చెరువులకు సాగర్ జలాలు తరలింపు
చీమకుర్తి రూరల్ : రామతీర్థం రిజర్వాయర్‌లోని సాగర్ జలాలను మరో వారం రోజుల పాటు చెరువులకు తరలించనున్నారు. ఇరిగేషన్ ఈఈ రాజయ్య తెలిపిన వివరాల ప్రకారం... రామతీర్థం రిజర్వాయర్ నీటిమట్టం 85.3 మీటర్లు కాగా, ప్రస్తుతం 77.5 మీటర్ల వరకూ నీరు ఉంది. దానిలో డెడ్‌స్టోరేజీ పాయింట్ 74.9 మీటర్లకు చేరుకునే వరకు చెరువులకు నీరు సరఫరా చేయనున్నారు. రిజర్వాయర్‌కు దిగువనున్న చెరువులకు మేజర్లు ద్వారా శనివారం 405 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఇప్పటికే ఒంగోలులోని ఎస్‌ఎస్ ట్యాంకులకు నీరిస్తున్నారు.
త్రోవగుంట మేజరు పరిధిలోని 16 చెరువులకుగాను 12 చెరువులను నింపారు. కారుమంచి మేజరు పరిధిలో 7 చెరువులుండగా, దాదాపు 5 చెరువులను, కొప్పోలు మేజరు పరిధిలో 5 చెరువులకుగానూ ఇప్పటికే 3 చెరువులను నీటితో నింపారు. ఈతముక్కల మేజరు కింద రానున్న వారం రోజుల్లో నీరిస్తారు. వాటితో పాటు ఆర్‌డబ్ల్యూఎస్ పరిధిలోని 43 చెరువులకు సాగర్ నీరు ఇస్తున్నారు. ఒకవైపు చెరువులకు ఇస్తూనే మరోవైపు పొగాకు, మిర్చి పంటలు సాగు చేసే రైతులకు కూడా ఒక తడికి సాగర్‌నీరు అందిస్తున్నారు. రామతీర్థం రిజర్వాయర్‌లోని సాగర్ జలాలు డెడ్‌స్టోరేజీకి చేరే వరకూ చెరువులకు నీరు సరఫరా చేస్తామని, సద్వినియోగం చేసుకోవాలని ఈఈ తెలిపారు.