badminton coach
-
ఇలా అయితే కష్టమే
మ్యాచ్ ప్రాక్టీస్‌కు దూరమయ్యేకొద్దీ క్రీడాకారులు తిరిగి గాడిన పడటం కష్టమవుతుందని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆందోళన వ్యక్తం చేశారు. తన కెరీర్లో ఆటకు ఇలాంటి ఎడబాటు ఎప్పుడూ లేదన్నారు. ఇది ఆటగాళ్ల ఆటతీరుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. న్యూఢిల్లీ: సుదీర్ఘ లాక్డౌన్ ఆటగాళ్ల ఆటతీరును ప్రభావితం చేసే ప్రమాదముందని, ఇన్ని నెలలుగా మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోతే మళ్లీ పూర్తిస్థాయి ఫామ్‌లోకి రావడం చాలా కష్టమవుతుందని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు. ఇది ప్లేయర్లకే కాదు... ద్వితీయశ్రేణి కోచ్‌లు, క్రీడా పరికరాల దుకాణాలకు నష్టాలనే తెచ్చిపెట్టిందన్నారు. మీడియాకిచ్చిన ఇంటర్వూ్యలో ఈ 46 ఏళ్ల చీఫ్ కోచ్ పలు అంశాలపై స్పందించారు. ఇలాగే కొనసాగితే... ఆటలు, పోటీలు లేకపోవడం ఇప్పటికైతే ఫర్వాలేదు కానీ ఇదే పరిస్థితి ఇంకో నెల, నెలన్నర కొనసాగితే మాత్రం ఆటగాళ్లకు కష్టమే! వాళ్ల సహనానికి ఇది కచ్చితంగా విషమ పరీక్షే అవుతుంది. లాక్డౌన్ మొదటి నెలంతా విశ్రాంతి తీసుకున్నారు. కొందరైతే గతంలో చేయని పనుల్ని సరదాగా చేసి మురిశారు. తర్వాత రెండు నెలలు కసరత్తు ప్రారంభించారు. ఆన్లైన్ ట్రెయినింగ్‌లో నిమగ్నమయ్యారు. ఇక్కడ ఆటగాళ్లకు శారీరక, మానసిక సవాళ్లు ఎదురవుతాయి. విశ్రాంతితో మానసిక బలం చేకూరుతుందేమో కానీ... నెలల తరబడి ఇలాగే ఉంటే ఫిట్నెస్ (శారీరక), ఫామ్ సమస్యలు తప్పవు. పైగా ఒలింపిక్స్‌కు ముందు ఇది మరింత ప్రమాదకరం కూడా! తొలిసారి ఈ ఎడబాటు... నా కెరీర్లో నేనెప్పుడూ ఇన్ని నెలలు బ్యాడ్మింటన్‌కు దూరం కాలేదు. ఆటగాడి నుంచి కోచ్ అయ్యేదాకా ఇలాంటి అనుభవం ఇదే తొలిసారి. ఆన్లైన్ కోచింగ్, ఫిట్నెస్ సెషన్లతో అందుబాటులో ఉండటం ద్వారా ఆ వెలితిని కాస్త పూడ్చుకోగలుగుతున్నా. నా వరకైతే ఇది ఓకే. ఈ తీరిక సమయాన్ని చదివేందుకు, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టేందుకు వినియోగించుకుంటున్నా. కోచింగ్ డెవలప్మెంట్ వర్క్‌షాప్‌లతో బిజీగా మారుతున్నా. ఎటొచ్చి మ్యాచ్ ప్రాక్టీస్ లేని ఆటగాళ్లకే ఇది నష్టం. మారే క్రీడా క్యాలెండర్... కరోనా పరిస్థితులతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టోర్నీలన్నీ వాయిదా వేసింది. కొన్ని రద్దు చేసింది. సాధారణంగా ప్రత్యేకించి ఏదైనా దేశం, టోర్నీ వాయిదా పడితే అందులో ఆడేవారిపై ప్రభావం పడుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా వేరు. ప్రయాణ ఆంక్షలు, క్వారంటైన్ నిబంధనలు, వీసాలతో ఇపుడు ఏ టోర్నీ అయినా ఆగొచ్చు. క్రీడా క్యాలెండర్ మరిన్ని మార్పులకు గురికావొచ్చు. కోచ్‌లకూ కష్టకాలం... ఈ ప్రతిష్టంభనతో ఒక్క ఆటగాళ్లే కాదు దీన్ని నమ్ముకున్న కోచ్‌లు, క్రీడా పరికరాల షాపులకు నష్టాలే. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, మే నెలలు సెలవులతో ఉంటాయి. అప్పుడు పిల్లలంతా ఆటలపై మరలుతారు. క్రీడా వస్తువులు కొంటారు. స్థానిక కోచ్‌లతో తమ ఆటల ముచ్చట తీర్చుకుంటారు. కానీ ఈసారి పరిస్థితి తిరగబడింది. ప్రొఫెషనల్ కోచ్‌లకు ఏ ఇబ్బంది లేకపోయినా ఢిల్లీలోని సిరిఫోర్ట్, త్యాగరాజ్ స్టేడియాల్లో స్వతంత్రంగా పనిచేసే కోచ్‌లకు జీవనాధారం కరువైంది. ఇలాంటి వారి కోసం అర్జున అవార్డీలు అశ్విని నాచప్ప, మాలతి హోలలతో కలిసి ‘రన్ టు ద మూన్’ పేరిట నిధులు సేకరించాలని నిర్ణయించాం. -
విదేశీ కోచ్‌లకు జవాబుదారీతనం ఉండాలి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ ముందు భారత బ్యాడ్మింటన్ డబుల్స్ విదేశీ కోచ్ ఫ్లాండీ లింపెలె (ఇండోనేసియా) తన పదవికి రాజీనామా చేయడం పట్ల భారత మాజీ బ్యాడ్మింటన్ కోచ్ విమల్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారీ మొత్తం చెల్లించి వారిని తీసుకుంటే బాధ్యతారాహిత్యంగా కీలక టోర్నీల ముందు చేతులెత్తేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ కోచ్‌లకు కచ్చితంగా జవాబుదారీతనం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ‘ఫ్లాండీ వెళ్లిన తీరు అనైతికం, దురదృష్టకరం. భారత డబుల్స్ జోడీ దాదాపుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. డబుల్స్‌లో మనకు మంచి ఫలితాలు రానున్న ఈ తరుణంలో ఆయన పదవీ కాలాన్ని ముగించకుండానే అర్ధాంతరంగా వెళ్లిపోవడం నిరాశ కలిగించింది. జనవరిలో నేను ఫ్లాండీతో చాలాసేపు చర్చించాను. ఆయన మన ఆటగాళ్ల గురించి మాట్లాడారు. ఎక్కడ లోపాలున్నాయో గుర్తించి సరిదిద్దుతానన్నారు. కానీ ఇలా ఆల్ ఇంగ్లండ్ టోర్నీకి ముందే మధ్యలోనే వెళ్లిపోయారు. ఇది సరి కాదు’ అని భారత్ బ్యాడ్మింటన్‌కు 2003 నుంచి 2006 వరకు చీఫ్ కోచ్‌గా వ్యవహరించిన విమల్ అసహనం వ్యక్తం చేశారు. గతేడాది మార్చిలో డబుల్స్ కోచ్‌గా నియమితులైన లింపెలె... కుటుంబ కారణాలను చూపిస్తూ పదవీకాలం ముగియకుండానే భారత కోచ్ పదవికి రాజీనామా చేశారు. ఇలా చేసిన నాలుగో విదేశీ కోచ్ లింపెలె. అతని కన్నా ముందు పీవీ సింధు ప్రపంచ చాంపియన్‌గా మారడంలో కీలక పాత్ర పోషించిన కొరియా కోచ్ కిమ్ జీ హ్యూన్, ఇండోనేసియా కోచ్ ముల్యో హండాయో, మలేసియా కోచ్ టాన్ కిమ్ పలు కారణాలతో ఇలాగే పదవీ కాలం ముగియకుండానే వెళ్లిపోయారు. ప్రతీసారి ఇలాగే జరుగుతుండటంతో విదేశీ కోచ్‌లను నియమించే సమయంలోనే కఠిన నిబంధనలు విధించాలని విమల్ కుమార్ అభిప్రాయపడ్డారు. ‘కోచ్‌లకు జవాబుదారీతనం ఉండేలా నిబంధనలు రూపొందించాలి. వారికి నిర్దేశించిన పనికి, వ్యక్తులకు వారే బాధ్యులుగా ఉండేలా ఫలితాలు రాబట్టేలా కాంట్రాక్టులోనే నియమాలు పొందుపరచాలి. విదేశీ కోచ్‌లకు చాలా పెద్ద మొత్తం ఇస్తున్నాం. ఇలా చెప్పా పెట్టకుండా వెళ్లిపోకూడదు’ అని విమల్ అన్నారు. ఇప్పటివరకు భారత్ నుంచి సింగిల్స్‌లో సింధు, సాయి ప్రణీత్‌తో పాటు డబుల్స్‌లో చిరాగ్ శెట్టి–సాత్విక్ సాయిరాజ్ జోడీ మాత్రమే ప్రస్తుతానికి ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
సింగిల్స్ కోచ్‌గా సొంటోసో
న్యూఢిల్లీ: ఒలింపిక్ ఏడాది నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ సింగిల్స్ కోచ్‌గా ఇండోనేసియాకు చెందిన అగుస్ డ్వి సాంటోసోను ఎంపిక చేస్తూ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జి హ్యూన్ వెళ్లడంతో ఏర్పడిన కోచ్ ఖాళీని భర్తీ చేయాలంటూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) గతంలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖను కోరింది. దానిపై స్పందించిన మంత్రిత్వ శాఖ సాంటోస్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అతడు ఒలింపిక్స్ ముగిసే వరకు కోచ్‌గా సేవలు అందించనున్నాడు. సాంటోస్ మార్చి రెండో వారంలో భారత బ్యాడ్మింటన్ జట్టుతో కలుస్తాడు. అతడి పర్యవేక్షణలో ప్రపంచ చాంపియన్ పీవీ సింధుతో పాటు ఇతర సింగిల్స్ షట్లర్లు కూడా టోక్యో కోసం సిద్ధమవుతారు. సాంటోస్ శిక్షణతో సంతృప్తి చెందితే అతడిని 2024 వరకు కూడా కొనసాగిస్తామని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కార్యదర్శి అజయ్ సింఘానియా తెలిపారు. ఒలింపిక్స్ వరకు సొంటోసోకు నెలకు 8 వేల డాలర్లు (సుమారు రూ.5.8 లక్షలు ) చెల్లించనున్నారు. -
బ్యాడ్మింటన్ కోచ్‌పై విచారణ
► తిరుపతిలో విచారణ చేపట్టిన నెల్లూరు డీఎస్డీవో ► శిక్షణ ఫీజు స్వాహా చేశారని ఆరోపణ తిరుపతి స్పోర్ట్స్: బ్యాడ్మింటన్ కోచ్ నిర్లక్ష్యంగా చూస్తున్నాడని, ఐదేళ్లుగా అరకొర శిక్షణ ఇస్తూ, పోటీల్లో పాల్గొనకుండా చూశాడని, పైగా విద్యార్థులు నెలనెలా చెల్లించిన ఫీజులు సైతం కార్యాలయంలో జమ చేయకుండా స్వాహా చేశాడని తల్లిదండ్రులు శాప్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై శాప్ మేనేజింగ్ డైరెక్టర్ బంగార్రాజు స్పందించారు. తక్షణమే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా డీఎస్డీవో పి.వెంకట రమణయ్యను విచారణ అధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు చేరుకున్న విచారణ అధికారి ఏవో వరలక్ష్మిని కలిశారు. కోచ్‌పై విద్యార్థుల ఫిర్యాదు ఏవో సమక్షంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాడ్మింటన్ కోచ్ జి.శివయ్యను, విద్యార్థులను విచారించారు. అంతకు ముందు ఐదేళ్లుగా విద్యార్థుల వద్ద వసూలు చేసిన ఫీజు వివరాలపై రికార్డుల ఆధారంగా విచారణ చేపట్టారు. బ్యాడ్మింటన్‌లో మొత్తం 180 మంది విద్యార్థులు శిక్షణ కోసం వస్తున్నారని, వారు ప్రతి నెలా ఫీజులు చెల్లిస్తున్నా ఆ డబ్బులు మాత్రం కార్యాలయంలో జమ కాలేదని, ఫీజులకు రశీదు కూడా ఇవ్వలేదని విచారణలో తేలింది. అందరికీ సమానంగా శిక్షణ ఇవ్వకపోగా, డబ్బులున్న వారి పిల్లలకు మాత్రమే ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారని, అర్హులను జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించకుండా విస్మరించినట్టు విచారణలో తేలింది. ఐదేళ్లుగా బ్యాడ్మింటన్ ఫీజు నెలకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు వస్తున్నట్టు రికార్డులో పేర్కొన్నారు. అదే కొత్త ఏవో వరలక్ష్మీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి నెలకు ఫీజు రూ.90 వేల నుంచి రూ.1 లక్ష వరకు రావడంపై విచారణ అధికారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక్క సారిగా మూడింతలు ఆదాయం పెరగడంపై లోతుగా విచారించారు. ఇదే విషయమై శాప్ ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తానని, ఆపై చర్యలు ఉంటాయని ఆయన విలేకరులకు తెలిపారు. -
పరీక్షల్లో ఫెయిల్ కావడం వల్లే: గోపీచంద్
న్యూఢిల్లీ: బాగా చదువుకుని గొప్పవారైనవారు ఎందరో ఉన్నారు. అయితే చదువు అంతగా రాకపోవడం తన అదృష్టమని బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ చెబుతున్నాడు. అంతర్జాతీయ షట్లర్‌గా ఎదిగిన గోపీ.. రిటరైన తర్వాత కోచ్‌గా ఎందరో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేశాడు. గోపీ శిక్షణలో స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు ఒలింపిక్ పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. గోపీ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. ఓ సన్మాన కార్యక్రమంలో గోపీచంద్ మాట్లాడుతూ.. తాను చదువుకునే రోజులు, షట్లర్‌గా ఎదుగుతున్న రోజులను గుర్తుచేసుకున్నాడు. పరీక్షల్లో ఫెయిల్‌కావడం తనకు కలిసివచ్చిందని, దీనివల్ల బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా కెరీర్‌ను కొనసాగించి విజయవంతమయ్యానని చెప్పాడు. 'చిన్నప్పుడు నేను, నా సోదరుడు క్రీడలు ఆడేవాళ్లం. నా సోదరుడు అప్పట్లో స్టేట్ చాంపియన్. ఐఐటీ పరీక్ష రాసి పాసయ్యాడు. ఐఐటీ చేసేందుకు వెళ్లడంతో క్రీడలను ఆపేశాడు. నేను ఇంజనీరింగ్ పరీక్ష రాస్తే ఫెయిలయ్యాను. దీంతో క్రీడలను కొనసాగించా. ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నా. చదువులో చురుగ్గాలేకపోవడం నా అదృష్టమని భావిస్తున్నా' అని గోపీచంద్ అన్నాడు. అంతర్జాతీయ షట్లర్‌గా ఎదిగిన గోపీచంద్.. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ గెలిచిన రెండో భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా ఘనత సాధించాడు. ఆ తర్వాత అకాడమీ స్థాపించి మేటి క్రీడాకారులను తయారు చేశాడు. అకాడమీని నెలకొల్పే సమయంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయని గోపీచంద్ చెప్పాడు. కుటుంబ సభ్యులు అండగా నిలవడంతో పాటు కొందరు సాయం చేశారని తెలిపాడు. 2004లో 25 మంది పిల్లలతో అకాడమీని ప్రారంభించానని గుర్తుచేసుకున్నాడు. సింధు 8 ఏళ్ల వయసులో అకాడమీలో చేరిందని తెలిపాడు. ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ క్రీడలో భారత్ పతకం గెలవాలన్న తన కల నాలుగేళ్ల క్రితం సాకారమైందని చెప్పాడు. 2012 లండన్ ఒలింపిక్ గేమ్స్‌లో సైనా కాంస్యపతకం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు రజత పతకం గెలిచింది. ఈ సన్మాన కార్యక్రమంలో పీవీ సింధు తండ్రి పీవీ రమణ పాల్గొన్నాడు. -
మనీలా సదస్సుకు ఉషారాణి
ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో ఈ నెల 6 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాన్ఫరెన్స్ (ఏషియన్ పొలిటిక్స్) సదస్సుకు గుంటూరులోని పాత గుంటూరుకు చెందిన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాన్ఫరెన్స్ ఉమెన్స్ వింగ్ జనరల్ సెక్రటరీ, బ్యాడ్మింటన్ కోచ్ గారా ఉషారాణి ఎంపికైంది. ఉషారాణి మాట్లాడుతూ మహిళలను అన్ని రంగాల్లో శక్తిమంతులుగా తీర్చిదిద్దేందుకు సదస్సు దోహదపడుతుందన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి బయలుదేరి మనీలాకు వెళుతున్నట్లు ఆమె చెప్పారు. ఉషారాణికి జిల్లా అధ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి జి.శేషయ్య, క్రీడాకారులు, నాయకులు అభినందనలు తెలిపారు.