మెహిదీపట్నం... పోరు రసవత్తరం! | Mehdipatnam GHMC Elections | Sakshi
Sakshi News home page

మెహిదీపట్నం... పోరు రసవత్తరం!

Published Fri, Jan 29 2016 1:13 AM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM

మెహిదీపట్నం... పోరు రసవత్తరం!

మెహిదీపట్నం... పోరు రసవత్తరం!

* బరిలో మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్
* గెలుపుకోసం టీఆర్‌ఎస్ పోరాటం
* రెండోసారి విజేతగా నిలిచేందుకు బీజేపీ ఆరాటం


మెహిదీపట్నం: మెహిదీపట్నం డివిజన్‌లో ఎన్నికల పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడి నుంచి ఎంఐఎం అభ్యర్థిగా మాజీ మేయర్ మాజిద్ రంగంలో ఉన్నారు. ఎలాగైనా గెలుపు సాధించి తన రాజకీయ భవిష్యత్తును పదిలం చేసుకోవాలని ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇక రెండవసారి గెలిచేందుకు బీజేపీ, ఎలాగైనా పాగా వేయాలని టీఆర్‌ఎస్ అభ్యర్థులు కూడా పట్టుదలతో ముందుకు సాగుతుండడంతో ఎన్నికల వేడి పుంజుకుంది. బలమైన క్యాడర్..టీడీపీ అండదండలతో విజయం సాధించడానికి బీజేపీ అభ్యర్థి భుజేందర్‌కుమార్ ప్రయత్నిస్తున్నారు. సంక్షేమ పథకాలు, సెంటిమెంట్, కేసీఆర్ ఇమేజ్‌తో ప్రజల మధ్యకు వె ళ్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థి అశోక్‌కుమార్ సైతం ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మెహిదీపట్నం డివిజన్‌లో పోరు రసవత్తరంగా మారింది.
 
డివిజన్‌లో ప్రధాన సమస్యలివీ....
మెహిదీపట్నం డివిజన్‌లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా తాగునీరు మురికిగా వస్తుండడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థతో పలు అవస్థలు ఎదురవుతున్నాయి. రాత్రి వేళ వీధి దీపాలు వెలగకపోవడంతో మహిళలు తిరగలేని పరిస్థితి నెలకొంది. హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్ నుంచి రేతిబౌలి చౌరస్తా వరకు నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 
మాజిద్ హుస్సేన్ - ఎంఐఎం
ప్రచార సరళి:  ప్రచారాన్ని ఆలస్యంగా ప్రారంభించి కొంత వెనుకంజలో ఉన్నారు. ఇంటింటి ప్రచారం ఇప్పటి వరకు నిర్వహించ లేదు. కేవలం మైక్‌ల ద్వారానే ప్రచారం చేస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. పోలింగ్ సమీపిస్తుండడంతో అభివృద్ధి నినాదంతో ముందుకు సాగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
 
బలాలు(+): గతంలో మేయర్‌గా పని చేసిన అనుభవం, తన హయాంలో జరిగిన సీసీ రోడ్లు, పార్కుల అభివృద్ధి తదితర అంశాలు కలిసొచ్చే అవకాశం ఉంది. పార్టీకి బలమైన క్యాడర్ ఉండడం..అగ్రనేతల మద్దతు, ఓటు బ్యాంకు కూడా మాజిద్‌కు ప్లస్‌గా చెప్పొచ్చు. సెలైంట్‌గా దూసుకెళ్లి విజయాన్ని మూటకట్టుకోవాలని ఆయన భావిస్తున్నారు.
 
బలహీనతలు(-): మేయర్‌గా ఉన్న సమయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నట్లు విమర్శలు రావడం. ఒకే వర్గానికి ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తున్నారనే అపవాదు మూటకట్టుకోవడం మాజిద్‌కు మైనస్ అనొచ్చు.
 
వి.భుజేందర్‌కుమార్ - బీజేపీ
ప్రచార సరళి: టికెట్ వస్తుందో రాదో అనే సందేహంతో ఉన్న భుజేందర్‌కుమార్...చివరి నిమిషంలో పార్టీ టికెట్ ఇవ్వడంతో పోటీకి సిద్ధమయ్యారు. ప్రచారాన్ని ప్రారంభించడంలో కొంత జాప్యం జరిగినా.... క్రమంగా ముమ్మరం చేస్తూ ముందుకు సాగుతున్నారు. టీడీపీ నేతల సహకారంతో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
 
బలాలు(+): గతంలో మెహిదీపట్నం డివిజన్ నుంచే కార్పొరేటర్‌గా ఉండడం, బీజేపీ, టీడీపీ పొత్తు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. స్థానికంగా నివాసం ఉంటూ ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి కావడం వల్ల ఒకింత బలం చేకూరే అవకాశముంది.
 
బలహీనతలు(-): ప్రజలతో అంతగా సంబంధాలు లేవనే ప్రచారం ఉండడం మైనస్‌గా చెపొచ్చు. ఎన్నికలు దగ్గరపడుతున్నా అగ్రనాయకులు ప్రచారంలో పాల్గొనక పోవడం క్యాడర్‌ను నిరాశపరుస్తోంది.
 
సి.అశోక్‌కుమార్ - టీఆర్‌ఎస్
ప్రచార సరళి: పార్టీలోకి ఆరునెలల ముందు వచ్చిన అశోక్‌కుమార్ మొదటి నుంచే టీఆర్‌ఎస్ పార్టీ ప్రథకాలను వివరిస్తూ ప్రచారం ప్రారంభించారు.  ఉపముఖ్యమంత్రి, మంత్రులు సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి గడపగడపకు తిరుగుతూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. స్థానిక నేతలు, కార్యకర్తల సహకారం తీసుకుంటున్నారు.
 
బలాలు(+): స్థానికంగా ఉండడం, తాత వెంకన్న పోలీస్ పటేల్‌గా పని చేసి మంచి పేరు కలిగి ఉండడం కలిసొచ్చే అంశం. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సహాయ సహకారాలు ఉండడం ప్లస్‌గా చెప్పొచ్చు.
 
బలహీనతలు(-):
కొత్తగా పార్టీలోకి వచ్చిన అశోక్‌కుమార్‌కు అధిష్టానం టికెట్ ఇవ్వడంతో సీనియర్ నాయకుల్లో అసంతృప్తి. రాజకీయ అనుభవం లేకపోవడం,  నియోజకవర్గ ఇన్‌చార్జి హనుమంతరావు సహకారం లేకపోవడం, ప్రజా సమస్యలు అంతగా తెలవకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement