అప్పుడు స్వర్ణయుగం.. ఇప్పుడు సర్వం నాశనం..!
సాక్షి, మర్రిపూడి (ప్రకాశం): మహానేత వైఎస్సార్ పాలన ఓ స్వర్ణయుగం..అడిగిన వాడికి..అడగని వాడికి లేదనకుండా పెట్టిన చేయ్యి అది. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు కోట్ల రూపాయలను ఖర్చు చేసి మహానేత వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. మహానేత హయాంలో మర్రిపూడి, సీఎస్‌పురం, పామూరు, కనిగిరి, పెదచెర్లోపల్లి, వెలిగండ్ల మండలాల్లో తాగునీటి ఇక్కట్లు తీర్చేందుకు రూ.91 కోట్లతో పథకాన్ని రూపొందించి ప్రజల దాహార్తి తీరిస్తే.. ప్రస్తుత పాలకులు ఆ పథకాన్ని గాలికొదిలేశారు. ఫలితంగా ఈ మండలాల పరిధిలోని గ్రామాలన్నీ దాహార్తితో అలమటిస్తున్నాయి. తాగునీటి కోసం ప్రజలు గొంతెతున్నా వారి గోడు ఆలకించే ప్రజాప్రతినిధులు, అధికారులు కరువవుతున్నారు.
తాగునీటికి నిత్యం ఎన్ని తిప్పలో..
రామతీర్థం జలాలు అందకపోవడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక ధర వెచ్చించి బబుల్ నీరుకొనుగోలుచేయాల్సివస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఆ బబుల్ వాటర్ అందుబాటులో లేని వారు పీపాలు, బిందెలు పట్టుకొని ట్రాక్టర్ల సాయంతో పొలాల్లో ఉన్న బోర్ల వద్దకు పరుగులు తీయాల్సి వస్తోంది. మరికొందరు ద్విచక్రవాహనాలపై దూర ప్రాంతాలకు వెళ్లి తాగునీటికి తంటాలుపడుతున్నారు. వేసవి నేపథ్యంలో అధికారులు ట్యాంకర్ల సాయంతోనేనైనా గ్రామాల్లో తాగునీటి సమస్యను తీర్చాలని మండల ప్రజలు కోరుతున్నారు.
పథకం లక్ష్యం..పక్కదారి
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకం గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. పథకంలోభాగంగా ఏర్పాటు చేసిన పైపులు నిత్యం లీకులు కావడంతో నీరు కలుషితమై సక్రమంగా సరఫరా కాలేదు. దీనికి తోడు స్కీం నిర్వహణ బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పగించారు. దీనికి తోడు స్కీం పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందికి నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడంతో వారు పూర్తిస్థాయిలో విధులు నిర్వహించలేకపోతున్నారు. మండలంలోని వల్లాయపాలెం, మర్రిపూడి, తదితర గ్రామ శివారుల్లో డీఆర్పీ 600 పైపులైన్ పగిలి నీరు వృథాగా పోతున్నాయి. అలాగే గుండ్లసముద్రం, గంగపాలెం, కూచిపూడి తదితర గ్రామాల్లో పైపులు లీకై నీరు కలుషితం కావడం నిత్యకృత్యమైంది. దీంతో ఆ పథకం పరిధిలో 241 గ్రామాలకు రామతీర్థం నీరు పూర్తిస్థాయిలో సరఫరా కావడం లేదు.
రామతీర్థం రిజర్వాయర్ నుంచి రూ.91 కోట్లతో..
వైఎస్ హయాంలో మర్రిపూడిలో నిర్మించిన తాగునీటి పథకం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008లో రూ.91 కోట్లు వెచ్చించి రామతీర్ధం రిజర్వాయర్ నుంచి మర్రిపూడి, సీఎస్‌పురం, పామూరు, కనిగిరి, పెదచెర్లోపల్లి, వెలిగండ్ల మండలాలకు పైపులైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేశారు. అందులో భాగంగా రూ. 5 కోట్లు వెచ్చించి మర్రిపూడి గ్రామశివారులో రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు రెండు లక్షల లీటర్లు శుద్ధిచేసి మండలంలోని 33 గ్రామాలకు తాగునీరు అందించేలా పథకాన్ని రూపకల్పన చేశారు. ఆయన అకాల మరణం తరువాత ఈ పథకానికి నిర్లక్ష్యపు జబ్బు సోకింది. వైఎస్ అకాల మరణం తర్వాత అప్పటి నీటిపారుదల శాఖమంత్రి పిన్నమనేని వెంకటేశ్వర్లు మర్రిపూడిలో తాగునీటి పథకాన్ని ప్రారంబించారు. తాగునీటి పథకం ఫేస్ 1 కింద కనిగిరి, పీసీపల్లి, మర్రిపూడి మండలాలల్లోని 139 గ్రామాలకు, ఫేస్ 2 కింద వెలిగండ్ల, పామూరు మండలాలలోని 102 గ్రామాలకు తాగునీరు ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రణాళిక రూపొందించారు. అయితే ఆ తరువాత పాలకులు పథకంపై పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.