సాక్షి, హైదరాబాద్: భారతీయ రక్షణ దళం దక్షిణ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రళయ్ సహాయ్ కార్యక్రమం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. శనివారం ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి హుస్సేన్‌సాగర్ వేదికైంది. ఆకస్మిక వరదలు విపత్తుల సందర్భంగా చేపట్టే అత్యవసర సహాయక సేవలు, పునరావాస కార్యక్రమాలపై ప్రదర్శనలను (మాక్‌డ్రిల్) ఏర్పాటు చేశారు. భారతీయ రక్షణ, విమాన, నావికా దళాలతో పాటు ఎన్డీఆర్‌ఎఫ్, రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నివారణ విభాగాలు ఈ మాక్ డ్రిల్‌లో పాల్గొన్నాయి. నగరంలో భారీ వరద సంభవిస్తే మునిగిన ఇళ్లు, భవనాల నుంచి ప్రజలను ఏవిధంగా రక్షించాలనే దానిపై సైనికులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి.
దీని కోసం హుస్సేన్ సాగర్‌లో మునిగిపోయిన ఇళ్లు, భవనాలు, విద్యాసంస్థలు, వాహనాల నమూనాలను ఏర్పాటు చేశారు. ఈ భవనాల్లో ప్రజలు చిక్కుకున్నట్లు కేకలు వేస్తూ కనిపించారు. వారిని సైనికులు స్పీడు బోట్ల సాయంతో రక్షించేందుకు ప్రయత్నించారు. వీటితో పాటు హెలికాప్టర్ నుంచి సైన్యం సాగర్‌లోకి తాడు సాయంతో దిగడం, వారు పడవల ద్వారా నీట మునిగిన భవంతుల వద్దకు చేరుకుని వాటిల్లో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం వంటివి ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్టు చూపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ విన్యాసాలను లెఫ్టినెంట్ జనరల్ పీఎం హరీద్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ వీక్షించారు.