sagar water
-
రబీకి సాగర్ నీరు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సాగర్ ఆయకట్టులో ఈ ఏడాది రెండో పంట రబీకి నీటిని పుష్కలంగా అందించనున్నారు. మంగళవారం నుంచి రబీకి నీటి సరఫరాను పాలేరు రిజర్వాయర్ నుంచి ప్రారంభించారు. వారబందీ విధానంలో ఈ నీటిని సరఫరా చేయనున్నారు. 9 రోజుల పాటు జిల్లాలోని ఆయకట్టుకు నీటిని సరఫరా చేయనుండగా.. 6 రోజుల పాటు నిలుపుదల చేయనున్నారు. ఇలా 8 విడతల్లో మార్చి చివరివరకు నీటిని సరఫరా చేస్తారు. అయితే రైతులు ఆరుతడి పంటలనే సాగు చేయాలని, దీంతో కాల్వ పరిధిలోని చివరి భూములన్నింటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు అందించడం సులువుగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. 2.54 లక్షల ఎకరాల ఆయకట్టు ఖమ్మం జిల్లాలో ఎన్నెస్పీ పరిధిలో 2.54 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ మొత్తంలో 17 వేల ఎకరాలు మినహా మిగిలింది జోన్–2 పరిధిలో ఉంది. 17 వేల ఎకరాలు జోన్–3 పరిధిలో ఉండటంతో ఏపీలోని ఆయకట్టు ద్వారా నీరు రావాల్సి ఉంటుం ది. ఈ కారణంగా ఖరీఫ్‌లో జోన్–3లో రెండు, మూడు తడులు మాత్రమే అందించారు. ఇక జోన్–2 పరిధిలో ఉన్న దాదాపు 8 వేల ఎకరాలను ప్లాట్లుగా మార్చారు. ఇక మిగిలిన ఆయకట్టులో ఖరీఫ్‌లో సగం వరి పంటలు వేయగా.. మరో సగం మెట్ట పైర్లను సాగు చేసినట్లు ఎన్నెస్పీ అధికారులు లెక్కలు చూపించారు. అయితే ఈ ఆయకట్టు మొత్తానికి సాగర్ నీరు పుష్కలంగా సరఫరా చేశారు. 20 నుంచి సరఫరా చేయాల్సి ఉన్నా.. సాగర్ నీటి విడుదలపై ఖమ్మం జిల్లా అధికారులు ఉన్నతాధికారులకు నివేదికలను పంపించారు. ఈనెల 20 నుంచి నీటిని విడుదల చేయాలని కోరారు. అయితే ఖమ్మం డివిజన్ పరిధిలోని బోనకల్, కొణిజర్ల, ముదిగొండ తదితర మండలాల పరిధిలో నీటి అవసరముందని రైతుల నుంచి డిమాండ్ రావడంతో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జోక్యంతో జిల్లా ఆయకట్టుకు షెడ్యూల్ కంటే 10 రోజులు ముందే పాలేరు రిజర్వాయర్ నుంచి నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం రోజుకు 600 క్యూసెక్కులు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది సాగర్ ఆయకట్టు ఎడమ కాల్వ మొత్తానికి 60 టీఎంసీలు అవసరముంటుందని అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. జోన్–2లోని ఖమ్మం జిల్లా (టేకులపల్లి సర్కిల్) పరిధిలో రబీకి 29 టీఎంసీలు అవసరముంటుందని లెక్కలు తయారు చేశారు. -
చెరువులకు సాగర్ జలాలు తరలింపు
చీమకుర్తి రూరల్ : రామతీర్థం రిజర్వాయర్‌లోని సాగర్ జలాలను మరో వారం రోజుల పాటు చెరువులకు తరలించనున్నారు. ఇరిగేషన్ ఈఈ రాజయ్య తెలిపిన వివరాల ప్రకారం... రామతీర్థం రిజర్వాయర్ నీటిమట్టం 85.3 మీటర్లు కాగా, ప్రస్తుతం 77.5 మీటర్ల వరకూ నీరు ఉంది. దానిలో డెడ్‌స్టోరేజీ పాయింట్ 74.9 మీటర్లకు చేరుకునే వరకు చెరువులకు నీరు సరఫరా చేయనున్నారు. రిజర్వాయర్‌కు దిగువనున్న చెరువులకు మేజర్లు ద్వారా శనివారం 405 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఇప్పటికే ఒంగోలులోని ఎస్ఎస్ ట్యాంకులకు నీరిస్తున్నారు. త్రోవగుంట మేజరు పరిధిలోని 16 చెరువులకుగాను 12 చెరువులను నింపారు. కారుమంచి మేజరు పరిధిలో 7 చెరువులుండగా, దాదాపు 5 చెరువులను, కొప్పోలు మేజరు పరిధిలో 5 చెరువులకుగానూ ఇప్పటికే 3 చెరువులను నీటితో నింపారు. ఈతముక్కల మేజరు కింద రానున్న వారం రోజుల్లో నీరిస్తారు. వాటితో పాటు ఆర్డబ్ల్యూఎస్ పరిధిలోని 43 చెరువులకు సాగర్ నీరు ఇస్తున్నారు. ఒకవైపు చెరువులకు ఇస్తూనే మరోవైపు పొగాకు, మిర్చి పంటలు సాగు చేసే రైతులకు కూడా ఒక తడికి సాగర్‌నీరు అందిస్తున్నారు. రామతీర్థం రిజర్వాయర్‌లోని సాగర్ జలాలు డెడ్‌స్టోరేజీకి చేరే వరకూ చెరువులకు నీరు సరఫరా చేస్తామని, సద్వినియోగం చేసుకోవాలని ఈఈ తెలిపారు. -
వేసవి గట్టెక్కేనా..?
