వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : నాలుగు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షంతో జనజీవనం అతలాకుతలమవుతున్నా మన జిల్లా ప్రజాప్రతినిధులు పత్తాకు లేరు. కష్టాల కండగండ్లలో చిక్కుకున్న వారిని ఆదుకునేందుకు నేతలకు తీరికలేకుండా పోయింది. చేతికొచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతిని విలపిస్తున్న అన్నదాతను ఓదార్చే దిక్కు కరువైంది. పూర్తిగా అధికారులు, ఇతర సిబ్బందిపైనే భారం మోపి ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారు.
జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 1,3,423 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ, మిరప, వరి తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 300 ఇళ్లు కూలిపోయాయి. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. సారయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పునియోజకవర్గ పరిధిలో రాధమ్మ అనే మహిళ గోడకూలి మృతిచెందింది. పలు కాలనీలు, ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకుని జనం బిక్కుబిక్కుమంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రైతులను, ప్రజలను ఓదారుస్తూ అధికారుల్లో చలనం తీసుకొచ్చి అవసరమైన చర్యలు చేపట్టడంలో భాగస్వామ్యం కావాల్సిన నాయకులంతా జాడలేకుండా పోయారు.
జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్, రాష్ర్ట మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, వర్ధన్నపేట, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, మాలోతు కవిత ఇప్పటి వరకు బాధితులను పలకరించిన పాపాన పోలేదు. టీడీపీ నేత, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కొడకండ్ల, రాయపర్తి మండలాల్లో పర్యటించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క కొత్తగూడ మండలంలో, నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి ఖానాపురం మండలంలో పర్యటించారు.
డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ మాత్రం జాడలేకుండా పోయారు. టీఆర్‌ఎస్‌కు చెందిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ నియోజకవర్గంలోని జలదిగ్బంధ కాలనీల్లో పర్యటించారు. బాధితులకు మంచినీరు, భోజనవసతి ఏర్పాటు చేశారు. పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి గీసుకొండ మండలంలోని మచ్చాపూర్‌లో పర్యటించి రైతులను ఓదార్చారు. ఇక స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య పార్టీ ఎమ్మెల్యేల బృందం పర్యటనలో వరంగల్ మార్కెట్, నర్సంపే ట, గీసుగొండ ప్రాంతాల్లో పాల్గొన్నారు. తన నియోజకవర్గంలో ఇంకా అడుగిడలేదు.
కొందరు ప్రజాప్రతినిధులు ఢిల్లీలో ఉంటే మరికొందరు హైదరాబాద్, జిల్లా కేంద్రానికే పరిమితమయ్యారు. నియోజకవర్గాల పర్యటనకు దూరం గా ఉన్నారు. జిల్లాలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు మినహా ఇతరత్రా ప్రజాప్రతినిధులెవరూ లేరు. పరిస్థితి సర్పంచ్‌ల స్థాయిలో లేదు. స్పందించాల్సిన మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కనీసం స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు రైతు సంఘాలు, ప్రజాసంఘాలు, అక్కడక్కడ టీఆర్‌ఎస్, బీజేపీ, ఇతర పార్టీలకు చెందిన స్థానిక నాయకులు మాత్రం పర్యటించి రైతులకు కొంతైనా భరోసా కల్పిస్తున్నారు. ఇకనైనా మన ప్రజాప్రతినిధులు స్పందించి, బాధితులకు అండగా నిలిచేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
జనం నీళ్లల్లో.. మంత్రులు ఇళ్లల్లో..
Published Sun, Oct 27 2013 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
Advertisement