సాక్షి, సిటీబ్యూరో : జడివాన నగరాన్ని దడిపిస్తోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి రహదారులు కాల్వలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీట మునిగాయి. వర్షానికి విద్యుత్ తీగలు తెగిపడడంతో పలు శివారు ప్రాంతాలు అంధకారంలో మునిగాయి. శుక్రవారం సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకువర్షం కురియడంతో ప్రధాన ప్రాంతాల్లోని రహదారులపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. ఫ్లైఓవర్లపైనా వాహనాలు బారులు తీరాయి.
కోఠి, అబిడ్స్, నాంపల్లి, ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్‌పేట, ఎస్.ఆర్.నగర్, కూకట్‌పల్లి, సైఫాబాద్, సికింద్రాబాద్, బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఏర్పడిన ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోయి సిటీజనులు విలవిల్లాడారు. రాత్రి 10 గంటల వరకూ ట్రాఫిక్ రద్దీ కనిపించింది. రహదారులపై మోకాళ్ల లోతున వరదనీరు పోటెత్తడంతో వాహనాలు వర్షపునీటిలో ఈదుకుంటూ మందకొడిగా ముందుకు కదలడంతో ప్రయాణికులు, వాహనచోదకులు నరకయాతన అనుభవించారు.
రాత్రి పొద్దుపోయాక ఇళ్లకు చేరుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన వర్షపునీటిని తొలగించేందుకు స్థానికులు నానా అవస్థలు పడ్డారు. వర్షపునీటిని తొలగించేందుకు రాత్రంతా జాగారం చేయాల్సి వస్తోందని వారు వాపోయారు. రాజేంద్రనగర్, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నిర్మించిన అపార్టుమెంట్ల సెల్లార్లలో వరదనీరు భారీగా చేరింది. దీంతో అపార్టుమెంట్ల వాసులు నిచ్చెనల సాయంతో బయటికి వెళ్లాల్సి వచ్చింది. కాగా శుక్రవారం రాత్రి 8.30 గంటలకు 1.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది.
వీడని జడివాన
Published Sat, Sep 21 2013 2:27 AM | Last Updated on Wed, Sep 5 2018 3:37 PM
Advertisement