= సాగర్ డ్యాం నుంచి నేడో రేపో నిలిచిపోనున్న నీటి సరఫరా = రెండువారాలుగా విడుదల చేస్తున్నా.. జిల్లాలో సగానికిపైగా చెరువులు ఖాళీ = ప్రస్తుతం రామతీర్థం రిజర్వాయర్ నీటిమట్ట 79.5 మీటర్లు = వేసవిలో నీటి సమస్య నుంచి గట్టెక్కడం ప్రశ్నార్థకమే చీమకుర్తి రూరల్: నాగార్జునసాగర్ డ్యాం వద్ద జిల్లాకు సంబంధించిన కుడికాలువకు గురు, శుక్రవారాల నుంచి నీటి విడుదలను నిలిపివేయనున్నట్లుతెలిసింది. నిలిపివేసిన తర్వాత కూడా వారం రోజుల వరకు బుగ్గవాగు నుంచి రామతీర్థం రిజర్వాయర్‌కు సాగర్ జలాలు వచ్చే అవకాశం ఉంది. అయితే, రెండు వారాల నుంచి వస్తున్న సాగర్ నీటితో రామతీర్థం రిజర్వాయర్ ఇంకా పూర్తిగా నిండలేదు. సాగర్ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లు నోటిఫైడ్ చెరువులు, నాన్‌నోటిఫైడ్ చెరువులు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకులకు అందిస్తున్నారు. అయినా గ్రామాల్లో ఇంకా సగానికిపైగా చెరువులు ఖాళీగా ఉన్నాయి. ఒంగోలు ఎస్ఎస్ ట్యాంక్–1కు ఇంతవరకు చుక్క నీరు ఇవ్వలేదు. ఎస్ఎస్ ట్యాంక్–2కు మాత్రమే గత ఆదివారం నుంచి రోజుకు 80 నుంచి 90 క్యూసెక్కుల చొప్పున సాగర్‌నీరు సరఫరా చేస్తున్నారు. రెండు ట్యాంకుల పూర్తిసామర్థ్యం 5,800 మిల్లీలీటర్లు కాగా, ప్రస్తుతం రెండింటిలో కలిపి 2,138 మిల్లీలీటర్లు మాత్రమే ఉంది. ఇంకా 3,660 మిల్లీలీటర్లు నింపుకోవాల్సి ఉంటుంది. రెండు ట్యాంకులు నింపడానికి రోజుకు 150 మిల్లీలీటర్ల చొప్పున విడుదల చేస్తే ఇంకా 25 రోజులు, 200 మిల్లీలీటర్ల చొప్పున ఇస్తే 18 రోజులు పడుతుందని పబ్లిక్ హెల్త్ డీఈ ప్రసాద్ తెలిపారు. చీమకుర్తిలోని ఎస్ఎస్ ట్యాంకుకు కూడా సరిపడా నీరు రావాల్సి ఉంది. ప్రస్తుతం రామతీర్థం రిజర్వాయర్‌లోకి 340 క్యూసెక్కులు వస్తుండగా, రిజర్వాయర్ నుంచి బయటకు మాత్రం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 85.34 మీటర్లు కాగా, ప్రస్తుతం 79.5 మీటర్లకు నీరు చేరింది. రానున్న వారం రోజుల వరకు మాత్రమే సాగర్‌నీరు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు, రైతులు ముందు మిగిలిన చెరువులు, ఎస్ఎస్ ట్యాంకులు నింపుకుంటేనే వేసవి కాలం గట్టెక్కే అవకాశం ఉంది.లేకుంటే వేసవిలో నీటి తిప్పలు తప్పేలా లేవు. -
నూజివీడు ప్రాంతానికి సాగర్‌జలాలు సరఫరా చేయాలి
నూజివీడు: నూజివీడు ప్రాంతంలో రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితులున్నందున ఎన్నెస్పీ ఉన్నతాధికారులు వెంటనే నూజివీడు ప్రాంతానికి సాగర్‌జలాలను సరఫరా చేయాలని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు డిమాండ్ చేశారు. స్థానిక ఆయన కార్యాలయంలో సోమవారం మాట్లాడుతూ నూజివీడు బ్రాంచి కాలువ పరిధిలో నూజివీడు, బాపులపాడు, మాచవరం మేజర్లు ఉన్నాయని, వీటి పరిధిలోని చెరువులన్నీ ఎండిపోయి ఉన్నాయన్నారు. ఈ చెరువుల కింద సాగుచేసిన ఆరుతడి పంటలకు ప్రస్తుతం నీటి అవసరం ఎంతో ఉందన్నారు. గతంలో కూడా కేవలం మూడురోజులు మాత్రమే సాగర్‌జలాలను సరఫరా చేసి నిలిపివేశారన్నారు. చెరువులు నింపకపోతే వ్యవసాయ బోర్లులో కూడా నీటిమట్టం పడిపోయి ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవ పరిస్థితులు అధికారులు ప్రభుత్వానికి తెలిపి సాగర్‌జలాలు సరఫరా చేసేలా చూడాలన్నారు. ముఖ్యంగా ఆగిరిపల్లిలోని సమ్మర్‌స్టోరేజీ ట్యాంకును సాగర్‌జలాలతో నింపాలన్నారు. అతిపెద్దచెరువైన కొమ్మూరు చెరువును నింపాలన్నారు. నూజివీడు మేజర్‌పై ఉన్న ఎత్తిపోతల పథకాల ద్వారా సుంకొల్లు, యనమదల చెరువులతో పాటు నూజివీడు పెద్ద చెరువును సాగర్‌జలాలతో నింపాలన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే నూజివీడుప్రాంతానికి సాగర్‌జలాలను మళ్లించి చెరువులను నింపాలని సూచించారు. -
సాగర్ నీరు.. రైతుల పోరు..
• ఖరీఫ్ పంటల రక్షణకేనంటున్న అధికారులు • మా ప్రాంతానికి ఎక్కువ వదలండని ఒత్తిడి చేస్తున్న రైతులు • బోనకల్ బ్రాంచ్ కాలువకు నీరు విడుదల • మరో 2 రోజులు పెంచాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి ఖమ్మం అర్బన్: ఖమ్మం జిల్లాకు ప్రధాన నీటి ఆధారమైన సాగర్ నీటి కోసం అనేక ప్రాంతాల నుంచి డిమాండ్ పెరిగింది. గత నెల 26 నుంచి సాగర్ నీటిని పాలేరు దిగువ రెండు, మూడు జోన్ల పరిధిలోని పంటలను కాపాడటానికి విడు దల చేస్తున్నారు. పాలేరుకు సాగర్ నుంచి 2,600 క్యూసెక్కుల నీరు వస్తుంటే అంతే నీటిని పాలేరు దిగువ కాలువకు విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అరుుతే, సాగర్ కాలువ సరిహద్దులను ఆనుకుని ఉన్న అనేక చెరువులను సైతం అవకాశం ఉన్న మేరకు నింపేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. జిల్లా లో సాగర్ ఆయకట్టు మొత్తం 2,51,800 ఎకరాలు. ఈ ఏడాది వర్షాభావంతో సాగర్ నుంచి నీరు విడుదల చేయకపోవడంతో అనేక వేల ఎకరాల్లో వరి సాగు లేకుండా పోరుుంది. కొందరు రైతులు వరి పొలాల్లో అక్కడక్కడ ఆరుతడి పంటలు సాగు చేశారు. ప్రసుత్తం ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలను కాపాడుకోవడానికి వారం రోజుల పాటు నీటి విడుదలకు ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. సుమారు 1 టీఎంసీకి పైగానే నీటిని విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఆ మేరకు సాగర్ ప్రధాన కాలువ పరిధిలోని 2, 3 జోన్ల పరిధిలోని సిరిపురం, రామచంద్రాపురం, గూడూరు-1, గూడూరు- 2, లక్కవరం మేజర్, కల్లూరు పెద్ద చెరువు, మధిర బ్రాంచ్ కాలువ, పోచారం, కోర్లగూడెం, టేకులపల్లి, తుమ్మలపల్లి, తిరువూరు మేజర్లకు నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలి పారు. జోన్-3లో లంకాసాగర్కాలువ, కాకర్ల, కుంచుపర్తి మేజర్లకు నీటిని విడుదల చేశారు. ఈ మొత్తం కల్లూరు డివిజన్ పరిధిలో ఉంది. ఖమ్మం డివిజన్లో చింతకాని, బోనకల్ బ్రాంచ్ కాలువ ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్ మండలాల పరిధిలో ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఆయకట్టు పరిధిలో మొత్తం 179 చెరువులున్నారుు. వాటిలో మాత్రం ఇప్పటివరకు వర్షం ద్వారా వచ్చిన నీటితోనే రైతులు పంటలు సాగు చేశారు. కాలువకు సమీపంలో ఉన్న చెరువులను అనధికారికంగానే నింపే ప్రయత్నాలు సాగుతున్నారుు. వాటి ద్వారా అరుునా పంటలను కాపాడుకోవాలని రైతులు ఆరాట పడుతున్నారు. కల్లూరు డివిజన్ పరిధిలో నీటి విడుదల నిలిపివేయాల్సిన గడువు దాటినప్పటికీ రైతుల నుంచి, ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు మరో 2-3 రోజులైనా నీటిని యథాతథంగా కొనసాగించాలని ఎన్నెస్పీ అధికారులు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ఉన్నతాధికారులను కోరుతున్నట్లు తెలిసింది. కల్లూరు డివిజన్లోని కొన్ని కాలువల పరిధిలోని రైతులు తమ కాలువకు నీరు ఎక్కువ విడుదల చేయాలని ఎన్నెస్పీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. బోనకల్ బ్రాంచ్ కాలువకు నీరు విడుదల చేసి చివరి దశలో ఉన్న పంటలను కాపాడాలని సీపీఎం నాయకులతో పాటు, రైతు సంఘాల నాయకులు సోమవారం ఎన్నెస్పీ ఎస్ఈని కలిసి వేడుకున్నారు. రబీ సాగుకు ఈ నెల రెండో వారంలో లేదా, మూడో వారంలో విడుదల చేసే అవకాశం ఉందని ఎన్నెస్పీ అధికారులు చెబుతున్నారు. మంగళవారం నుంచి బోనకల్ బ్రాంచ్ కాలువకు దశలవారీగా పెంచుతూ 600 క్యూసెక్కులను విడుదల చేసినట్లు ఎన్నెస్పీ ఈఈ వెంకటేశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. పంటలను కాపాడేందుకే ఖరీఫ్‌లో ఉన్న స్టాండింగ్ పంటలను కాపాడటానికి సాగర్ నీటిని విడుదల చేశాం. కాలువల నుంచి నీటిని చెరువులకు తరలించి నింపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవు. సాగర్ నుంచి పాలేరు రిజర్వాయర్‌కు వస్తున్న నీరు 2,600 క్యూసెక్కులు. అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నాం. -కోటేశ్వరరావు, ఎస్ఈ -
దర్శికి చేరిన సాగర్ జలాలు
దర్శి: పట్టణానికి మంగళవారం సాగర్ జలాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎన్నెస్పీ ఈఈ రత్తయ్య మాట్లాడుతూ నాగార్జున సాగర్ కాలువ ఆయకట్టులోని ఆరుదల పంటల కోసం సాగర్ జలాలు విడుదల చేసినట్లు తెలిపారు. ఇటీవల వర్షాలు లేక వేసిన పంటలు వాడు ముఖం పట్టడంతో ఆ పంటలను కాపాడేందుకు నీటి విడుదల చేశారన్నారు. ఈ నీరు 20 రోజుల పాటు వస్తుందని చెప్పారు. డ్యాంలో 538.80 అడుగుల నీటి మట్టం ఉన్నాయి. ఆర్సీఆర్లో 4 వేల క్యూసెక్కులు, బుగ్గవాగు 468.50 అడుగులు (5627 క్యూసెక్కులు), అద్దంకి బ్రాంచి కెనాల్ 1200 క్యూసెక్కులు, గుంటూరు బ్రాంచ్ కెనాల్ 1300 క్యూసెక్కులు, 57/2 మైలు రాయి వద్ద 2 వేల క్యూసెక్కులు, జిల్లా సరిహద్దు 85/3 మైలు రాయి వద్ద 1632 క్యూసెక్కులు, 126/0 మైలు రాయి వద్ద 1192 క్యూసెక్కులు, ఓబీసీ 883 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఆయకట్టు ప్రాంత రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. -
నిన్న నిండుకుండ.. నేడు వట్టికుండ..
వర్షాకాలంలో సైతం వరుణుడు ముఖం చాటేశాడు. తొలకరిని చూసి సాగు చేసిన రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎక్కడ చూసినా ఎండమావులే తప్ప, నీటిజాడ కరువైంది. ఈ తరుణంలో కృష్ణా పుష్కరాలు వచ్చాయి. పుష్కరాల కోసం విడుదల చేసిన సాగర్‌జలాలు మండలంలోని సాగర్ కాలువల్లో దర్శనం ఇచ్చాయి. పుష్కర కాలంలో నిండుకుండలా దర్శనం ఇచ్చిన పెదనందిపాడు బ్రాంచి కెనాల్ (పీబీసీ కెనాల్) పుష్కరాల అనంతరం ఇలా వట్టిపోయి కన్పించింది. మండలంలోని లింగారావుపాలెం –మైదవోలు మధ్య కాలువ దృశ్యాలు ఇవి. – యడ్లపాడు -
సాగుకు చివరి వరకు నీరు అందించేనా ?
చీమకుర్తి : దుక్కి దున్నటం, దమ్ముచేయటం కానేలేదు. వరినాట్లు వేసుకోవడం ఇంకా పూర్తికాలేదు. అప్పుడే సాగర్ కాలువలపై వారబందీ విధానం అమలు చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు ఆకస్మికంగా ప్రకటించడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత సోమవారం నుంచి వారబందీ విధానం అమలు చేస్తున్నట్లు ఇరిగేషన్ చీమకుర్తి డివిజన్ ఈఈ ప్రకటించిన సంగతి తెలిసిందే. వారబందీ విధానంలో రామతీర్థం రిజర్వాయర్‌కు దిగువనున్న మేజర్లకు మూడు రోజులు, ఎగువ నున్న మేజర్లకు మూడు రోజులు సాగర్ నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. దాని వలన నీటిని నిలిపేసిన మూడురోజుల పాటు వరినాట్లు వేసుకునే ందుకు, దమ్ముచేసుకునే భూములకు సాగునీరు అందక ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వరినాట్లు పూర్తయ్యాక ఎప్పుడో డిసెంబర్ నెలాఖరులోనో లేక జనవరి నెలలోనో సాగర్‌లో నీటి మట్టం తగ్గడం, రామతీర్థం రిజర్వాయర్‌లో నీటి మట్టాలు పడిపోతే వారబందీ విధానం అమలు చేయటం సర్వసాధారణం. కానీ ప్రస్తుతం సాగర్‌లో నీటిమట్టం పుష్కలంగా ఉంది. పైగా సాగర్ కాలువ ప్రారంభమైన మొదటి నుంచి వారబందీ విధానం అమలు చేయకుండా కేవలం ఓబీసీ బీద 0/0 మైలు వద్ద చీమకుర్తి డివిజన్‌లోనే విధించడంతో రిజర్వాయర్ పరిధిలోని రైతులు మాత్రమే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వచ్చాయి. సాగర్ ప్రారంభం నుంచి వచ్చే సాగర్ జలాలను గుంటూరు, పమిడిపాడు బ్రాంచ్ కాలువలకు జిల్లా సరిహద్దు 85/3వ మైలుకు పైభాగంలో రైతులు ఎంచక్కా వాడుకుంటుంటే ఓబీసీ ప్రారంభం 0/0 మైలు వద్ద నుంచి దిగువనున్న వారికి మాత్రమే వారబందీ విధానం ఎందుకు అమలు చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. వారబందీ ఇలా... ఓబీసీ మీద రామతీర్థం రిజర్వాయర్‌కు ఎగువనున్న కరవది మేజరు, బూదవాడ, లక్కవరం, నిప్పట్లపాడు, కొర్లమడుగు వంటి 38 మేజర్లు, మైనర్లు, డీపీల ద్వారా గురువారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు మాత్రమే సాగర్ నీటిని అం దిస్తారు. ఆ సమయంలో రిజర్వాయర్‌కు దిగువనున్న మేజర్లకు నీటిని పూర్తిగా నిలిపేస్తారు. అదే విధంగా సోమవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు రామతీర్థం రిజర్వాయర్‌కు దిగువనున్న కారుమంచి మేజర్, చీమకుర్తి-1, 2 మేజర్లు, మైలవరం, అగ్రహారం, త్రోవగుంట, చిలకపాడు, కొప్పోలు, ఈతముక్కల వంటి 40 మేజర్లకు సాగర్ నీటిని అందిస్తారు. అదే సమయంలో పైనున్న మేజర్లకు నీటిని నిలిపేయాలి. దిగువ రైతులకు అన్యాయం... రిజర్వాయర్‌కు దిగువనున్న మేజర్లకు నీటిని నిలిపేయాల్సి వచ్చిన ప్పుడు రిజర్వాయర్ నుంచి రావాలి కాబట్టి నీటిని పూర్తిగా ఆపేసే అవకాశం ఉంది. కానీ ఎగువనున్న మేజర్లకు నిలిపేయాల్సి వచ్చినప్పుడు ఆయా మేజర్ల మీదుగా రిజర్వాయర్‌లోకి రావాలే తప్ప రిజర్వాయర్ నుంచి ఎగువనున్న మేజర్లకు నీటి విడుదల ఉండదు. అలాంటప్పుడు కాలువల్లో వచ్చే నీటిని వారబందీ సమయంలో మేజర్లలో ఒక్కో తూము వద్ద రాత్రి, పగలనే తేడా లేకుండా అధికారులు కాపలా ఉండి నీటిని ఆపడం సాధ్యం కాదు. ఇలా వారబందీ విధానంలో రిజర్వాయర్‌కు దిగువనున్న వారికే అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. -
కృష్ణాడెల్టాకు నీరిస్తే తెలంగాణకే లబ్ధి
కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికే లబ్ధి చేకూరిందని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఇలా డెల్టాకు నీరు విడుదల చేయడం వల్ల తెలంగాణ ప్రాంతానికి 237 కోట్ల రూపాయల విలువైన విద్యుత్ ఉత్పత్తి అయ్యిందని ఆయన అన్నారు. దీని వల్ల తెలంగాణలో విద్యుత్ కొరత బాగా తగ్గిందని ఉమామహేశ్వరరావు చెప్పారు. అయితే.. సాగర్ నుంచి 7 టీఎంసీల నీరు విడుదలైతే, ప్రకాశం బ్యారేజికి వచ్చింది మాత్రం 3 టీఎంసీలేనని, అందువల్ల డెల్టా ప్రాంత తాగునీటి అవసరాలు తీరేందుకు మిగిలిన నీరు కూడా విడుదల చేయాలని మంత్రి ఉమా మహేశ్వరరావు కోరారు. -
