Torrential rain
-
పెద్ద మోరీకి భారీ అడ్డం
నాలా వెంబడి కళాశాల నిర్మాణం 17 అడుగుల నాలా కనుమరుగు ఓ విద్యాసంస్థ నిర్వాకంతో వరద ముప్పు జీడబ్ల్యూఎంసీ ఇప్పటికైనా కళ్లు తెరుస్తుందా.. సాక్షి, హన్మకొండ : మూడు రోజుల క్రితం కుండపోత వర్షానికి హన్మకొండ నయీంనగర్ దగ్గర పెద్ద మోరీ ఉప్పొంగి ప్రవహించడంతో వంతెన పైకి నీరు చేరుకుంది. ఆ ప్రాంతమంతా జలయమౖయెంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మోకాలు లోతు వరకు వంతెనకు ఇరువైపులా నీరు చేరడంతో ట్రాఫిక్‌ను ఆపేశారు. ఇదే వర్షాలకు హనుమాన్‌నగర్ వద్ద పెద్దమోరీ వాగు వంతెన దగ్గర మాత్రం ఎటువంటి సమస్యా తలెత్తలేదు. భారీగా వచ్చిన వరద నీరు సాఫీగా వెళ్లిపోయింది. రాకపోకలకు ఎలాంటి ఆటంకమూ కలుగలేదు. కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు వంతెలన వద్ద వరద నీరు వల్ల ఉత్పన్నమైన పరిస్థితుల మధ్య తేడా ఇదీ.. ఈ రెండు వంతెనల మధ్య ఉన్న నాలాకు ఇరువైపులా వెలిసిన ఆక్రమ నిర్మాణాల కారణంగానే ఈ తేడా వచ్చింది. నాలా వెంబడి ఉన్న ఓ ప్రైవేటు కాలేజీ యాజమాన్యం చేపట్టిన నిర్మాణ కారణంగా నాలా వెడల్పు తగ్గిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. 20 అడుగుల మేరకు... పెద్ద మోరీ నాలా వెంబడి ప్రైవేటు కాలేజీ యాజమాన్యం చేపట్టిన నిర్మాణాలు నాలా పాలిట శాపంగా మారాయి. నయింనగర్ వద్ద పెద్ద మోరీ 60 అడుగుల వెడల్పుతో ప్రవహిస్తోంది. ఇదే నాలా ఈ ప్రైవేటు కాలేజీ దగ్గరికి వచ్చే సరికి 53 అడుగులకు తగ్గిపోయింది. ఈ కాలేజీని దాటే సరికి నాలా వెడల్పు మరింత తగ్గి 43 అడుగులకు చేరుకుంది. కేవలం కాలేజీ విస్తరించిన ఉన్న ప్రాంతంలో నాలా వెడల్పు దాదాపు పది అడుగుల మేరకు తగ్గిపోయింది. నాలా స్థలంలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఈ స్థాయిలో నాలా వెడల్పు తగ్గిపోవడంతో గురువారం, శుక్రవారం కురిసిన వర్షపు నీరు ముందుకు పోలేదు. ఫలితంగా వరద నీరు వెనక్కి వచ్చి రోడ్లు, వీధులను ముంచెత్తింది. నాలాల కబ్జాల కారణంగా తలెత్తుతున్న సమస్యలపై ఇప్పటికైనా గ్రేటర్ వరంగల్ అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సి ఉంది. నాలా వెంబడి వెలసిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి. -
ఎడతెరపిలేని వర్షంతో విమానాల ఆలస్యం
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నైలో కురుస్తున్న కుండపోత వర్షంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెన్నై తదితర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో విమానాశ్రయం రన్‌వే నీళ్లతో నిండిపోయింది. మంగళవారం రాత్రి 10 గంటల తర్వాత విదేశాలకు బయలుదేరాల్సిన విమానాలు చెన్నైలోనే నిలిచిపోయాయి. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన విమానాలు చెన్నైకి రాలేదు. రాత్రి 12 గంటల తర్వాత రన్‌వేపై నీళ్లు కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో విమానాలను అనుమతించారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా 30 విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. -
కుండపోతగా వర్షం
జలమయమైన రోడ్లు జనజీవనానికి తీవ్ర అంతరాయం పాడేరు రూరల్ : పాడేరు ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం కుండపోతగా వర్షం కురిసింది. వారం రోజులుగా ఏజెన్సీలో మబ్బులు, చిరుజల్లులే పడుతున్నాయి. కొన్ని రోజులుగా మబ్బువాతావరణం కొనసాగిన మన్యంలో మధ్యాహ్నం వరకు ఎండకాసింది. అనంతరం ఒక్క సారిగా మార్పు చోటుచేసుకుంది. ఒంటి గంట నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం పడింది. సుమారు ఆరు గంటలపాటు ఏకధాటిగా వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జనజీవనానికి ఆటంకం ఏర్పడింది. సుదూర ప్రాంతాల నుంచి పాడేరు వచ్చినవారు స్వగ్రామాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంటపొలాల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది. మండలంలోని ఇరడాపల్లి, పాడేరు-పెదబయలు మండలాల సరిహద్దులోని పి.కోడాపల్లి వద్ద మత్య్సగెడ్డపొంగి ప్రవాహించింది. రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేస్తున్నారు. సాగుకు ఈ వర్షం మేలు చేస్తుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. -
జనం నీళ్లల్లో.. మంత్రులు ఇళ్లల్లో..
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : నాలుగు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షంతో జనజీవనం అతలాకుతలమవుతున్నా మన జిల్లా ప్రజాప్రతినిధులు పత్తాకు లేరు. కష్టాల కండగండ్లలో చిక్కుకున్న వారిని ఆదుకునేందుకు నేతలకు తీరికలేకుండా పోయింది. చేతికొచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతిని విలపిస్తున్న అన్నదాతను ఓదార్చే దిక్కు కరువైంది. పూర్తిగా అధికారులు, ఇతర సిబ్బందిపైనే భారం మోపి ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 1,3,423 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ, మిరప, వరి తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 300 ఇళ్లు కూలిపోయాయి. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. సారయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పునియోజకవర్గ పరిధిలో రాధమ్మ అనే మహిళ గోడకూలి మృతిచెందింది. పలు కాలనీలు, ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకుని జనం బిక్కుబిక్కుమంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రైతులను, ప్రజలను ఓదారుస్తూ అధికారుల్లో చలనం తీసుకొచ్చి అవసరమైన చర్యలు చేపట్టడంలో భాగస్వామ్యం కావాల్సిన నాయకులంతా జాడలేకుండా పోయారు. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్, రాష్ర్ట మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, వర్ధన్నపేట, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, మాలోతు కవిత ఇప్పటి వరకు బాధితులను పలకరించిన పాపాన పోలేదు. టీడీపీ నేత, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కొడకండ్ల, రాయపర్తి మండలాల్లో పర్యటించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క కొత్తగూడ మండలంలో, నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి ఖానాపురం మండలంలో పర్యటించారు. డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ మాత్రం జాడలేకుండా పోయారు. టీఆర్ఎస్కు చెందిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ నియోజకవర్గంలోని జలదిగ్బంధ కాలనీల్లో పర్యటించారు. బాధితులకు మంచినీరు, భోజనవసతి ఏర్పాటు చేశారు. పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి గీసుకొండ మండలంలోని మచ్చాపూర్‌లో పర్యటించి రైతులను ఓదార్చారు. ఇక స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య పార్టీ ఎమ్మెల్యేల బృందం పర్యటనలో వరంగల్ మార్కెట్, నర్సంపే ట, గీసుగొండ ప్రాంతాల్లో పాల్గొన్నారు. తన నియోజకవర్గంలో ఇంకా అడుగిడలేదు. కొందరు ప్రజాప్రతినిధులు ఢిల్లీలో ఉంటే మరికొందరు హైదరాబాద్, జిల్లా కేంద్రానికే పరిమితమయ్యారు. నియోజకవర్గాల పర్యటనకు దూరం గా ఉన్నారు. జిల్లాలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు మినహా ఇతరత్రా ప్రజాప్రతినిధులెవరూ లేరు. పరిస్థితి సర్పంచ్ల స్థాయిలో లేదు. స్పందించాల్సిన మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కనీసం స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు రైతు సంఘాలు, ప్రజాసంఘాలు, అక్కడక్కడ టీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలకు చెందిన స్థానిక నాయకులు మాత్రం పర్యటించి రైతులకు కొంతైనా భరోసా కల్పిస్తున్నారు. ఇకనైనా మన ప్రజాప్రతినిధులు స్పందించి, బాధితులకు అండగా నిలిచేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
అతలాకుతలం
= నగరం కకావికలం = కుండపోతతో జనం యాతన = లోతట్టు ప్రాంతాలు జలమయం = ఇళ్లలోకి చేరిన నీళ్లు సాక్షి, సిటీబ్యూరో: బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు కుండపోత వర్షం గ్రేటర్ నగరాన్ని అతలాకుతలం చేసింది. సాయంత్రం 5.30 గంటల వరకు 8 సెంటీమీటర్లు, రాత్రి 8.30 వరకు 9.81 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేటలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సీజన్లో ఇదే రికార్డు వర్షపాతం. సాయంత్రం 4 నుంచి రాత్రి 10.30 వరకు ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, వాహనచోదకులు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకొని నరకయాతన అనుభవించారు. కుండపోత వర్షానికి తడిసి ముద్దవడంతో పాటు రోడ్లపై పోటెత్తిననీటిలో అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. పలువురు ఇళ్లకు సకాలంలో చేరలేకపోయారు. ఫ్లైఓవర్లపైనా కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ప్రధాన రహదారులు, షాపింగ్‌మాల్స్ ఎదుట పార్క్ చేసిన వాహనాలు వర్షపునీటి ప్రవాహంలో మునిగిపోయాయి. కొన్ని కొట్టుకుపోయాయి. హయత్‌నగర్, వనస్థలిపురం, దిల్సుఖ్నగర్, మలక్‌పేట, బహదూర్‌పురా, గాంధీనగర్, కాలాపత్తర్, చార్మినార్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, పంజగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, ఎస్.ఆర్.నగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, మెహిదీపట్నం, శేరిలింగంపల్లి, మియాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట ప్రాంతాల్లో వర్షవిలయానికి లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీటమునిగాయి. ఇళ్లలోకి నీళ్లు చేరాయి. నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల పరిస్థితిపై నగర మేయర్ మాజిద్ హుస్సేన్ జోనల్ కమిషనర్లతో ఫోన్లో సమీక్షించారు. సహాయక చర్యలకు ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం వందలాది బస్తీలు నీటమునిగాయి. సికింద్రాబాద్‌లోని అంబేద్కర్‌నగర్, ఇందిరమ్మనగర్, రసూల్‌పురా, అన్నానగర్, గాంధీనగర్‌లలోని లోతట్టుప్రాంతాల్లో గల ఇళ్లలోకి నీళ్లు చేరాయి. మెహిదీపట్నంలో గుడిమల్కాపూర్-మందుల బస్తీ, నదీంకాలనీ, అంజయ్యనగర్, భోజగుట్ట, తాళ్లగడ్డ ప్రాంతాల్లో స్థానికులు అవస్థలు పడ్డారు. కొన్నిచోట్ల వర్షపు నీళ్లు వెళ్లేందుకని మ్యాన్‌హోల్ మూతలు తెరవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. అంబర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, అబిడ్స్, చార్మినార్, బహదూర్‌పురా, శేరిలింగంపల్లి, తార్నాక, ఉప్పల్ ప్రాంతాల్లో వర్షపునీటి ప్రవాహం బెంబేలెత్తించింది. పలుచోట్ల అంధకారం భారీవర్షానికి పలు శివారు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తీగలు తెగిపడ్డాయి. పలుచోట్ల అంధకారం అలముకుంది. వర్షం కారణంగా పునరుద్ధరణ చర్యల్లో జాప్యం జరిగింది. ఇదీ వర్షవిలయం = నెక్లెస్ రోడ్డులోని ఇందిరాచౌక్ వద్ద హోర్డింగ్ కూలిపడింది. భారీ శబ్దంతో కూలిపోవడంతో పక్కనే ఐమాక్స్ థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఒకవైపు జోరువాన.. తడుస్తూనే ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వాహనచోదకులు.. పరిస్థితి ఘోరంగా మారింది. చాలాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది బేగంపేటలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం పక్కనే ఉన్న జీఈ ఇంజనీరింగ్ కార్యాలయం ప్రహరి వర్షం ధాటికి కూలిపడింది. గోడ వద్ద నిలిపి ఉంచిన కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి = చాదర్‌ఘాట్ మూసీ నదిపై ఉన్న చిన్నబ్రిడ్జిపై నడుములోతున వాననీరు పోటెత్తడంతో ఆ మార్గంలో రాకపోకల్ని మళ్లించారు = అంబర్‌పేట బతుకమ్మకుంట, చేనంబర్, ప్రేమావతినగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీళ్లు చేరాయి = బాగ్‌లింగంపల్లి డివిజన్ సూర్యనగర్‌లో 50 ఇళ్లలోకి వర్షపు నీరు పోటెత్తింది = కవాడిగూడ బండమైసమ్మ బస్తీలో చేరిన నీటిని మోటార్లతో తోడాల్సి వచ్చింది = గాంధీనగర్ కెనరాబ్యాంక్ వీధిలో చెట్టు విరిగిపడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది = అమీర్‌పేట, ఎస్.ఆర్.నగర్, సనత్‌నగర్ ప్రాంతాల్లో రహదారులపై మోకాళ్లలోతున నీరు పోటెత్తింది = పంజగుట్ట మోడల్‌హౌస్ ప్రాంతం జలమయమైంది = బేగంపేటలోని హోలీ ట్రినిటి చర్చి ప్రాంగణంలోకి నీళ్లు చేరాయి = చార్మినార్, బహదూర్‌పురా, అబిడ్స్ ప్రాంతాల్లోని పురాతన భవనాల్లో ఉంటున్న వారు బిక్కుబిక్కుమంటూ గడిపారు = చాదర్‌ఘాట్ వినాయక్‌నగర్‌లోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లోకి వర్షపునీరు చేరడంతో ఆ ప్రాంతంలో కరెంటు సరఫరాను నిలిపివేశారు = ఎల్బీనగర్ ప్రాంతంలో విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. -
వర్షబీభత్సం
= జడివానలతో జన జీవనం అస్తవ్యస్తం = పిడుగులు పడి ఇద్దరు మృతి = చోడవరంలో నీటమునిగిన పంటపొలాలు = {పమాద స్థాయికి పెద్దేరు, తాచేరు నదులు = కోనాం గేట్లు ఎత్తివేత చోడవరం,న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడ్డ పెను వాయుగుండం కారణంగా జిల్లా అస్తవ్యస్తమయింది. భారీగా కురుస్తున్న వర్షాల వల్ల జనజీవనం అతలాకుతలమైంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం నుంచి జడివానలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడింది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఎస్.రాయవరం, పెదబయలు మండలాల్లో చెరొకరు మృతి చెందారు. మాకవరపాలెం,చీడికాడ మండలాల్లో ఏడు పశువులు ప్రాణాలు కోల్పోయాయి. ఒక పక్క కరెంటు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే, మరో వంక ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో సమస్య తీవ్రమైంది. కరెంటు లేక కార్మికులకు, వర్షాల వల్ల కూలీలకు పనిలేకుండా పోయింది. చోడవరంలో సుమారు 4 సెం.మీ వర్షం పడింది. మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, బుచ్చెయ్యపేట, వడ్డాది ప్రాంతాల్లో 2 నుంచి 3 సెం.మీ వర్షం కురిసింది. భారీ వర్షాల వల్ల పెద్దేరు, బొడ్డేరు, తాచేరు నదులతోపాటు కొండగెడ్డలు పొంగి ప్రవిహ స్తున్నాయి. పెద్దేరు, తాచేరులలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. భీమిలి-నర్సీపట్నం రోడ్డులో చోడవరం సమీపంలో బొడ్డేరు నదిపై ఉన్న కాజ్‌వేకు భారీ గండి పడింది. కాజ్వే పైనుంచి నీరు పరవళ్లు తొక్కుతోంది. గండి పడటంతో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఈ దారిలో వెళ్లాల్సిన వాహనాలను గౌరీపట్నం మీదుగా వడ్డాది జంక్షకు మళ్లిస్తున్నారు. కోనాం జలాశయం నుంచి ఒక గేట్లు ఎత్తి 300క్యూసెక్కుల నీటిని బొడ్డేరు నదిలోకి విడుదల చేయగా పెద్దేరు జలాశయం నుంచి రెండు గేట్లు ఎత్తి 500క్యూసెక్కుల నీటిని పెద్దేరు నదిలోకి వదిలారు. వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. లక్ష్మీపురం, కస్పా, ఎం.కోటపాడు, ముకుందపురం ప్రాంతాల్లో కనుచూపుమేరలో పొలాలు నీట మునిగాయి. చోడవరంలో వివిధ ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై నీరు ప్రవహించింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపిలేకుండా కుండపోత వర్షం కురిసింది. దాంతో పనులు లేక ప్రజలంతా అల్లాడిపోయారు. గ్రామాలు చీకట్లోనే కాలం వెళ్లదీశాయి. యలమంచిలిలోనూ వర్షం కురిసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. హుకుంపేట మండలంలో భారీ వర్షానికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మన్యంలో వర్షాల వల్ల కూరగాయల పంటలకు మేలు కలుగుతుందని గిరిరైతులు అంటున్నారు. పాడేరులోనూ వర్షం కురిసింది. గిరిజనుడి మృతి హుకుంపేట: పశువులు కాసేందుకు కొండపైకి వెళ్లిన గిరిజనుడు పిడుగుపాటుతో మృతి చెందాడు. తీగలవలసలో ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. బోయిన సీతారామయ్య (40) పశువులు కాసేందుకు సమీపంలో కొండపైకి తీసుకువెళ్లాడు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో భారీ వర్షం కురవంతో చెట్టు కిందకు చేరాడు. చెట్టుపై పెద్ద శబ్ధంతో పిడుగు పడడంతో సీతారామయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సీతారామయ్యకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. పిడుగుపాటుకు ఏడు పశువులు మృతి మాకవరపాలెం మండలంలో పిడుగుపాటుకు మూడు పశువులు చనిపోయాయి. బుధవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అనేకచోట్ల పిడుగులు పడ్డాయి. లచ్చన్నపాలెంలో కిల్లాడ రామ్మూర్తి ఇంటి వద్ద పిడుగుపడి రూ. 50 వేల విలువైన ఆవు మృతి చెందింది. వజ్రగడలో అప్పలనాయుడుకు చెందిన లక్ష విలువైన రెండు గేదెలు పిడుగుపాటుతో మృతి చెందాయి. పిడుగులు పడి రెండూ అక్కడికక్కడే మృతి చెందాయి. చీడికాడ మండలంలో పిడుగులకు నాలుగు పశువులు మృతి చెందాయి. చినబోడిమెట్టలో బొడ్డు మంగునాయుడుకు చెందిన రెండు ఎద్దులు, , చీడికాడలో గండి అక్కునాయుడుకు చెందిన రెండు ఆవులు ఒకేచోట మృతి చెందాయి. -
వీడని జడివాన
సాక్షి, సిటీబ్యూరో : జడివాన నగరాన్ని దడిపిస్తోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి రహదారులు కాల్వలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీట మునిగాయి. వర్షానికి విద్యుత్ తీగలు తెగిపడడంతో పలు శివారు ప్రాంతాలు అంధకారంలో మునిగాయి. శుక్రవారం సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకువర్షం కురియడంతో ప్రధాన ప్రాంతాల్లోని రహదారులపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. ఫ్లైఓవర్లపైనా వాహనాలు బారులు తీరాయి. కోఠి, అబిడ్స్, నాంపల్లి, ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్‌పేట, ఎస్.ఆర్.నగర్, కూకట్పల్లి, సైఫాబాద్, సికింద్రాబాద్, బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఏర్పడిన ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోయి సిటీజనులు విలవిల్లాడారు. రాత్రి 10 గంటల వరకూ ట్రాఫిక్ రద్దీ కనిపించింది. రహదారులపై మోకాళ్ల లోతున వరదనీరు పోటెత్తడంతో వాహనాలు వర్షపునీటిలో ఈదుకుంటూ మందకొడిగా ముందుకు కదలడంతో ప్రయాణికులు, వాహనచోదకులు నరకయాతన అనుభవించారు. రాత్రి పొద్దుపోయాక ఇళ్లకు చేరుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన వర్షపునీటిని తొలగించేందుకు స్థానికులు నానా అవస్థలు పడ్డారు. వర్షపునీటిని తొలగించేందుకు రాత్రంతా జాగారం చేయాల్సి వస్తోందని వారు వాపోయారు. రాజేంద్రనగర్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నిర్మించిన అపార్టుమెంట్ల సెల్లార్లలో వరదనీరు భారీగా చేరింది. దీంతో అపార్టుమెంట్ల వాసులు నిచ్చెనల సాయంతో బయటికి వెళ్లాల్సి వచ్చింది. కాగా శుక్రవారం రాత్రి 8.30 గంటలకు 1.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. -
జోరువాన
సాక్షి, సిటీబ్యూరో:కుండపోత వాన నగరంలో బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మొదలై రాత్రి పొద్దుపోయే వరకు ఎడ తెరిపిలేకుండా కురిసింది. మూడు రోజులుగా అక్కడక్కడా కురిసిన వాన సోమవారం ఉగ్రరూపం దాల్చింది. పలుచోట్ల ప్రధాన రోడ్లు కాల్వలను తలపించాయి. వాహనాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి చేరిన నీటిని తొలగించుకొంటూ బాధితులు రాత్రంతా జాగారం చేశారు. పురాతన భవనాల్లో నివసిస్తున్నవారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. సాయంత్రం వేళ ఉద్యోగులు, విద్యార్థులు ఇళ్లకు వెళ్లాల్సిన వారు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. రవాణా సాధనాలుఅందుబాటులో లేక మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, పాదచారులు నరకయాతన అనుభవించారు. రాదారులన్నీ గోదారులు వర్షపు నీటి ఉధృతితో ఉగ్రరూపం దాల్చిన మూసీ చాదర్‌ఘాట్ ప్రధాన బ్రిడ్జికి పక్కనే ఉండే కాజ్వే (చిన్న వంతెన)ను ముంచెత్తింది. మోకాళ్ల లోతున నీళ్లు ప్రవహించాయి. అటుగా వెళ్లే వాహనాలను గోల్నాక వైపు మళ్లించారు మలక్‌పేట గంజ్ ప్రాంతంలో మెట్రో పిల్లర్ల కోసం ఏర్పాటు చేసిన గుంతల్లో భారీగా వరదనీరు చేరి రోడ్డు కుంగిపోయింది. అందుటో మెట్రో రైలు పనుల కోసం ఏర్పాటు చేసిన బార్కేడ్ పడడంతో మలక్‌పేట-చాదర్‌ఘాట్ రూట్లో రాకపోకలు స్తంభించాయి. మలక్‌పేట రైల్వేస్టేషన్‌లోకి వరద నీరు చేరింది. టోలిచౌకి, పాత ముంబై రహదారి నీట మునిగాయి. ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు, సాగర్ రింగ్రోడ్లపైనా భారీగా వర్షపునీరు చేరింది అత్తాపూర్‌లోని మల్లయ్య టవర్స్ అపార్ట్మెంట్ సెల్లార్ నీట మునిగింది. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే 190వ పిల్లర్ ప్రాంతంలో భారీగా వర్షపు నీళ్లు చేరాయి. రాజేంద్రనగర్ పరిధిలోని హసన్‌నగర్, శివరాంపల్లి, రాంబాగ్, సులేమాన్‌నగర్, మారుతినగర్, ప్రియదర్శిని కాలనీల్లోని వంద కు పైగా ఇళ్లలోకి వరద నీరు చేరింది. ముంపు ప్రాంతాలను నగర మేయర్ మాజిద్ హుస్సేన్ సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఎల్బీనగర్, గోషామహల్, అబిడ్స్, సంతోష్‌నగర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి లోతట్టు ప్రాంతాలు మునక.. అంధకారం గోల్కొండ మోతి దర్వాజ, గుడిమల్కాపూర్ మార్కెట్, మందుల బస్తీ, నదీంకాలనీ, అంజయ్యనగర్, భోజగుట్ట, తాళ్లగడ్డ ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. కొన్నిచోట్ల వర్షపు నీరు వెళ్లేందుకు మ్యాన్‌హోల్ మూతలు తెరవడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. మలక్‌పేట, ఓల్డ్‌మలక్‌పేట, పాత నగరంలోని ఛత్రినాక, శివగంగానగర్, అరుంధతినగర్, సాయిబాబానగర్, క్రాంతినగర్, గౌలిపురా, కిషన్‌బాగ్ ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. బంజారాహిల్స్ పరిధిలోని బస్తీలు ముంపు బారినపడ్డాయి. ఎడతెరిపి లేని కారణంగా సహాయక చర్యలకు అంతరాయం కలిగింది. మరోపక్క నాలాలు, ఓపెన్ డ్రైనేజీల్లో వరద నీరు పోటెత్తింది. కూకట్పల్లినాలా, బంజారా, పికెట్, బల్కాపూర్ నాలాలు పొంగిపొర్లడంతో రహదారులపైకి మోకాళ్లలోతు నీరు చేరింది. ఇంకోవైపు శివారు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడడంతో పలుచోట్ల అంధకారం అలుముకుంది. వర్షం కారణంగా పునరుద్ధరణ చర్యలు చేపట్టడం వీలుకాకపోవడంతో జనం రాత్రి వేళ నరకయాతన అనుభవించారు. -
ఏడు జిల్లాల్లో కుండపోత వాన
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. కుండపోతగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సాక్షి, చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో సేలం, నామక్కల్, ధర్మపురి, కృష్ణగిరి, ఈరోడ్, కడలూరు, విల్లుపురం జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి వర్షం మొదలైంది. ఆదివారం ఉదయం వరకు కుండపోతగా కురిసింది. ఉరుములు మెరుపులతో, ఈదురుగాలులతో వర్షం విరుచుకుపడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. రోడ్లు నదుల్ని తలపించాయి. సేలంలోని ఏర్పాడులో ఐదు సెం.మీ, ధర్మపురిలో నాలుగు సెం.మీ, సేలం, ఈరోడ్, కృష్ణగిరిలో మూడు సెం.మీ వర్షపాతం నమోదైంది. చెన్నైలో ఆదివారం సాయంత్రం తెరపించి తెరపించి వర్షం పడింది. అల్పపీడన ప్రభావంతో మరో 24 గంటలు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది కాస్త వినయక చవితి వ్యాపారంపై ఎక్కడ ప్రభావం చూపుతుందోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.