పూర్తిగా అడుగంటిన రామతీర్థం జలాశయం
చీమకుర్తి రూరల్: రామతీర్థం రిజర్వాయర్ పూర్తిగా అడుగంటిపోయిందని.. అలాగే జిల్లాలోని తాగు నీటి చెరువుల పరిస్థితి ఉందని చీమకుర్తి ఇరిగేషన్ ఈఈ రాజభూషణం ఐజాక్ శుక్రవారం సీఈ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సాగర్ నీటిని విడుదల చేయాలని సీఈని కోరారు. శుక్రవారం చీమకుర్తి, దర్శి, ఒంగోలు ఇరిగేషన్ అధికారులతో సాగర్ నీటి పరిస్థితిపై సీఈ చర్చించారు. ఈ సమావేశంలో చీమకుర్తి ఈఈ ఐజాక్ మాట్లాడుతూ రామతీర్థం రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 85.34 మీటర్లు కాగా డెడ్‌స్టోరేజీ 74.9 మీటర్లు కంటే దిగువకు పడిపోయిందన్నారు.
దీంతో పాటు చీమకుర్తి, ఒంగోలు ప్రాంత ప్రజల తాగునీటి అవసరంతో పాటు రిజర్వాయర్‌కు దిగువనున్న చెరువులను నింపేందుకు కనీసం 1.5 టీఎంసీల నీరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 17న నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు సీఈ వెల్లడించారని రాజభూషణం తెలిపారు. 0/0 మైలు ఓబీసీ వద్ద 1800 క్యూసెక్కుల నీటిని విడుదల కావచ్చని, వాటి నుంచి 1400 క్యూసెక్కుల సాగర్ జలాలు రామతీర్థం రిజర్వాయర్‌లోకి వచ్చి చేరే అవకాశం ఉంటుందని తెలిపారు. సుమారు 1.5 టీఎంసీల నీటిని అడిగామని, వచ్చే నీటి సామర్థ్యాన్ని బట్టి తాగునీటితో పాటు చెరువులను నింపేందుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment