కూసుమంచి, న్యూస్‌లైన్ : మండలంలోని పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. సోమవారానికి 13 అడుగులతో ప్రీ ఫ్లోకు చేరుకుంది. సాధారణంగా రిజర్వాయర్ నీటి మట్టం 18 అడుగులకు తగ్గకుండా చూడాలి. రానురాను మరింత తగ్గిపోయే అవకాశం ఉంది. దీని వల్ల ఎడమ కాల్వకు నీటిప్రవాహం తగ్గనుంది. అదే జరిగితే పంటలకు నీరందక రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం సాగర్ నుంచి రిజర్వాయర్‌కు 3964 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా రిజర్వాయర్ నుంచి ఎడమ కాల్వకు 3841 క్యూసెక్కులు, పాలేరు పాత కాలువకు మరో 200 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది. అలాగే రిజర్వాయర్ ఆధారంగా నిర్మించిన మంచినీటి పథకాలకు కూడా నీటి సరఫరా జరుగుతోంది. దీంతో నీటి మట్టం రోజురోజుకు తగ్గుతోంది.
పాలేరుకు సాగర్‌నీటి సరఫరాలో అన్యాయం...
సాగర్ మెదటి జోన్ పరిధిలో ఉన్న పాలేరు రిజర్వాయర్‌కు సాగర్ నుంచి నీటి విడుదలలో అన్యాయం జరుగుతోంది. వాస్తవానికి రిజర్వాయర్‌కు 5వేల క్యూసెక్కులకు పైగా సాగర్ నీరు రావాల్సి ఉంది. కానీ ఈ సీజన్ లో ఆ స్థాయిలో నీరు చేరేలేదు. సాగర్ నుంచి ఎడమ కాల్వకు 11వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా పాలేరుకు 5వేల క్యూసెక్కులు రావాలి, కానీ 4వేల క్యూసెక్కులకు మించి రావడం లేదు. ఎగువన ఉన్న నల్లగొండ జిల్లా రైతులు అధికంగా నీటిని వాడుకోవడంతో పాలేరుకు వచ్చే సరఫరా తగ్గుతోంది.
దీంతో రిజర్వాయర్ నీటి మట్టం తరుచూ పడిపోతుంది. ఇటు రిజర్వాయర్ నుంచి ఎడమ కాల్వ దిగువకు, పాలేరు పాత కాల్వకు లెక్క ప్రకారం నీటిని వదులుతున్నప్పటికీ సాగర్ నుంచి తగినంత నీరు రాకపోవడంతో రిజర్వాయర్ ఫ్రీ ఫ్లోకు చేరింది. ఇ ప్పటికైనా అధికారులు స్పందించి రిజర్వాయర్‌కు సాగర్ నీటిని పెంచాలి. లేకపోతే రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరి పంటలకు, తాగునీటి పథకాలకు సరిపడా నీరు అందకపోవచ్చు.
తగ్గుతున్న పాలేరు
Published Tue, Mar 4 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 4:19 AM
Advertisement