pv expressway
-
మెహిదీపట్నం టూ శంషాబాద్ ఎయిర్‌పోర్టు జస్ట్ 18 నిమిషాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని మెహిదీపట్నం నుంచి 30 కిలోమీటర్ల దూరం.. విపరీతమైన ట్రాఫిక్, ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఔటర్ రింగురోడ్డుతో అనుసంధానమైన బెంగళూరు జాతీయ రహదారిని దాటాల్సి రావటం.. వెరసి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ఎప్పుడూ టెన్షనే. ఇప్పుడు ఆ టెన్షన్‌ను తగ్గిస్తూ విమానాశ్రయానికి కొత్త ‘రాచబాట’ సిద్ధం కాబోతోంది. తాజాగా పనులు మొదలుపెట్టిన జాతీయ రహదారుల విభాగం మరో 12 నుంచి 15 నెలల్లో దాన్ని సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే సంవత్సరం జూలై నాటికి దాని మీదుగా దూసుకెళ్లొచ్చు. మెహిదీపట్నం నుంచి జస్ట్ 18 నిమిషాల్లో విమానాశ్రయంలో దిగొచ్చు. పీవీ ఎక్స్‌ప్రెస్‌వేకు కొనసాగింపుగా.. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శంషాబాద్ అవతల నిర్మించింది. దానికి వీలైనంత తొందరగా చేరుకునేందుకు అప్పట్లో దేశంలోనే అతి పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించింది. మెహిదీపట్నం సమీపంలో మొదలయ్యే ఈ నాలుగు వరుసల ఫ్లైఓవర్ 11.6 కి.మీ. సాగి బెంగళూరు జాతీయ రహదారిపై వ్యవసాయ విశ్వవిద్యాలయం గేటు ఎదుట ముగుస్తుంది. పదేళ్ల కిందటే ఈ వంతెన అందుబాటులోకి రావటంతో.. విమానాశ్రయానికి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు వెళ్లగలుగుతున్నారు. కానీ విమానాశ్రయం ఏర్పాటుతో శంషాబాద్ పట్టణం ఒక్కసారిగా అభివృద్ధి చెందటం ప్రారంభమైంది. వాహనాల సంఖ్య బాగా పెరిగింది. ఫలితంగా ఆ రోడ్డు రద్దీగా మారింది. పీవీ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేపై వచ్చే వాహనాలు జాతీయ రహదారిపై దిగగానే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్నాయి. మెహిదీ పట్నం నుంచి అక్కడి వరకు 10–12 నిమిషాల్లో వచ్చే వాహనాలు, అక్కడి నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకు నేందుకు అరగంట కంటే ఎక్కువ సమయం పడుతోంది. విమానాశ్రయానికి వెళ్లే వారికి పెద్ద సమస్యగా పరిణ మించింది. దీనికి పరిష్కారంగా ఇప్పుడు జాతీయ రహ దారిని పీవీ ఎక్స్‌ప్రెస్‌వేకు కొనసాగింపుగా ఎక్స్‌ప్రెస్ వే తరహాలో మార్చాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. గతేడాది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆ పనులను జాతీయ రహదారుల విభాగం ప్రారంభించింది. ఆరు నిమిషాల్లోనే.. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే దిగిన వాహనాలు అక్కడి నుంచి విమానాశ్రయానికి ఆరు నిమిషాల్లోనే చేరుకునేలా రోడ్డును పూర్తిగా మారుస్తున్నారు. పీవీ ఎలివేటెడ్ కారిడార్ పూర్తయిన వెంటనే ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ వే తరహా నిర్మాణం మొదలవుతుంది. అక్కడికి 200 మీటర్ల తర్వాత లైట్‌వెయిట్ వెహిక్యులర్ అండర్ పాస్ (ఎల్‌వీయూపీ) నిర్మిస్తారు. ప్రధాన రోడ్డుపై సిగ్నల్స్, యూటర్న్ అవకాశం ఉండదు. దానిమీదకు వచ్చే వాహనాలు నేరుగా విమానాశ్రయానికో, బెంగళూరు వైపో వెళ్లాల్సిందే. ఇందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లే సాధారణ వాహనాలు ఆ రోడ్డును క్రాస్ చేసేందుకు ఈ అండర్‌పాస్ ఉపయోగపడుతుంది. ఇది 770 మీటర్ల పొడవుతో నిర్మితమవుతుంది. కార్లు, మినీ వెహికిల్స్, ఆటోలు, ద్విచక్ర వాహనాలు దీని కిందుగా రోడ్డును అటూఇటూ దాటతాయి. భారీ ఫ్లైఓవర్ కాటేదాన్, గగన్పహాడ్ల నుంచి వచ్చే వాహనాలు సిటీ వైపు, సమీపంలోని ఇతర ప్రాంతాల వైపు నుంచి వెళ్లేందుకు వీలుగా ఫ్లైఓవర్ ఆప్షన్ ఉంటుంది. 730 మీటర్ల పొడవుండే ఈ వంతెనను నిర్మిస్తారు. ఎయిర్‌పోర్టు, బెంగళూరు వైపు వెళ్లే వాహనాలు దీనిమీదుగా దూసుకెళ్తాయి. కాటేదాన్, గగన్‌పహాడ్ నుంచి వచ్చే వాహనాలు సిటీ వైపు వెళ్లాలన్నా, ప్రధాన రహదారిని క్రాస్ చేసి మరోవైపు వెళ్లాలన్నా దీని కిందుగా క్రాస్ చేయాల్సి ఉంటుంది. కాగా, శంషాబాద్ సమీపంలో 500 మీటర్ల పొడవుతో ఓ వెహికిల్ అండర్ పాస్ నిర్మిస్తారు. జాతీయ రహదారి మీదుగా కాకుండా అటూఇటూ వెళ్లే చిన్న వాహనాలు దీని కిందుగా ప్రధాన రోడ్డును క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే గగన్‌పహాడ్ గ్రామస్తులు రోడ్డు దాటేందుకు స్టీల్ ఫుట్ఓవర్ బ్రిడ్జి కూడా నిర్మిస్తారు. వీలైతే పాదచారులు రోడ్డు దాటేందుకు అండర్‌పాస్‌కు అనుసంధానంగా ఏర్పాటు చేయాలని ఇప్పుడు భావిస్తున్నారు. అది సాధ్యమైతే ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఉండదు. భారీ ఎలివేటెడ్ కారిడార్.. ప్రధాన ట్రాఫిక్ శంషాబాద్ పట్టణం వద్దనే ఉంటున్నందున ఆ ప్రాంతం యావత్తు దాటేందుకు విశాలమైన 1.2 కి.మీ. మీటర్ల పొడవుండే ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. శంషాబాద్ కంటే ముందు మొదలయ్యే ఈ కారిడార్ ముందుకు సాగి విమానాశ్రయం మలుపు వద్ద రెండుగా చీలుతుంది. విమానాశ్రయంలోకి వెళ్లేందుకు ఎడమవైపు ఒక పాయ చీలి ఎయిర్‌పోర్డు రోడ్డుపై ల్యాండ్ అవుతుంది. ప్రధాన పాయ జాతీయ రహదారిపై ఓఆర్ఆర్ వంతెన కంటే ముందు ల్యాండ్ అవుతుంది. విమానాశ్రయం నుంచి వచ్చి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు ఈ వంతెన మీదకు చేరుకునేలా ఓ ర్యాంపును అనుసంధానిస్తారు. గడువు లోపు పూర్తి చేస్తాం విమానాశ్రయానికి ప్రధాన అనుసంధానం అవుతున్నందున ఈ రోడ్డు నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేస్తాం. అది అందుబాటులోకి వస్తే మెహిదీపట్నం నుంచి విమానాశ్రయానికి 20 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు. ఎక్కడా విమానాశ్రయ వాహనాలకు అడ్డంకి లేకుండా ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రహదారి రూపుదిద్దుకోనుంది – గణపతి రెడ్డి,ఈఎన్సీ జాతీయ రహదారులు -
‘పీవీ ఎక్స్‌ప్రెస్ వే’కు హరిత శోభ
- పిల్లర్ల మీద వర్టికల్ గార్డెన్ ఏర్పాటుకు సన్నాహాలు - హెచ్ఎండీఏ, బెంగళూరు ‘సే ట్రీస్’ బృందం అధ్యయనం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను జీవవైవిధ్య నగరంగా మలిచేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) చర్యలు తీసుకుంటోంది. ఒకవైపు కాలుష్యాన్ని నియంత్రిస్తూనే, మరోవైపు పచ్చదనంతో నగరవాసులను ఆహ్లాదపరిచేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పీవీ నర్సింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేలో గ్రీన్‌వాల్స్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. బెంగళూరుకు చెందిన ‘సే ట్రీస్’సంస్థ సభ్యులతో కలసి నగరంలోని 11.6 కిలోమీటర్ల మేర ఉన్న పీవీ ఎక్స్‌ప్రెస్ వేలో హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు బుధవారం అధ్యయనం చేశారు. దేశంలోనే తొలిసారిగా బెంగళూరులోని హసూర్ రోడ్డు ఎలక్ట్రానిక్స్ సిటీ ఫ్లైఓవర్‌లోని పిల్లర్లపై పది రకాల మొక్కలతో 3,500 శాంప్లింగ్ మొక్కలను వర్టికల్ గార్డెన్ ద్వారా పెంచుతున్న విధానాన్ని సే ట్రీస్ సభ్యులు వివరించారు. ‘‘పిల్లర్ల వర్టికల్ గార్డెన్లో ఆటోమేటెడ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంటుంది. రోజుకు 100 మిల్లీలీటర్ల డోస్‌తో నీరు అందుతుంది. వర్టికల్ గార్డెన్ ఒక్కోవైపు యూనిక్ డిజైన్ ఉండేలా చూస్తాం. ఈ గార్డెన్లతో అన్ని పిల్ల ర్లను కవర్ చేస్తున్నాం. దీనివల్ల నగరంలో ఉన్న వేడి తగ్గుముఖం పడుతుంది. పొగమంచుతోపాటు గాలి కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. పక్షులు,కీటకాలు ఆరోగ్యకరమైన నివాసాలను ఏర్పరుచుకునే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ విలువ కూడా పెరిగే అవకాశముంది. ఈ గ్రీన్‌వాల్స్ వల్ల బయోడైవర్సిటీని నగరంలో పటిష్టం చేసినవారమవుతాం’’ అని సే ట్రీస్ సభ్యులు తెలిపారు. -
యువతి అనుమానాస్పద మృతి
లంగర్‌హౌస్: పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై సోమవారం అనుమానాస్పదస్థితిలో యువతి మృతదేహం లభించింది. లంగర్‌హౌస్ ఇన్స్పెక్టర్ ఎంఏ జావీద్, మృతురాలి కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కర్ణాటకకు చెందిన రాజేశ్వరి అత్తాపూర్‌లో నివసిస్తోంది. ఆమెకు కూతురు కావ్యశ్రీ(21), కుమారుడు ఉన్నారు. మూడేళ్ళ క్రితం ఆమె భర్త రవీష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రాజేశ్వరి అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబ బాధ్యతలు తీసుకున్న ఆమె కుమార్తె కావ్యశ్రీ ఏడాదిన్నరగా మాదాపూర్‌లోని డీఎల్ఎఫ్ సంస్థకు అనుబంధమైన యూనిసిస్లో సెక్యూరిటీ విభాగంలో పని చేస్తోంది. సోమవారం ఉదయం నిద్ర లేచేసరికి కావ్యశ్రీ కనిపించకపోవడంతో విధులకు వెళ్లి ఉంటుందని తల్లి భావించింది. అయితే ఉదయం 7.30 ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెం.74 సమీపంలోని ర్యాంపు దారిపై అనుమానాస్పద స్థితిలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన వాహనచోదకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న లంగర్‌హౌస్ పోలీసులు క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కావ్యశ్రీ సెల్‌ఫోన్ కాల్ డిటేల్స్,, సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అన్నీ అనుమానాలే... ♦ కావ్యశ్రీ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావ్యశ్రీ ఇళ్లు అత్తాపూర్‌లోని పిల్లర్ నెం.130 సమీపంలో ఉండగా, ఆఫీస్‌కు వెళ్లేందుకు ఆమె తరచూ పిల్లర్ నెం.128 వద్ద ఆటో ఎక్కేది. ♦ మృతదేహం లభ్యమైన పిల్లర్ నెం.74 నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఫ్లైఓవర్ పైకి వెళ్ళే వాహనాలు మాత్రమే నడుస్తుంటాయి. ద్విచక్ర వాహనాలకు కూడా ఈ రోడ్డులో అనుమతి లేదు. మృతురాలు అక్కడికి ఎందుకు వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది. ♦ కావ్యశ్రీ యూనిఫాం, టిఫిన్ బాక్సు సోమవారం ఆమె మృతదేహం వద్ద లభించలేదు. మృతదేçహానికి 150 మీటర్ల దూరంలో ఆమె చెప్పులు పడి ఉండటమూ అనుమానాలకు తావిస్తోంది. ఆమె ఫోన్ సైతం మరికొంత దూరంలో పడుంది. ♦ ఒక వేళ ఏదైనా వాహనం ఆమెను ఢీ కొట్టి ఉన్నా ఆమె ఒంటిపై గాయాలు ఉండాలి. అయితే మృతదేహంపై నడుము వద్ద మాత్రమే గాయమైంది. ఆమె ముక్కు, నోరు, చెవుల నుంచి తీవ్ర రక్తస్రావమైంది. నుదురు తదితర ప్రాంతాల్లో కమిలిన గాయాలు కనిపిస్తున్నాయి. ♦ కావ్యశ్రీ ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వచ్చిందనే అంశం పైనా స్పష్టత లేదు. సోమవారం ఉదయం తమకు కనిపించలేదని, రోజూ బయటకు వచ్చే సమయంలో మాత్రం రాలేదని కుటుంబీకులు చెబుతున్నారు. -
పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై యువతి అనుమానాస్పద మృతి
-
పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై యువతి అనుమానాస్పద మృతి
హైదరాబాద్ : నగరంలోని పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన సోమవారం కలకలం రేపింది. కర్ణాటకకు చెందిన కావ్యశ్రీ(23) అనే యువతి మాదాపూర్‌లోని డీఎన్‌ఎస్‌లో సెక్యూరిటీగా పనిచేస్తోంది. ఆమె మెహిదీపట్నం అత్తాపూర్‌లో నివాసం ఉంటోంది. సోమవారం ఉదయం ఇంటి నుంచి డ్యూటీకి బయల్దేరిన ఆమె పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై మృతురాలై కనిపించింది. కావ్యశ్రీ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆమె చెవులు, ముక్కు నుంచి రక్తం వస్తూ రోడ్డు పక్కన పడిపోయింది. ఆమెకు సంబంధించిన బ్యాగ్, ఫోన్ మరోవైపు పడి ఉన్నాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై స్కార్పియో బోల్తా
వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని పీవీ ఎక్స్‌ప్రెస్ వే పైన బుధవారం చోటుచేసుకుంది. పిల్లర్ నెంబర్ 219 వద్ద స్కార్పియో వాహనం బోల్తా కొట్టింది. మెహదీపట్నం నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. అందులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
సిటీ జామ్
► సిటీలో 5 సెంటీమీటర్ల వర్షం ► చెరువులను తలపించిన ప్రధాన రహదారులు ► ఎక్కడికక్కడే స్తంభించిన ట్రాఫిక్ ► తీవ్ర ఇక్కట్లపాలైన జనం ► పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై దారి కనిపించక మూడు కార్లు ఢీ సాక్షి, సిటీబ్యూరో: సిటీలో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. పలుచోట్ల 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యథావిధిగా నగరవాసికి మరోసారి ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యాయి. రహదారులపై మోకాలు లోతు నీరు నిలవడంతో చాలా చోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పైన వర్షంలో వాహనాలు కనబడక మూడు కార్లు ఢీకొన్నాయి. దీంతో దాదాపు రెండుగంటపాటు ఈ దారిలో ట్రాఫిక్ స్తంభించింది. పాఠశాలల, కళాశాలల నుంచి, ఆఫీసుల నుంచి ఇంటికి బయలుదేరిన చిన్నారులు, మహిళలు నానా అవస్థలు పడ్డారు. కొందరు రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఇంటికి చేరుకోలేక పోయారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో రహదారులు చెరువులను తలపించాయి. వరదనీరు పోటెత్తడంతో సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించింది. ► సికింద్రాబాద్ బోయిగూడ రైల్వే బ్రిడ్జి కింద నడుము లోతు వరకు వరదనీరు పోటెత్తడంతో ఈ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారలు, ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. ► కంటోన్మెంట్ నాలుగు, ఐదు వార్డుల్లో పలు బస్తీలు వర్షంధాటికి అతలాకుతలమయ్యాయి. వర్షపు నీరు రోడ్డుపై నిలవడంతో జూబ్లీబస్టాండ్, స్వీకార్ ఉపకార్ వద్ద ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. ► బహదూర్‌పురా, కిషన్‌బాగ్ నాలాలు పొంగిపొర్లడంతో పాతనగరంలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. బహదూర్‌పురా చౌరస్తాలోని నాలాలో చెత్త చెదారం పేరుకుపోవడంతో వర్షపు నీరు రోడ్డుపైకి చేరుకొని ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ► కుండపోత వర్షానికి నాచారం పెద్ద నాలాకు పెద్దఎత్తున వరద నీరు పోటెత్తింది. నాచారం పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రధాన రోడ్డుమార్గంలో ఉన్న కల్వర్టు ఉప్పొంగి ప్రవహించింది. కల్వర్టు దాటడానికి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ► నాచారం పోలీస్ స్టేషన్ నుండి నాచారం చౌరస్తా వరకు ట్రాఫిక్ జామయ్యింది. -
వేగమే యమపాశం
ఓఆర్ఆర్పై ముగ్గురు, పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పై ఇద్దరు మృతి ఘటనలు అతివేగమే కారణమని తేల్చిన పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: అతి వేగమే ప్రాణాల్ని బలిగొంటోంది. సోమవారం ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో ముగ్గురు, పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు దుర్మణం చెందారు. ఈ రెండు ప్రమాదాలకు మితి మీరిన వేగమే ప్రధాన కారణమని అధికారులు తేల్చారు. ఓఆర్ఆర్పై ఒకటి, రెండో లేన్‌లో వెళ్లాల్సిన కారు లేన్‌ను పాటించకపోవడంతో పాటు మరోపక్క అతివేగంతో వచ్చి ఆరో లేన్‌లో పార్క్ చేసిన లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ ఎంవీవీ సూర్యనారాయణరావు భార్య నాగ రామలక్ష్మి (50), కుమార్తె సింధూర (19), బావ మహిధర్ (50) దుర్మరణం చెందారు. విజయవాడ నుంచి వస్తున్న వీరి కారు ప్రమాద సమయంలో సుమారు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తోతోంది. ఇక పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పైజరిగిన ప్రమాదంలో కారు డ్రైవర్ భాను (26)తో పాటు గౌతం (21) ప్రాణాలు కోల్పోయారు. వీరి కారు కూడా ప్రమాదం జరిగినప్పుడు సుమారు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్టు గుర్తించారు. లారీ లేకుంటే ప్రమాద తీవ్రత తగ్గేది.. ఓఆర్ఆర్పై లారీ చెడిపోవడంతో నిబంధనల మేరకు ఆరో లేన్‌లో పార్క్ చేశారు. ఇది ఓఆర్ఆర్పై తిరిగే ట్రాఫిక్ పెట్రోలింగ్ మొబైల్-3 వాహనం గుర్తించలేదు. పెద్ద గోల్కొండ నుంచి రాజేంద్రనగర్ వరకు ఈ వాహనం పర్యవేక్షిస్తుంది. హిమాయత్‌సాగర్ వద్ద సిబ్బంది ఉదయం 9 గంటలకు డ్యూటీ మారుతుంటారు. సమయం దగ్గర పడుతుండడంతో పెద్ద గోల్కొండలో ఉన్న ఈ మొబైల్ వాహనం ఘటనా స్థలం మీదుగా ఉదయం 8.30కి వెళ్లింది. ఆ సమయంలో అక్కడ లారీ లేదు. ఈ వాహనం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్యూటీ ఛేంజ్ పా యింట్ వద్దకు రాగానే ప్రమాద సమాచారం అందింది. ఆ ప్రాంతం లో లారీ లేకుంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదని అధికారులు భావిస్తున్నారు. లారీ కోసం రాత్రి వరకు ఎవరూ రాకపోవడంతో పోలీసులే కాపలాగా ఉన్నారు. కాగా, ఓఆర్ఆర్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. ఓఆర్ఆర్ పైకి వాహనం ఎక్కేముందు టోల్గేట్ సిబ్బంది ఇచ్చే చిట్టీపై కూడా నిబంధనలు స్పష్టంగా ఉంటాయి. ఇక, ఓఆర్ఆర్పై స్పీడ్ గన్లు శాశ్వతంగా ఏర్పాటు చేసి ఉంటే వేగం తగ్గించుకునే అవకాశముంది. కానీ ఔటర్‌పై మొబైల్ స్పీడ్ గన్లు మాత్రమే ఉన్నాయి. వీటిని ట్రాఫిక్ పోలీసుల తనిఖీల సమయంలో మాత్రమే వాడుతున్నారు. -
జోరువాన
సాక్షి, సిటీబ్యూరో:కుండపోత వాన నగరంలో బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మొదలై రాత్రి పొద్దుపోయే వరకు ఎడ తెరిపిలేకుండా కురిసింది. మూడు రోజులుగా అక్కడక్కడా కురిసిన వాన సోమవారం ఉగ్రరూపం దాల్చింది. పలుచోట్ల ప్రధాన రోడ్లు కాల్వలను తలపించాయి. వాహనాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి చేరిన నీటిని తొలగించుకొంటూ బాధితులు రాత్రంతా జాగారం చేశారు. పురాతన భవనాల్లో నివసిస్తున్నవారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. సాయంత్రం వేళ ఉద్యోగులు, విద్యార్థులు ఇళ్లకు వెళ్లాల్సిన వారు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. రవాణా సాధనాలుఅందుబాటులో లేక మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, పాదచారులు నరకయాతన అనుభవించారు. రాదారులన్నీ గోదారులు వర్షపు నీటి ఉధృతితో ఉగ్రరూపం దాల్చిన మూసీ చాదర్‌ఘాట్ ప్రధాన బ్రిడ్జికి పక్కనే ఉండే కాజ్వే (చిన్న వంతెన)ను ముంచెత్తింది. మోకాళ్ల లోతున నీళ్లు ప్రవహించాయి. అటుగా వెళ్లే వాహనాలను గోల్నాక వైపు మళ్లించారు మలక్‌పేట గంజ్ ప్రాంతంలో మెట్రో పిల్లర్ల కోసం ఏర్పాటు చేసిన గుంతల్లో భారీగా వరదనీరు చేరి రోడ్డు కుంగిపోయింది. అందుటో మెట్రో రైలు పనుల కోసం ఏర్పాటు చేసిన బార్కేడ్ పడడంతో మలక్‌పేట-చాదర్‌ఘాట్ రూట్లో రాకపోకలు స్తంభించాయి. మలక్‌పేట రైల్వేస్టేషన్‌లోకి వరద నీరు చేరింది. టోలిచౌకి, పాత ముంబై రహదారి నీట మునిగాయి. ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు, సాగర్ రింగ్రోడ్లపైనా భారీగా వర్షపునీరు చేరింది అత్తాపూర్‌లోని మల్లయ్య టవర్స్ అపార్ట్మెంట్ సెల్లార్ నీట మునిగింది. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే 190వ పిల్లర్ ప్రాంతంలో భారీగా వర్షపు నీళ్లు చేరాయి. రాజేంద్రనగర్ పరిధిలోని హసన్‌నగర్, శివరాంపల్లి, రాంబాగ్, సులేమాన్‌నగర్, మారుతినగర్, ప్రియదర్శిని కాలనీల్లోని వంద కు పైగా ఇళ్లలోకి వరద నీరు చేరింది. ముంపు ప్రాంతాలను నగర మేయర్ మాజిద్ హుస్సేన్ సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఎల్బీనగర్, గోషామహల్, అబిడ్స్, సంతోష్‌నగర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి లోతట్టు ప్రాంతాలు మునక.. అంధకారం గోల్కొండ మోతి దర్వాజ, గుడిమల్కాపూర్ మార్కెట్, మందుల బస్తీ, నదీంకాలనీ, అంజయ్యనగర్, భోజగుట్ట, తాళ్లగడ్డ ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. కొన్నిచోట్ల వర్షపు నీరు వెళ్లేందుకు మ్యాన్‌హోల్ మూతలు తెరవడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. మలక్‌పేట, ఓల్డ్‌మలక్‌పేట, పాత నగరంలోని ఛత్రినాక, శివగంగానగర్, అరుంధతినగర్, సాయిబాబానగర్, క్రాంతినగర్, గౌలిపురా, కిషన్‌బాగ్ ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. బంజారాహిల్స్ పరిధిలోని బస్తీలు ముంపు బారినపడ్డాయి. ఎడతెరిపి లేని కారణంగా సహాయక చర్యలకు అంతరాయం కలిగింది. మరోపక్క నాలాలు, ఓపెన్ డ్రైనేజీల్లో వరద నీరు పోటెత్తింది. కూకట్పల్లినాలా, బంజారా, పికెట్, బల్కాపూర్ నాలాలు పొంగిపొర్లడంతో రహదారులపైకి మోకాళ్లలోతు నీరు చేరింది. ఇంకోవైపు శివారు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడడంతో పలుచోట్ల అంధకారం అలుముకుంది. వర్షం కారణంగా పునరుద్ధరణ చర్యలు చేపట్టడం వీలుకాకపోవడంతో జనం రాత్రి వేళ నరకయాతన అనుభవించారు.