సాగర్ నీరు.. రైతుల పోరు..
• ఖరీఫ్ పంటల రక్షణకేనంటున్న అధికారులు
• మా ప్రాంతానికి ఎక్కువ వదలండని ఒత్తిడి చేస్తున్న రైతులు
• బోనకల్ బ్రాంచ్ కాలువకు నీరు విడుదల
• మరో 2 రోజులు పెంచాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి
ఖమ్మం అర్బన్: ఖమ్మం జిల్లాకు ప్రధాన నీటి ఆధారమైన సాగర్ నీటి కోసం అనేక ప్రాంతాల నుంచి డిమాండ్ పెరిగింది. గత నెల 26 నుంచి సాగర్ నీటిని పాలేరు దిగువ రెండు, మూడు జోన్ల పరిధిలోని పంటలను కాపాడటానికి విడు దల చేస్తున్నారు. పాలేరుకు సాగర్ నుంచి 2,600 క్యూసెక్కుల నీరు వస్తుంటే అంతే నీటిని పాలేరు దిగువ కాలువకు విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అరుుతే, సాగర్ కాలువ సరిహద్దులను ఆనుకుని ఉన్న అనేక చెరువులను సైతం అవకాశం ఉన్న మేరకు నింపేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. జిల్లా లో సాగర్ ఆయకట్టు మొత్తం 2,51,800 ఎకరాలు. ఈ ఏడాది వర్షాభావంతో సాగర్ నుంచి నీరు విడుదల చేయకపోవడంతో అనేక వేల ఎకరాల్లో వరి సాగు లేకుండా పోరుుంది.
కొందరు రైతులు వరి పొలాల్లో అక్కడక్కడ ఆరుతడి పంటలు సాగు చేశారు. ప్రసుత్తం ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలను కాపాడుకోవడానికి వారం రోజుల పాటు నీటి విడుదలకు ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. సుమారు 1 టీఎంసీకి పైగానే నీటిని విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఆ మేరకు సాగర్ ప్రధాన కాలువ పరిధిలోని 2, 3 జోన్ల పరిధిలోని సిరిపురం, రామచంద్రాపురం, గూడూరు-1, గూడూరు- 2, లక్కవరం మేజర్, కల్లూరు పెద్ద చెరువు, మధిర బ్రాంచ్ కాలువ, పోచారం, కోర్లగూడెం, టేకులపల్లి, తుమ్మలపల్లి, తిరువూరు మేజర్లకు నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలి పారు.
జోన్-3లో లంకాసాగర్‌కాలువ, కాకర్ల, కుంచుపర్తి మేజర్లకు నీటిని విడుదల చేశారు. ఈ మొత్తం కల్లూరు డివిజన్ పరిధిలో ఉంది. ఖమ్మం డివిజన్‌లో చింతకాని, బోనకల్ బ్రాంచ్ కాలువ ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్ మండలాల పరిధిలో ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఆయకట్టు పరిధిలో మొత్తం 179 చెరువులున్నారుు. వాటిలో మాత్రం ఇప్పటివరకు వర్షం ద్వారా వచ్చిన నీటితోనే రైతులు పంటలు సాగు చేశారు. కాలువకు సమీపంలో ఉన్న చెరువులను అనధికారికంగానే నింపే ప్రయత్నాలు సాగుతున్నారుు. వాటి ద్వారా అరుునా పంటలను కాపాడుకోవాలని రైతులు ఆరాట పడుతున్నారు. కల్లూరు డివిజన్ పరిధిలో నీటి విడుదల నిలిపివేయాల్సిన గడువు దాటినప్పటికీ రైతుల నుంచి, ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు మరో 2-3 రోజులైనా నీటిని యథాతథంగా కొనసాగించాలని ఎన్నెస్పీ అధికారులు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ఉన్నతాధికారులను కోరుతున్నట్లు తెలిసింది.
కల్లూరు డివిజన్‌లోని కొన్ని కాలువల పరిధిలోని రైతులు తమ కాలువకు నీరు ఎక్కువ విడుదల చేయాలని ఎన్నెస్పీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. బోనకల్ బ్రాంచ్ కాలువకు నీరు విడుదల చేసి చివరి దశలో ఉన్న పంటలను కాపాడాలని సీపీఎం నాయకులతో పాటు, రైతు సంఘాల నాయకులు సోమవారం ఎన్నెస్పీ ఎస్‌ఈని కలిసి వేడుకున్నారు. రబీ సాగుకు ఈ నెల రెండో వారంలో లేదా, మూడో వారంలో విడుదల చేసే అవకాశం ఉందని ఎన్నెస్పీ అధికారులు చెబుతున్నారు. మంగళవారం నుంచి బోనకల్ బ్రాంచ్ కాలువకు దశలవారీగా పెంచుతూ 600 క్యూసెక్కులను విడుదల చేసినట్లు ఎన్నెస్పీ ఈఈ వెంకటేశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు.
పంటలను కాపాడేందుకే
ఖరీఫ్‌లో ఉన్న స్టాండింగ్ పంటలను కాపాడటానికి సాగర్ నీటిని విడుదల చేశాం. కాలువల నుంచి నీటిని చెరువులకు తరలించి నింపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవు. సాగర్ నుంచి పాలేరు రిజర్వాయర్‌కు వస్తున్న నీరు 2,600 క్యూసెక్కులు. అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నాం. -కోటేశ్వరరావు, ఎస్‌ఈ