సాక్షి, హైదరాబాద్ : ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శినంటూ ప్రజా ప్రతినిధులనే మోసం చేస్తున్న ఘరానా మోసగాణ్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ ఎస్ మట్టం రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తోట బాలాజీ నాయుడు అలియాస్ మల్లారెడ్డి/ దాసరి అనిల్ కుమార్ మై నేత.కామ్ వెబ్‌సైట్ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్ నంబర్లు సేకరించేవాడు. వారికి ఫోన్ చేసి ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా పరిచయం చేసుకునేవాడు. ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించనుందని, గ్రాంట్‌ను విడుదల చేయనుందని వివరించేవాడు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కావాలని కోరేవాడు. నిజమేనని నమ్మిన ప్రజా ప్రతినిధులు బాలాజీ నాయుడు సూచించిన మ్యూల్ బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీ చేసేవారు. ఆ తర్వాతి నుంచి ఫోన్ స్విఛాఫ్ చేసేవాడు. ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి.. కొత్త ప్రభుత్వం రుణ పథకాన్ని ప్రారంభిస్తుందని, తనతో పాటు వంద మంది సభ్యులు పాల్గొనాల్సి ఉంటుందని సూచించాడు. నిజమేనని నమ్మిన సదరు శాసనసభ సభ్యుడు రూ.3.60 లక్షలు నిందితుడు సూచించిన మ్యూల్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశారు. నగదు విత్‌డ్రా చేసిన తర్వాత నిందితుడు కాల్స్ చేయడం మానేశాడు. దీంతో మోసపోయామని గ్రహించిన ఎమ్మెల్యే సూచన మేరకు తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడు బాలాజీని అరెస్టు చేశారు.
లంచం కేసులో దొరికే, జాబ్ పోయే..
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తోట బాలాజీ నాయుడు 2008లో రామగుండంలోని ఎనీ్టపీసీలో ఏఈగా ఉద్యోగంలో చేరాడు. చేరిన ఏడాది కాలంలోనే 2009 ఫిబ్రవరిలో ఓ ఎమ్మెల్యే పీఏ నుంచి లంచం తీసుకుంటుండగా.. సీబీఐ చేతికి చిక్కాడు. దీంతో బాలాజీని అరెస్టు చేసి, రిమాండ్ నిమిత్తం కరీంనగర్ జైలుకు తరలించారు. దీంతో ఎనీ్టపీసీ సంస్థ బాలాజీని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. జైలు నుంచి బయటికి వచ్చిన కొంత కాలం తర్వాత బాలాజీ మళ్లీ విశాఖ పరవాడ సింహాద్రీ పవర్ ప్లాంట్‌లో తిరిగి ఉద్యోగంలో చేరాడు. కానీ, అతని ప్రవృత్తిలో మార్పు రాకపోవడంతో 2009లో అతన్ని సరీ్వస్ నుంచి తొలగించారు. ఇక అక్కడ్నుంచి మోసాలకు పాల్పడటే వృత్తిగా ఎంచుకున్నాడు. బాలాజీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 37 కేసులున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతని చేతిలో మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment