అయ్యో పాపం!
అయ్యో పాపం!
Published Mon, Dec 12 2016 10:54 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM
గుంతకల్లు టౌన్ / అనంతపురం సిటీ: వారిప్పుడే ఈ లోకంలోకి వచ్చారు. భావవ్యక్తీకరణకు భాష తెలియని అమాయకులు. కుటుంబ సభ్యులకు ఏ కష్టమొచ్చిందో గానీ అభం శుభం తెలియని ఆ శిశువులను బయట పడేశారు. ఒక శిశువు సజీవంగా లభ్యమైతే, మరొక శిశువు చనిపోయి ఉంది. అయ్యో పాపం అన్పించే ఈ ఘటనలు సోమవారం అనంతపురం జిల్లాలో వేర్వేరు చోట్ల వెలుగు చూశాయి. వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు పట్టణ శివారులోని సమ్మర్‌స్టోరేజీ ట్యాంక్ పంప్‌హౌస్ ఎదురుగా ఉన్న ముళ్లపొదల్లో నుంచి పసికందు ఏడ్పును అక్కడికెళ్లిన ముగ్గురు బాలురు భరత్, రాజశేఖర్, రాజు విన్నారు. వెళ్లి చూడగా పసికందును ఓ టవల్‌లో చుట్టి పడేసి ఉండడం కన్పించింది. తలపైభాగంలో చీమలు కరిచి చిన్న గాయాలయ్యాయి. వెంటనే వారు 100కి డయల్ చేశారు. గుంతకల్లు వన్టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ఆడశిశువును 1098 చైల్డ్‌లైన్ సంస్థ మండల కోఆర్డినేటర్ బాలాజీకి అప్పగించారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పసికందును పరీక్షించిన చిన్నపిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ హరిప్రసాద్ ఆ పసికందుకు పుట్టుకతోనే మలవిసర్జన ప్రాంతంలో రంధ్రం లేదని, వెంటనే చిన్నపిల్లల సర్జన్తో ఆపరేషన్ చేయించాల్సి ఉంటుందని తెలిపారు. తర్వాత అక్కడి నుంచి అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. శిశువు బొడ్డుకున్న క్లిప్‌ను చూస్తే ఎక్కడో హాస్పిటల్‌లోనే జన్మించినట్లు తెలుస్తోంది. అలాగే అనంతపురం సర్వజనాస్పత్రి గైనిక్ వార్డు సమీపంలోని నీళ్ల ట్యాంకు వద్ద ఉన్న క్యారీ బ్యాగులో మృత మగశిశువు లభ్యమైంది. ఈ విషయాన్ని రోగుల బంధువులు గమనించి ఔట్‌పోస్ట్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత శిశువును స్వాధీనం చేసుకున్నారు. కాగా.. మృత శిశువు లభించిన ప్రాంతంలో గుర్తుతెలియని మహిళకు కాన్పు చేసినట్లు తెలుస్తోంది.
Advertisement