బ్యాడ్మింటన్ కోచ్‌పై విచారణ
► తిరుపతిలో విచారణ చేపట్టిన నెల్లూరు డీఎస్‌డీవో
► శిక్షణ ఫీజు స్వాహా చేశారని ఆరోపణ
తిరుపతి స్పోర్ట్స్: బ్యాడ్మింటన్ కోచ్ నిర్లక్ష్యంగా చూస్తున్నాడని, ఐదేళ్లుగా అరకొర శిక్షణ ఇస్తూ, పోటీల్లో పాల్గొనకుండా చూశాడని, పైగా విద్యార్థులు నెలనెలా చెల్లించిన ఫీజులు సైతం కార్యాలయంలో జమ చేయకుండా స్వాహా చేశాడని తల్లిదండ్రులు శాప్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై శాప్ మేనేజింగ్ డైరెక్టర్ బంగార్రాజు స్పందించారు. తక్షణమే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా డీఎస్‌డీవో పి.వెంకట రమణయ్యను విచారణ అధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు చేరుకున్న విచారణ అధికారి ఏవో వరలక్ష్మిని కలిశారు.
కోచ్‌పై విద్యార్థుల ఫిర్యాదు
ఏవో సమక్షంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాడ్మింటన్ కోచ్ జి.శివయ్యను, విద్యార్థులను విచారించారు. అంతకు ముందు ఐదేళ్లుగా విద్యార్థుల వద్ద వసూలు చేసిన ఫీజు వివరాలపై రికార్డుల ఆధారంగా విచారణ చేపట్టారు. బ్యాడ్మింటన్‌లో మొత్తం 180 మంది విద్యార్థులు శిక్షణ కోసం వస్తున్నారని, వారు ప్రతి నెలా ఫీజులు చెల్లిస్తున్నా ఆ డబ్బులు మాత్రం కార్యాలయంలో జమ కాలేదని, ఫీజులకు రశీదు కూడా ఇవ్వలేదని విచారణలో తేలింది. అందరికీ సమానంగా శిక్షణ ఇవ్వకపోగా, డబ్బులున్న వారి పిల్లలకు మాత్రమే ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారని, అర్హులను జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించకుండా విస్మరించినట్టు విచారణలో తేలింది. ఐదేళ్లుగా బ్యాడ్మింటన్ ఫీజు నెలకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు వస్తున్నట్టు రికార్డులో పేర్కొన్నారు. అదే కొత్త ఏవో వరలక్ష్మీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి నెలకు ఫీజు రూ.90 వేల నుంచి రూ.1 లక్ష వరకు రావడంపై విచారణ అధికారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక్క సారిగా మూడింతలు ఆదాయం పెరగడంపై లోతుగా విచారించారు. ఇదే విషయమై శాప్ ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తానని, ఆపై చర్యలు ఉంటాయని ఆయన విలేకరులకు తెలిపారు.