సాక్షి, కడప/పులివెందుల : నక్కలపల్లె ఎస్‌ఎస్ ట్యాంకు నీరులేక వెలవెలబోతోంది. దీంతో తాగునీటి ముప్పు ముంచుకొస్తోంది. వేసవితోపాటు ఇతర ఏ సందర్భంలోనూ పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించి ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడకూడదన్న మహాసంకల్పంతో దివంగత సీఎం వైఎస్సార్ ముందుచూపుగా నక్కలపల్లె వద్ద సమ్మర్ స్టోరేజీ ట్యాంకు (ఎస్‌ఎస్ ట్యాంకు) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
వైఎస్సార్ జీవించినంతకాలం సమ్మర్ స్టోరేజీకి నీరు తీసుకొచ్చి సమస్య లేకుండా చూస్తూ వచ్చారు. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ సర్కార్ సక్రమంగా నీరు విడుదల చేయకపోవడంతో పులివెందుల సమస్యల సుడిగుండంలో పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపధ్యంలో గత ఏడాది అన్నో ఇన్నో నీళ్లను నక్కలపల్లె సమీపంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో నీటి నిల్వ చేసినా, ప్రస్తుతకరువు పరిస్థితులలో పూర్తిగా ఎండిపోయింది. పులివెందులకు నీటి గండం ముంచుకొస్తోంది.
పులివెందులకు ఎక్కిళ్లు..
నక్కలపల్లె వద్ద రూ. 40 కోట్లకు పైగా వెచ్చించి సమ్మర్ స్టోరేజీ ట్యాంకును నిర్మించారు. అయితే, ఈ ఏడాది 2014 జనవరి, ఫిబ్రవరి ప్రాంతంలో ఎస్‌ఎస్ ట్యాంకుకు సీబీఆర్ నుంచి నీరు తీసుకొచ్చి నిల్వ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పులివెందుల ప్రజలకు సంబంధించి ప్రతిరోజు అవసరమైన రూ. 10 లక్షలకు పైగా లీటర్ల నీటిని అందిస్తూ వచ్చారు. అయితే, వర్షాభావ పరిస్థితులకు తోడు విపరీతమైన ఎండలు కాస్తుండడంతో ఉన్న నీరు అయి పోయాయి. ప్రస్తుతం సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నీరు లేక ఎండిపోయి బీటలు వారింది. ప్రజలకు నీటిని ఎలా అందించాలన్న సమస్య అధికారుల్లో మొదలైంది. చివరకు పులివెందులలో అన్నో ఇన్నో బోర్లలో వస్తున్న నీళ్లు కూడా ఇప్పుడు రాకుండా పోతున్నాయి. బోర్లలో కూడా నీరు ఆవిరి కావడంతో పాలకవర్గం అనుమతితో మున్సిపాలిటీ అధికారులు కొత్త బోర్లను వేస్తున్నారు.
నీరివ్వలేక చేతులు ఎత్తేసిన ఆర్‌డబ్ల్యుఎస్..
రెండు వారాల క్రితమే ఎస్‌ఎస్ ట్యాంకు ఎండిపోవడంతో తాత్కాలికంగా పులివెందుల ప్రజలకు నీరందించేందుకు మున్సిపల్‌శాఖ అధికారులు గ్రామీణ తాగునీటి విభాగం అధికారులతో మాట్లాడారు. రోజూ పది లక్షల లీటర్ల నీటిని మున్సిపాలిటీ ప్రజలకు ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ అందించేలా....పది లక్షల లీటర్ల నీటికి రూ. 6 వేలు చొప్పున అద్దె ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. అయితే, రెండుమూడు రోజులు నీటిని అందించిన ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ గ్రామాలకు నీటి సమస్య ఉత్పన్నం అవుతుందంటూ చేతులెత్తేసింది. దీంతో పులివెందుల మున్సిపాలిటీ అధికారులతో పాలకవర్గం మాట్లాడి ఉలిమెల్ల వద్ద బోర్లువేశారు. ఆశాజనకంగా బోర్లలో నీరు పడడంతో వారం, పదిరోజుల్లో కనెక్షన్ ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు.
10 ట్యాంకులతో ప్రజలకు నీరు..
పులివెందుల మున్సిపాలిటీలో ప్రస్తుతం బోర్లు ఎండిపోవడంతో ఎస్‌ఎస్ ట్యాంకులో నీరు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులు ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం పది ట్యాంకర్లతో వీధులకు నీటిని సరఫరాచేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో మరికొన్ని ట్యాంకర్లను అదనంగా పెట్టి నీందించేందుకు కసరత్తు చేస్తున్నారు. పులివెందుల మున్సిపాలిటీలో 65 వేల పైచిలుకు జనాభా ఉండగా, రోజుకు 10 నుంచి 13 లక్షల లీటర్ల మేర నీటి అవసరం ముంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పులివెందులకు తాగునీటి గండం
Published Wed, Sep 10 2014 2:35 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM
Advertisement
Advertisement