
చిన్నారిపై దురాగతం
బెంగళూరులో బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు
కర్ణాటక: ఓ క్రీడా శిక్షకుడు కామాంధునిగా మారి కటకటాలు లెక్కిస్తున్నాడు. మైనర్ బాలికపై దారుణానికి పాల్పడిన కేసులో బ్యాడ్మింటన్ కోచ్‌ను బెంగళూరు హుళిమావు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితడు సురేశ్ బాలాజీ (26), వివరాలు.. ఇటీవలే టెన్త్ క్లాస్ పరీక్షలు రాసిన బాలిక సెలవులు రావడంతో హుళిమావులోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. బాలిక 2 ఏళ్లుగా సురేశ్ బాలాజీ అనే బ్యాడ్మింటన్ కోచ్ వద్ద ఆట నేర్చుకుంటోంది. తమిళనాడుకు చెందిన ఇతడు బెంగళూరులో స్థిరపడ్డాడు. ఆట నేర్పించే నెపంతో అతడు బాలికను మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడేవాడు, ఎవరికై నా చెబితే హత్య చేస్తానని బెదిరించేవాడు.
ఇలా గుట్టురట్టు
ఇటీవల బాలిక అమ్మమ్మ మొబైల్ ద్వారా నిందితునికి నగ్న చిత్రాలు, వీడియోలు పంపుతోంది. అమ్మమ్మ గమనించి బాలికను నిలదీయడంతో పాటు ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితున్ని అరెస్టు చేశారు. అతని మొబైల్‌ఫోన్‌ని పోలీసులు తనిఖీ చేయగా 8 మంది బాలికల నగ్న ఫోటోలు, వీడియోలు లభ్యమయ్యాయి. దీంతో వారి మీద కూడా అత్యాచారాలు చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. కోచ్ తనను కనీసం 25 సార్లు అతని గదికి తీసుకెళ్లాడని బాలిక విచారణలో తెలిపింది. బాలికల అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని ఇతడు దురాగతాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుని విచారణలో మరిన్ని నిజాలు బయటపడే అవకాశముంది.