లోతట్టును ముంచిన సాగర్ నీరు
ఊపిరి పీల్చుకున్న అధికారులు, స్థానికులు దోమలగూడ: హుస్సేన్‌సాగర్ నీరు పరుగులు తీసింది. లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు, బస్తీలు నీటమునిగాయి. భారీ వర్షాలకో.. సాగర్ నీటితో నిండి పొంగిపొర్లడంతో ఇలా జరగలేదు. హుస్సేన్‌సాగర్ వరద నీటి పైపులను మరమ్మతు చేస్తున్న క్రమంలో జరిగిన పొరపాటుకు పలుచోట్ల పైపులైన్ల నుంచి నీరు భారీగా బయటకు తన్నుకొచ్చింది. దీంతో లోయర్ ట్యాంక్‌బండ్ ప్రాంతంలో వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రవాహాన్ని నియంత్రించడానికి అధికారులు 24 గంటలు శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు లీకేజీలు ఆగిపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. హుస్సేన్‌సాగర్ నుంచి కట్టమైసమ్మ దేవాలయం, ఉస్మానియా యూనివర్సిటీ మీదుగా ఉప్పల్ వరకు ఉన్న వరద నీటి పైపులైన్లకు ట్యాంక్‌బండ్ వద్ద మరమ్మతులు జరుపుతున్నారు. గురువారం మధ్యాహ్నం షెట్టర్ తిప్పడంలో జరిగిన పొరపాటుతో పలుచోట్ల పైపులైన్ల నుంచి వరద నీరు పొంగిపొర్లింది. డివిజన్లోని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పాత కార్యాలయం వద్ద, దివంగత నేత పీజేఆర్ ఇంటి సమీపంలో, రామకృష్ణమఠం వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. ఈ పైపుల నుంచి వరద నీరు భారీగా రావడంతో ఇందిరాపార్కు ప్రధాన రహదారితోపాటు డివిజన్లోని రోజ్‌కాలనీ, దోమలగూడ, ఏవీ కళాశాల, గగన్‌మహల్ పోలీస్ అవుట్‌పోస్టు తదితర బస్తీలు, రోడ్లు జలమయమయ్యాయి. వరద నీరు బయటకు రావడంతో ఇందిరాపార్కు రహదారితోపాటు బస్తీల రోడ్లు కాలువలను తలపించగా ప్రజలు, ప్రయాణికులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే ఆయా చోట్లకు చేరుకుని మరమ్మతులు సాగించారు. గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు 24 గంటల పాటు శ్రమించి వరదనీటి ప్రవాహాన్ని నియత్రించగలిగారు. గతంలో రామకృష్ణమఠం వద్ద.. గత ఏడాది జూలైలో రామకృష్ణమఠంలో ఏర్పాటు చేయతలపెట్టిన 30 కిలో మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటు కోసం ఎర్తింగ్ కోసం డ్రిల్లింగ్ పనులు చేపడుతుండగా దాదాపు పద్నాలుగు అడుగుల లోతులో ఉన్న పైపులైను పగలడంతో ఒక్కసారిగా పైపు నుంచి నీరు ఎగిసిపడింది. దీంతో ఆరేడు గంటలపాటు శ్రమించి వర ద నీటిని నియత్రించగలిగారు. ఆ తరువాత వారం రోజులకు తిరిగి అక్కడే ఏర్పడిన లీకేజీతో మరోమారు పైపులైను నుంచి వరద నీరు రావడంతో ఇందిరాపార్కు రహదారి జలమయమై ప్రజలు, పాదచారులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. నిజాం కాలం నాటి పైపులైన్.. జనావాసాల మీదుగా వెళ్లిన ఈ పైపులైన్ దాదాపు ఎనభై ఏళ్ల క్రితం నిజాం హయాంలో వేసినట్టుగా జలమండలి అధికారులు చెబుతున్నారు. హుస్సేన్‌సాగర్ నుంచి కట్టమైసమ్మ దేవాలయం సమీపం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ మీదుగా ఉప్పల్ వరకు ఈ పైపులైన్ ఉన్నట్టు సమాచారం. అప్పట్లో ఈ పైపులైన్ ద్వారా హుస్సేన్‌సాగర్ మంచినీటిని ఆయా ప్రాంతాలకు సరఫరా చేసేవారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పైపులైన్ ద్వారా సరఫరా అవుతున్న నీటిని ఉస్మానియా యూనివర్సిటీ, ఉప్పల్ ప్రాంతాల్లో మొక్కలు, చెట్ల పెంపకానికి వినియోగిస్తున్నట్టు సమాచారం. -
మంచినీళ్లో రామచంద్ర..!
మార్కాపురం, న్యూస్‌లైన్ : మార్కాపురం మున్సిపాలిటీలో ఏ బ్లాక్‌లో చూసినా నీటి సమస్య తాండవిస్తోంది. మిగిలిన రోజుల్లో పరిస్థితి ఎలాగున్నా..వేసవి కాలంలో మాత్రం పట్టణ ప్రజల గొంతెండక తప్పడం లేదు. బిందె నీటి కోసం నానాతంటాలు పడాల్సి వస్తోంది. స్థానికులకు సక్రమంగా మంచినీరు సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన దూపాడు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులోని సాగర్‌నీరు గతేడాది పూర్తిగా అడుగంటింది. దీంతో గతంలో మూడు రోజులకోసారి సరఫరా చేసే సాగర్‌నీటిని ప్రస్తుతం ఐదు రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. శివారు కాలనీలకు పైపులైన్లు సక్రమంగా లేకపోవడంతో సాగర్‌నీటి సరఫరా కలగానే మిగిలింది. ఆయా కాలనీలకు ట్యాంకర్ల ద్వారా వచ్చే నీరే దిక్కయింది. ఆ ట్యాంకర్లు కూడా ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. వాటి వద్ద నీరు పట్టుకునేందుకు మహిళలు పోటీపడే నేపథ్యంలో నిత్యం ఘర్షణలు సర్వసాధారణమయ్యాయి. ప్రధాన కాలనీలకు సైతం అరకొరగానే సాగర్ నీరు అందుతోంది. మున్సిపాలిటీలో 32 వార్డులుండగా, అధికారికంగా 17,464 నివాస గృహాలు, 71,092 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. 29 మురికివాడల్లో 29,173 మంది నివసిస్తున్నారు. ఒక్కొక్కరికి రోజుకు సుమారు 70 లీటర్ల నీరు అవసరం. కానీ, ప్రస్తుతం 40 నుంచి 50 లీటర్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. 24 వార్డుల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. వేసవి ప్రారంభానికి ముందే నీటివెతలు మొదలవడంతో వేసవిలో ఇంకెలా ఉంటుందోనని పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాలుగు నెలల నుంచి వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే శివారు ప్రాంతాల్లోని డీప్‌బోర్లు సైతం పనిచేయడం లేదు. మున్సిపాలిటీలో సుమారు 165 డీప్బోర్లుండగా, వాటిలో 80 నుంచి 85 మాత్రమే పనిచేస్తున్నాయి. 25 మినీ వాటర్ ట్యాంకులుండగా 10 నుంచి 12 మాత్రమే వాడుకలో ఉన్నాయి. పూలసుబ్బయ్యకాలనీ, ఎస్సీబీసీకాలనీ, బాపూజీకాలనీ, భగత్‌సింగ్‌కాలనీ, చెన్నరాయునిపల్లె, విద్యానగర్, కరెంట్ ఆఫీస్కాలనీ, నాగులవరం రోడ్డు, ఒంటెద్దుబండ్లకాలనీ, నానాజాతుల పేట, ఏకలవ్యకాలనీ, రాజ్యలక్ష్మీనగర్, సుందరయ్య కాలనీల్లో తీవ్ర నీటి కొరత నెలకొంది. 28, 29 బ్లాకుల్లో దాహంతో ప్రజలు అల్లాడుతున్నారు. పొలాల్లో నుంచి తోపుడు బండ్లు, సైకిళ్లపై నీరు తెచ్చుకుంటూ అవస్థపడుతున్నారు. సుమారు 350 నుంచి 400 అడుగుల లోతులో వేసిన బోర్లలో సైతం నీరు రాకపోవడంతో ప్రజలతో పాటు సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. కనిగిరిలో కన్నీటి గాథ కనిగిరి, న్యూస్‌లైన్ : కనిగిరి అనగానే ప్రధానంగా నీటి సమస్య గుర్తొస్తుంది. కనిగిరి మేజర్ పంచాయతీని నగర పంచాయతీగా మార్చేందుకు చుట్టుపక్కలున్న కాశీపురం, మాచవరం, శంఖవరం పంచాయతీలను విలీనం చేశారు. ప్రస్తుతం కనిగిరి నగర పంచాయతీలో 20 వార్డులు, 44,755 మంది జనాభా ఉన్నారు. అధికారికంగా 10,465 గృహాలు, 307 బోర్లు, 51 డీప్‌బోర్లు, 1,839 కుళాయిలు ఉన్నాయి. కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని సగం ప్రాంతాల్లో బోర్లలో నీరు పడవు. ఒకవేళ నీరు పడినా ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉంటుంది. అత్యధికంగా 5.1 పీపీఎం ఫ్లోరైడ్ శాతం ఇక్కడి నీటిలో ఉంటుంది. దీంతో ఇక్కడి ప్రజలకు సాగర్ నీటి సరఫరా తప్పనిసరి. 1992లో కనిగిరి పరిసరాల్లోని 18 గ్రామాల కోసం రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాంత ప్రజలకు ఫ్లోరైడ్ నీటి నుంచి విముక్తి కలిగించేందుకు 175 కోట్ల రూపాయలతో రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. కానీ, ఆయన మరణం తర్వాత సక్రమంగా నిధులు విడుదలగాక ఆ పథకం నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో నగర పంచాయతీలో ఇంటికో సాగర్‌నీటి కుళాయి కలగానే మిగిలింది. ట్యాంకర్లపై ఆధారపడి నీటి సమస్యతో ప్రజలు అల్లాడుతూనే ఉన్నారు. -
తగ్గుతున్న పాలేరు
కూసుమంచి, న్యూస్‌లైన్ : మండలంలోని పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. సోమవారానికి 13 అడుగులతో ప్రీ ఫ్లోకు చేరుకుంది. సాధారణంగా రిజర్వాయర్ నీటి మట్టం 18 అడుగులకు తగ్గకుండా చూడాలి. రానురాను మరింత తగ్గిపోయే అవకాశం ఉంది. దీని వల్ల ఎడమ కాల్వకు నీటిప్రవాహం తగ్గనుంది. అదే జరిగితే పంటలకు నీరందక రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం సాగర్ నుంచి రిజర్వాయర్‌కు 3964 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా రిజర్వాయర్ నుంచి ఎడమ కాల్వకు 3841 క్యూసెక్కులు, పాలేరు పాత కాలువకు మరో 200 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది. అలాగే రిజర్వాయర్ ఆధారంగా నిర్మించిన మంచినీటి పథకాలకు కూడా నీటి సరఫరా జరుగుతోంది. దీంతో నీటి మట్టం రోజురోజుకు తగ్గుతోంది. పాలేరుకు సాగర్‌నీటి సరఫరాలో అన్యాయం... సాగర్ మెదటి జోన్ పరిధిలో ఉన్న పాలేరు రిజర్వాయర్‌కు సాగర్ నుంచి నీటి విడుదలలో అన్యాయం జరుగుతోంది. వాస్తవానికి రిజర్వాయర్‌కు 5వేల క్యూసెక్కులకు పైగా సాగర్ నీరు రావాల్సి ఉంది. కానీ ఈ సీజన్ లో ఆ స్థాయిలో నీరు చేరేలేదు. సాగర్ నుంచి ఎడమ కాల్వకు 11వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా పాలేరుకు 5వేల క్యూసెక్కులు రావాలి, కానీ 4వేల క్యూసెక్కులకు మించి రావడం లేదు. ఎగువన ఉన్న నల్లగొండ జిల్లా రైతులు అధికంగా నీటిని వాడుకోవడంతో పాలేరుకు వచ్చే సరఫరా తగ్గుతోంది. దీంతో రిజర్వాయర్ నీటి మట్టం తరుచూ పడిపోతుంది. ఇటు రిజర్వాయర్ నుంచి ఎడమ కాల్వ దిగువకు, పాలేరు పాత కాల్వకు లెక్క ప్రకారం నీటిని వదులుతున్నప్పటికీ సాగర్ నుంచి తగినంత నీరు రాకపోవడంతో రిజర్వాయర్ ఫ్రీ ఫ్లోకు చేరింది. ఇ ప్పటికైనా అధికారులు స్పందించి రిజర్వాయర్‌కు సాగర్ నీటిని పెంచాలి. లేకపోతే రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరి పంటలకు, తాగునీటి పథకాలకు సరిపడా నీరు అందకపోవచ్చు. -
జిల్లాకు సాగర్ జలాలు
త్రిపురాంతకం,న్యూస్‌లైన్: సాగర్ ఆయకట్టు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరు జిల్లా లింగాలపల్లి వద్ద సాగర్ ప్రధాన కాలువకు గండి పడడంతో నాలుగు రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో రైతన్నలు గాభరా పడ్డారు. కానీ బుధవారం నాటికి పరిస్థితి చక్కబడింది. మేజర్లకు నీటి సరఫరా జరుగుతుండడంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. గుంటూరు- ప్రకాశం జిల్లాల సరిహద్దు 85-3 వద్ద మొదటి రోజు 2070 క్యూసెక్కుల నీరు విడుదలకాగా.. గురువారం 2700 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు డీఈఈ సత్యకుమార్ తెలిపారు. మొన్నటి దాకా నీరు లేక వరినాట్లు ఎండుముఖం పట్టడంతో కష్టాలు తప్పవని అన్నదాత నిరాశ చెందాడు. కానీ పరిస్థితి అనుకూలంగా మారడంతో ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు. భూములను దమ్ము చేస్తున్నారు. నీటి సరఫరా ఇదేవిధంగా కొనసాగితే ఆయకట్టు చివరి భూములకు కూడా ఇబ్బంది ఉండదు. దీని కోసం అధికారులు చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం ఉంది. కాగా సాగర్ జలాశయంలో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఖరీఫ్‌లో సక్రమంగా నీరు విడుదలవ్వక చాలా చోట్ల పంటలు సాగులోకి రాలేదు. ఇప్పటికి నలభై శాతమే! జిల్లాలోని సాగర్ ఆయకట్టు కింద 4.35 లక్షల ఎకరాలుండగా ఇప్పటికి సుమారు నలభై శాతం భూముల్లో మాత్రమే వరి సాగులోకి వచ్చింది. ప్రస్తుతం కాలువకు ఎగువ భూములే కళకళలాడుతున్నాయి. సాగర్ కాలువకు సమృద్ధిగా నీరు వస్తే తప్ప మిగిలిన భూములు తడవవు. ఇదే జరిగితే ఈ ఏడాది కూడా రైతులు అప్పులతో మిగిలిపోవాల్సిందే.