- ఊపిరి పీల్చుకున్న అధికారులు, స్థానికులు
దోమలగూడ: హుస్సేన్‌సాగర్ నీరు పరుగులు తీసింది. లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు, బస్తీలు నీటమునిగాయి. భారీ వర్షాలకో.. సాగర్ నీటితో నిండి పొంగిపొర్లడంతో ఇలా జరగలేదు. హుస్సేన్‌సాగర్ వరద నీటి పైపులను మరమ్మతు చేస్తున్న క్రమంలో జరిగిన పొరపాటుకు పలుచోట్ల పైపులైన్ల నుంచి నీరు భారీగా బయటకు తన్నుకొచ్చింది.
దీంతో లోయర్ ట్యాంక్‌బండ్ ప్రాంతంలో వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రవాహాన్ని నియంత్రించడానికి అధికారులు 24 గంటలు శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు లీకేజీలు ఆగిపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. హుస్సేన్‌సాగర్ నుంచి కట్టమైసమ్మ దేవాలయం, ఉస్మానియా యూనివర్సిటీ మీదుగా ఉప్పల్ వరకు ఉన్న వరద నీటి పైపులైన్లకు ట్యాంక్‌బండ్ వద్ద మరమ్మతులు జరుపుతున్నారు.
గురువారం మధ్యాహ్నం షెట్టర్ తిప్పడంలో జరిగిన పొరపాటుతో పలుచోట్ల పైపులైన్ల నుంచి వరద నీరు పొంగిపొర్లింది. డివిజన్‌లోని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పాత కార్యాలయం వద్ద, దివంగత నేత పీజేఆర్ ఇంటి సమీపంలో, రామకృష్ణమఠం వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. ఈ పైపుల నుంచి వరద నీరు భారీగా రావడంతో ఇందిరాపార్కు ప్రధాన రహదారితోపాటు డివిజన్‌లోని రోజ్‌కాలనీ, దోమలగూడ, ఏవీ కళాశాల, గగన్‌మహల్ పోలీస్ అవుట్‌పోస్టు తదితర బస్తీలు, రోడ్లు జలమయమయ్యాయి.
వరద నీరు బయటకు రావడంతో ఇందిరాపార్కు రహదారితోపాటు బస్తీల రోడ్లు కాలువలను తలపించగా ప్రజలు, ప్రయాణికులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న జలమండలి, జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే ఆయా చోట్లకు చేరుకుని మరమ్మతులు సాగించారు. గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు 24 గంటల పాటు శ్రమించి వరదనీటి ప్రవాహాన్ని నియత్రించగలిగారు.
గతంలో రామకృష్ణమఠం వద్ద..
గత ఏడాది జూలైలో రామకృష్ణమఠంలో ఏర్పాటు చేయతలపెట్టిన 30 కిలో మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటు కోసం ఎర్తింగ్ కోసం డ్రిల్లింగ్ పనులు చేపడుతుండగా దాదాపు పద్నాలుగు అడుగుల లోతులో ఉన్న పైపులైను పగలడంతో ఒక్కసారిగా పైపు నుంచి నీరు ఎగిసిపడింది. దీంతో ఆరేడు గంటలపాటు శ్రమించి వర ద నీటిని నియత్రించగలిగారు. ఆ తరువాత వారం రోజులకు తిరిగి అక్కడే ఏర్పడిన లీకేజీతో మరోమారు పైపులైను నుంచి వరద నీరు రావడంతో ఇందిరాపార్కు రహదారి జలమయమై ప్రజలు, పాదచారులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
నిజాం కాలం నాటి పైపులైన్..
జనావాసాల మీదుగా వెళ్లిన ఈ పైపులైన్ దాదాపు ఎనభై ఏళ్ల క్రితం నిజాం హయాంలో వేసినట్టుగా జలమండలి అధికారులు చెబుతున్నారు. హుస్సేన్‌సాగర్ నుంచి కట్టమైసమ్మ దేవాలయం సమీపం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ మీదుగా ఉప్పల్ వరకు ఈ పైపులైన్ ఉన్నట్టు సమాచారం. అప్పట్లో ఈ పైపులైన్ ద్వారా హుస్సేన్‌సాగర్ మంచినీటిని ఆయా ప్రాంతాలకు సరఫరా చేసేవారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పైపులైన్ ద్వారా సరఫరా అవుతున్న నీటిని ఉస్మానియా యూనివర్సిటీ, ఉప్పల్ ప్రాంతాల్లో మొక్కలు, చెట్ల పెంపకానికి వినియోగిస్తున్నట్టు సమాచారం.