అతలాకుతలం
= నగరం కకావికలం
= కుండపోతతో జనం యాతన
= లోతట్టు ప్రాంతాలు జలమయం
= ఇళ్లలోకి చేరిన నీళ్లు
సాక్షి, సిటీబ్యూరో: బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు కుండపోత వర్షం గ్రేటర్ నగరాన్ని అతలాకుతలం చేసింది. సాయంత్రం 5.30 గంటల వరకు 8 సెంటీమీటర్లు, రాత్రి 8.30 వరకు 9.81 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేటలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సీజన్‌లో ఇదే రికార్డు వర్షపాతం. సాయంత్రం 4 నుంచి రాత్రి 10.30 వరకు ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, వాహనచోదకులు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకొని నరకయాతన అనుభవించారు.
కుండపోత వర్షానికి తడిసి ముద్దవడంతో పాటు రోడ్లపై పోటెత్తిననీటిలో అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. పలువురు ఇళ్లకు సకాలంలో చేరలేకపోయారు. ఫ్లైఓవర్లపైనా కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ప్రధాన రహదారులు, షాపింగ్‌మాల్స్ ఎదుట పార్క్ చేసిన వాహనాలు వర్షపునీటి ప్రవాహంలో మునిగిపోయాయి. కొన్ని కొట్టుకుపోయాయి.
హయత్‌నగర్, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, బహదూర్‌పురా, గాంధీనగర్, కాలాపత్తర్, చార్మినార్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, పంజగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, ఎస్.ఆర్.నగర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, మెహిదీపట్నం, శేరిలింగంపల్లి, మియాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట ప్రాంతాల్లో వర్షవిలయానికి లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీటమునిగాయి. ఇళ్లలోకి నీళ్లు చేరాయి. నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల పరిస్థితిపై నగర మేయర్ మాజిద్ హుస్సేన్ జోనల్ కమిషనర్లతో ఫోన్‌లో సమీక్షించారు. సహాయక చర్యలకు ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం
వందలాది బస్తీలు నీటమునిగాయి. సికింద్రాబాద్‌లోని అంబేద్కర్‌నగర్, ఇందిరమ్మనగర్, రసూల్‌పురా, అన్నానగర్, గాంధీనగర్‌లలోని లోతట్టుప్రాంతాల్లో గల ఇళ్లలోకి నీళ్లు చేరాయి. మెహిదీపట్నంలో గుడిమల్కాపూర్-మందుల బస్తీ, నదీంకాలనీ, అంజయ్యనగర్, భోజగుట్ట, తాళ్లగడ్డ ప్రాంతాల్లో స్థానికులు అవస్థలు పడ్డారు. కొన్నిచోట్ల వర్షపు నీళ్లు వెళ్లేందుకని మ్యాన్‌హోల్ మూతలు తెరవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. అంబర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, అబిడ్స్, చార్మినార్, బహదూర్‌పురా, శేరిలింగంపల్లి, తార్నాక, ఉప్పల్ ప్రాంతాల్లో వర్షపునీటి ప్రవాహం బెంబేలెత్తించింది.
పలుచోట్ల అంధకారం
భారీవర్షానికి పలు శివారు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తీగలు తెగిపడ్డాయి. పలుచోట్ల అంధకారం అలముకుంది. వర్షం కారణంగా పునరుద్ధరణ చర్యల్లో జాప్యం జరిగింది.
ఇదీ వర్షవిలయం
= నెక్లెస్ రోడ్డులోని ఇందిరాచౌక్ వద్ద హోర్డింగ్ కూలిపడింది. భారీ శబ్దంతో కూలిపోవడంతో పక్కనే ఐమాక్స్ థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఒకవైపు జోరువాన.. తడుస్తూనే ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వాహనచోదకులు.. పరిస్థితి ఘోరంగా మారింది. చాలాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది
బేగంపేటలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం పక్కనే ఉన్న జీఈ ఇంజనీరింగ్ కార్యాలయం ప్రహరి వర్షం ధాటికి కూలిపడింది. గోడ వద్ద నిలిపి ఉంచిన కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి
= చాదర్‌ఘాట్ మూసీ నదిపై ఉన్న చిన్నబ్రిడ్జిపై నడుములోతున వాననీరు పోటెత్తడంతో ఆ మార్గంలో రాకపోకల్ని మళ్లించారు
= అంబర్‌పేట బతుకమ్మకుంట, చేనంబర్, ప్రేమావతినగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీళ్లు చేరాయి
= బాగ్‌లింగంపల్లి డివిజన్ సూర్యనగర్‌లో 50 ఇళ్లలోకి వర్షపు నీరు పోటెత్తింది
= కవాడిగూడ బండమైసమ్మ బస్తీలో చేరిన నీటిని మోటార్లతో తోడాల్సి వచ్చింది
= గాంధీనగర్ కెనరాబ్యాంక్ వీధిలో చెట్టు విరిగిపడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది
= అమీర్‌పేట, ఎస్.ఆర్.నగర్, సనత్‌నగర్ ప్రాంతాల్లో రహదారులపై మోకాళ్లలోతున నీరు పోటెత్తింది
= పంజగుట్ట మోడల్‌హౌస్ ప్రాంతం జలమయమైంది
= బేగంపేటలోని హోలీ ట్రినిటి చర్చి ప్రాంగణంలోకి నీళ్లు చేరాయి
= చార్మినార్, బహదూర్‌పురా, అబిడ్స్ ప్రాంతాల్లోని పురాతన భవనాల్లో ఉంటున్న వారు బిక్కుబిక్కుమంటూ గడిపారు
= చాదర్‌ఘాట్ వినాయక్‌నగర్‌లోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లోకి వర్షపునీరు చేరడంతో ఆ ప్రాంతంలో కరెంటు సరఫరాను నిలిపివేశారు
= ఎల్బీనగర్ ప్రాంతంలో విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.