గోషామహల్‌కు ఉస్మానియా ఆస్పత్రి | Construction of a new hospital in 32 acres | Sakshi
Sakshi News home page

గోషామహల్‌కు ఉస్మానియా ఆస్పత్రి

Published Wed, Aug 28 2024 4:47 AM | Last Updated on Wed, Aug 28 2024 4:47 AM

Construction of a new hospital in 32 acres

‘స్పీడ్‌’పై సమీక్షలోసీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం 

32 ఎకరాల్లో కొత్త ఆస్పత్రి నిర్మాణం 

పోలీస్‌ స్టేడియం, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ స్థలం వైద్య, ఆరోగ్య శాఖకు బదిలీ 

అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం 

పాత ఆస్పత్రి భవనాన్నిహెరిటేజ్‌ కట్టడంగా పరిరక్షిస్తామని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్‌కు తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. గోషామహల్‌లోని పోలీస్‌ స్టేడియం, పోలీస్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్సులో ఉన్న దాదాపు 32 ఎకరాల్లో కొత్త ఆసుపత్రిని నిర్మించాలని, ఇందుకు గాను వెంటనే ఆ భూమిని వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వేగవంతం చేయాలని సూచించారు. 

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పీడ్‌ (స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియెంట్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ డెలివరీ) కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులపై తొలిసారిగా మంగళవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. 

స్పీడ్‌ ప్రణాళికలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణంతో పాటు కొత్తగా 15 నర్సింగ్‌ కాలేజీలు, 28 పారా మెడికల్‌ కాలేజీల ఏర్పాటు, జిల్లాల్లో సమాఖ్య భవనాల నిర్మాణంపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.  

వచ్చే 50 ఏళ్లకు తగినట్టుగా కొత్త ఆస్పత్రి
‘రాబోయే 50 సంవత్సరాల అవసరాలను అంచనా వేసి దానికనుగుణంగా కొత్త ఆసుపత్రి డిజైన్‌ను రూపొందించాలి. ఆసుపత్రి నలుదిశలా రోడ్లు ఉండాలి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయాలి. ఆసుపత్రికి అవసరమైన అన్ని విభాగాలతో పాటు అకడమిక్‌ బ్లాక్, నర్సింగ్‌ ఉద్యోగులకు హాస్టళ్లు కూడా నిర్మించాలి. కేవలం కాంక్రీట్‌ భవంతులు, బహుళ అంతస్తులు మాత్రమే ప్రధానం కాదు. ఆహ్లాదకరమైన విశాలమైన ఖాళీ ప్రాంగణం ఎక్కువగా ఉండాలి. 

కార్పొరేట్‌ తరహాలో వైద్య విభాగాలు, సేవలన్నీ అందుబాటులోకి రావాలి. ఇందుకు గాను అనుభవజు్ఞలైన ఆర్కిటెక్ట్‌లతో డిజైన్లు తయారు చేయించాలి. గోషామహల్‌ స్థలాన్ని వైద్య, ఆరోగ్య శాఖకు బదిలీ చేసినందుకు గాను పోలీసు విభాగానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలి. పేట్లబురుజులో ఉన్న పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్, సిటీ పోలీస్‌ అకాడమీల చుట్టూ ఉన్న స్థలాన్ని జిల్లా కలెక్టర్‌ క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలి. గోషామహల్‌లోని పోలీస్‌ స్టేడియం, స్పోర్ట్స్‌ కాంప్లెక్సును అక్కడకు తరలించేలా చూడాలి. 

రాష్ట్రంలో కొత్త ఆసుపత్రుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. 15 నర్సింగ్‌ కళాశాలల భవనాలను వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలి. కళాశాలలను తాత్కాలికంగా అద్దె భవనాల్లో నిర్వహించాలి..’అని సీఎం ఆదేశించారు. ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రి భవనాలను చారిత్రక కట్టడాలుగా పరిరక్షించే బాధ్యతను చేపడతామని, మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా హెరిటేజ్‌ కట్టడాలు గుర్తించి పర్యాటకులను ఆకట్టుకునే చారిత్రక భవనాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. 

ఎస్‌హెచ్‌జీలకు కొత్త భవనాలు 
మహిళా స్వయం సహాయక సంఘాలకు భవనాలు లేని 22 జిల్లాల్లో కొత్త భవనాలను నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకోసం ప్రతి జిల్లా సమాఖ్యకు ఎకరం భూమి కేటాయించేందుకు అంగీకరించిన సీఎం.. ముందుగా స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. శిల్పారామం పక్కన మహిళా శక్తి సంఘాలకు కేటాయించిన మూడెకరాల స్థలాన్ని వెంటనే బదిలీ చేయాలని, మహిళా శక్తి సంఘాలు తయారుచేసే ఉత్పత్తులను అక్కడ ఏడాది పొడవునా అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 

ఎగ్జిబిషన్‌ తరహాలో వివిధ రకాల ఉత్పత్తులను అక్కడ అందుబాటులో ఉంచాలని సూచించారు. వివిధ రంగాల ప్రముఖులు, జాతీయ స్థాయి నేతలు ఎవరు హైదరాబాద్‌కు వచ్చినా తప్పకుండా ఆ ప్రాంతాన్ని సందర్శించే విధంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement