Hyderabad: నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన వెబ్‌సిరీస్‌ చూసి.. కిడ్నాప్‌ చేసి.. | Inspired By Money Heist On Netflix Gang Pulls Off Kidnaps In Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన వెబ్‌సిరీస్‌ చూసి.. కిడ్నాప్‌ చేసి..

Published Wed, Feb 16 2022 2:07 AM | Last Updated on Wed, Feb 16 2022 1:07 PM

Inspired By Money Heist On Netflix Gang Pulls Off Kidnaps In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘మనీ హెయిస్ట్‌’ చూసి కిడ్నాప్‌లకు తెగబడి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ తప్పించుకుంటున్న ఓ ఘరానా నేరగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘరానా నిందితుడితోపాటు అతడి గ్యాంగ్‌ను ఆసిఫ్‌నగర్‌ పోలీసులు పట్టుకున్నట్లు కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. మెహిదీపట్నంలోని భోజగుట్టకు చెందిన గుంజపోగు సురేశ్‌ 2011 నుంచి నేరాలు చేయడం మొదలెట్టాడు. ఇతడిపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో 14 చోరీ కేసులు నమోదయ్యాయి. 2019 డిసెంబర్‌లో జైలుకు వెళ్లి 2020 ఫిబ్రవరిలో బయటకు వచ్చాడు. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘మనీ హెయిస్ట్‌’వెబ్‌ సిరీస్‌ అతడిని ఆకర్షించింది.

దీంతో అదే పంథాలో అపహరణలు చేసి బాధితుల నుంచి డబ్బు రాబట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ వ్యవహారంలో తనకు సహకరించడానికి భోజగుట్ట ప్రాంతానికే చెందిన ఎం.రోహిత్, ఐ.జగదీశ్, కె.కునాల్‌లతోపాటు జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన శ్వేతాచారిని ఏర్పాటు చేసుకున్నాడు. వీరికి ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు జీతాలు ఇచ్చేవాడు. తన స్నేహితుల ద్వారా పరిచయమైన వారి ఫోన్‌ నంబర్లు సంగ్రహించేవాడు. వారితో సంప్రదింపులు జరపడానికి ప్రత్యేకంగా ఫోన్, నంబర్‌ ఏర్పాటు చేసుకున్నాడు. శ్వేతాచారి ఫొటోను డీపీగా పెట్టి, ఆమెతోనే వాయిస్‌ మెసేజ్‌లు సందేశాలు పంపి టార్గెట్‌ చేసిన వ్యక్తుల్ని ముగ్గులోకి దించేవాడు. పగటిపూట ఆమెతో, రాత్రిళ్లు స్వయంగా చాటింగ్‌ చేసేవాడు.

అడుగడుగునా జాగ్రత్తలు: ఓ దశలో డేటింగ్‌ కోసం కలుద్దామంటూ శ్వేతతో సందేశం పంపించి ఏదో ఒక చోటుకు బాధితులను రప్పించేవాడు. అక్కడకు వచ్చిన తర్వాత తన గ్యాంగ్‌తో కలసి కిడ్నాప్‌ చేసేవాడు. గుర్తుపట్టకుండా ఉండటానికి తమతోపాటు బాధితులకూ మాస్కులు, ఫేస్‌కవర్లు చేయించేవాడు. బాధితుడి ఫోన్‌ నుంచి కాల్స్‌ చేయడమో, అతడి నుంచి హాట్‌స్పాట్‌ తీసుకుని తన ఫోన్‌ ద్వారా వాట్సాప్‌ కాల్స్‌ చేసి బాధితుల కుటుంబాన్ని బెది రించేవాడు. డిమాండ్‌ చేసిన నగదును బాధితుడి ఖాతాలో వేయించి, బాధితుడితోనే ఏటీఎంల నుంచి డ్రా చేయించి డబ్బు తీసుకున్నాక అతడిని విడిచిపెట్టేవాడు.

ఇలా 2021 నుంచి సంగారెడ్డి జిల్లా సదాశివపేట, హైదరాబాద్‌లోని లంగర్‌హౌ స్, జీడిమెట్ల, ఆసిఫ్‌నగర్, రాజేంద్రనగర్‌తోపాటు తెనాలి రూరల్‌లో ఆరు నేరాలకు పాల్పడ్డాడు. సురేశ్‌ ఒక్కోసారి బాధిత కుటుంబీకులను డబ్బులు తీసుకొని హైదరాబాద్‌లోని అవుటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)కిందకు రమ్మనేవాడు. కిందికి తాడు సహాయంతో డబ్బు సంచిని పైకి లాగి తీసుకునేవాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని ఈ నెల 5న కిడ్నాప్‌ చేసి, రూ.50 వేలు వసూలు చేశాక మరుసటిరోజు విడిచి పెట్టాడు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న ఆసిఫ్‌నగర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తన కోసం గాలిస్తున్నారనే విషయం తెలుసుకున్న సురేశ్‌ తన కారును కర్నూలులో రిపేరుకు ఇచ్చి ఆ షెడ్‌ యజమాని నుంచి తాత్కాలికంగా మరో వాహనం తీసుకున్నాడు. ఇలా పది రోజులుగా సంచరిస్తున్న సురేశ్‌ హైదరాబాద్‌ చేరుకోగానే ఆసిఫ్‌నగర్‌ పోలీసులు పట్టుకున్నారు. సురేశ్‌ ముఠాను కూడా అదుపులోకి తీసుకున్నారు. శ్వేత కోసం గాలిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement