జోరువాన
సాక్షి, సిటీబ్యూరో:కుండపోత వాన నగరంలో బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మొదలై రాత్రి పొద్దుపోయే వరకు ఎడ తెరిపిలేకుండా కురిసింది. మూడు రోజులుగా అక్కడక్కడా కురిసిన వాన సోమవారం ఉగ్రరూపం దాల్చింది. పలుచోట్ల ప్రధాన రోడ్లు కాల్వలను తలపించాయి. వాహనాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి చేరిన నీటిని తొలగించుకొంటూ బాధితులు రాత్రంతా జాగారం చేశారు. పురాతన భవనాల్లో నివసిస్తున్నవారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. సాయంత్రం వేళ ఉద్యోగులు, విద్యార్థులు ఇళ్లకు వెళ్లాల్సిన వారు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. రవాణా సాధనాలుఅందుబాటులో లేక మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, పాదచారులు నరకయాతన అనుభవించారు.
రాదారులన్నీ గోదారులు
వర్షపు నీటి ఉధృతితో ఉగ్రరూపం దాల్చిన మూసీ చాదర్‌ఘాట్ ప్రధాన బ్రిడ్జికి పక్కనే ఉండే కాజ్‌వే (చిన్న వంతెన)ను ముంచెత్తింది. మోకాళ్ల లోతున నీళ్లు ప్రవహించాయి. అటుగా వెళ్లే వాహనాలను గోల్నాక వైపు మళ్లించారు
మలక్‌పేట గంజ్ ప్రాంతంలో మెట్రో పిల్లర్ల కోసం ఏర్పాటు చేసిన గుంతల్లో భారీగా వరదనీరు చేరి రోడ్డు కుంగిపోయింది. అందుటో మెట్రో రైలు పనుల కోసం ఏర్పాటు చేసిన బార్‌కేడ్ పడడంతో మలక్‌పేట-చాదర్‌ఘాట్ రూట్లో రాకపోకలు స్తంభించాయి. మలక్‌పేట రైల్వేస్టేషన్‌లోకి వరద నీరు చేరింది.
టోలిచౌకి, పాత ముంబై రహదారి నీట మునిగాయి. ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు, సాగర్ రింగ్‌రోడ్లపైనా భారీగా వర్షపునీరు చేరింది
అత్తాపూర్‌లోని మల్లయ్య టవర్స్ అపార్ట్‌మెంట్ సెల్లార్ నీట మునిగింది. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే 190వ పిల్లర్ ప్రాంతంలో భారీగా వర్షపు నీళ్లు చేరాయి. రాజేంద్రనగర్ పరిధిలోని హసన్‌నగర్, శివరాంపల్లి, రాంబాగ్, సులేమాన్‌నగర్, మారుతినగర్, ప్రియదర్శిని కాలనీల్లోని వంద కు పైగా ఇళ్లలోకి వరద నీరు చేరింది. ముంపు ప్రాంతాలను నగర మేయర్ మాజిద్ హుస్సేన్ సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
ఎల్బీనగర్, గోషామహల్, అబిడ్స్, సంతోష్‌నగర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి
లోతట్టు ప్రాంతాలు మునక.. అంధకారం
గోల్కొండ మోతి దర్వాజ, గుడిమల్కాపూర్ మార్కెట్, మందుల బస్తీ, నదీంకాలనీ, అంజయ్యనగర్, భోజగుట్ట, తాళ్లగడ్డ ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. కొన్నిచోట్ల వర్షపు నీరు వెళ్లేందుకు మ్యాన్‌హోల్ మూతలు తెరవడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. మలక్‌పేట, ఓల్డ్‌మలక్‌పేట, పాత నగరంలోని ఛత్రినాక, శివగంగానగర్, అరుంధతినగర్, సాయిబాబానగర్, క్రాంతినగర్, గౌలిపురా, కిషన్‌బాగ్ ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. బంజారాహిల్స్ పరిధిలోని బస్తీలు ముంపు బారినపడ్డాయి. ఎడతెరిపి లేని కారణంగా సహాయక చర్యలకు అంతరాయం కలిగింది. మరోపక్క నాలాలు, ఓపెన్ డ్రైనేజీల్లో వరద నీరు పోటెత్తింది. కూకట్‌పల్లినాలా, బంజారా, పికెట్, బల్కాపూర్ నాలాలు పొంగిపొర్లడంతో రహదారులపైకి మోకాళ్లలోతు నీరు చేరింది. ఇంకోవైపు శివారు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడడంతో పలుచోట్ల అంధకారం అలుముకుంది. వర్షం కారణంగా పునరుద్ధరణ చర్యలు చేపట్టడం వీలుకాకపోవడంతో జనం రాత్రి వేళ నరకయాతన అనుభవించారు.