సంఘటనా స్థలం వద్ద బైఠాయించిన బంధువులు
మెహిదీపట్నం బోజగుట్టలో ఘటన
హైదరాబాద్: నగరంలో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు గోడ కూలి దుర్మరణం పాలయ్యారు. ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై కుమారస్వామి వివరాలను మీడియాకు తెలిపారు. మహారాష్ట్ర, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన నాగేశ్(30), కృష్ణ (35) మెహిదీపట్నం బోజగుట్టలో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. అయోధ్యనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నం. 28 వద్ద ఓ భవన నిర్మాణ పనుల్లో ఉండగా, పక్కనున్న మరో భవనం ప్రహరీ వీరిపై కూలింది. ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. మృతులకు న్యాయం చేయాలంటూ మృతుల బంధువులు, ఇతర కార్మికులు బైఠాయించారు.
ఏసీపీ గౌస్ మొహియుద్దీన్, డీఐ రాజరాజేశ్వర్ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదు పులోకి తీసుకొచ్చారు. భవన నిర్మాణంలో సెల్లార్, 6వ అంతస్తులను అనుమతి లేకుండా నిర్మిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్పారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో మృతదేహాలను తరలించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.6 లక్షల బీమాతో పాటు రూ. 30 వేల దహన సంస్కారాల ఖర్చును అందిస్తామని భవన నిర్మాణ కార్మిక సంఘం నగర అ«ధ్యక్షుడు పి.రామారావు తెలిపారు.