పాలేరు రిజర్వాయర్ వద్ద నీరు విడుదల చేస్తున్న దృశ్యం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సాగర్ ఆయకట్టులో ఈ ఏడాది రెండో పంట రబీకి నీటిని పుష్కలంగా అందించనున్నారు. మంగళవారం నుంచి రబీకి నీటి సరఫరాను పాలేరు రిజర్వాయర్ నుంచి ప్రారంభించారు. వారబందీ విధానంలో ఈ నీటిని సరఫరా చేయనున్నారు. 9 రోజుల పాటు జిల్లాలోని ఆయకట్టుకు నీటిని సరఫరా చేయనుండగా.. 6 రోజుల పాటు నిలుపుదల చేయనున్నారు. ఇలా 8 విడతల్లో మార్చి చివరివరకు నీటిని సరఫరా చేస్తారు. అయితే రైతులు ఆరుతడి పంటలనే సాగు చేయాలని, దీంతో కాల్వ పరిధిలోని చివరి భూములన్నింటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు అందించడం సులువుగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
2.54 లక్షల ఎకరాల ఆయకట్టు
ఖమ్మం జిల్లాలో ఎన్నెస్పీ పరిధిలో 2.54 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ మొత్తంలో 17 వేల ఎకరాలు మినహా మిగిలింది జోన్–2 పరిధిలో ఉంది. 17 వేల ఎకరాలు జోన్–3 పరిధిలో ఉండటంతో ఏపీలోని ఆయకట్టు ద్వారా నీరు రావాల్సి ఉంటుం ది. ఈ కారణంగా ఖరీఫ్‌లో జోన్–3లో రెండు, మూడు తడులు మాత్రమే అందించారు. ఇక జోన్–2 పరిధిలో ఉన్న దాదాపు 8 వేల ఎకరాలను ప్లాట్లుగా మార్చారు. ఇక మిగిలిన ఆయకట్టులో ఖరీఫ్‌లో సగం వరి పంటలు వేయగా.. మరో సగం మెట్ట పైర్లను సాగు చేసినట్లు ఎన్నెస్పీ అధికారులు లెక్కలు చూపించారు. అయితే ఈ ఆయకట్టు మొత్తానికి సాగర్ నీరు పుష్కలంగా సరఫరా చేశారు.
20 నుంచి సరఫరా చేయాల్సి ఉన్నా..
సాగర్ నీటి విడుదలపై ఖమ్మం జిల్లా అధికారులు ఉన్నతాధికారులకు నివేదికలను పంపించారు. ఈనెల 20 నుంచి నీటిని విడుదల చేయాలని కోరారు. అయితే ఖమ్మం డివిజన్ పరిధిలోని బోనకల్, కొణిజర్ల, ముదిగొండ తదితర మండలాల పరిధిలో నీటి అవసరముందని రైతుల నుంచి డిమాండ్ రావడంతో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జోక్యంతో జిల్లా ఆయకట్టుకు షెడ్యూల్ కంటే 10 రోజులు ముందే పాలేరు రిజర్వాయర్ నుంచి నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం రోజుకు 600 క్యూసెక్కులు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది సాగర్ ఆయకట్టు ఎడమ కాల్వ మొత్తానికి 60 టీఎంసీలు అవసరముంటుందని అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. జోన్–2లోని ఖమ్మం జిల్లా (టేకులపల్లి సర్కిల్) పరిధిలో రబీకి 29 టీఎంసీలు అవసరముంటుందని లెక్కలు తయారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment