్రోవగుంట, చిలకపాడు, కొప్పోలు, ఈతముక్కల వంటి 40 మేజర్లకు సాగర్ నీటిని అందిస్తారు. అదే సమయంలో పైనున్న మేజర్‌లకు నీటిని నిలిపేయాలి.
దిగువ రైతులకు అన్యాయం...
రిజర్వాయర్‌కు దిగువనున్న మేజర్లకు నీటిని నిలిపేయాల్సి వచ్చిన ప్పుడు రిజర్వాయర్ నుంచి రావాలి కాబట్టి నీటిని పూర్తిగా ఆపేసే అవకాశం ఉంది. కానీ ఎగువనున్న మేజర్లకు నిలిపేయాల్సి వచ్చినప్పుడు ఆయా మేజర్ల మీదుగా రిజర్వాయర్‌లోకి రావాలే తప్ప రిజర్వాయర్ నుంచి ఎగువనున్న మేజర్లకు నీటి విడుదల ఉండదు. అలాంటప్పుడు కాలువల్లో వచ్చే నీటిని వారబందీ సమయంలో మేజర్లలో ఒక్కో తూము వద్ద రాత్రి, పగలనే తేడా లేకుండా అధికారులు కాపలా ఉండి నీటిని ఆపడం సాధ్యం కాదు. ఇలా వారబందీ విధానంలో రిజర్వాయర్‌కు దిగువనున్న వారికే అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు.
సాగుకు చివరి వరకు నీరు అందించేనా ?
Published Wed, Nov 26 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM
Advertisement